ప్రకృతే నియంత్రిస్తుంది! 12 ప్రకృతే శాసిస్తుంది!! ఊహప్రతిపాదనలు లేకుండానే సిద్ధాంత ఆవిష్కరణ!

(Formulating a Theory, Without Hypotheses!)


(గత సంచిక తరువాయి)
ఇంటికి చేరుతాననే నమ్మకంలేని అయిదు సంవత్సరాల సుదీర్ఘ యాత్ర తర్వాత స్వంత గూటికి చేరిన డార్విన్‍ రెండో రోజుననే కుటుంబాన్ని కలిసాడు. తర్వాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంకు పోయి హెన్స్స్లో (Henslow)ను కలిసి తాను రాసుకున్న డైరీలను చూయించాడు. సమాచారం తెలిసిన చార్లెస్‍ లియల్స్ (Lyell) డార్విన్‍ కృషిని అభినందించాడు. తాను పొందిన అనుభవాల్ని కేంబ్రిడ్జి ఫిలసొఫికల్‍ (Philosophical) సంఘంతో పంచుకున్నాడు. అప్పటికి డార్విన్‍ వయస్సు కేవలం 27 సం।।లే! ఇంగ్లాండ్‍ చేరిన మూడు నెలల కాలంలోనే ఓ నూనూగు మీసాల కుర్రవాడు మెళ్ళిమెళ్ళిగా ఇంగ్లాండ్‍ను, మొత్తం బ్రిటన్‍ను, ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.
జనవరి 4, 1837లో తాను చీలిలో, దక్షిణ అమెరికా ఇతర ప్రాంతాల్లో అగ్ని పర్వతాలు (mt. osorno, 15/1/1835 & Valxdivia, 20/2/35) పేలి, లావా ఉబికిన విధానాన్ని, భూకంపం సంభవించి సముద్ర అలలు సునామిగా మారి, ఓ పట్టణం (Concepcion) ధ్వంసమైన తీరును, ఆ సమయంలో తాను నేలపై పడుకొని తనకు తాను రక్షించుకున్న వైనాన్ని వివరిస్తూ రాసిన పత్రాన్ని (paper)ను భూగర్భ శాస్త్ర సంస్థకు సమర్పించాడు. ఇలా జరిగిన ప్రకృతి విపత్తులలో ఆయా ప్రాంతాలలో, సముద్రంలో భూమి ఉబికి వచ్చి కొత్త భూగాలు ఏర్పడిన తీరును వివరిస్తూ geologic formations were the result of steady cummulative fores of the sort we see today అంటూ ఓ కొత్త నిర్వచనాన్ని ముందుకు తెచ్చాడు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఏడు వేల అడుగుల ఎత్తుకు భూమి ఉబికినట్లుగా డార్విన్‍ గుర్తించాడు. దీంతో భూగర్భంలో కూరుకు పోయిన వేలాది సంవత్సరాల శిలజాలు బయట పడడం, వాటిని డార్విన్‍ పరిశీలించడం జరిగినట్లు, సేకరించినట్లు ఆ పత్రంలో పేర్కొన్నాడు. అందులో కొన్నింటిని తనవెంట తెచ్చినట్లు ఆధారాల్ని చూపాడు. డార్విన్‍ సేకరించిన శిలజాల్ని, ఇతర నమునాల్ని, పక్షుల చర్మాల్ని, గుడ్లని భద్రంగా ఎప్పటికప్పుడు ఇంగ్లాండ్‍కు వెళ్ళే నౌకల ద్వారా పంపించేవాడు. వాటితోనే నేడు లండన్‍లో డార్విన్‍ విరచిత పరిణామ సిద్ధాంత మ్యూజియంను చూడవచ్చు!


డార్విన్‍ శ్రమను, ఆలోచన విధానాన్ని గుర్తించిన ఆ సంస్థ, తర్వాతికాలంలో డార్విన్‍కు కార్యదర్శి హోదాను ఇచ్చింది. మిగతా అంశాల్ని కెప్టెన్‍ ఫిట్జ్రాయ్‍తో కలిసి కథనాలుగా రాయాలను కుంటే, డార్విన్‍ ప్రతిభను గుర్తించిన కుటుంబ సభ్యులు, తండ్రి స్వంతగానే ప్రయత్నించమని కోరారు. అయినా, ఫిట్జ్రాయ్‍పై గౌరవంతో ఆయన కథనాలకై ఎదురు చూడగా ఆగస్టు 1837లో ఆయన రాయడంతో, బీగల్‍ యాత్ర (The Voyage of Beagle) అనే శీర్షికతో General & Remarks యొక్క మూడో సంపుటిలో డార్విన్‍ తన అనుభవాల్ని రాసాడు.
తండ్రి 400 పౌండ్ల వార్షిక గ్రాంటు ఇవ్వగా ఓ భూగర్భశాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించాడు. తాను రాసుకున్న, సేకరించిన మొత్తం సమాచారాన్ని Journal of Resarches in to the Geology and Natural History of the various countries visited (1831-36) by HMS beagle అంటూ 1000 పౌండ్ల గ్రాంటు మంజూరు కాగా 1839లో ప్రచురించాడు. తర్వాత దృష్టి తాను సేకరించిన వివిధ శిలజాల నమూనాలపై పడడంతో కొంతమంది జంతుశాస్త్ర నిపుణుల్ని ఉద్యోగులుగా పెట్టుకొని, వాటి సమాచారాన్ని్ Zoology of the voyage of HMS Beagle (1834-43 మధ్యన) ప్రచురించడంతో డార్విన్‍కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు (lionized) రావడంతో మతవాదుల్లో ఆక్రోషం, గుబులు మొదలైంది. అదే కాలంలో ఓటింగ్‍ హక్కుపై బ్రిటన్‍లో పౌర ఉద్యమం తలెత్తి ఓట్ల సవరణ చట్టం (Reforms Act 1832)కు దారితీయడంతో, మత వాదుల దృష్టి అటువైపుగా మరలింది. అయినా, తాను పరిశీలించిన మొత్తం అంశాల్ని సమాజపరం చేయడానికి డార్విన్‍కు రెండు దశాబ్దాలు (1859) పట్టింది.


డార్విన్‍ నిర్ధారణలు :
(conclusions)

గాలాపాగోస్‍ దీవుల్లోని జంతుజాల, శిలజాల పరిశీలన తర్వాత డార్విన్‍ ఈ కింది నిర్ధారణలకు వచ్చాడు.

 • జీవులన్నింటి మధ్యన సంబంధం వుంటుంది. (relationship between organisms)
 • జీవన విధానంలో వ్యత్యాసాలుంటాయి. (the diversity of living things)
 • గత జీవుల అవశేషాలు, ప్రస్తుత జీవులకు దగ్గరగా వుంటాయి. (the remains of ancient organisms, looks like present one)
 • ప్రతి జాతికి కొన్ని లక్షణాలుంటాయి. (xevery organism posses certain qualities)


డార్విన్‍ పరిశీలనలు (observations) :

విభిన్న ప్రాంతాల మొక్కల, జంతు జాలాన్ని నిశితంగా చూసిన డార్విన్‍ ఈ కింది అభిప్రాయాలకు వచ్చాడు.

 • ఒకే జాతి జీవులన్నీ ఒకేరకంగా వుండవు. (individuals of a species are not identical)
 • జీవుల్లోని ప్రత్యేక లక్షణాలు తర్వాతి తరానికి అందించబడుతాయి. (traits are passed from generation to generation)
 • జన్మించేవి ఎక్కువ, బతికేవి తక్కువ (more offsprings are born them – cansurvive)
 • మనుగడ కోసం పోరాడేవే సంతానాన్ని అందిస్తాయి. (the survivors of the competition for resources will reproduce)


పరిశీలనాంశాల ప్రాముఖ్యత : (Significance)

నిశిత దృష్టితో డార్విన్‍ జీవపరిణామ సిద్దాంతాన్ని (Theory of Evolution) ప్రతి పాదించాడు. ఇది సహజ ఎంపిక (Natural Selection) ద్వారా జరిగినట్లుగా గుర్తించి, జీవజాతుల పుట్టక (Origin of Species) రహస్యాన్ని చేధించాడు. మానవుడి పూర్వికులు దాదాపు 70లక్షల సంవత్సరాల క్రితం నాటి చింపాంజి లాంటి వాలిడి (తోకలేని) కోతుల నుంచి వచ్చారని, వీటన్నింటి ముత్తాత 350 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టిన తర్వాత ఆవిర్భవించిన లూకాను (Lucanu) అనే జీవి అని నిర్ధారించాడు.


డార్విన్‍ చేజిక్కించుకున్న అవకాశం :

జీవుల పుట్టక, మనుగడ గూర్చి రెండు శతాబ్దాలకు పూర్వమే చాలా మంది శాస్త్రజ్ఞులలో సంశయాలుండేవి. చర్చలు జరిగేవి. డార్విన్‍ సమకాలికుడైన మరో బ్రిటీషు ప్రకృతి శాస్త్రవేత్త రస్సెల్‍ వాలెస్‍ (Russel Wallace) మలయా (మలేషియా) దీవుల్లోని జంతుజాలాన్ని (1854-62) మధ్య కాలంలో పరిశీలించాడు. వీరిద్దరు రాసిన పత్రాలు లియోన్‍ (Leone) సొసైటీకి 1859లో అందాయి. వీటిని పరిశీలించిన దాని సభ్యులు, డార్విన్‍ 1844 రాసినట్లుగా, వాలెస్‍ 1858లో రాసినట్లుగా గుర్తించి, ప్రకృతివరణ సిద్దాంత ఆవిష్కర్తగా డార్విన్‍కే గుర్తింపునిచ్చారు. కొంత మంది డార్విన్‍ గ్రంథ చౌర్యం చేసాడని అభియోగించారు. వాలెస్‍ కృషి కూడా అభినందనీయమే! కాని, ఆయన సేకరించిన నమూనాలు, శిలజాలు, రాసుకున్న పత్రాలు బోటు ప్రయాణంలో దగ్దమయ్యాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కొన్ని మరణిస్తే మరికొన్ని బతకడాన్ని, వాలెస్‍ మనుగడ కోసం పోరాటం అని (Suruival of the fittest) ముందుగా ప్రకటించాడు. దీంతో కొన్ని కథనాల్ని వాలెస్‍తో కలిసి డార్విన్‍ ప్రచురించాడు. అందుకే డార్విన్‍ ప్రతిపాదిక ప్రకృతివరణ సిద్దాంతం (species change through Natural Selection) వాలెస్‍ ప్రతిపాదిత పదజాలమని (Pharse) అంటారు.
ఇలా డార్విన్‍కు జీవపరిణామ సిద్దాంత పిత (Father of Evolution)గా పేరు వచ్చింది. దీన్నే డార్విన్‍ ఈ కింది విధంగా చెప్పాడు.


VISTA

 • Variation (వ్యత్యాసం)
 • Inheritance (వారసత్వం)
 • Selection (ఎంపిక)
 • Time & Adoption (పరిసరాల అనుగుణత)


పరిణామం – రకాలు (Types of Evolutions):
వచ్చిన అవకాశాలతో పాటుగా, డార్విన్‍ ప్రతి అంశాన్ని స్పష్టంగా విశదీకరించే వాడు. తన సిద్దాంతాలతోపాటు పరిణామాలు ఈ కింది రకాలని చెప్పాడు.

 • అభిసార (రెండు జీవుల కలయిక) (convergent)
 • విపరిణామ (వేర్వేరు జీవుల కలయిక) (divergent)
 • సమాంతర (parallel)
 • సహపరిణయం (దగ్గరగా కలిసుండే జీవుల మధ్య సంబంధం) (co-eveolutin)


పరిణామ సిద్ధాంతాలు (Theories of Evolution)
జీవ పరిణామ సిద్దాంతాలు అయిదు విధాలని డార్విన్‍ ప్రతిపాదించాడు.

 • పరిణామం అనివార్యం (evolution as such)
 • సాధారణ సంతతి (common descent)
 • క్రమబద్దత (gradualism)
 • జీవుల పుట్టుక (multiplication of spcies)
 • సహజ ఎంపిక (natural selection)


సృష్టిలో పరిణామం సహజమని, జీవులన్నింటికి ఓ మూల జీవి వుందని, దీని నుంచే ఇతర జీవులు ఉద్భవించాయని, వీటి పుట్టుక గుణకార పద్ధతిలో జరుగునని, కాని, ప్రకృతి ఎంపికలో కొన్ని నెగ్గితే, మరికొన్ని కనుమరుగైతాయని డార్విన్‍ వివరించాడు.


పరిణామ సిద్దాంతం (డార్వినిజం)(Theory of Evolution)
డార్విన్‍ అన్వేషించి, పరిశీలించిన అంశాల్ని ఏకపక్షంగా కాకుండా, తన సమకాలికులైన థామస్‍ మాట్టాస్‍, చార్లెస్‍ లియల్స్ రచనలతో మరింతగా ప్రభావితమై వాలెస్‍ ఆలోచనల్ని కూడా జోడించి తన సిద్దాంతాన్ని కింది విధంగా ప్రకటించాడు.

 • జీవపరిణామం హఠాత్తుగా జరగలేదు.
 • ఇది నిరంతరం సంభవించే పక్రియ.
 • ప్రకృతి జీవుల్లో వైవిధ్యాల్ని కల్గించదు.
 • ఉపయోగకరమైన వైవిధ్యాలతో గల జీవులను మాత్రమే ప్రకృతి ఎంపిక చేస్తుంది.
 • ఏ జీవి జాతులు శాశ్వతం కాదు. అవి ఎల్లవేళ్ళలా మార్పులకు లోనవుతాయి.


జీవపరిణామం చెందిన తీరును, కొత్త జాతులు ఉద్భవించిన విధానాన్ని పై అంశాలు స్పష్టంగా వివరిస్తాయి. డార్వినిజంలోని మూలసూత్రాలు కూడా ఇవే!


పరిణామ సిద్దాంతంలోని ముఖ్యమైన అంశాలు : (Factors)

1. ప్రత్యుత్పత్తి :
అన్ని జీవులు తమ సంతానాన్ని (మొక్కలతో సహా) ఉత్పత్తి చేసు కుంటాయి.
ఉదా।। పేరామేషియం రోజుకు 3-4 సార్లు ప్రత్యుత్పత్తి జరుపును.
2.జనాభాల నిర్ణీత సంఖ్య
వేలాది విత్తనాల్ని, పదుల సంఖ్యలో సంతానాన్ని అందించినా, అందులో బతికేవి కొన్ని మాత్రమే! అంటే ప్రకృతి వీటిని విభిన్న పద్దతుల్లో నియంత్రిస్తుంది.
3.మనుగడ కోసం పోరాటం
తాను మాత్రమే బతకాలనేది ప్రతి జీవి లక్ష్యం. అందుకే ఒకేజాతిలో, విభిన్న జాతుల మధ్యన నిరంతర పోరాటం జరుగుతుంది.
ఉదా।। మనిషి × మనిషి / పిల్లి×ఎలుక / మహావృక్షం × చిన్న మొక్కలు.
భౌతిక శక్తులతో (తుఫానులు వరదలు/ సునామిలు/ భూకంపాలు / ఆహారం కోసం/ రోగాలు) నిత్య పోరాటం. కాబట్టి జనాభా నియంత్రించబడి స్థిరంగా వుంటుంది. పోతే మానవ జనాభా ఈ మధ్యన పెరిగినా, కరోనా లాంటి మహమ్మారి కాపుకాస్తూనే ఉంది.
4 వైవిధ్యాలు
ఉపయోగకరమైన వైవిధ్యం గల జీవులు, ఈ వైవిధ్యం లేని వాటికంటే ఎక్కువ కాలం మనుగడ సాగిస్తాయి.
ఉదా।। బొచ్చు దట్టంగా ఉన్న గొర్రె చలికి తట్టుకుంటుంది.
5.ప్రకృతి వరణం
ఉపయోగకరమైన వైవిధ్యంగల జీవుల్ని ప్రకృతే ఎంచు కుంటుంది. ఇవే ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తాయి. దీన్నే హెర్బర్ట్ స్పెన్సర్‍ (spencer) యోగ్యతల సార్థక జీవనం (Survival of the Fittest) అని వ్యాఖ్యానించాడు.
6.అనువంశికత :
ఉపయుక్త వైవిధ్యాలు తర్వాతి తరానికి బదలాయించబడుతాయి. మొదటి తరానికన్నా తర్వాతి తరం భిన్నంగా వుంటుంది.
7.కృత్రిమ ఎన్నిక
అన్ని జీవరాసుల్లో ఒక్క మానవుడే ప్రజనకర్త (artificial selector). రెండు విభిన్న జాతుల మధ్యన సంపర్కం జరిపి మరింత మేలైన జాతుల్ని ఎంపిక చేస్తాడు.
8.లైంగిక ఎన్నిక
ఇది కొంత వివాదస్పదమైన ఆలోచన. స్త్రీ జీవి ఆకర్షణీయమైన రంగు, అందం గల పురుష జీవినే ఎన్నుకుంటుంది. కొన్ని జంతువులలో ఇది వారస్వతమే! కాని, మనుషుల్లో ఈ గుణం మగ జీవులకు కూడా వుంటుంది. అంటే అభివృద్ధి చెందిన జీవుల్లో సంపర్కం శారీరక ఆకర్షణపై ఆధారపడుతుందన్నమాట!
9.పాన్‍ జెనెసిస్‍ (జన్యు బదలాయింపు)
ప్రతి జీవిలో సహజమైన జన్యువులుంటాయి. ఇవి సంపర్క సమసమయంలో బీజకోషాలను చేరి (మొక్కల్లో పుష్పాలు) బీజకణాల ద్వారా తర్వాతి సంతానానికి చేరుతాయి.

డార్వినిజం – పరిమితులు : (Limitations)
ఏ సిద్దాంతమైన కొన్ని పరిమితులను కలిగి వుంటుంది. కొన్ని సిద్దాంతాలు కాలనుగుణంగా, కొన్ని షరతులకు లోబడి వుంటాయి. నిజానికి డార్విన్‍ సిద్దాంతం సార్వజనీనమైనదే కాక, జీవుల పుట్టుక, మనుగడకు సంబంధించిన అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెపుతుంది. ఇప్పటికి ఈ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయ సిద్దాంతం ప్రతిపాదించబడలేదు.


పోతే, డార్విన్‍ సిద్దాంతానికి ముందు ప్రతిపాదించిన బాప్టిస్ట్ లామార్క్ సిద్దాంతం పరిసరాలకు అనుగుణంగా వినియోగించబడిన భౌతిక అవయవాలు, తర్వాతి తరానికి అందించబడుతాయని (Great used organs will be developed and transimitted to off springs inheritance of acquired characters.) జిరాఫిని ఉదహరణగా చూపాడు. ఇది చర్చకు నిలబడలేదు. అందుకే వీగిపోయింది. కాని, డార్విన్‍ సిద్ధాంతానికి ఇది దారుల్ని వేసింది. అందుకే డార్విన్‍ సిద్ధాంతంకు ముందు లామార్క్ సిద్దాంతాన్ని విధిగా చూస్తాం. ఇదే సైన్సుకున్న దొడ్డ గుణం. డార్విన్‍ తర్వాత వచ్చిన హ్యూగో డివ్రిస్‍ (Hugo de vies) ఉత్పరివర్తన (Mutation) సిద్దాంతం డార్విన్‍ సిద్దాంతానికి కొనసాగింపుగానే చూస్తాం. పైగా హ్యుగో, డార్విన్‍ సిద్దాంతాన్ని సమర్థించాడు. అందుకే డార్వినిజం నేటికి అజరామమైంది.


సిద్దాంత పరిమితులు : (Limitations)

 • డార్విన్‍ కొన్నింటికి వివరణల్ని ఇవ్వలేకపోయాడు.
 • వైవిధ్యాల కారణాలను వివరించలేదు.
 • అవ శేషావయాల గూర్చి చర్చ లేదు.
 • అనువంశిక, అనువంశిక రహిత వైవిధ్యాల మధ్య తేడాను స్పష్టం చేయలేదు.

అవసరానికి మించిన అవయవాల పెరుగుదల (ఐరిష్‍ జింకల కొమ్ములు, జెపర్‍సన్స్ మమూత్‍ ఏనుగు దంతాలు) గూర్చి నిశ్శబ్దంగా వుంది.


డార్వినిజంకు కొనసాగింపు : (Neo-Darwinism)
పరిణామ సిద్దాంతం డార్వినిజంతోనే ఆగిపోలేదు. దీనిపై నిరంతర ఆలోచనలు కొనసాగుతూ, డార్విన్‍ వదిలిపెట్టిన అంశాలకు సమాధానాల్ని వెతుకుతూనే వున్నాయి. అందులో డచ్‍ శాస్త్రజ్ఞుడైన హ్యూగో డ్రివీస్‍ ప్రముఖుడు. తర్వాత ఇంగ్లాండ్‍కు చెందిJS Huxley, R fisher, JbS Haldaneలు కాగా, అమెరికాకు చెందిన S. Wright, Ford, HJ Muller, J.Dobzhansky లు ముఖ్యులు.
నేటికి పరిణామ సిద్ధాంతంపై చర్చలు, పరిశోధనలు, అన్వేషణలు కొనసాగుతున్నాయి. డార్విన్‍ సిద్దాంతం తప్పు అని చెప్పే సిద్ధాంతాలు ఇప్పటికీ రాలేదు. అందుకే డార్వినిజం అలరారుతూనే వుంది. (వచ్చే సంచికలో అంటార్కిటికా ప్రయోగాల్ని చూద్దాం!)

 • డా।। లచ్చయ్య గాండ్ల,
  ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *