కథ కంచికి..

 • చెప్పేవారే కరువు.. అంతా స్మార్ట్ఫోన్‍ బాధితులే..
 • వ్యక్తిత్వ వికాసానికి కథలే మార్గం
 • ఉన్నత విలువల సాధనకు దిక్సూచి
 • పిల్లలకు రోజూ ఒక కథ చెప్పగలగాలి
 • తల్లిదండ్రుల్లో కానరాని ధోరణి..
 • యాంత్రిక జీవితమే కారణం


అనగనగనగా అనగానే.. తెలియని ఆసక్తి, మధురానుభూతి, ఏదో వినబోతున్నామన్న ఉత్కంఠ.. ఇన్ని ఆలోచనలు ఒకేసారి మొదలవుతాయి. అంతటి శక్తి కథలకు మాత్రమే ఉంది. గతంలో అమ్మమ్మ, తాతయ్య చెప్పే కథలు వింటూ చిన్నారులు అలా ఊహా లోకంలో తేలిపోయేవారు. సంప్రదాయాలను, సంస్కృతులను, చరిత్రను, విజయగాథలను కథల రూపంలో అందంగా, ఆసక్తిగా మరల్చి చెప్పగలిగితే చాలు.. చిన్నారుల వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది. చైతన్యం వెల్లివిరుస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక కథతో పరిష్కారం దొరుకుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ వాటి పట్ల ఆసక్తి పెంచుకోవాలి అంటున్నారు విద్యావేత్తలు.
స్ఫూర్తిని, చైతన్యాన్ని, విలువలు పెంచడానికి, ఆత్మవిశ్వాసం నింపడానికి, కాలక్షేపానికి, చివరికి నిద్రపోవడానికి ఇలా అన్నింటికీ కథలే కావాలి. గొప్పతనం ఏంటంటే ప్రతి కథలో ఒక నీతి ఉంటుంది. భారతీయ కథల్లో ఏదో తెలియని శక్తి ఉంటుందని బ్రిటీష్‍ మేధావి రొమిలా థాపర్‍ వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీకి తల్లి జిజియా బాయి ఏం కథలు చెప్పిందో తెలుసుకోవడానికి ఔరంగజేబు మేధా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడంటే మన కథలకు ఉన్న శక్తి ఏంటో అర్ధం అవుతుంది.

చెప్పడంలో కృష్ణుడి గొప్పతనమో.. రాయడంలో వ్యాసుడి గొప్పతనమో భగవద్గీతలో అధ్యాయాల పొందిక మహమానిత్వంగా గోచరిస్తున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా పొగుడుతుంటే మన కథల ఔన్నత్యం ఏంటో అవగతమవుతుంది. కానీ ప్రస్తుతం వాటి మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. పిల్లలకు కథలు చెప్పే తల్లిదండ్రులే లేరు. కాస్తోకూస్తో చెప్పగలిగిన పెద్దవారు దూరంగా ఉండిపోతున్నారు. దీంతో మన చరిత్రకు, విలువలకు ప్రస్తుత తరం దూరం అయిపోతున్నారు. అందుకే ఎంతో కొంత వాటిని నేటితరానికి దగ్గర చేయాలన్న ఆలోచనతో ప్రతి ఏడాది మార్చి 20న వరల్డ్ స్టోరీ టెల్లర్స్ డేను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కథా.. కమామీషు వాస్తవానికి కథల ప్రాశస్త్యం భారతీయులదే. దేశంలో అన్ని రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో చిన్న, పెద్దవి కలుపుకొని పది కోట్లకు పైగా కథలు ఉన్నట్టు అంచనా. భారతీయ సంస్కృతిలో అత్యంత బలమైన ఐదు అంశాల్లో కథలు కూడా ఒకటిగా నాటి బ్రిటీష్‍ ప్రభుత్వం గుర్తించింది. అందుకే వాటిని తమ దేశాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. కానీ అది అంత సులువుకాదని కొద్ది రోజులకే తెలుసుకుంది. కథల కంటే వాటిని చెప్పే గొప్పతనం భారతీయుల్లో మాత్రమే ఉందని గుర్తించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కొంతకాలం తరువాత జోన్‍ డిడియన్‍ అనే స్వీడన్‍ మేధావి వీటి ప్రాముఖ్యతను గుర్తించి 1991 నుంచి ఏటా మార్చి 20న మౌఖిక కథల దినోత్సవం జరుపుకునేందుకు తలపెట్టారు. 1997 నాటికి ఆస్ట్రేలియాలో ప్రారంభమై 2009 నాటికి ఒక్క అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల్లోని దేశాలు ఈ పండుగను జరుపు కొంటున్నారు. కథల విశిష్టతను, ఏడాది పొడువునా పిల్లలకు చెప్పాల్సిన కథలను ఈ పండుగలో నిర్ణయించుకుంటారు.

మౌఖిక కథలదే అగ్రపీఠం.. కథలు చెప్పే తీరు అనేక విధాలుగా ఉంటాయి. అక్షరాలు, నాటిక, నాటకం, నృత్యరూపం, సంజ్ఞలు, ప్రదర్శనలు, సినిమాలు ఇలా అనేక విధాలుగా కథలు చెప్పే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ నేరుగా ఎదురుగా కూర్చుని చెప్పే కథలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి అని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి మెదడును ఉత్తేజపరచి ఆ జ్ఞాపకాలను జీవితకాలం ఉండేలా చేస్తాయి. మిగిలిన రూపంలో చెప్పే కథలు శక్తివంతంగానే ఉంటాయి. కానీ మౌఖిక కథలంత ప్రభావితం చేయలేవు అని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. అందుకే ఎన్ని రూపాల్లో ఉన్నా మౌఖిక కథలదే అగ్రపీఠం. అందుకే వరల్డ్ స్టోరీ టెల్లర్స్ డే రోజు మౌఖిక కథల గురించే అవగాహన కల్పిస్తుంటారు.


ఆసక్తి తగ్గలేదు.. కథలను ఏదో విధంగా నేటితరానికి అందించాలన్న కృషి కొంతమందిలో ఉండబట్టే నేటికి అందుబాటులో ఉన్నాయి. పూర్వం పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవారు. ఆ తరువాత అవి పుస్తకరూపంలో, నాటికల రూపంలోకి అందుబాటులోకి వచ్చాయి. టీవీల ద్వారా ఇవి మరింత చేరువయ్యాయి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‍లు వచ్చాక యూ ట్యూబ్‍లలో బొమ్మల ద్వారా వీటిని అందుబాటులో ఉంచారు. ఇవి ఏ రూపంలో ఉన్నా వీటి పట్ల ఆసక్తి మాత్రం తగ్గలేదు. ప్రతి 10 మంది పిల్లల్లో నలుగురు వీటిని చూడటానికి ఇప్పటికి ఇష్టపడటమే దీనికి నిదర్శనం.
చెప్పే వారేరీ.. ప్రస్తుత యాంత్రిక జీవితం, పెద్దలు దూరంగా ఉండి పోవడం వల్ల పిలల్లకు కథలు చెప్పేవారే కనుమరుగయ్యారు. అసలు వాస్తవానికి ప్రస్తుత తరంలో ఉన్న చాలామంది తల్లిదండ్రులకు కథలు తెలియవనే చెప్పాలి. ఎందుకంటే వారుకూడా స్మార్ట్ఫోను బాధితులే. దీంతో పిల్లలు కథలకు పూర్తి దూరమయ్యారు. పురాణాలు, చరిత్ర గురించి నేటి తరానికి అవగాహన లేకుండా పోవడానికి ఒక కారణంగా చెప్పుకోవాలి.

 • పోలెండ్‍ దేశంలో పిల్లలు పాఠశాలల్లో చేర్పించే సమయంలో వారికి రోజు ఒక నీతి కథ చెప్పాలని తల్లిదండ్రులకు మార్గదర్శకాలు జారీ చేస్తారు. ఏం కథ చెప్పారో పిల్లల పుస్తకాల్లో తప్పనిసరిగా రాసి పంపాలనే నిబంధన అమల్లో ఉంది.
 • ఆత్మహత్య చేసుకుందామని అనుకునే ప్రతి 10 మందికి స్ఫూర్తివంతమైన కథ చెబితే అందులో ఆరుగురు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని జాతీయ నేర గణాంక సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది.
 • ఆస్ట్రేలియాలోని కొన్ని పాఠశాలల్లో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తరగతి గదిలో కథలు చెప్పాలని మార్గదర్శకాలు ఉన్నాయి.
 • మంచి కథలు వినకపోవడం వల్లే భారతదేశంలో చాలామంది పిల్లలు ధరో బ్రెడ్‍ కిడ్డింగ్‍ (అట్టపెట్టలాంటి జీవితం) అనుభవిస్తున్నారని యునిసెఫ్‍ తన నివేదికలో వెల్లడించింది.
 • తెలుగు స్టోరీస్‍, తెలుగు మోరల్‍ స్టోరీస్‍, హిస్టారికల్‍ స్టోరీస్‍ పేరిట యూ ట్యూబ్‍లలో పదుల కొద్ది ఛానళ్లు అందుబాటులో ఉన్నాయి. చారిత్రక, పురాణాలు, నీతి కథలు ఛానళ్లు ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారు.
 • బాలమిత్ర, చందమామ వంటి కథల పుస్తకాలు నేటికి ఆన్‍లైన్‍ ద్వారా 23 లక్షల మంది చదువుతున్నట్టు ఒక అంచనా.


అడ్రస్సు లేని ‘ఆనంద వేదిక’ పాఠశాల ప్రారంభించే తొలి గంటలో అన్ని తరగతుల విద్యార్థులకు రోజు ఒక అంశంపై కథలు చెప్పాలని రాష్ట్ర కౌన్సిల్‍ ఎడ్యుకేషన్‍ రీసెర్చ్ ట్రైనింగ్‍ సెంటర్‍ సిఫార్సులు మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆనంద వేదిక అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2020లో తీసుకువచ్చింది. కథలో ఏఏ పాత్రలు ఎవరికి నచ్చాయో ఎందుకు నచ్చాయో అనే విషయం విద్యార్థులను తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి. కానీ ప్రస్తుతం ఏ పాఠశాలలోను ఈ కార్యక్రమం అమలు కావడం లేదు. గతంలో కంటే పని ఒత్తిడి అధికంగా ఎక్కువైందని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలంటూ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆనందవేదిక కార్యక్రమాన్ని ఢిల్లీలో సమర్ధంగా అమలు చేసి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పిల్లల్లో వచ్చిన మార్పులను చూసి ఇదే కార్యక్రమాన్ని పంజాబ్‍ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.


ఆ శక్తి కథలకు మాత్రమే ఉంటుంది..
ఏదో తెలియని అయోమయంలో ఉన్న పసి మెదడుకు ప్రేరణ ఇచ్చి గాడిలో పెట్టే శక్తి కథలకు మాత్రమే ఉంటుంది. ఒడిలో కూర్చుబెట్టుకుని చెప్పగలిగితే అవి మరింత ప్రభావితం చేయగలుగుతాయి. తెలుగులో ఉన్న నీతికథలు మరెక్కడా ఉండవు. అవి ఒక విధంగా మన అద•ష్టమే. తల్లిదండ్రులే ఆ బాధ్యత తీసుకోవాలి. ఇది పెద్ద కష్టమేమి కాదు. కథలు చెప్పకపోతే వారి భవితకు తీవ్ర అన్యాయం చేసిన వారమవుతాం.


ప్రపంచం అర్ధం కాదు…
విద్య, అభ్యాసానికి కథలే కీలకం. చరిత్ర, పురణాలకు తరువాతి తరానికి అందించాలి. కథలు చెప్పడం ఒక్కటే వాటికి మార్గం. కథలు అందించలేకపోతే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు అర్ధం కాదు. సహజంగా పిల్లలు ప్రతి దానికి వివరణ అడుగుతూ ఉంటారు. అటువంటి వివరణలకు ఉదాహరణలుగా కథలే మూలాధారం. చెడుపై మంచి గెలిచిన కథలే ఎన్నుకోవాలి. అప్పుడే విలువల గల సమాజం అవతరిస్తుంది. లేదంటే యాంత్రీకరణ జీవితం మరింత దుర్భలంగా మారుతుంది.
ప్రతి ఏటా మార్చి 20న అంతర్జాతీయ కథలు చెప్పే రోజుగా ప్రకటించుకున్నాం.

 • దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *