ఈశ్వరీబాయి గారి జీవిత విశేషాలు వింటుంటే, ఒకనాడు భర్తృహరి చెప్పిన సుభాషితం గుర్తొస్తుంది. ఒకటి నేలను నొకటి నొప్పారు పూసెజ్జపై ఒకటో శాకమువారణించు, ఒకటి ఊత్కృష్ణ శాల్యోదనం, ఒకటి బొంత ధరించు – ఇలా చెప్పి, కార్యసాధకుడు దుఃఖాన్ని సుఖాన్ని లెక్కపెట్టడు. అతని లక్ష్యం కార్యసాధన మాత్రమే. ఇది ఈశ్వరీబాయి గారిపట్ల సార్థకమైందని చెప్పాలి.
ఈశ్వరీబాయిగారి జీవిత చరిత్ర రాసిన ఎం.ఎల్. నరసింహారావుగారు ‘‘సాహమూర్తి జె. ఈశ్వరీబాయి’’ అన్నారు. ‘‘ఎక్కడ ఏ మూల ఏ అన్యాయం జరిగినా పలు వేదికలపై నుండి సుమారు అర్ధశతాబ్ది క్రితం వాటిని ప్రభుత్వ దృష్టికి తెచ్చి పరిష్కారాలు డిమాండు చేసిన ఏకైక ‘‘యాంగ్రీయంగ్ ఉమెన్ లీడర్’’ జె. ఈశ్వరీబాయి అన్న సుప్రసిద్ధ సీనియర్ జర్నలిస్టు టి. ఉడయవర్లు గారు ఈశ్వరీబాయి ఒక వాక్చిత్రం అన్నారు. ఇవన్నీ ఈశ్వరీబాయి వ్యక్తిత్వంలోని విశిష్టతను చాటి చెబుతాయి. 1918లో డిసెంబరు ఒకటవ తారీఖున ఈశ్వరీబాయి సికింద్రాబాద్‍లో ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. తండ్రి బలరామస్వామి సికింద్రాబాద్ చిలకలగూడలో వుంటూ, రైల్వే ఉద్యోగిగా జీవితం సాగించాడు. తల్లి రాములమ్మ.
ఈశ్వరీబాయి విద్యాభ్యాసం ఎస్.పి.జి. మిషన్ పాఠశాలలో తర్వాత కీస్ హైస్కూలులో సాగింది. ఈశ్వరీబాయిది బాల్యవివాహం. పదమూడేళ్ళకే వివాహమయింది. భర్త దంత వైద్యుడు జె. లక్ష్మీనారాయణ. వారికి ఒక కూతురు గీతారెడ్డి. ఈమె వైద్యురాలు, రాజకీయవేత్త. ఈశ్వరీబాయి వైవాహిక జీవితం విచ్ఛిన్నమయినా కృంగి పోలేదు. ఆత్మస్థైర్యంతో జీవితాన్ని ఎదుర్కోవాలని నిశ్చయించింది. సికింద్రాబాద్‍లో ఒక పాఠశాల దాన్ని సీతమ్మ పాఠశాల అనేవారు. ఆర్య సమాజ నాయకుడు శ్యామలరావుగారు వారి తల్లి పేరున పెట్టిన పాఠశాల అది. ఈశ్వరీబాయి అందులో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. సంపన్నుల కుటుంబాలలోని పిల్లలకు ట్యూషన్లు చెప్పారు. ఈశ్వరీబాయి బహు భాషా కోవిదురాలు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ భాషలు వచ్చు.
ఈశ్వరీబాయి జీవితంలో గొప్ప మలుపు, సాంఘిక దురాచారలతో అణగారిపోతున్న వారిని ఆదుకోవాలనే సంకల్పమే. అదే సమయంలో, ఆమెపై గాంధీ, అంబేద్కర్‍ల ప్రభావం పడింది. ఆ ప్రభావం ఈశ్వరీబాయి జీవితాన్ని అభ్యుదయ మార్గంవైపు నడిపించింది.
అంబేద్కర్ ఉపన్యాసాలు ఈశ్వరీబాయి మనసుపై ముద్రవేశాయి. దళిత జాతుల సముద్ధరణకి కృషి చేయాలని బద్ధకంకణులయ్యారు. అంబేద్కర్ చేసిన పోరాటాలు దళిత హక్కుల విషయంలలోనూ, భారత రాజ్యాంగ రచనలోని ఆయన అభిప్రాయాలు ఈశ్వరీబాయిలో గొప్ప ప్రేరణ కలిగించాయి.
అంబేద్కర్ ఉపన్యాసం ఒకటి ఈశ్వరీబాయిలో గొప్ప చైతన్యాన్ని కలిగించింది. ‘‘నేను ఏ జాతిలో జన్మించి పెద్దవాడినై, జీవనయాత్ర సాగిస్తున్నానో, ఆ దళిత ప్రజల సంక్షేమానికి, అభ్యున్నతికి నా జీవితం ధారపోస్తాను. నా ఈ న్యాయ సమ్మతమైన మార్గం నుంచి నన్ను యే దుష్టశక్తులు, ఏ విమర్శలూ మళ్ళించలేవు. నన్ను ఒక్క అంగుళం కూడా కదల్చలేరు’’ అని అంబేద్కర్ అన్న మాటలు ఈశ్వరీబాయి జీవితానికి ఆదర్శప్రాయమయ్యాయి.
ఈశ్వరీబాయి రాజకీయ జీవితంవైపు అడుగులు వేసి, ముందు తరాలకి ఒక బాట వేశారు. భారతదేశంలోని బలహీన వర్గాలు, అట్టడుగున పడివున్న పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయాల్లో ప్రవేశించారు. సమాజంలోని హెచ్చు తగ్గులు, దారిద్య్రం, మూఢ నమ్మకాలు, ఛాందస ఆచారాలు చూస్తున్న ఆమెకు చాలా ఆవేదన కలిగేది. ఒకనాటి మహనీయులైన సంఘ సంస్కర్తల ఆశయాలు, ఆదర్శాలు సఫలమవ్వాలని ఆమె ఆశించేవారు.
ఈశ్వరీబాయి చిలకలగూడ వార్డు (సీతాఫల్‍మండి) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు రాజకీయాలలో ప్రవేశం అదే మొదలు. ఆమెకు ఏ బలమూలేదు గెలవడానికి ఒక్క ఆత్మబలం తప్ప. పురపాలక సంఘ సభ్యురాలిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తూ, ఇంటింటికి తిరిగి ఓట్లు వేయమని కోరాఉ. మురికివాడల్లో, దళిత వర్గాలు కార్మికులు నివసించే వీధుల్లో ఆమె తిరిగి అందరినీ కలిశారు.
ఈశ్వరీబాయి గెలుపు ఆమె జీవితంలోనే పెద్ద గెలుపైంది. రాజకీయాల్లో అది తొలి అడుగే అయినా, నిజాయితీతో, సేవా భావంతో దళిత ప్రజల విముక్తి పోరాటానికి ఆమె బద్దకంకణురాలయ్యారు. ఆ దీక్షతోనే ఆమె ప్రజాసేవా రంగంలో అడుగుపెట్టారు. ఈశ్వరీబాయి పురపాలక సంఘ సభ్యురాలై నగర పురోభివృద్ధికి కృషి చేయడమేకాక ఎన్నో సంస్థలలో సభ్యురాలై, సేవా కార్యక్రమాలు చాలా చేశారు. మురికివాడల్లో మంచినీటి నల్లాలు వేయించటం, వీధి దీపాలు పెట్టించటం, పొట్టకూటికై నగరానికొచ్చిన బీదలకు ఇళ్ళ స్థలాలు ఇప్పించటం మొదలైన సేవా కార్యక్రమాలు బాధ్యతగా జరిపించారు.
ఆనాటి పెద్దలు అనుభవజ్ఞులు అయిన మాడపాటి హనుమంత రావుగారు, వేంకటరామరెడ్డిగారు, సీతయ్య గుప్తా గారు మొదలైన మహనీయులను ఘటిస్తూ, వారి నుంచి ఎన్నో ఆదర్శప్రాయమైన అంశాలు తెలుసుకునేవారు.
ప్రముఖ నగరాలైన బొంబాయి, నాగపూర్‍లో జరిగే షెడ్యూలు కులాల ఫెడరేషన్ సభలలో పాల్గొని, అంబేద్కర్ ఆశయసిద్ధికై కృషి చేయాలనే పట్టుదల వుండాలని ఆమె ప్రచారం చేసేవారు. 1967లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆమె బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచి, వారి న్యాయమైన కోర్కెలకై పోరాడుతానని వారికి ధైర్యమివ్వటమే ఆమె గెలుపుకి కారణం.
ఈశ్వరీబాయి వ్యక్తిత్వం మహోన్నతమైంది. అందరి సమస్యలు, బాధలు తనవిగా భావించే సహృదయురాలు. పరిపాలనా సంస్కరణల సందర్భంగా ఈశ్వరీబాయి తన అభిప్రాయాలు నిర్భయంగా చెప్పేవారు. ‘‘ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, దరఖాస్తులు, ఫిర్యాదులు కనీసం అవి అందినట్టు జవాబైనా పంపించే నాథుడు లేడు అంటే ఉద్యోగబృందం యొక్క నిర్లక్షవైఖరి తేటతెల్లమవుతోంది. సాధారణ పౌరుడికి అందుబాటులో వుండే వ్యవస్థ కావాలి. నియమ నిబంధనలు సులభతరం చేయాలి. ప్రభుత్వం రూపొందించే నియమాలు నిబంధనలు ప్రజోపయోగమునకుకాని, ప్రజలను బంధించడానికి తప్పులు పట్టడానికి కాదనే సత్యాన్ని బ్యూరోక్రసీ గుర్తించాలని నేను కోరుతున్నాను.’’ (సాహసమూర్తి, జె. ఈశ్వరీబాయి – ఎం.ఎల్. నరసింహారావు).
విద్యారంగంపై దృష్టి సారించారు. విద్య ఒక వ్యాపారంగా మారిపోయిందని, పేదవారికి డొనేషన్లు కట్టే స్థితిలేక, ప్రభుత్వ పాఠశాలల్లో, భోధనాపద్ధతి బాగాలేకున్న, అక్కడే చేరుస్తున్నారని పిల్లలతరపు ఆవేదన వ్యక్తం చేసేవారు. భూ సంస్కరణ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు ఈశ్వరీబాయి. ‘అభ్యుదయ వాదులు, ప్రగతిశీలురమని చెప్పుకునే నాయకులు తమ ప్రగతిశీల భావాలను మాటల్లోకాక చేతల్లో చూపాలి’’ అన్నారు.
మహిళా సంక్షేమం గురించి చాలాసార్లు శాసనసభల్లో మాట్లాడారు. మహిళా సంక్షేమ శాఖలో జరిగే అక్రమాలను నిరభ్యంతరంగా విమర్శించేవారు. గ్రామ సేవకుల ఉద్యోగాలను పర్మినెంటు చెయ్యాలని, సీనియారిటీ తెలిపే రికార్డులు, ఉద్యోగ సర్వీసు పుస్తకాలు సరిగాలేవని, ‘‘డైరెక్టర్‍గారి దయాదాక్షిణ్యాల మీద యావత్ సిబ్బంది ఆధారపడివుండడం అత్యంత సోచనీయమన్నారు. షెడ్యూలు కులాల విద్యార్థుల వసతి గృహాలు సరిగా నడవటం లేదని గుర్తించారు. ‘అధికార పార్టీకి చెందిన వారినే ఈ వసతి గృహాల నిర్వాహకులుగా నియమించటం జరుగుతోదని, నిజాయితీ సేవా భావంతో పనిచేసేవారిని మేనేజర్లుగా నియమించాలని, అప్పుడే ప్రభుత్వ పథకాలు విజయవంతం అవుతాయమన్నారు.
ఈశ్వరీబాయి తెలంగాణా ఉద్యమాన్ని బలపరిచి తెలంగాణా ప్రజాసమితి కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. ఈశ్వరీబాయి గొప్ప వక్త. గొప్ప కార్యదక్షురాలు. సేవాతత్పరత, పేదలపాలిట కల్పవల్లి అని పలువురిచే అభినందనలు పొందారు. ఈశ్వరీబాయి ఒక ఉద్యమం, ఒక శక్తి. ఒక చైతన్య జ్యోతి. నిరుపేదలు, షెడ్యూల్డు కులాల ప్రజల ఏకైక ప్రతినిధి. మహానాయకురాలు అని ప్రజలచే కీర్తించబడ్డారు.
ఆంధప్రదేశ్ శాసనసభలో జె. ఈశ్వరీబాయి ప్రసంగాలు అనే పుస్తకంలో 29 ప్రసంగాలున్నాయి. ప్రసంగానికి ఆ ప్రసంగమే ప్రత్యేకమైంది. ఈ ప్రసంగాలు ఈ తరానికి కానుకగా అందిస్తున్నామని, ఇది శాసనసభ్యులకు స్ఫూర్తివంతంగా ఉంటుందని ఆశించారు. సీనియర్ జర్నలిస్టు ఉడయవర్లుగారు.
విశ్వమానవ శ్రేయస్సును కాంక్షించిన మానవతావాది ఈశ్వరీబాయి అనగల్గడం అక్షరసత్యం.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-డా।। ముక్తేవి భారతి