పిట్టలోళ్ల పిట్ట గోస ‘పార్థీవాడ’ ఆపైన ‘‘గాజిబండ’’

ఉత్తర హిందూస్థానంలో వీరిని ‘‘పార్థీ’’లు అంటారు. తెలుగులో పిట్టలోళ్ళు. పిట్టలను, ఉడతలను, ఉడుములను పట్టే సంచార జీవులు. తాము ఏకలవ్యుడి వారసులమని ఘనంగా గర్వంగా చెప్పుకుంటారు. అంతేగాక లంబాడీల మాదిరిగ తాము కూడ రాణా ప్రతాప్‍ వంశానికి చెందిన వారమని అక్బర్‍తో జరిగిన యుద్ధంలో ఆయన ఓడిన తర్వాత ప్రాణరక్షణ కోసం వలస వెళ్ళి దేశదిమ్మరులమైనామని చెపుతారు.


వీరి ముఖ కవళికలు, రూపురేఖలన్నీ రాజస్థానీయులతో పోలి ఉంటాయి. కొలిమిలో బాగా కాలిన రాగి రంగు ముఖాలు, తేనె రంగు కండ్లు వీరి ప్రత్యేకత. మొగవారికి మెలి తిప్పిన మీసాలు, తలపై రంగుల పగిడీలు ఉంటాయి. లంబాడాలు తెలివైన వారు. గాడిదలు, గుర్రాలపై ఉప్పు, ఆహార ధాన్యాల వర్తక వ్యాపారాలు చేసి, పశు పోషణ గావించి సమాజంలో ఒక ప్రత్యేకతను సంపాదించారు. ఈ పార్థీలు మాత్రం అడవుల్ని నమ్ముకుని వేటాడమే వృత్తిగా, సంచార జాతిగా జీవించారు. వీరి భాష ప్రత్యేకంగా ఉంటుంది గాని లిపి మాత్రం లేదు.


నైజాము కాలంలో వీరు హైద్రాబాద్‍ రాజ్యానికి వలస వచ్చారు. అయితే వీరిని నగరంలోకి రానీయకుండా నగరం దర్వాజాలకు అవతలనే ఆపేసారు. ఆ రోజులలో నగరం చుట్టూ పెద్ద కోట గోడ ఉండేది. ఉర్దూలో దాన్ని సఫీల్‍ అంటారు. ఆ గోడకు 13 దర్వాజాలు, 13 కిటికీలు ఉండేవి. అవన్నీ కూలిపోయి ఇపుడు రెండు దర్వాజాలు మాత్రమే మిగిలాయి. ఒకటి పురానా పూల్‍ దర్వాజా, మరొకటి డబీర్‍ పురా దర్వాజా. సూర్యోదయంతో ఆ దర్వాజాలు తెరిచి అస్తమయానికి మళ్లీ మూసేసేవారు. సంచార జాతుల వారందరు నేరస్తులని బ్రిటిష్‍ వారు చట్టాలు చేయటం వలన నైజాం సర్కారు కూడా అదే నమ్మి వారిని నగరం వెలుపల నిర్బంధించారు. నగర కోత్వాల్‍ వారి మీద ‘‘ఖడీ నిగరానీ’’ పెట్టాడు.


కొన్ని నెలలు గడిచాక ఒక పథకాన్ని అమలు చేసారు. తమలోని ఒక అందమైన కన్యను ఆ దర్వాజా దగ్గర కాపలా ఉండే అధికారికి అలవాటు చేసారు. ఆ అధికారి ఆమె అందానికి ‘‘పానీ పానీ’’ ఐపోయి (కరిగిపోయి) వారి నగర ప్రవేశం కోసం నైజాం నవాబు అనుమతి సంపాదించాడు.
ఫలక్‍నుమా గుట్ట వెనుక ఉన్న జల్‍పల్లి గ్రామాన్ని నిజాం వారికి దత్తత ఇచ్చాడు. ఆ గ్రామం వారి మొదటి నివాసం. ఆ తర్వాత నెమ్మదిగా నగరంలోని అలియాబాద్‍, షక్కర్‍ గంజ్‍, గాజీ బండ, పురానాపూల్‍ ప్రాంతాలకు వ్యాపించారు. కొండ జాతి ప్రజలు కావున మాతృస్వామిక సంఘం ఆచారాల ప్రకారం ఆ అందమైన కన్యనే తమ వంశానికి మూలమని భావించి ఆమె మరణించగానే జల్‍పల్లి గ్రామంలోనే సమాధి చేసారు. అట్ల ఆమె అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మగా అవతరించింది. పార్థీలు ఈ రోజుకు కూడా తమ వాళ్లు నగరంలో ఏ మూలలో చనిపోయినా ఆ జల్‍పల్లి గ్రామంలోనే ఖననం చేస్తారు. ఆ కన్యను గ్రామ దేవతగా కొలుస్తూ ప్రతి సంవత్సరం హోలీ, కాముని పున్నమ పండుగ అయిన మూడోనాడు ఆ గ్రామంలో పెద్ద జాతర చేస్తారు. వారం రోజులపాటు ఆ జాతర ఘనంగా కొనసాగు తుంది. కల్లు, సారా ఏరులై పారుతాయి. తెగిన యాటల తలలతో, కారిన రక్తంతో దేవతకు అభిషేకం చేస్తారు. స్త్రీలకు అమ్మవారు పూనుతుంది. జోస్యాలు, వరాలు, దీవెనలతో పాటు పూటుగా త్రాగిన స్త్రీ పురుషుల కొట్లాటలతో జాతర ఘనంగా ముగుస్తుంది.


వీరి ప్రధాన వృత్తి పూలు, పండ్లు, కూరగాయల్ని తోపుడు బండ్లలో పెట్టి అమ్ముకోవడం. పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా కష్టంచేసి డబ్బులు సంపాదిస్తారు. వీరి స్త్రీలకు స్వాతంత్య్రం ఎక్కువ. తమలో తాము గాని, పరాయివారితోగాని తన్నులాటలు, కొట్లాటలు వస్తే పురుషుల కన్నా స్త్రీలే సివంగులుగా మారుతారు. ప్రస్తుతం చిక్కడపల్లి కూరగాయల మార్కెట్టులో వీరిని చూడవచ్చు. వీరితో కొసరి కొసరి బేరం చేయటానికి చాలామంది భయపడతారు.
1989లో ఒకానొక కాళరాత్రి షక్కర్‍ గంజ్‍లోని పార్థీవాడపై దాడి జరిగాక, గృహ దహనాలు జరిగినాక పిట్టలోళ్ళందరూ దిక్కులేని పక్షుల్లా ప్టుకొకరు, చెట్టుకొకరుగా చెదిరిపోయారు.


ఈ పార్థీవాడను దాటి సీదా ప్రయాణిస్తే గాజీబండ వస్తుంది. ఇక్కడ ‘‘షారాజు ఖత్తాల్‍’’ దర్గా చక్కటి చమన్‍ మధ్యలో ఉంది. ఆఖరి కుతుబ్‍ షాహీ నవాబు ‘‘అబుల్‍ హసన్‍ తానాషా’’ జీవితం ఈ దర్గాతో ముడిపడి ఉంది. ఈ కహానీ కూడా తెలుసుకుందాం.
ఆరవ కుతుబ్‍ షా హీ నవాబు రాజ్యం ఏలుతున్నప్పుడు ఆయన మూడవ కూతురి వివాహం పెళ్లిపీటల మీదనే తప్పి పోయింది. నవాబు చింతాక్రాంతుడైనాడు. మౌల్వీలందరూ సమీప రక్త బంధువైన అబుల్‍ హసన్‍ పేరును సూచించారు. నవాబు గారి బేగం సాహెబా కూడా అనుకున్న సమయానికి బేటీ నిఖా జరగాలన్న ఆదుర్దాతో అబుల్‍ హసన్‍ను అల్లుడిగా ఒప్పుకుంది.


ఇంతకీ ఎవరీ అబుల్‍ హసన్‍?
ఇతను కౌమార ప్రాయంలోనే సిద్ధార్థుడిలా అన్నింటినీ పరిత్యజించి గాజీబండలోని ‘‘షారాజు ఖత్తాల్‍’’ ‘‘బార్గా’’కు వెళ్లిపోయి అతని చరణ సన్నిధిలో ఒక ఫకీర్‍గా జీవిస్తున్నాడు. బార్గా అంటే ఇస్లాం మత గురువులు నివసించే ఆశ్రమం, దర్గా అంటే వారు చనిపోయిన తర్వాత నిర్మించిన సమాధి. ఆ వలీకి (బోధ గురువు) షాగిర్ద్గా (ప్రియశిష్యుడు) మారినాడు. అబుల్‍ హసన్‍ గంటల తరబడే కాదు రోజుల తరబడి తను సృష్టించుకున్న మనోవల్మీకపు ఏకాంత ధ్యానంలోని నిశ్శబ్దంలో మునిగి తేలుతుండేవాడు. దానిని గమనించిన గురువు సంతసించి అతనికి ‘‘తానాషా’’ అన్న బిరుదును ప్రసాదించాడు. తానాషా అంటే బాలయోగి అని అర్థం. అట్లా పన్నెండు సంవత్సరాలు గడిచాక ఒకరోజు ఆ గురువు తన శిష్యుడిని పిలిచి ఈ రోజు నీ చేతులకు మెహందీ పెట్టుతానని స్నానం చేసి సిద్ధంకమ్మని ఆదేశించాడు. తానాషా ఆశ్చర్యపోయి పెళ్లికొడుకు పెట్టుకోవాల్సిన మెహందీ తనకెందుకని ప్రశ్నించాడు. నీకు కాబోయే భార్యకు గోల్కొండ కోటలో మెహందీ పెడుతున్నారు. నీవు కూడా పెళ్లి కొడుకుగా మెహందీ పెట్టుకుని సిద్ధం కమ్మని వలీ ఆజ్ఞాపించాడు. ఇంతలోనే ఆశ్రమంలోకి పెళ్లి పల్లకీతో ‘‘బారాత్‍’’ వచ్చేసింది. అట్లా అబుల్‍ హసన్‍ తానీషా గోల్కొండ రాజ్యానికి 1672లో అల్లుడైనాడు. ఒక సన్యాసి సంసారిగా మారిన కథ అది.
ఆ కాలంనాటి ‘‘మహానామా’’ ‘‘గుల్జారే ఆసఫియా’’ అన్న గ్రంథాలలో ఈ పెళ్లి సంగతులన్నీ ఉన్నాయి. అబుల్‍ హసన్‍ అదృష్టం అంతటితో ఆగలేదు. నాటకీయ పరిణామాల మధ్య చివరికి గోల్కొండ సామ్రాజ్యానికి ఏడవ నవాబు కూడా ఐనాడు. మహామంత్రి మాదన్న, పేష్కారు అక్కన్నల సహాయ, సహకారాలతో 15 సం।।లు నిరంధిగా రాజ్యమేలాడు. చరిత్ర రథచక్రాలు వడివడిగా ముందుకు సాగి 1687లో ఔరంగజేబు నిరంతర దండయాత్రల వలన గోల్కొండ రాజ్యలక్ష్మి మొగల్‍ చక్రవర్తుల వశమయ్యింది.


‘‘తామరాకు మీద నీటిబొట్టు’’లా జీవించే తానాషాకు ఆ అపజయం ఎటువంటి బాధ కల్గించలేదు. ఒక దుర్దిన ఉదయాన రోహిల్లాఖాన్‍ నేతృత్వంలో మొగల్‍ సైనికులు నవాబును బంధించటానికి గోల్కొండ కోట లోపలికి ప్రవేశించాయి. వార్త తెలిసిన నవాబు రాణీ వాసానికి వెళ్లి అందరికి వీడ్కొలు చెప్పి వారి అల్విదాలు, ఆఖ్రీ సలాములు స్వీకరించినాడు. ఆ తర్వాత సర్వాంగ భూషితుడై రత్నఖచిత సింహాసనంలో ఆసీనుడై శత్రు సైనికులను తన దర్బారులోకి అనుమతించాడు. రోహిల్లాఖాన్‍ తన బృందంతో ప్రవేశించి వినయంగా క్రిందికి తలవంచి మూడుసార్లు సాంప్రదాయికంగా సలాములు సమర్పించాడు. ఇంతలో ఒక సేవకుడు వచ్చి ‘‘నాష్తా కోసం దస్తర్‍ ఖానా’’ సిద్ధంగా ఉందని ప్రభువుకు విన్నవించాడు. నవాబు శత్రు సైనికులను తన అతిథులుగా నాష్తాకు ఆహ్వానించాడు. ఆందోళనకరమైన పరిస్థితిలో కూడా ఏ మాత్రం కలవరానికి గురికాని తానాషా స్థితప్రజ్ఞతకు ఆసైనికులు ఆశ్చర్యానికి గురైనారు. రోహిల్లాఖాన్‍ తప్ప అందరూ నాష్తా చేసారు.
అనంతరం సైనికులు తోడురాగా అళ్వారూఢుడై కోట ఇవతలికి వచ్చి అక్కడ నిరీక్షిస్తున్న మొగల్‍ రాకుమారుడు షా ఆలం బహద్దూర్‍ మెడలో తను ధరించిన వజ్రాల హారాన్ని తీసి అతనికి వేసాడు. ఆ రాకుమారుడు సగౌరవంగా తానీషాను చార్మినార్‍ వద్ద మకాం చేసిన చక్రవర్తి ఔరంగజేబు దగ్గరికి తీసుకెళ్లాడు. షహెన్‍షా తానాషాను సాదరంగా ఆహ్వానించి మూడు రోజుల విడిది అనంతరం బీదర్‍కు తన వెంట పట్టుకపోయాడు. బీదర్‍ కోట హైద్రాబాద్‍కు దగ్గర కావున దూరాన ఉన్న దౌల్తాబాద్‍ కోటకు తరలించి అక్కడే శాశ్వతంగా బంధించాడు. ప్రతి సంవత్సరం యాభైవేల వార్షిక బృతిని కూడా ఏర్పాటు చేసారు. తానాషా ఖైదులో తన కుటుంబంతో సహా జీవించాడు. అక్కడ అతనికి ‘‘ఖుదాబందా’’ అన్న కొడుకు జన్మించాడు. అక్కడి ప్రజలు ఆ బాలుడికి ‘‘బందీ సుల్తాన్‍’’ అని పేరుపెట్టారు. కొంతకాలం తర్వాత ఔరంగజేబు కుటిల రాజనీతి దృష్టితో ఆ బాలుడిని మాయం చేశాడు.
తానాషా ఖైదులో కవిత్వం అల్లుకుంటూ, చేతిలో తస్బీహాని (జపమాల) తిప్పుకుంటూ నిరంతర అల్లా చింతనలో ఉంటూ 15 సంవత్సరాలు జీవించి చివరికి తన 75వ ఏట 1703లో అల్లాకు ప్రియతముడైనాడు. మరో నాలుగు సం।।లకు 1707లో ఔరంగజేబు కూడా పరలోక గతుడైనాడు. ‘‘తారీఖే కుతుబియా’’ అన్న చరిత్ర గ్రంధంలో ఈ విషాదాంతాన్ని మనం చదవవచ్చు.
బహుషా ఔరంగాజేబు, తానాషాలిద్దరూ తమ మరణానంతరం జన్నత్‍లోని (స్వర్గం) జమ్‍జమ్‍ (పవిత్ర స్నానఘట్టం) వద్ద కలుసుకుని చిర్నవ్వులతో పరస్పర అభివాదాలను చేసుకుని ఇలా అనుకున్నారేమో!
‘తుమ్హారీ భీ జైజై
హమ్హారీ భీ జైజై
న తుమ్‍ హారే
న హమ్‍ హారే’’
మీకూ జయము జయము
నాకూ జయము జయము
మీరూ ఓడిపోలేదు
నేనూ ఓడిపోలేదు


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *