కషాయం కాచుకునేదెలా?

పశువుల పాలు, తేయాకుతో టీ, కాఫీ కాచుకొని తాగడం కన్నా.. ఔషధ మొక్కల ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగటం ఆరోగ్యదాయకం.
కషాయాలను మొక్కల ఆకులతో తయారు చేసుకుంటుంటాం. గుప్పెడు ఆకులను లేదా నాలుగైదు ఆకులను తీసుకోవాలి. వాటిని 150-200 ఎం.ఎల్‍. నీటిలో వేసి 3-4 నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ కషాయాన్ని వడకట్టి తాగాలి. వేడిగా తాగొచ్చు లేదా చల్లారినాక తాగొచ్చు. అయితే, విధిగా పరగడుపున, సాయంత్రం వేళల్లో కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తాగాలి! అంతేకాదు.. రాగి పాత్రలోని లేదా రాగి రేకు ఉంచి శుద్ధి చేసిన నీటిని మాత్రమే కషాయం కాయడానికి వాడాలి!
లెమన్‍ గ్రాస్తో ఒక వారం, పుదీన ఆకులతో ఒకవారం, తులసి ఆకులతో ఒక వారం, అరికల పొట్టుతో ఒక వారం హెర్బల్‍ టీ తయారు చేసుకొని తాగటం ఆరోగ్యదాయకం. గోంగూర ఆకులతో కషాయం మహిళల ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
కొత్తిమీరతో ఒక వారం ఇంట్లోనే హెర్బల్‍ టీ తయారు చేసుకొని.. వడకట్టుకొని తాటి బెల్లం పానకం కలుపుకొని తాగటం మేలు.
ఇలా తయారు చేసుకున్న హెర్బల్‍ టీలో.. పాలు, పంచదార, బెల్లం, తేనె కలపకుండా… తాటి బెల్లం పానకం కలుపుకొని తాగడం ఆరోగ్యదాయకం.
అరిక (kodo_millet)ల పొట్టుతో మిల్లెట్‍ టీ తయారు చేసుకొని తాగడం ఎంతో ఆరోగ్యదాయకం. అరిక ధాన్యాన్ని మిక్సీ / మర పట్టి అరిక బియ్యం తయాలు చేసిన తర్వాత వచ్చే పొట్టులోనూ ఆరోగ్యదాయకమైన పోషకాలున్నాయి. ఈ పొట్టును తేయాకు మాదిరిగా నీటిలో మరిగించి.. వడకట్టుకొని.. తాటి బెల్లం పానకాన్ని తగుమాత్రంగా కలుపుకొని తేనీరు / కాఫీకి బదులుగా వాడుకోవడం ఉత్తమం.


రోగనిరోధక శక్తికి 28 రోజులు సప్త పత్ర కషాయాలు
1.గరిక, 2. తులసి, 3. తిప్పతీగ, 4. మారేడు, 5. కానుగ, 6. వేప, 7. రావి. ఈ 7 ఆకుల కషాయాలను ఇదే వరుసలో ఒక్కొక్కటి 4 రోజుల చొప్పున 28 రోజులు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏడాది వరకు చీటికి మాటికి జలుబులు, జ్వరాలు రావు.
దేశీ ఆహారం.. సంపూర్ణ ఆరోగ్యం
సిరిధాన్యాలు కషాయాలు

నిజమైన, సరైన ఆహారం తింటూ, కషాయాలు తాగుతూ, నడుస్తూ ఉంటే మనుషులు రోగగ్రస్తులు కారు. సరైన ఆహారం తినటం ప్రారంభిస్తే ఉన్న రోగాలూ కొద్ది వారాల్లోనే ఉపశమించి, 6 నెలల నుంచి రెండేళ్లలోపు పూర్తిగా తగ్గిపోతాయి, అవి ఎంతటి మొండి / భయానక రోగాలైనా సరే.
ఆహారం సరైనది కాకపోతే ఏ ఔషధమూ పనిచేయదు. ఆహారం సరైనదైతే ఏ ఔషధమూ అవసరం లేదు, రాదు. ఎంతటి భీకర రోగం ఉన్న వారికైనా సిరిధాన్యాలు, కషాయాలే సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే అపురూపమైన దేశీ ఆహారం. సిరిధాన్యాలు, కషాయాలు, నడకతోపాటు హెరీమియో లేదా ఆయుర్వేద ఔషధాలు సంపూర్ణ ఆరోగ్యానికి సోపానాలు.
ఇవి ఎవరికైనా ఆరోగ్యదాయకమైనవి, ఆచరణయోగ్యమైనవి మాత్రమే కాదు, అన్నిటికీ మించి పర్యావరణ హితమైనవి కూడా. ఏ రోజైనా ఒకే రకం సిరిధాన్యం తినాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అదే రకాన్ని తినాలి. కొన్ని రకాలను కలిపి గానీ, ఉదయం ఒక రకం, సాయంత్రం ఒక రకం గానీ తినకూడదు.
కషాయాలను ఉదయం పరగడుపున, సాయంత్రం వేళల్లో తాగాలి. తాగాలనిపిస్తే మధ్యలోనూ తాగవచ్చు. వారానికి మించి ఏ కషాయాన్నీ తాగవద్దు. ఒకే రకం కషాయం వారాల తరబడి తాగకూడదు. అలా చేస్తే ఆ కషాయం కూడా కాఫీ / టీ / మద్యం / గుట్కా మాదిరిగా చెడు అలవాటుగా మారుతుంది.
రోజుకు గంట గంటన్నర సేపు నడవటం తప్పనిసరి. నెమ్మదిగానైనా నడవండి. వేగం ముఖ్యం కాదు. ఎంత సేపు నడిచామన్నది ముఖ్యం. ఉదయం కొంత సేపు, సాయంత్రం కొంత సేపు నడవండి. సూర్యాస్తమయం, సూర్యోదయం వేళల్లో నడిస్తే మంచిది. అప్పుడు వీలుకాకపోతే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే నడవండి. వయసు పెరుగుతున్నకొద్దీ మరింత ఎక్కువ సమయం సడకకు కేటాయించడం ఆరోగ్యదాయకం.


ఆకలైతేనే తినండి. మూడు పూటలూ తినాల్సిందేనని ఆకలి లేకపోయినా తినొద్దు. దాహాన్ని బట్టి నీరు తాగండి. ఇన్ని లీటర్లు తాగాల్సిందే అనుకోకండి. అన్నం తిన్న కొద్ది సేపటికైనా, ముందైనా దాహం వేస్తే దాహం తీరే వరకు తాగండి. పనిగట్టుకొని ఎక్కువ, తక్కువ తాగకండి.
పాలు తాగటం పిల్లలు / పెద్దలు / వృద్ధులు అందరూ మానెయ్యాలి. వారానికి ఒక నువ్వుల లడ్డు తింటే చాలు.. కాల్షియం లోపం రానేరాదు. మధుమేహం ఉన్నవారైతే.. నువ్వులను దోరగా వేయించి పెట్టుకొని వారానికి ఒకసారి రెండు, మూడు చెంచాలు తినండి. అంతకన్నా ఎక్కువ తినాల్సిన అవసరం ఎట్టిపరిస్థితుల్లోనూ లేదు.
పశువుల పాల వల్ల ఆడ, మగ, పిల్లలు, పెద్దలు అందరిలోనూ హార్మోన్‍ అసమతుల్యత వస్తుంది. కేవలం ఈ పాల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. పశువుల పాలకు బదులు.. నువ్వులు, సజ్జలు, కుసుమలు, పచ్చి కొబ్బరితో పాలు తయారు చేసుకొని తాగండి. పెరుగు, మజ్జిగ చేసుకొని తాగండి. ఈ పాలను నేరుగా గిన్నెలో పోసి పొయ్యి మీద మరగ పెట్టకండి. పశువుల పాలలో మాదిరిగా కొవ్వు ఉండదు కాబట్టి ఇరిగిపోతాయి. ఒక పాత్రలో నీరు పోసి.. ఈ పాలున్న గిన్నెను ఆ నీళ్లలో పెట్టి వేడిచేయండి. గోరు వెచ్చగా తాగండి లేదా తోడెయ్యండి.


మనం శుద్ధమైన నీటిని, రచనాత్మక (స్ట్రక్చర్‍) నీటిని తాగుతున్నామా?

మనలో చాలా మంది ఆర్‍.ఓ. ఫిల్టర్‍ నీటిని తాగుతున్నాం, వంటకు వాడుతున్నాం. కానీ, ఈ నీరు శుద్ధమైనదేనా అన్నది ప్రశ్న. డాక్టర్‍ ఖాదర్‍ వలి చెబుతున్నదేమంటే… మన ఫిల్టర్లు నీటిలోని బ్యాక్టీరియాను, వైరస్‍ను. ప్లాస్టిక్‍ నానో కణాలను తొలగించటం లేదు. కాబట్టి ఆర్‍.ఓ. నీరు సురక్షితమైనవి కావు. ప్లాస్టిక్‍ నానో కణాలు నీటి ద్వారా కడుపులోకి వెళ్లి చిన్న పేగుల్లో గోడలకు అంటుకుంటున్నాయి. ఇలా అంటుకోవడం ద్వారా ఆహారం ద్వారా మనం తీసుకుంటున్న సూక్ష్మపోషకాలు మన దేహానికి అందుకుండా వృథాగా బయటకు వెళ్లిపోతున్నాయి. కాబట్టి, బాక్టీరియా, వైరస్‍ల దాడి నుంచి… పౌష్టికాహార లోపం నుంచి బయటపడాలనుకుంటే మనం తాగే, వంటకు వాడే నీటిని కూడా సరైన పద్ధతిలో శుద్ధి చేసుకోవాలి.


ఎలా?
శుద్ధమైన నీటిని పొందడానికి రాగి బిందెలో నీరు లేదా 4 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల పొడవు ఉన్న రాగి రేకును ఉంచిన స్టీలు బిందెలో లేదా మట్టి కుండలో నీరు తాగాలి. నీటిలోని ప్లాస్టిక్‍ కణాలతోపాటు వైరస్‍, బాక్టీరియాలు రాగి బిందె లేదా రాగి రేకులకు అంటుకుంటాయి. అందువల్లనే, రాగి బిందె అయినా, రాగి రేకు అయినా ప్రతి రోజూ చింతపండు+ఉప్పు లేదా నిమ్మ తొక్క/ రసం+ఉప్పుతో అర నిమిషంలో శుభ్రం చేసుకొని, తిరిగి ఉపయోగించుకోవాలి.
స్టీలు బిందె లేదా మట్టి కుండలోని నీటిలో రాగి రేకును కనీసం 8 గంటలు ఉంచిన తర్వాత ఆ నీటిని వాడుకోవచ్చు. రాత్రి బిందెలో పెట్టిన రాగి రేకును ఉదయం తీసివేసి ఆ నీటిని వాడుకోవచ్చు. ఉదయం రాగి రేకును శుభ్రం చేసి, తిరిగి మరో బిందెలో పెట్టి, సాయంత్రం తీసివేసి ఆ నీటిని వాడుకోవచ్చు.


-డా।। ఖాదర్‍ వలి
ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త,
ఆరోగ్య, ఆహార నిపుణులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *