- తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
- ఈ ఏడాది (2022-23) నుంచి ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన భావితరాలకు ఉజ్వల పునాది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగాలనేది ప్రజల చిరకాల వాంఛ. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం హర్షణీయం. ఈ విద్యాసంవత్సరం (2022-23) నుంచి ఇది అమలవుతుంది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల, ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల్లోని పేదల పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రజలు ఆనందపడుతున్నారు.
నాడు ప్రైవేటు బడుల్లో పిల్లల్ని చదివించడం ఆర్థిక భారంతో కూడుకున్నది. సంపాదనలో సగం పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమ ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం లేదని ఐదేండ్ల కిందట మూతపడింది. దీంతో అక్కడున్న ఉపాధ్యాయులు పక్క పాఠశాలకు డిప్యుటేషన్‍పై వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల అక్కడి తల్లిదండ్రులు ఏకమై కేటీఆర్ చొరవతో తమ పాఠశాలను తిరిగి తెరిపించారు. ఆంగ్ల మాధ్యమం అనుమతి కోసం విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు. ఆంగ్ల మాధ్యమం పట్ల తల్లిదండ్రుల్లో ఉన్న విశ్వాసానికి ఈ ఉదంతం చక్కటి నిదర్శనం.
ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసనం సులువు అవుతుంది. ఆంగ్లంలో చదువని విద్యార్థులు ఆత్మన్యూనతకు గురవుతారు. అవకాశాలను అందిపుచ్చుకోలేక పోతారు. పాఠశాల దశ నుంచే ఆంగ్లంలో చదివిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై రాణించడానికి అవకాశం ఉన్నది. ప్రైవేట్, కార్పొరేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. నేటి ఆధునిక, సాంకేతిక యుగంలో విషయ అవగాహనకు మెరుగైన మెటీరియల్ ఆంగ్లంలోనే లభ్యమవుతుంది. దీంతో తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వారిని ఆంగ్లంలో చదివించాలని తల్లిదండ్రులు తపన పడుతున్నారు. ఈ నేపథ్యంలోంచే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే చారిత్రక నిర్ణయం తీసుకున్నది.
పునాది స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల తెలంగాణ యువత మేలిమి మానవ వనరుగా తయారవుతుంది. జాతీయ, అంతర్జాతీయ అవకాశాలను మరింత ఎక్కువగా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. దశాబ్దాలుగా ఆధునిక చదువులకు నోచుకోలేక ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనుకబడిన తెలంగాణ ప్రాంత ప్రజల జీవనంలో ఆంగ్ల మాధ్యమంతో నూతన శకం ఆరంభమవుతుందనటంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన విద్య అందించేందుకు ఈ నిర్ణయం ఎంతో తోడ్పడుతుంది. ఇప్పటికే గురుకులాల్లో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందిస్తున్నారు. ప్రాథమికస్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే, కేజీ టు పీజీ ఉచిత నాణ్యమైన విద్య సాకారమయ్యే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ‘మన ఊరు- మన బడి’ పేరిట రూ.7,289 కోట్లతో ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిది. అందుకోసం పైలట్ ప్రాజెక్టుగా పనులు చేపట్టింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.3.57 కోట్లు వెచ్చించింది. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద 12 విభాగాలను ప్రభుత్వం గుర్తించింది. అందులో నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు – సిబ్బందికి సరిపోయే ఫర్నీచర్, పాఠశాలకు రంగులు, సున్నం వేసి అందంగా తీర్చిదిద్దటం, అన్నిరకాల మరమ్మతులు చేపట్టడం, ‘గ్రీన్ చాక్ బోర్డు’ల ఏర్పాటు, ప్రహరీ గోడల నిర్మాణం, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూముల నిర్మాణం చేపడుతారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్ ఏర్పాటు, డిజిటల్ విద్య అమలుచేయటానికి సకల హంగులను కల్పిస్తుంది. ‘మన ఊరు – మన బడి’ పథకంతో మన బడులలో మౌలిక వసతుల కల్పనతో ఆధునికత సంతరించుకోవడం తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయం. ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు తెలంగాణ అభివృద్ధి వికాసాల్లో నవశకం. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం పేదవాడి పేగు బంధమైన కేసీఆర్ కే సాధ్యం.
మౌలిక సదుపాయాలు తోడైతేనే…
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు మౌలిక సదుపాయాలూ తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలిగే పరిస్థితి వస్తుంది. మౌలిక సదుపాయాలంటే ఎయిర్ కండీషన్ ఉన్న తరగతి గదులు కావాలని కాదు. ఈ దేశానికి అలాంటివి అస్సలు అవసరం లేదు. కావాల్సిందల్లా ప్రాథమిక అవసరాలను తీర్చగలిగేవి మాత్రమే. మంచి తరగతి గదులు, కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటివన్నమాట. వీటన్నింటికీ మించి నిబద్ధతతో పాఠాలు బోధించే మంచి ఉపాధ్యాయుల అవసరమూ ఎంతో ఉంది. పాఠ్యపుస్తకాల్లోనివి వల్లెవేసే వారు కాకుండా… పరిస రాలను అర్థం చేసుకుని కనీస జ్ఞానంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలను పిల్లలకు పరిచయం చేయగలిగిన వారు కావాలి. పాఠ్యపుస్తకాలు ఇతర టీచింగ్ మెటీరియల్ సరఫరా కూడా కీలకమే.
73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలు…
దేశంలో విద్యకు సంబంధించి గత 73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలే అమల్లో ఉన్నాయి. ధనికులకు ఇంగ్లిష్‍లో, పేదలకు ప్రాంతీయ భాషల్లో బోధన సాగుతూ వచ్చింది. ఇరు వర్గాల మధ్య సౌకర్యాల అంతరమూ చాలా ఎక్కువే. ఫలితంగా పేదవారు, గ్రామీణ విద్యార్థులు జీవితంలో అన్ని దశల్లోనూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవం తులుగా మారిస్తే… పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది.
ఆంగ్ల మాధ్యమం వల్ల ప్రయోజనాలు
చాలా మంది భారతీయ తల్లిదండ్రులకు, వారి పిల్లలకు ఆంగ్ల-మీడియం విద్యను సమానత్వంతో అందించడం ఒక కల. వారిలో చాలా మంది కష్టపడి తమ సంపాదనలో గణనీయమైన భాగాన్ని తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి వెచ్చిస్తారు. అయినప్పటికీ, పేదరికం కారణంగా, వారిలో చాలా మంది, ప్రత్యేకించి ఇ, బి, ఆ ఇ మరియు మైనారిటీల వంటి వెనుకబడిన వర్గాల వారు తమ ఆశయాన్ని సాధించలేకపోతున్నారు. లక్షలాది మంది తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు తమ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు-మీడియం విద్యను ప్రవేశపెట్టడం ప్రజాస్వామిక చర్య. తెలంగాణలో విద్యా అసమానతలను తగ్గించడంలో ఇది సాయపడుతుంది. కాబట్టి ఇది సమీకరణ ప్రభావాన్ని కూడా కలిగి ఉంది. ఉద్యోగ అవకాశం నేటి పోటీ సమాజంలో, ఎక్కువ కెరీర్ అవకాశాలను పొందేందుకు ఇంగ్లీష్ తెలుసుకోవడం తప్పనిసరి. ఇది ఆంగ్ల భాషా నైపుణ్యాలను పరీక్షించే చాలా ప్రైవేట్ కంపెనీల నియామక పక్రియలలో మాత్రమే కాకుండా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిటీ వంటి వివిధ ప్రభుత్వ రంగ ఉద్యోగాల ఎంపిక పక్రియలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరియు బ్యాంకింగ్, అన్నింటికీ ఆంగ్లంలో నైపుణ్యం అవసరం. 2016 కేంబ్రిడ్జ్ యూని వర్శిటీ సర్వే ప్రకారం ‘పనిలో ఆంగ్లం యొక్క శోధనలు: కార్యాలయంలో భాషా నైపుణ్యాల ప్రపంచ విశ్లేషణ,’ దాదాపు 90% మంది భారతీయ యజమానులు తమ కంపెనీకి ఆంగ్ల భాషా నైపుణ్యాలు కీలకమని నమ్ముతున్నారు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2019 యొక్క అన్వేషణల ప్రకారం, నేర్చుకునే చురుకుదనం మరియు అనుకూలతతో పాటుగా భారతదేశంలో యజమానులు కోరుకునే మొదటి మూడు నైపుణ్యాలలో ఇంగ్లీష్ ఒకటి. ఈ చొరవ ఫలితంగా, పిల్లలు వ్యాకరణం మరియు వాక్య నిర్మాణం, ఉచ్చారణ వంటి పునాదులను నేర్చుకుంటారు, ఇది భవిష్యత్తులో వారికి పోటీ ప్రయోజనాన్ని అందిస్తుంది.
తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన 2014 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంగ్ల మాధ్యమానికి సముచితమైన ప్రాధాన్యం ఇచ్చారు. సౌకర్యాలపరంగా, నాణ్యతా ప్రమాణాల పరంగా ఉత్తమస్థాయిలో ఉన్న వెయ్యికి పైగా ఇంగ్లిష్ మీడియం గురుకులాలను ప్రారంభించారు. ఇదే సమయంలో మాతృభాష ప్రాధాన్యం తగ్గకుండా, అన్ని విద్యాసంస్థల్లో తెలుగును తప్పనిసరి ద్వితీయ భాషగా చేశారు. ఈ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభా పాటవాలను చాటుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో కూడా ఇవేతరహా ఫలితాలొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వరంగంలో ఉన్న 41,337 పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం గొప్ప ముందడుగు. ప్రపంచీకరణ యుగంలో తెలంగాణ భవిష్యత్తు తరాలకు గ్లోబల్ భాషపై పట్టు ఉండటానికి, వారు ఎంచుకున్న రంగంలో వికాసం చెందటానికి ఈ చర్య దారితీస్తుంది.
విద్యను సేవా దృక్పథంతో అందిస్తామనే అభ్యర్థనతో ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటాయి. కానీ, ఆచరణలో 99 శాతం విద్యాసంస్థలు విద్యను సరుకుగా మార్చి వ్యాపారమయం చేశాయి. సామాన్య ప్రజల సంపాదనలో 50 శాతానికిపైగా ఈ సంస్థలు దోచుకుంటున్నాయి. దీన్ని నివారించ డానికి ‘జీవో 1, 1993 రూల్స్’ ఉన్నాయి. కేసీఆర్ తొలి క్యాబినెట్‍లో ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి ఈ జీవో నెంబర్ 1ని అమలుచేయడానికి, ఫీజుల నియంత్రణకు ‘ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ’ని ఏర్పాటుచేశారు. జీవో 1, 1993 ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల్లో ఐదు శాతం మాత్రమే యాజమాన్యం ఉపయోగించుకోవాలి. 15 శాతం పాఠశాల నిర్వహణ, 15 శాతం వసతుల కల్పన, 50 శాతం ఉద్యోగుల వేతనాల కోసం, 15 శాతం ఫీజులను ఉద్యోగుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. కానీ, ఏ ప్రైవేటు విద్యాసంస్థ కూడా దీన్ని అమలుచేస్తున్న దాఖలాలు లేవు. ఏటా ఫీజులను పెంచుకుంటూ పోయి దోపిడీ కేంద్రాలుగా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు మారుతున్నాయి. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ విద్యాసంస్థల నియంత్రణ, కాపిటేషన్ ఫీజు నిషేధ చట్టం 1983, సబ్ రూల్-7ను ప్రైవేటు విద్యాసంస్థలలో అమలుచేయాలని సూచించింది. జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణ అథారిటీని ఏర్పాటుచేయాలని సూచించింది. ఇది ప్రైవేటు విద్యాసంస్థల ఆదాయ వ్యయాలను పరిశీలించి ఫీజుల పెంపుపై తగిన సూచనలను ఇస్తుంది. పై అంశాల నేపథ్యంలో ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు పటిష్ఠమైన చట్టం తీసుకురావాలి.
తెలుగు మీడియం
ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినా.. తెలుగు మీడియం తరగతులు కూడా అందుబాటులో ఉంచాల్సిందేనని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మాత•భాషలో విద్యాబోధనపై కేంద్రంతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని నూతన విద్యా విధానంలో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు మీడియం క్లాసులను కూడా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో సుమారు 26 వేల పాఠశాలలు ఉన్నాయి. మొదటి ఏడాది ఒకటో తరగతి, తర్వాత సంవత్సరం రెండవ తరగతి, ఇలా రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్ల కాలంలో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్ మీడియం అమలులోకి వచ్చే వీలుంది. ఏ మీడియంలో చేరాలనే నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులదే. కాగా సక్సెస్ స్కూళ్ల పేరిట ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 8 వేల స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో 6 వేల దాకా ప్రైమరీ స్కూళ్లు ఉండగా, మిగతావి హైస్కూళ్లు. అయితే… సక్సెస్ స్కూల్ విధానంలో 6వ తరగతి నుంచి మాత్రమే ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు. కింది తరగతులకు ఈ అవకాశం లేదు.
ఇంటర్, డిగ్రీ కాలేజీల్లోలా..
ఇంగ్లిష్ మీడియాన్ని ఇప్పటికే ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో అమలు చేస్తున్నారు. ఆయా కళాశాలల్లో తెలుగుతోపాటు ఆంగ్లమాధ్యమంలో కూడా తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాల పరిధిలో కూడా ఇలాగే రెండు మాధ్యమాలనూ అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వం యోచనగా చెబుతున్నారు. ఈ మేరకు.. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను నిర్వహణ కోసం ఇప్పుడున్న టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన కొంత మంది ఉపాధ్యా యులకు ఇంగ్లీష్‍లో శిక్షణ ఇచ్చి, వారి చేత స్కూళ్లను నడిపించ నున్నారు. తర్వాత ఖాళీల భర్తీలో ఇంగ్లీష్ బోధించే సామర్థ్యం కలిగిన అభ్యర్థులనే ఎంపిక చేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యా యుల నియామక పరీక్షల్లో చేర్పులు, మార్పులను తీసుకు రానున్నారు. అలాగే.. టెట్, బీఎడ్ వంటి వాటిల్లో కూడా మార్పులు తేవాలని భావిస్తున్నారు. కాగా.. రాష్ట్రంలో కొనసాగుతున్న రెసిడెన్షియల్ స్కూళ్లు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. వీటిల్లో 5వ తరగతి నుంచి అడ్మిషన్లను తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ స్కూళ్లు తెలుగు మీడియంలో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నుంచి ఇలాంటి స్కూళ్లను కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చనున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని స్థాయుల్లోని విద్యాసంస్థల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టనున్నారు.
ఉపాధ్యాయుల విషయంలోనూ..
భవిష్యత్తులో ఇంగ్లీష్ మీడియం బోధించే ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకువచ్చే విషయంలోనూ కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఒకటి, రెండేళ్లపాటు పెద్దగా ఇబ్బందులు రావని అంచనా వేస్తున్నారు. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడానికి ప్రస్తుతం ఉన్న టీచర్లకు శిక్షణ ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారు. తరగతులు పెరిగే కొద్దీ మాత్రం ఉపాధ్యాయుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. కొత్త నియామకాలను చేపట్టే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే… భవిష్యత్తులో ఇంగ్లీష్‍లో బోధించే అభ్యర్థులను సిద్ధం చేయడంలో భాగంగా బీఎడ్ వంటి కోర్సుల నిర్వహణలో కూడా ఇంగ్లిష్ మీడియం సీట్లను పెంచేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇంగ్లీష్ మీడియం ప్రారంభం, మన ఊరు-మన బడి పథకం ప్రారంభంపై ఇప్పటికే విద్యామంత్రి ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యింది.
బడిలో చేరడానికి ముందు..
అంగన్‍వాడి కేంద్రాల నుంచి పాఠశాలల్లో చేరడానికి ముందు.. ఆరు నెలలపాటు లేదా కొంతకాలంపాటు పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. ప్రైవేట్‍లో ఎల్‍కేజీ, యూకేజీ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒకటో తరగతికి ముందు ఇంగ్లీష్‍లో ఒక తరగతిని నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇతర తరగతుల్లో తెలుగుమీడియంలో చదువుతున్న వారు ఇంగ్లీష్ మీడియంలోకి మారాలంటే అందుకు అవకాశం ఉంటుందా? లేదా? అంటే.. అది కేబినెట్ సబ్ కమిటీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. అలాగే, ప్రస్తుతం అమల్లో ఉన్న సక్సెస్ స్కూల్స్ తరహాలో మధ్య తరగతుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలంటే అందుకు అనేక అడ్డంకుల్ని దాటాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పంచాయితీ నుంచి తీర్మానం చేయాలి. స్కూల్ మేనేజ్‍మెంట్ కమిటీ తీర్మానంతో పాటు ఆర్‍అండ్‍బీ, ఫైర్, వైద్యం వంటి సుమారు 20 శాఖల నుంచి ఎన్ వోసీలను పొందాల్సి
ఉంటుంది. పైగా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదనే గ్యారంటీని సంబంధిత స్కూల్ హెచ్‍ఎం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఎంఈవో ద్వారా డీఈవోలకు పంపిస్తే అక్కడి నుంచి ఆర్‍జేడీ స్థాయిలో అనుమతి ఇస్తున్నారు.
మన ఊరు.. మన బస్తీ.. మన బడి
గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు- మన బడి, పట్టణాల్లో మన బస్తీ- మన బడి పేరిట ఆధునికీకరించనుంది. మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు డిజిటలీకరణ చేయనుంది. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో రూ.7289.54కోట్ల ఖర్చుతో సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. తొలి విడతలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9,123 బడుల్లో రూ.3497.62 కోట్లతో పనులు చేపట్టనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్‍కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మండలం యూనిట్‍గా అధిక ప్రవేశాలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్ని ఎంపికచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఈ పనుల మంజూరు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం.. ఒక మండలానికి ఒక ఏజెన్సీ ఉండాలని స్పష్టం చేసింది. పనుల నిర్వహణ బాధ్యతను అనుమతించి ఆర్థిక పరిమితికి లోబడి పాఠశాల యాజమాన్య కమిటీలు చేపట్టాలని, ప్రజాభాగస్వామ్యం తీసుకోవాలని సూచించింది. యాజమాన్య కమిటీలు ముందుకు రాకుంటే జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు.
యాజమాన్య కమిటీలకు బాధ్యతలు
ఈ పథకానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్షాఅభియాన్, ఉపాధిహామీ, ఏసీడీపీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, నాబార్డు, జిల్లా, మండల పరిషత్ ప్రత్యేక అభివ•ద్ధి నిధుల నుంచి వినియోగించు కోవాలని ప్రభుత్వం సూచించింది. నిధుల సమీకరణకు ఆర్థికశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటూ అవసరమైనవాటిని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‍కు అందుబాటులో పెట్టనుందని తెలిపింది. నిధుల ఖర్చుకు సంబంధించిన చెక్కులపై పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్, ప్రిన్సిపల్, సహాయ ఇంజినీర్, సర్పంచి సంతకాలు తప్పనిసరి. ఎవరైనా దాత రూ.2లక్షలు ఈ కార్యక్రమం కింద ఇస్తే కమిటీలో సభ్యుడిగా చేర్చుకోవచ్చు. రూ.10లక్షలు అంతకు ఎక్కువగా విరాళం ఇస్తే పాఠశాలలో ఒక తరగతి గదికి దాత సూచించిన పేరు పెడతారు.
మన ఊరు, మన బస్తీ, మన బడి కార్యక్రమం కింద చేపట్టే పనులపై ప్రభుత్వం సామాజిక తనిఖీని తప్పనిసరి చేసింది. దాతలు ఇచ్చే విరాళాలతో చేపట్టే పనులను పర్యవేక్షించేందుకు ప్రతి బడిలో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేయాలని సూచించింది. సంఘంలోని ఇద్దరు సభ్యులు, సర్పంచితో కలిసి కమిటీగా ఏర్పాటు కావాలి. ఈ కమిటీతో పాటు పాఠశాల యాజమాన్య కమిటీలోని ఇద్దరు సభ్యులు, ప్రధానోపాధ్యాయుడు.. దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు, నిర్వహణ బాధ్యతలు పరిశీలించాలి. దాతలు ఇచ్చే నిధులను పూర్వ విద్యార్థుల సంఘంలోని ఇద్దరు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్య యుడితో కూడిన సంయుక్త ఖాతాలో జమ చేయాలి. ఈ నిధులను జిల్లా కలెక్టరు అనుమతితో ఖర్చుచేయాలి. వీటిపై వచ్చే వడ్డీని పాఠశాల నిర్వహణ కోసం వినియోగించాలి.
పాఠశాలల్లో చేపట్టే పనులు…
- నీటివసతితో మరుగు దొడ్లు
- విద్యుదీకరణ, తాగునీటి సరఫరా
- విద్యార్థులు, అధ్యాపకుల కోసం ఫర్నీచర్
- ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీ, కంప్యూటర్, సైన్స్ల్యాబ్‍లు
- పాఠశాలకు మొత్తం రంగులు వేయడం
- పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు
- ప్రహరీగోడలు, కిచెన్ షెడ్‍లు
- శిథిల గదుల స్థానంలో కొత్తవి నిర్మాణం
- ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు
- డిజిటల్ విద్యకు అవసరమైన మౌలిక సదుపాయాలు
- కట్టా ప్రభాకర్
ఎ : 8106721111