(గత సంచిక తరువాయి)
నాగరిలిపిలో వున్న క్రీ.శ.1711 నాటి ఈ శాసనంలో జైనగురువు పండిత కేసరకుశల కోరికను మన్నించిన ఔరంగజేబు కొడుకు సుబేదార్ బహదుర్ షా-1 ప్రతినిధి నవాబ్ మహమ్మద్ యూసుఫ్ ఖాన్ ఆదీశ్వర భగవానుడు లేదా మాణిక్యస్వామి ప్రతిష్ట, పునరుద్ధరణ, దేవాలయ ప్రాకారనిర్మాణం చేయించారని తెలుపబడింది. 4 జైనదేవాలయానికి దక్షిణభాగాన పాకశాల పక్కన జైన సంగ్రహాలయం పేరిట జైనశిల్పాల, శాసనాలు సేకరించి ఇక్కడ భద్రపరిచారు. వీటిలో జైన చౌముఖి, జైన స్తూప, జైన గురువులు, తీర్థంకరుల శిల్పాలెన్నో ఉన్నాయి. కొలనుపాక జైనుల విద్యాకేంద్రం అని చెప్పడానికి 6 సరస్వతిగచ్ఛ శిల్పాలు, శాసనాలున్నాయి. జైన దేవాలయ ప్రాకారంగోడలో ఒకచోట శైవమందిర ద్వారం ఉంది. దేవాలయ ప్రాంగణంలో అలంకారంగా నిలిపిన కాకతీయశైలి శిల్పాలున్న నల్లరాతి దేవాలయస్తంభాలు కూడా వున్నాయి.
కొలనుపాక-కులమఠాలు
కొలనుపాకలో 22 కులమఠాలుండేవని పురావస్తుశాఖాధికారి టి.శ్రీనివాస్, 20 మఠాలున్నాయని విరువంటి గోపాలకృష్ణ రాసారు. కొలనుపాక మాదిగమఠం సోమయ్య గురువు మల్లయ్య వద్ద వున్న రాగిరేకు శాసనాన్నిబట్టి మఠాలు, వాటి గురువుల వివరాలు తెలుస్తున్నాయి. ఈ శాసనం క్రీ.శ.1221లో వేయబడినట్లు తెలుస్తున్నది.
మఠాల జాబితా:
1.మాదిగ మఠం, 2. పెద్ద మఠం, 3.కోమట్ల మఠం, 4. కాపుల మఠం, 5. గొల్లమఠం, 6. గాండ్ల మఠం, 7. గౌండ్ల మఠం, 8.సాలె మఠం, 9.కుమ్మరి మఠం, 10. పంచాణ మఠం, 11. పెరిక మఠం, 12. మేదరి మఠం, 13.చాకలి మఠం, 14. మంగలి మఠం, 15.సంగరి మఠం, 16. మేర మఠం, 17. జాండ్ర మఠం, 18.కుర్మమఠం, 19. శంబరిమఠం, 20. మాల మఠం
క్రీ.శ.1056 డిసెంబర్ 24న వేయించిన దానశాసనంలో ప్రెగ్గడ చావుండయ్య, దండనాయక కావణభట్టల విజ్ఞప్తి మేరకు మాళికొండ ఉపాయనవీడులో ఉన్న త్రైలోక్యమల్లదేవ ప్రభువు కురుమ మఠ ఆచార్యులకు, జైనబసదుల గురువులకు ‘తాళవృత్తి, బిట్టి, పన్నస, కెరె, నీరునేల, రాటనం, తోటకెరెయబు, మన్నేయ, పన్నులు రద్దుచేస్తు’న్నట్లు వివరించబడ్డది. 5 కురుమమఠానికి రాజశాసనం ఉన్నట్లు ఆధారం లభించింది. కుర్మమఠం ఆచార్యులు వీరభద్రయ్య వద్ద ఉన్న క్రీ.శ.1032 తామ్రశాసనంలో కుర్మమఠంలో జంగమార్చన చేయడానికి కళ్యాణీపుర వీర క్షత్రియుడు హనుమంత బండన్న (చారిత్రక ఆధారాలు లభించలేదు) ఇచ్చిన ధర్మశాసనం అని వుంది.6 మిగతా మఠాలకు హక్కుపత్రాలు ఇచ్చింది ఏ పాలకులో తెలియదుకాని, కులగురువుల వద్ద ఉన్న రాగిరేకులే తప్ప ఇతర ఆధారాలు లేవు.
కులమఠాల శిల్పాలు:
గొల్లమఠంలో అంబిక (కూష్మాండిని) శిల్పముంది. అక్కడే మరొకగుడిలో రాష్ట్రకూటులనాటి మహిషాసురమర్దిని విగ్రహముంది. గాండ్లమఠంలో అరుదైన ‘త్రైపురుషమూర్తి’ శిల్పముంది. మాదిగమఠంలో కొన్నాళ్ళ క్రితం ఆదిజాంబవుని విగ్రహంగా భావించిన వీరభద్ర (విరిగిన) శిల్పముంది. గర్భగుడిలో ఉమాలింగనమూర్తి శిల్పముంది. కుర్మమఠం, విశ్వకర్మ మఠాలలో జైనమహావీరుని అధిష్టానపీఠాలున్నాయి. కుర్మమఠంలో శంఖలతాతోరణముంది. కులమఠాల పైకప్పులలో రాతిదూలాల మీద జైనశిల్పాలు, శాసనస్తంభాలు కనిపిస్తున్నాయి.
కొలనుపాక-జైనమత విధ్వంసం:
చోళులు రాజేంద్రచోళుడు, రాజాధిరాజుల (క్రీ.శ.1006, 1040) దండయాత్రల్లో కొలనుపాక కొల్లబోయింది. వాళ్ళ దాడుల్లో కొలనుపాక నామ,రూపాలు పూర్తిగా నాశనమైపోయాయి. ముఖ్యంగా జైనదేవాలయాలు వారి ఆగ్రహానికి ఆహుతైనవి. అప్పటివరకు రాష్ట్రకూటుల ప్రతినిధి శంకరగండరస (ఆకునూరు, జాఫర్ గఢ్, తుమ్మలగూడెం, ఆమనగల్లు శాసనాల్లో ప్రస్తావించబడిన వాడు) పాలనలో, రాష్ట్రకూటచక్రవర్తుల ఆదరణలో వెలసిన జైనబసదులకు, జైనులకు కష్టకాలమొచ్చింది. అందువల్ల జయసింహుడు కొలనుపాక వదిలి, ఎక్కువకాలం ఇప్పటి పటాన్ చెరు(పొత్తలకెరె) నెలవీడు (తాత్కాలిక రాజధాని, విడిది)లో ఎక్కువకాలమున్నాడు. జయసింహుడు (జగదేకమల్లుడు) శివశరణ్యయైన అతని భార్య సుగ్గలదేవి, ఆమె శైవగురువు శంకర దాసిమయ్యల వత్తిడివల్ల శైవుడైనాడు. ఈ కాలంలోనే కొలనుపాక శివశరణ్యులకు, వీరశైవులకు కేంద్రమైంది. పటాన్ చెరులో జైనబసదులను కూల్చి, జైనులను వధించినానని శంకరదాసిమయ్య చెప్పుకున్నట్లే కొలనుపాకలో కూడా జైనులు, జైనాలయాల విధ్వంసం కొనసాగింది. కాలాముఖులు, పాశుపతులకు కొలనుపాక కేంద్రం కావడంతో జైనబసదులన్నీ శైవాలయాలుగా మార్చబడ్డాయి. ‘చాళుక్యులకాలంలో కాలాముఖ శైవసంప్రదాయం పలుచోట్ల స్థాపించబడెను. కొలనుపాకలోని సోమేశ్వరాలయం కూడ అట్టిదే’ అన్నారు పివి పరబ్రహ్మశాస్త్రి. 7ప్రస్తుతం వాటినే కులమఠాలుగా పిలుస్తున్నారు. ప్రతిమఠంలో కూడా జైనశిల్పాలో, జైనశాసనాలో తప్పకుండా కనిపిస్తాయి. కాకతీయుల పాలనలో శైవమతానికే అత్యంత ఆదరణ లభించింది. సహస్రలింగ ప్రతిష్ట, ప్రతాపరుద్రునిగుడి అప్పటివే. రుద్రమ శాసనం కూడా లభించింది. పిదప కాలాల్లో కొలనుపాక దేవాలయాలను పునరుద్ధరణ చేసిన దాఖలాలు తక్కువ.
వీరగల్లులు:
కొలనుపాకలో తూర్పున వాగుదగ్గర వీరులగడ్డ అనే ప్రదేశంలో 10కి పైగా వీరగల్లులు లభించాయి. ఈ వీరగల్లులలో రాష్ట్రకూటుల నుంచి కాకతీయులకాలం వరకు వేసినవి వున్నాయి. రాజుసేవలో వుండి రాజు మరణించగానే ఆత్మార్పణంచేసుకున్న వీరులను వెలెవాలి, లెంక, లెంకవాలి, కిల్గుంటె, గరుడలని శాసనాలు పేర్కొన్నాయి. వీటిని మ్యూజియం వెనకగోడకానించి నిలిపిపెట్టారు. అందులో ఒక వీరగల్లులో జైనగురువును వధించిన శిల్పం వుంది.
ఉపసంహారం:
కొలనుపాకలో మొదటి మతమేది? గుడి ఏది? శాసనాలలో పేర్కొనబడి, దానాలందిన నకరేశ్వరాలయం, ఉత్తరేశ్వరాలయం, పంచమఠాలు, విష్ణ్వాలయం, జైనబసదులు ఏవి? ఉన్నగుడులను ఎవరెవరు పునరుద్ధరించారో తెలియదు. పలుకాలాల శైలుల శిల్పాలు కనిపిస్తున్నాయి. అడ్డదిడ్డంగా పేర్చబడ్డాయి. గుడులు నిర్మించిన పాలకులు, వారి నాదేశించి, గైడ్ చేసిన గురువుల ఆధ్యాత్మిక భావనల రూపమైన ఈ శిల్పాలకు క్రమమేది కనిపించదు. అన్నీ అపక్రమమే. ఎన్నికాలాలలో ఎన్నిసార్లు ధ్వంసాలకు గురైనవో, పునరుద్ధరణల పాలైనవో కాని, ఈ గుడులు ఒక తీరుగా కనిపించడంలేదు. మొత్తం మీద పూజాదికాలు జరుగుతున్నాయన్నదొకటే అంగీకృత వాస్తవం. కొలనుపాక చోళులదాడిలో ధ్వంసమైనదన్నది చరిత్ర. కాలాముఖుల కేంద్రంగా జైనం విధ్వంసానికి గురైనదన్నది చరిత్రే. సోమేశ్వరాలయం పై కప్పుమీద ఒకచోట డోమ్ వంటి నిర్మాణం వుంది. అంటే ఈ గుడిని ఎపుడైనా ముస్లింలు మసీదుగా వాడుకున్నారా? అయోమయమైన చరిత్ర. కొలనుపాక భూగర్భంలో నిరీక్షిస్తున్న చరిత్ర ఎంతవుందో. ఈ మధ్యన కొలనుపాకలోని విద్యుత్ సబ్ స్టేషన్ వెనక ఒకచోట బయటపడిన పెద్దదేవాలయాన్ని మళ్ళీ మట్టితో కప్పేసారు. కొలనుపాకది అభాగ్య చరిత్ర.
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆటంకం అని భావించిన చారిత్రక ప్రదేశాల దుర్దశ అది. అన్నిచోట్ల అదే వర్తమాన చరిత్ర. నిధి,నిక్షేపాల కొరకు గుళ్ళు తవ్వే మాఫియాది సినిమా అంత కథ. విగ్రహాల స్మగ్లర్లది నిరాటంక రాజ్యం. అసలు చరిత్రనే పాఠ్యాంశంగా వద్దంటున్న వ్యవస్థ మనది.
ఆధార సమాచారం:
- విరువంటి గోపాకృష్ణ – కొలనుపాక చరిత్ర-శాసనాలు
- ఎన్. రమాకాంతం, క్యూరేటర్, ఆర్కియాలజీ మ్యూజియం, ఎడి: ఎన్.రామేశన్ (మ్యూజియం సిరీస్:16)- కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల
- T.Srinivas -The Antiquities of Kulpak,1917, JHAS
- G.Jawahar lal – Jainism in Andhra
- APAREp,1965,No.280; IAP,Nal II, No.3; Jainism in Andhra No.45
- విరువంటి గోపాలక•ష్ణ-కొలనుపాక చరిత్ర-శాసనాలు
- పి.వి. పరబ్రహ్మశాస్త్రి, గ్రంథపరిచయము-1997, విరువంటి గోపాలకృష్ణ-కొలనుపాక చరిత్ర-శాసనాలు,పే.VII.
కొలనుపాకను నాతోపాటు సందర్శించిన గురువు విరువంటి గోపాలకృష్ణకు, వేముగంటి మురళీక•ష్ణకు, చంటికి, యంబ నర్సింహులుకు, తిరునగరి శ్రీనివాసుకు, జి. కుమారస్వామి సార్ కు ధన్యవాదాలతో.
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698