దక్కని సిక్కుల సాంస్కృతిక జీవితం

దక్కను పీఠభూమి ఎన్నో జాతులకు, సంస్కృతులకు పుట్టినిల్లు. ఎన్నో శతాబ్దాల తన ప్రయాణంలో ఎన్నెన్నో జాతులను ఇముడ్చుకున్నది. భిన్న ఆదివాసి జాతులకు ఆలవాలమైన ఈ భూమి ఆధునిక సంస్కృతులకు కూడా వేదికైంది. దక్కను ప్రాంతం గురించి చెప్పడమంటే అప్పటి హైదరాబాద్‍ స్టేట్‍ గురించి చెప్పడమే. అంతేకాకుండా తెలంగాణ తన చరిత్రను మరింత విస్తృతపర్చుకోవడం కూడా అవుతుంది. వివిధ ముస్లిం రాజుల పరిపాలన కాలంలో దక్కనులో ఎన్నో జాతులు వచ్చి స్థిరపడ్డాయి. ఇక్కడి సంస్కృతులతో ఆ జాతులు మమేకమై జీవనం కొనసాగిస్తున్నాయి. అట్లా ‘నూటా తొంభై’ సంవత్సరాలుగా తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ, ఇక్కడి ప్రజలతో కలసి జీవిస్తున్న సిక్కుల సాంస్కృతిక జీవితం గురించి చెప్పుకోక తప్పదు.


భౌగోళికంగా నిజాం రాజ్యం చాలా పెద్దది. ఈ సంక్లిష్ట భూభాగాన్ని పరిపాలించడం కొంత ఇబ్బందితో కూడిన వ్యవహారమే. నిజాం తన పరిపాలన అస్తవ్యస్థంగా మారితే ఇతరుల పై ఆధారపడడం ప్రారంభించాడు. నాలగవ నిజాం నసీరుద్దౌలా (1829-1857) కాలంలో ప్రజలు శిస్తులు కట్టకపోవడం, శాంతి భద్రతల సమస్య ఏర్పడడం (పిండారులు, మరాఠాల దాడులు)తో ఆ లోటును పూడ్చడానికి పెద్ద ఎత్తున సైన్యం అవసరమైంది. నిజాం రాజ్యానికి సంబంధించిన అరబ్‍, నిగ్రో, సిద్ది, రోహిల్లా, పఠాన్‍ సైన్యాలు పూర్తిగా విఫలమైనాయి. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన నిజాం తన ప్రధాని చందూలాల్‍ (1822-1843) (పంజాబ్‍ ప్రాంతానికి చెందిన ఖత్రి సామాజిక వర్గానికి చెందినవాడు) సూచన మేరకు పంజాబ్‍ రాజ్య పాలకుడైన మహారాజ రంజిత్‍ సింగ్‍ సహాయాన్ని అర్థిస్తాడు. మహారాజ రంజిత్‍ సింగ్‍ విస్తృతమైన తన రాజ్యాన్ని ఏ ఇబ్బందులు లేకుండా చాలా అర్థవంతంగా పరిపాలిస్తున్నాడు. కారణం సిక్కు రెజిమెంట్లు ఉండడం చేతనే. సిక్కులు చాలా బలవంతులు, దేశభక్తులు, నమ్మకంగా పనిచేస్తారనే విశ్వాసం నాడు నేడు జగమెరిగిన సత్యం. నిజాం రాజు మహారాజు రంజిత్‍ సింగ్‍ని కోరడంతో లాహోర్‍ నుండి సైనాన్ని పంపిస్తాడు. నిజాం రాజు దీనికి ప్రతిగా అమృత్‍సర్‍ గురుద్వారా సాహెబ్‍కు ఎంతో విలువైన బంగారు చాదర్‍ను సమర్పించుకుంటాడు. ఇది ఆపరేషన్‍ బ్లూ స్టార్‍లో చాలా వరకు కాలిపోయింది. సాంస్కృతిక ఐక్యత చిహ్నాలు ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న భారత్‍లో స్వార్ధ ప్రయోజనాలకు బూడిద కావల్సిందేనా!


1832 సంవత్సరంలో సిక్కు రెజిమెంటు పదనాలుగు బెటాలియన్‍లుగా, అంటే సుమారు 1,400 మంది సైనికులు, నాలుగు నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత హైదరాబాద్‍ స్టేట్‍కు చేరారు. ఈ సైన్యాన్ని ‘జామియత్‍-ఇ-లాహోరి’ (Army of Lahore) అంటారు. వీరికి హైదరాబాద్‍ నగర శివార్లలో, ఇప్పటి కిషన్‍భాగ్‍లో విడిది ఏర్పాటు చేశారు. వారి పూర్వీకులు ఇక్కడి ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఆ ప్రాంతంమంటే సిక్కులకు నేటికి ఎనలేని మమకారం. ఆ ప్రాంతానికి వారు పెట్టుకున్న పేరు ‘బరంబాల సిక్‍ చౌని’ (Sikh Cantonment). నేటికి ఆ స్థలాన్ని వారు వారి ఉమ్మడి ఆస్థిగా పరగణిస్తారు. శిథిలావస్థలోనున్న గురుద్వారా అప్పటి ఆనవాళ్ళను చెప్పకనే చెపుతున్నది. తరువాత ఉప్పుగూడలో కూడ వసతి ఏర్పాటు చేశారు. దానిని కూడ వారు ఉప్పుగూడ సిక్‍ చౌని అని అంటారు.
నిజాం ప్రభుత్వం హైదరాబాద్‍ స్టేట్‍ లోని అన్ని జిల్లాల (16)కు సిక్కు సైనికులను పంపారు. ఈ సైనాన్ని ‘‘బేఖాయిదా పౌజ్‍’’ అంటారు. ఈ సైన్యంలో రిసల్‍దార్‍, సిలేదార్‍, జమేదార్‍, కానిస్టేబుల్‍ అనే వర్గీకరణ ప్రధానంగా కనపడుతుంది. వీరు గ్రామాలు, పట్టణాలు తిరిగి శిస్తు వసూలు చేయడమే కాక శాంతి భద్రతల సమస్యను కూడ చక్కదిద్దేవారు. నిజాం సిక్కు సైనికులకు జాగిర్దార్‍లను ఖేటాయించాడు. కాని వారు తిరస్కరించారు. ఏ జాగీర్‍ను తీసుకోలేదు. మీర్‍ ఉస్మాన్‍ ఆలీ ఖాన్‍ నిర్మల్‍ జాగిర్‍దార్‍ను రాసిస్తే, ఆ ఫర్మానను తుపాకీ గొట్టంలో పెట్టి కాల్చేశారు. ‘మేము నిన్ను బతికియ్యడానికి వచ్చాము మాకెందుకు నీ ఆస్తి’ అని. నిజమే… నమ్మిన పని కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని సిక్కు సైన్యం కదా…! వీరికి మహారాజ రంజిత్‍ సింగ్‍ ఖజాన నుండే జీతభత్యాలు అందేవి. అనుకున్నట్లుగానే హైదరాబాద్‍ స్టేట్‍ శాంతిభద్రతల సమస్య తీరింది. భారీగా వసూలైన శిస్తులతో ఖజానా నిండింది.


అట్లా విజయవంతంగా విధులు నిర్వహిస్తున్న సిక్కులు, తిరిగి తమ రాజ్యానికి వెళ్లే సందర్భంలో మహారాజా రంజిత్‍ సింగ్‍ రాజ్యం పతనమై, బ్రిటీషు సైన్యం హస్తగతమవడంతో కలత చెందారు. బ్రిటీష్‍ రాజ్యంలో బానిసలుగా బతికే కంటే హైదరాబాద్‍ స్టేట్‍లోనే ఉండడం మేలనుకున్నరు. నిజాం రాజు కూడా ‘మీ సేవలు ఈ రాజ్యానికి అవసరం. భారీ వేతనాలు ఏర్పాటు చేస్తం. హైదరాబాద్‍ స్టేట్‍లోనే ఉండమని’’ అభ్యర్థిస్తాడు. దక్కను ప్రాంతంలో స్థిరపడాలనుకున్న సిక్కు సైనికులు ఇక్కడి స్థానికులను దళితులను, నిమ్న వర్గాలను ముఖ్యంగా మహారాష్ట్రీయన్‍లను వివాహం చేసుకున్నారు. సిక్కు ధర్మం ప్రకారం అమృతం తాగిపించి సిక్కు అయిన తరువాత, వారి ధర్మ పద్ధతిలోనే వివాహాలు చేసుకున్నారు. వారికి కల్గిన సంతానమే నేడు ‘‘దక్కని సిక్కు’’లుగా పిలువబడుతున్నారు. ఇక్కడనే స్థిరపడ్డారు కావున పంజాబ్‍ ప్రాంతంతో వీరికి సంబంధం పూర్తిగా తెగిపోయింది. అప్పటి నిజాం సర్కారు వీరికి అన్ని వసతులు కల్పించింది. మగపిల్లవాడు సిక్కు మతంలో పుడితే ఆ రోజు నుండే అతను ‘‘నిజామ్‍ ప్రభుత్వ ఉద్యోగి’’గా పరిగణించేవారు. సిక్కు సైన్యం రాక మునుపే గురు గోవింద్‍ సింగ్‍ (1708) సుమారు 300 మంది హజూరి సిక్కు అనుచరులతో నాందేడ్‍ను కేంద్రంగా చేసుకొని పనిచేయడం జర్గింది. వీరిలో చాలా మంది పంజాబ్‍కు వెళ్లిపోగా, మిగిలినవారు గురు గోవింద్‍ సింగ్‍తో ఉండి పోతారు. అనంతరం వీరే ఈ ప్రాంతంలో సిక్కు మత రక్షణ కోసం దక్కన్‍ ప్రాంతమైన నాందేడ్‍లో స్థిరపడ్డారు. గురుగోవింద్‍ సింగ్‍ దక్కను ప్రాంతాన్నే ఎంచుకోవడం చారిత్రక పరిణామం. గురు గోవింద్‍ సింగ్‍ చివరి శ్వాస ఇక్కడనే వదలడం, గురు గ్రంథ్‍ సాహెబ్‍ పవిత్ర గ్రంథాన్ని గురువుగా ఆయన పెర్కోనడంతో ‘సచ్‍ఖండ్‍ హజూరి సాహెబ్‍ గురుద్వారా’ నాందేడ్‍ సిక్కుల ఐదు పవిత్ర తక్త్లలో ఒకటిగా మారడం ఇక్కడి ప్రాంత వైశిష్టాన్ని తెలుపుతున్నది. కావున హైదరాబాద్‍ స్టేట్‍కు వచ్చిన సిక్కు సైన్యం ఇక్కడనే స్థిరపడడానికి ఇది కూడ ఒక ప్రధాన కారణం. సిక్కులకు దక్కనుతో అనుబంధం మూడువందల యేళ్ల పాతదే కాదు. అయిదు వందల యేళ్ల క్రితం గురు నానక్‍ తన సుదీర్ఘ యాత్రలో దక్షిణా పథం వైపు పయనిస్తూ దక్కన్‍లో వివిధ ప్రాంతాలలో విశ్రాంతి తీసుకున్నాడు. గోలకొండ ప్రాంతాన్ని సందర్శించాడు. గురునానక్‍ బీదర్‍లో పయనిస్తూ (ఏప్రిల్‍ 1512), ఒకానొక సందర్భంలో, కాలితో బండరాయిని పెకిలించగా, నీటి ఊట ఎగజిమ్మి యేరులైంది. ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చాడు. ఐదువందల యేళ్ళ నుండి నిర్విరామంగా ఆ ఊట చెలిమె పారుతూనే ఉంది. గురు నానక్‍ అడుగిడిన నేలైన బీదర్‍ (నానక్‍ జీర బీదర్‍) సిక్కుల పవిత్ర స్థలంగా మారింది. సజ్జన్‍ సింగ్‍, శిరోమణి గురుద్వారా ప్రబంధక్‍ కమిటీ, సభ్యులు దక్కన్‍ ప్రాంతంతో సిక్కులకు ఎంత అనుబంధం ఉన్నదో వివరించాడు. ‘‘దక్షిణా పథ మహా పాదయాత్రలో గురునానక్‍ ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకున్నాడో ఆ ప్రాంతాలలో గురునానక్‍ పెద్ద కుమారుడైన శ్రీ చంద్‍ అనుచరులు ‘ఉదాసి మఠం’లను స్థాపించారు. హైదరాబాద్‍, పాతబస్తీలోని హుస్సేని ఆలం ఉదాసిన్‍ మఠం చాలా పురాతనమైంది. 1822లో చందులాల్‍ నిర్మల్‍ కేంద్రంలో ఉదాసి మఠాన్ని నిర్మించాడు’’. ఈ కారణంగానే దక్కన్‍ ప్రాంతమంటే సిక్కులకు అభిమానం ఏర్పడింది. ఉదాసి పంథ్‍ సంప్రదాయమనగా వివాహం చేసుకొనకుండా ఆశ్రమ విరాగులుగా బతికేవారు. సిక్కు మతానికి వీరికి సంబంధం లేదు.


గురుగోవింద్‍ సింగ్‍ కాలంలోనే సిక్కు ధర్మం పూర్తి రూపం తీసుకున్నది. ప్రతి యువకుడు సైనికుడిగా మారాడు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో దక్కనీ సిక్కులున్నారు. వరంగల్‍, కరీంనగర్‍లో ఎక్కువ కనిపిస్తారు. ఇక్కడి కంటే కూడ రాజధాని నగరమైన హైదరాబాద్‍లో చాలా వరకు సిక్కు కుటుంబాలు స్థిరపడ్డాయి. గౌలిగూడ, కిషన్‍ భాగ్‍, ఉప్పుగూడ, అమీర్‍ పేట, రహ్మత్‍ నగర్‍ మొదలగు ప్రాంతాలలో వీరి జనాభా అధికం. వీరి వివాహ సంబంధాలు దక్కన్‍ ప్రాంతమంతటా విస్తరించాయి. వీరు అసలైన తెలంగాణ ప్రాంతవాసులుగా కనిసిస్తారు. వీరు హిందీని మాతృభాషగా ఎంచుకోవడం సహజంగా జరిగిన పరిణామం. పంజాబీ భాష వారి నుండి దూరమైంది. అలాగే తెలంగాణ పట్టణాలలో అచ్ఛమైన తెలంగాణ భాష ఒక్క దక్కనీ సిక్కులు మాత్రమే మాట్లాడుతున్నారు. వీరి తెలంగాణ భాష సొబగు వినసొంపుగా ఉంటుంది. అంతరిస్తున్న తెలంగాణ భాషకు జీవం అద్దినట్లుగా ఉంటుంది.


ఇక్కడ ప్రధానంగా చెప్పుకునే విషయమేమిటంటే దక్కని సిక్కులకు ఇంటి పేర్లుగాని, గోత్రాలుగాని ఉండవు. తమ పేరు ముందు ‘సర్దార్‍’అని, అదే మహిళలయితే ‘సర్దార్ని’గా పిలుచుకుంటారు. అదే పంజాబ్‍లో గోత్రాలు, ఇంటి పేర్లు సహజం. సిక్కు మత ధర్మం ప్రకారం ఇవి ఏవి (బ్రాహ్మణిజం ఏర్పర్చిన రుగ్మతలు) ఉండకూడదు. దక్కనులో ఇవేమి లేకుండా నిజమైన సిక్కులుగా మనుగడ సాగిస్తున్నారు. ఇది దక్కను సిక్కులు సాధించిన పరిణతిగా చెప్పుకోవచ్చు. కొందరు తమను దక్కనీ సిక్కులని కాకుండా సిక్కుగానే గుర్తించాలంటారు. నానక్‍ సింగ్‍ నిస్తర్‍, ఊర్దు కవి అభిప్రాయం ప్రకారం దక్షిణాపథానికి దక్కన్‍ ప్రాంతమని పేరు. భౌగోళిక విభజన కోసం దక్కనీ సిక్కులుగా వ్యవహారిస్తాం. ఆహార్యంలో వీరు స్థానికులను పోలి ఉంటారు. కాని పంజాబ్‍లోని సిక్కుల కంటే కూడా వారి మతాచారాలను ఖచ్చితంగా పాటిస్తారు. గురు గోవింద్‍ సింగ్‍ చెప్పిన ఐదు ‘పంజ్‍ కాకర్‍’ కేశ్‍ (కేశాలు), కరా (కడెం), కంగ (దువ్వెన), కచ్ఛ (అంగవస్త్రం), కిర్‍పాణ్‍ (కత్తి)లు తప్పనిసరిగా ధరిస్తారు. తమ శరీరం నుండి వాటిని విడదీయరు. సింహానికి ప్రతిరూపంగా ఉన్న గడ్డం, మీసాలను అపురూపంగా పెంచుకుంటారు. అసలుకే తీయరు. వీరు పంజాబీ సంస్కృతులను ప్రతిబింబిస్తూ, స్థానిక ఆచారాలను కూడ కొనసాగిస్తున్నారు. దసరా, దీపావళి, హోళి, ఉగాది మొదలగు పండుగలను జరుపుకుంటారు. పంజాబ్‍లోని సిక్కులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా అభివృద్ధి చెందారు. పాశ్చాత్యీకరణ ప్రభావం కారణంగా గడ్డాలు, మీసాలు తీసేస్తున్నారు. పంజాబ్‍ సిక్కు దక్కనీ సిక్కుల మధ్య విభజన రేఖ స్పష్టంగా కనపడుతుంది. ఆధునిక కాలంలో, దక్కను ప్రాంతంలో స్థిరపడ్డ పంజాబ్‍ ప్రాంత సిక్కులకు దక్కనీ సిక్కులకు మధ్య సంబంధ బాంధవ్యాలు లేవు. పంజాబ్‍ ప్రాంత సిక్కులు ఆధిపత్య భావజాలాన్ని కల్గి ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న పంజాబ్‍ ప్రాంత సిక్కులు వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. దక్కన్‍లోని చాలావరకు దక్కనీ సిక్కు కుటుంబాలు పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. నిజాం రాజ్యం అంతరించిన తరువాత సిక్కుల ప్రాధాన్యత తగ్గింది. విద్య, ఉద్యోగాలలో వీరికి కల్పించబడిన సదుపాయాలన్నీ అంతర్థాన మైనాయి. వీరు మైనార్టీ కావడంచేత వీరికి ఏ సదుపాయాలు అందడంలేదు. నేటికి వీరు తమ శ్రమ శక్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో, ఉన్నత చదువులలో వీరు అసలే కనిపించరు. చేయడానికి పనులు లేక కొందరు సిక్కులు రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారస్తుల స్థలాలకు కాపలాదారులుగా, వడ్డీ వ్యాపారస్తుల కింద వడ్డీ వసూలు చేసే వ్యక్తులుగా వీరిని ఉపయోగించు కుంటున్నారు. సహజంగా సమాజంలో సర్దార్జీలంటే భయం కారణంగా. ఈ అపోహ ఇంకా కొనసాగుతున్నది. మైనార్టీల విషయంలో మెజార్టీ ప్రజలు చాలా సందేహాలు పెట్టుకుంటారు. కాని ఆ సందేహాలు అపోహలు మాత్రమే. హైదరాబాద్‍ నగరంలో చిన్న చిన్న ఒకటి రెండు గదులలోనే వీరు జీవిస్తున్నారు. నిజాం ఇచ్చిన జాగిర్దార్లను తీసుకోకపోవడంతో వీరికి ప్రత్యేకంగా స్థలాలు లేవు. వారి పూర్వీకుల స్థలమైన సిక్‍ చౌనిలో కట్టుకున్న ఇండ్లకు నేటికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదు. పంజాబ్‍ నుండి వచ్చిన సిక్కులు దాబాలు, మద్యం దుఖానాలు పెడుతున్నారు. కాని దక్కని సిక్కులు వారి మత విశ్వాసాల ప్రకారం మద్యం, ఇతర మత్తు పదార్ధాలకు పూర్తిగా దూరంగా ఉంటారు.


ఇక్కడి ప్రజలతో మమేకమై ఒక సాంస్కృతిక వారధిని నిర్మించిన దక్కనీ సిక్కు మహానీయులు ఈ ప్రాంతంలో చాలా ఉన్నారు. చరిత్రలో ఒక కవికి గుడి కట్టి ఆరాధించిన సందర్భాలు చాలా అరుదు. కాని రామసింహ ఆ గౌరవాన్ని పొందాడు. కవిగా విస్తృత ప్రజల మన్నలను పొందాడు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చిన్న పద్యాలతో ప్రజలను మేలుకొల్పాడు. ఇటీవల ప్రముఖ రచయుత కె.వి.నరేందర్‍ రామసింహ కవి గురించి వివరణాత్మక వ్యాసాలు రాశాడు. విస్మృతికి గురైన కవిని యాది చేసుకునే అవకాశం కల్గింది.
పల్లె జనపదాలలో దాగిన చరిత్రను డాక్యుమెంటేషన్‍ చేస్తే విలువైన సాహిత్యం బయటకు వస్తుంది. తెలియని వీరుల సాహస గాథలు బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. అట్లా విస్మరణకు గురైన సాహస వీరుడు, పందొమ్మిదవ శతాబ్దపు రాబిన్‍ హుడ్‍గా పల్లె ప్రజల మన్నలను పొందాడు. అతడే నారాయణ సింగ్‍ మోర్తాడ్‍. ఈయన అసలు పేరు నారాయణ సింగ్‍ పహార్‍. నిజామాబాద్‍ జిల్లా మోర్తాడ్‍ ఈయన కార్యక్షేత్రం. సంపన్నుల నుండి దోచిన సొమ్మును పేదలకు పంచిపెట్టడం కర్తవ్యంగా భావించాడు. చివరకు నిజాం రాజు ఆగహ్రానికి గురైండు. పలుమార్లు నిజాం సైన్యంతో పోరాడి విజయం సాధించిన నారాయణ సింగ్‍ను విషపప్రయోగం చేసి చంపారు. జనపదంలో నిక్షిప్తమైన ఈ సాహస వీరుడిని గురించి నిజామాబాద్‍ ప్రాంత ప్రజలు కథలుగా పాడుకుంటారు.


దక్కనీ సిక్కులు తమ పూర్వీకులు ‘సిక్కు సైన్యం’ అని ఎంతో గర్వపడతారు. వారి ధైర్య సాహసాలు, నీతి నిజాయితీ గురించి ఇప్పటికి కథలుగా చెప్పుకుంటారు. విచారణలో భాగంగా, సిక్కు సైనికుడు ఒక కుటుంబాన్ని సందర్శించి వెళ్తే, ‘ఆ కుటుంబ సభ్యులు ఏ తప్పు చేశారో అందుకే సిక్కు వచ్చి వెళ్లాడు’ అనే చర్చ ఊరంతా సాగేది. నిజాయితీగా విధులు నిర్వహించే సిక్కు సైనికులు, రిసాల్‍దార్లు అనుచితంగా ప్రవర్తించే నిజాం అధికారులను గౌరవించరు. ఆశా సింగ్‍ అనే సైనికుడు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకుండా అలక్ష్యం చేసిన నిజాం రాజు వైఖరికి వ్యతిరేఖంగా హైదరాబాద్‍ స్టేట్‍ మిలట్రీపై తిరుగుబాటు చేశాడు. కిషన్‍ భాగ్‍లో ఈయన జ్ఞాపకార్థం ‘ఆశా సింగ్‍ భాగ్‍ షహీదన్‍ గురుద్వారా’ను నిర్మించారు.


అలాగే హైదరాబాద్‍, గౌలీగూడ నుండి ఎదిగిన సాహితీ దిగ్గజం నానక్‍ సింగ్‍ నిస్తర్‍ పంజాబీ, ఉర్దూ సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్నాడు. వీరు మంచి ఉపాన్యాసకులు. దక్కనీ సిక్కుల చరిత్ర, సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా, హైదరాబాద్‍ నగర ప్రాచీన కట్టడాలను కాపాడాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న శిరోమణి గురుద్వారా ప్రపంధక్‍ కమిటీ, అమృత్‍సర్‍ సభ్యులు సజ్జన్‍ సింగ్‍ గొప్ప పరిశోధకులు. వీరు తెలంగాణా ప్రాంతం నుండి ఎదిగిన ఆణిముత్యాలు.
దక్కనులో ఈ సిక్కులే కాకుండా గురుగోవింద్‍కు సహాయంగా ఒక ప్రత్యేక తెగ వచ్చింది. వారే ‘‘సిక్‍లీగర్‍’’లు. వీరు గురుగోవింద్‍ సైన్యానికి కత్తులు, కటార్లు తయారుచేసి ఇచ్చేవారు. గురుగోవింద్‍ సింగ్‍, ఆయన సైన్యం ఎక్కడెక్కడ తిరిగితే వీరు ఆయన వెంబడి తిరిగేవారు. సిఖల్‍గర్‍ అనగా పర్షియన్‍ భాషలో ‘ఇనుము’. వీరు ఎక్కువగా ఇనుముతో పనిచేస్తారు. వీరి పుటుక రాజస్థాని. వీరి మాతృభాష సికల్‍గరి. వీరు సంచార గిరిజన జాతికి చెందినవారు. గురుగోవింద్‍సింగ్‍తో వీరికి చాలా సాన్నిహిత్యముంది. వీరు సిక్కు మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ఖచ్చితంగా పాటిస్తారు. గురుగోవింద్‍సింగ్‍ చనిపోయిన తరువాత వీరు దక్కనులోనే స్థిరపడ్డారు. వీరు సంచార జాతి కావున ఒక దెగ్గర ఉండరు. దక్కను ప్రాంతమంతా తిరిగేవారు. యుద్ధ పరికరాలు తయారుచేసే వీరి వృత్తి పూర్తిగా మారిపోయింది. వీరు వంటింటికి కావలసిన సమస్త వస్తువులను తయారు చేస్తారు. తాపెంకలు, గంటెలు, జల్లెడ, కడాయి, జాలి గంజులు, చిట్టాగలు, పొయ్యిలు మొదలగు వస్తువులు తయారుచేస్తారు. ఈ ఎలక్ట్రానిక్‍ యుగంలో వీరి వృత్తి నడవడం చాలా కష్టమే. వీరి రెండు మూడు తరాలు విద్యకు నోచుకోలేదు.

ఇప్పుడిప్పుడే వారి పిల్లలను బడికి పంపుతున్నారు. స్థిరంగా ఒకే ప్రాంతంలో బతకడానికి ప్రయత్నిస్తున్నారు. వీరికి నేటికి పక్కా ఇండ్లు లేవు. రోడ్డు పక్కన్నే జీవిస్తున్నారు. అప్పటి రాష్ట్ర గవర్నర్‍గా సుర్జీత్‍ సింగ్‍ బర్నాల ఉన్నపుడు పక్కా ఇండ్లు కట్టించే ప్రయత్నం చేశారు. కొందరికే లబ్ధి చేకూరింది. మిగతా వారు దారుణ పరిస్థితులలో జీవిస్తున్నారు. ప్రతి జిల్లాలో వీరు కనిపిస్తారు. హైదరాబాద్‍లో మాత్రం కొన్ని వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. బాలానగర్‍, సుభాష్‍నగర్‍, కొత్తపేట, శంషాబాద్‍, రోడామిస్త్రి కాలనీ, ఎల్లమ్మబండ ప్రాంతాలలో ఎక్కువగా వీరు కనిపిస్తారు. ముఖ్యమైన సెంటర్లలో మెయిన్‍ రోడ్డు పక్కననే ఇనుముతో కుస్తీపడుతూ కనిపిస్తారు. వేసుకుంటే ‘డేరా లేకుంటే ఆరుబయటనే నివసించే సిక్‍లీగర్‍లు కడు పేదరికంలో బతుకుతున్నారు.


అలాగే దక్కనులో బంజారలకు గురుగోవింద్‍ సింగ్‍తోనున్న అనుబంధం కారణంగా, బంజారాలు చాలా మంది సిక్కు మతంలోకి పోయారు. దక్కను ప్రాంతంలో గురుద్వారాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం పాటలు పాడడానికి ప్రత్యేకంగా ‘రాగీసింగ్‍’లను నియమించుకుంటారు. ఈ రాగీసింగ్‍లు బంజార కమ్యూనిటికి చెందినవారు. మహారాష్ట్రలోని నాందేడ్‍, కర్ణాటకలోని బీదర్‍ ప్రాంతాలలోని చాలా జంజారా కుటుంబాలు సిక్కు మతాన్ని స్వీకరించారు. ఆకలితో అలమటించిన వారికి అన్నపూర్ణగా గురుద్వారాలు ఆదుకున్నాయి.
19వ శతాబ్దపు శాంతి సైన్యం (peace corps of 19th century)గా దక్కన్‍లో అడుగిడిన సిక్కు సైన్యం, ఈ ప్రాంత ఔన్నత్యం కోసం పాటుపడింది. తెలంగాణలో మూడు, నాలుగు తరాలుగా సిక్కులు జీవిస్తున్నారు. ఒకరిపై ఆధిపత్యంగాని, జులుంగాని చేసిన దాఖలాలు లేవు. సిక్కులు ముస్లింలతో సోదరభావంతో మెలుగుతున్నారు. దక్కనుతో అందులో తెలంగాణతో ఇతర మతాల, జాతుల అనుబంధం చాలా గొప్పది. ఇక్కడి జాతులు వారితో మింగిలి కాగల్గాయి. ఆర్తి, ప్రేమ, కరుణ దక్కన్‍ నేల గుణాలు కావచ్చు. ఈ నేల శుష్క వాతావరణం మనిషిని తడారిపోనివ్వడం లేదు.


-బి. వేణుగోపాల్‍ రెడ్డి
ఎ : 9908171441

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *