సమస్త జీవకోటి భారాన్ని మోసేది పుడమి తల్లి

ఏప్రిల్‍ 22న ధరిత్రీ దినోత్సవం

సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమి పరిరక్షణపై ఎంతమందికి అవగాహన ఉంది అంటే సమాధానం శూన్యం. పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించ కుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగాహన అవసరం. అటు పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరమవుతున్నాయి. అందులో భాగంగానే.. తొలి ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ డే)ను 1970 ఏప్రిల్‍ 22న జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అదే రోజు ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.


పెరుగుతోన్న భూతాపం, వాతావరణ కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ విషయమై ప్రజల్లో అవగాహన పెంచి, అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకోవడానికి 1970లో బీజం పడింది. 1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్రతీరం చమురు తెట్టులతో నిండిపోవడంతో సముద్ర తీరమే ఆలంబనగా ఉన్న వందలాది జీవజాతులు మృత్యువాతపడ్డాయి. సుమారు నాలుగు వేల పక్షులు ఆ చమురు తెట్టులో చిక్కుకొని ఎగిరే దారిలేక అవి ప్రాణాలొదిలాయి. జీవ వైవిధ్యం ప్రమాదంలో పడటంతో ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి ఈ సంఘటన పునాదిగా మారింది. అమెరికన్‍ సెనేటర్‍ గెలార్డ్ నెల్సన్‍ పర్యావరణ పరిరక్షణకు పిలుపునివ్వడంతో అమెరికాలో 20 లక్షల మంది ఏప్రిల్‍ 22న నిర్వహించిన తొలి ధరిత్రి దినోత్సవంలో పాల్గొన్నారు. నేల అంటే మట్టి మాత్రమే కాదు, భూమంటే 84 లక్షల జీవరాశుల సముదాయం.


ధరిత్రీ గురించి
పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం. మొదట ఐక్యరాజ్యసమితి 1969, మార్చిలో జాన్‍ మెక్కల్‍తో ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా రాజకీయవేత్త గేలార్డ్ నెల్సన్‍ ప్రారంభించాడు. 1962లో సెనెటర్‍ నెల్సన్‍కి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ ధరిత్రీ దినోత్సవం. తన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమవడం గమనించి అందరికీ ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు నెల్సన్‍ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ప్రెసిడెంట్‍ కెన్నెడిని కలసి తన ఆలోచనను వివరించాడు. దీని ప్రకారం ప్రెసిడెంట్‍ కెన్నెడి అందరికీ ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు దేశమంతటా పర్యటించాల్సి వచ్చింది. ఈ ఆలోచన నచ్చి కెన్నెడి పర్యటించేందుకు ఒప్పుకున్నాడు. కాని ప్రెసిడెంట్‍ కెన్నెడి పర్యటన సఫలీకృతం కాలేదు. ఈ సమస్యపై అప్పటి సమాజం పెద్దగా పట్టించుకోలేదు. 1969లో సెనెటర్‍ నెల్సన్‍కి మరొక ఆలోచన వచ్చింది. మన వాతావరణంలో జరిగే మార్పులనూ వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన వంతు ఏమి చెయ్యాలో అందరికీ తెలియ చెప్పడానికి ఒక రోజంటూ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే తన ఆలోచనకు రూపకల్పన చేస్తూ, ఒక వార్తాపత్రిక ద్వారా ప్రజలకూ ఈ ధరిత్రీ దినోత్సవం గూర్చి వివరించారు. 1970 ఏప్రిల్‍ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం జరిగింది. ఆరోజు ఆ దేశంలోని ప్రజలంతా ధరిత్రిని రక్షించుకునేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రమాణాలు చేసారు. ఇలా తొలుత అమెరికాలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఆ తర్వాత ప్రపంచవ్యాపితమైంది. ప్రజలలో మరింత అవగాహన కలిగించేందుకు ఎర్త్ డే నెట్‍వర్క్ ఏర్పడింది.


ధరణిని కాపాడి జీవ జాతిని రక్షించుకుందాం!
సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. పర్యావరణం, వాతావరణంతోపాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరమవుతున్నాయి.
సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి అనేది అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగాహన అవసరం. అటు పర్యావరణం, వాతావరణంతోపాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరమవుతున్నాయి. ఈ క్రమంలోంచి వచ్చిందే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’. 1970 నుంచి ప్రారంభమైన ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 190 కంటే ఎక్కువ దేశాల్లో ఏప్రిల్‍ 22న జరుపుకుంటున్నాయి. భూగోళంపై మానవ ప్రభావాన్ని తెలియజేయడం, అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. ఏటా ఒక నినాదంతో ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ‘జీవ జాతులను రక్షిద్దాం (ప్రొటెక్ట్ అవర్‍ స్పీసెస్‍)’ అనే నినాదం ఇచ్చారు.


మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివ•ద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది.
ఉపరితలంపై ఉన్న వనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల భూతాపం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో ముడిచమురు నిల్వలు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ భూగోళంపై హరితదనం తగ్గిపోవడం, కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం వల్ల భూతాపం పెరుగుతూ వస్తోంది. నానాటికీ పెరుగుతున్న భూతాపంతో ప్రకృతి సమతౌల్యత దెబ్బతిని జీవరాశి మనుగడకు ముప్పు ఏర్పడుతోంది.


పరిశ్రమలు, వాహనాలు తదితరాల నుంచి వెలువడుతోన్న క్లోరోఫోరో కార్బన్ భూగ్రహాన్ని మరింత వేడెక్కిస్తూ పలు కాలుష్యాలకు కారణమవుతున్నాయి. భూతాపం పెరగడంవల్ల పర్యావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుని జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వాతావరణంలో మార్పుల కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. వృక్షాలను విచక్షణారహితంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించి పోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. దీంతో జల వనరులు నానాటికీ తీసుకట్టుగా మారుతున్నాయి. తత్ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్‍ వార్మింగ్‍తో ఓజోన్‍ పొర దెబ్బతింటోంది.


ధరిత్రి దినాన్ని 2009 నుంచి ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్‍ మదర్‍ ఎర్త్డే’గా మార్చింది. కొన్ని దేశాల్లో ‘ధరిత్రి వారం’ను నిర్వహిస్తున్నారు. భూమితో మానవాళికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ పలు కార్యక్రమాలు, ప్రచారంతో ‘ధరిత్రీ వారం’ని జరుపుతున్నారు. మొత్తం 192 దేశాలు ‘ఎర్త్డే’లో భాగమవుతున్నాయి. ప్లాస్టిక్‍ వాడకపోవడమే మంచిది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టాలి. నీటి వృథాను అరికట్టాలి. వీలైనన్ని మొక్కలు నాటాలి. తొమ్మిదో దశకం నుంచి ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.9 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూములు కనుమరుగయ్యాయి.


ఈ చిన్న సూచనలు పాటిస్తే భూతాపం కొంత తగ్గించవచ్చు. బయటకు వెళ్లే సమయంలో వాహనాలు కాకుండా నడిచి వెళ్ళడం లేదా సైకిల్‍ను ఎంచుకోవడం. దూర ప్రాంతాలకు వెళ్లటేప్పుడు స్వంత వాహనాలు కాకుండా ప్రజా రవాణను ఆశ్రయించడం. మాంసాహారానికి దూరంగా ఉండటం వల్ల కూడా కర్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఉపయోగించాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి. పునర్వినియోగ ఇంథనాలు, వస్తువులను వినియోగించాలి. స్థానికంగా దొరికే ఆహారాన్నే వినియోగించాలి.


మన ఇంట్లో, చుట్టుపక్కల పరిసరాల్లో భూగోళ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా మానవాళి పురోగమన చర్యలకు తోడ్పడండి. ధరిత్రి పరిరక్షణకు స్ఫూర్తిని పెంచుకోండి.

  • ఎసికె. శ్రీహరి
    ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *