పిల్లలమర్రి దేవాలయంలో ఉన్న ఆ ఒక్క వర్ణచిత్రాన్నీ కాపాడుకోలేమా?


ఆది మానవుని అడుగుజాడలకు అద్దం పట్టిన తెలుగు నేలపై శిలాయుగంలోనే చిత్రకళ పురుడుపోసుకుంది. తెలంగాణా – రాయల సీమ జిల్లాల్లో దాదాపు 45కుపైగా స్థావరాల వద్ద గుహల్లోనూ, కొండ చరియలపైనా ఆనాటి వర్ణచిత్రాలు అప్పటి సృజనకు ఆనవాళ్లుగా నేటికీ నిలిచేవున్నాయి. కరీంనగర్‍ జిల్లాలో రేగొండ, వరంగల్‍ జిల్లాలో పాండవుల గుట్ట, కర్నూలు జిల్లాలో కేతవరం, మహబూబ్‍నగర్‍ జిల్లాలో సంగనోన్‍ పల్లి, కడప జిల్లాలో చింతకుంట, నెల్లూరు జిల్లాలో నాయుడుపల్లి శిలాయుగపు చిత్రకళకు కొన్ని ఉదాహరణలు.
మళ్లీ శాతవాహనుల కాలంలో తెలుగువారి చిత్రకళ ఎల్లలు దాటి చక్కటి అంగసౌష్టవం, సొగసు, సోయగాలతో అలరారిన దాఖలాలు అజంతా గుహల్లో వెలుగు చూశాయి. ఆ తరువాత చిత్రకళ లేదని కాదు గానీ మళ్లీ కళ్యాణీ చాళుక్యుల కాలపు వర్ణచిత్రాలు మునుపటి మెదక్‍ జిల్లా అల్లాదుర్గంలో ఒక శివాలయపు గోడలపైన కనిపించాయి. హవమల్ల సోమేశ్వరుని పాలనాకాలంలో నలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో వేసిన ఉమామహేశ్వర, లకులీశ, నందీశ్వరుల బొమ్మలు మధ్యయుగ ప్రారంభ కాలపు వన్నెల్ని కళ్లకు కడుతున్నాయి. అస్పష్టంగా వున్నా, చక్కటి చారిత్రక ఆధారాలైన ఈ రంగుల బొమ్మలు మానసోల్లాసంలో వర్ణించిన వర్ణచిత్ర సంప్రదాయానికి మచ్చు తునకలు. హైదరాబాద్‍ స్టేట్‍ మ్యూజియంలో వీటిని చూడవచ్చు.


కాకతీయుల కాలం అన్ని రంగాల్లో మాదిరిగా వర్ణచిత్రాలకు కూడా స్వర్ణయుగమే. కొంచెం తరువాతి కాలంలో రాసినా, క్రీడాభిరామంలో పేర్కొన్న మట్టెవాడలోని మాచలదేవి నివాస (విలాస)గృహం కప్పులు, గోడలపై గల రకరకాల రంగుబొమ్మలు, నాటి చిత్రకారుల పనితనాన్ని తెలియజేస్తున్నాయి. ఈ వర్ణచిత్రాలు ఇప్పుడు లేకపోయినా తెలుగువారి చిత్రకళా సాంప్రదాయాన్ని, నైపుణ్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి.


చారిత్రక ఆధారాలు ఎంత తక్కువగా ఉంటే వాటి విలువ అంత పెరుగుతుంది. ఒకటో, రెండో అలాంటి అరుదైన ఆధారాలను ‘ప్రాణాధారాల్లా’ చూసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. ఇలా మనకు కూడా ఒకటీ, రెండు వర్ణచిత్రాల ఆధారాలు కాకతీయుల కాలానికి చెందినవే వున్నాయి. నిర్లక్ష్యాన్ని నిలువెల్లా కప్పుకొన్న చక్కటి ఆధారం సూర్యాపేట జిల్లాకు పట్టుమని పదిగజాల దూరంలో నున్న రేచర్ల వంశపు రెడ్ల రాజధానిగా భాసిల్లిన పిల్లలమర్రి దేవాలయంలో దూలంపై వుంది. పిల్లలమర్రిలో క్రీ.శ.1195లో రేచెరువుల నామిరెడ్డి, తండ్రి పేర కామేశ్వర, తల్లిపేర కాచేశ్వర తన పేర నామేశ్వర అనే మూడు లింగాలను ప్రతిష్టించాడు. ఇది త్రికూటాలయం. ఇంకా తాను తన భార్య పేర, ఐతేశ్వర, కొడుకు పేర విశ్వనాధేశ్వర, నామిరెడ్డి మేనల్లుడు పేర ప్రోలేశ్వర దేవాలయాలను నిర్మించి, నిర్వహణకు భూముల్ని దానం చేశాడు. రేచెర్ల బేతిరెడ్డి భార్య క్రీ.శ. 1208లో, ఎరకసాని తన పీఠ ఎరకేశ్వర దేవాలయాన్ని నిర్మించింది. గ్రామంలోని నామేశ్వర దేవాలయ సముదాయంలోని ఏక కూటాలయ అర్థమండప దూలంపైన అలనాటి వర్ణ చిత్ర మొకటుంది. దేవదానవ యుద్ధ తంత్రంలో భాగంగా అమృతమథన దృశ్యాన్ని నాటి చిత్రకారుడు కడు హృద్యంగా చిత్రీకరించాడు. కాకతీయుల సామంతులైన రేచర్ల రెడ్ల వారసత్వానికి ప్రతీకగానే కాక, అప్పటి తెలుగువారి వన్నెలకు వున్న ఒకే ఒక చిన్న ఆధారంగా దీనిని మనం కాపాడుకోవాలి. ఆ గీతల రాత మారకముందే, పరిరక్షించుకొని భావితరానికి తెలియజెప్పాలి. నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమన్న అపప్రథను రాష్ట్ర వారసత్వ శాఖ తొలగించుకొని అరుదైన ఈ చారిత్రక ఆధారాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటానికి ఇకనైనా పూనుకోవాలి!


ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *