పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ లాంటి సమస్యలూ ఉన్నా, ఇలాంటి అంశాలపై దృష్టి సారించిన ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. కవర్ పేజీ, లోపలి పేజీల బొమ్మలు కైరంకొండ బాబు వేశారు. ఆ పది జిల్లాల బడి పిల్లల కథలు దక్కన్‍ల్యాండ్ పాఠకులకు పరిచయంలో భాగంగా ‘నిజామాబాద్ బడిపిల్లల కథలు’ బాల సాహితీవేత్త డా।। వి.ఆర్.శర్మ విశ్లేషణ.
‘బాల చెలిమి’కారులు మణికొండ వేదకుమార్ చైర్మన్‍గా దాదాపు మూడు దశాబ్ధాలుగా బాలల వికాసం కోసం పనిచేస్తూ ‘బాల చెలిమి’పత్రిక, ‘బాల చెలిమి గ్రంథాలయం’, ‘చెలిమి క్లబ్’లు నిర్వహిస్తూ అదే కోవలో చేసిన మరో గొప్పపని తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల వారిగా ‘తెలంగాణ బడిపిల్లల కథలు’ తెచ్చారు. కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారి ఆహ్వానం మేరకు నిజామాబాద్ జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 126 కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాలసాహితీవేత్తలు 18 కథలను ఎంపిక చేశారు. ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ నిష్ణాతులతో ఎన్నో సమావేశాలు, సదస్సులు, చర్చలు, బాల చెలిమి ముచ్చట్లు నిర్వహించింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల సాహిత్యాన్ని పరిశీలిస్తే 1955 ప్రాంతంలో లోక మలహరి రాసిన ‘‘జగ్గని యిద్దె’’ నవల, 1959లో తిగుళ్ళ వెంకటేశ్వర శర్మ రాసిన ‘‘వానకారు’’ గేయ సంపుటి ప్రధానంగా పేర్కొనవచ్చు. పై రెండు గ్రంథాలు ఇటీవల పునర్ముద్రణ పొందడం విశేషం. ఇటీవలి కాలానికి వస్తే 2000 సంవత్సరంలో అమరేశం రాజేశ్వరశర్మ పిల్లల కోసం మూడు ‘‘చారిత్రక నాటికలు’’ ప్రచురించారు. 1996లో ‘పిల్లల లోకం’ నుండి డా. వి.ఆర్.శర్మ నేతృత్వంలో ‘ఆకాశం’, ‘చుక్కలు’, ‘పిల్లల లోకం 1-2’ పిల్లల రచనల బులెటిన్లు వచ్చాయి. వీటికి తోడు అనేక మంది సీనియర్ రచయితలు, కొత్త రచయితలు పిల్లల కోసం రచనలు చేస్తున్నారు.
తెలంగాణా ఇతర జిల్లాల్లోని బడిపిల్లల మాదిరిగానే నిజామాబాద్ పిల్లలు ముందు వరుసలో ఉన్నారు. అనేక సంకలనాల్లో ఇక్కడి పిల్లల కథలు, కవితలు, గేయాలు ప్రచురించబడడమే కాక బడి పిల్లలు రాసిన రచనల సంకలనాలు ప్రచురించబడ్డాయి. పిల్లల రచనా యజ్ఞంలో ఘణపురం దేవేందర్, డా. కాసర్ల నరేశ్‍రావు, దేశ్‍ముఖ్ ప్రవీణ్ శర్మ, కోకిల నాగరాజు, సిరిసిల్ల గఫూర్ శిక్షక్, విజయ పాఠశాలల యాజమాన్యాన్ని ప్రధానంగా పేర్కొనవచ్చు.
ఈ కోవలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రచురింప బడుతున్న ‘తెలంగాణ బడి పిల్లల కథలు’ సీరిస్‍లో మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి వస్తున్న పద్దెనిమిది కథల ఈ సంకలనం మన పిల్లల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ పద్దెనిమిది కథల్లో దేని విశిష్టత దానిదే. ఒక కథ ‘అవయవ దానం’ గొప్పతనాన్ని చెబితే మరోకథ సేవ లోని పరమార్థాన్ని వివరిస్తుంది. ఒక కథ చతురత గురించి చెబితే ఇంకో కథ మనం జాగరూకులై ఎలా ఉండాలో తెలుపుతుంది. ఇందులోని కథలన్నీ విద్యార్థులకు నచ్చడమే కాదు, వారిలో చక్కని సంస్కారాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయి. ‘బాల చెలిమి’ పక్షాన వెలువడుతున్న ఈ కథలకు స్వాగతం పలుకుతున్నాను.
- డా।। వి.ఆర్. శర్మ, బాల సాహితీవేత్త,
అధ్యక్షులు, పిల్లల లోకం