ప్లాస్టిక్‍ విముక్త సముద్రాలు – మానవాళి మనుగడ


సముద్రాలలో చేపల కన్నా ప్లాస్టిక్‍ అధికంగా పెరుగుతూ ఉన్నదని ఆందోళన చెందుతూ ఉంటారు పర్యావరణ వాదులు, శాస్త్రవేత్తలు. ఎక్కడో మనకు దూరంగా ఉన్న సముద్రంలోన నేనొక్కడినే ప్లాస్టిక్‍ను విడుదల చేస్తున్నానా? ఏమిటనే ప్రశ్నతో మనమేమీ ప్లాస్టిక్‍కు ‘నో’ చెప్పం. కనీసం వాడకమైనా తగ్గించాలని అనుకోం. ప్లాస్టిక్‍ వాడకం నెలకింత చొప్పున తగ్గించాలని భావించం. అయితే బారీ కామనర్‍ అనే సామ్యవాద పర్యావరణ వేత్త ‘ది క్లోజింగ్‍ సర్కిల్‍’ అనే ఓ గ్రంథం రాశాడు. దాన్లో ఆయన పర్యావరణ సంక్షోభాలకు కారణం రెండవ ప్రపంచ యుద్ధకాలం నుండి ప్రొడక్టివ్‍ టెక్నాలజీలో వస్తున్న మార్పులేనని తేల్చాడు.
ప్రకృతిలో కనిపించని పదార్థాలతో ఉత్పత్తి పెరగటం వైపు వేలు చూపించాడు. సింథటిక్‍ మెటీరియల్స్ అంత త్వరగా భూమిలో కలిసిపోవు. ఇక అవి భూమాత ముఖం మీద మచ్చలను, గడ్డలను, ముడతలను శాశ్వతంగా పెంచుతాయి. సహజ క్రమంలో ప్రకృతిలో లభ్యమయ్యే వాటితో ఉత్పత్తి జరిగితే అంత ప్రమాదకరంగా పరిణమించవు.


ఇకోస్ఫియర్‍లో ప్రతి కార్యమూ ఒక కారణంగా కూడా రూపొందుతుంది. జంతు విసర్జకాలు నేలలోని బాక్టీరియాకి ఆహారంగా మారుతుంది. బాక్టీరియా విసర్జించే వాటితో మొక్కలు పోషకాలను తీసుకుంటాయి. జంతువులు మొక్కలను తింటాయి.
ఆధునిక పారిశ్రామిక వ్యవస్థలు భుజరేఖాక్రమ లక్షణాన్ని కలిగి ఉంటాయి. అవి వర్తులాలు కావు. యంత్రాలు లేదా ‘ఎ’ అనే యంత్రం ‘బి’ అనే ఉత్పత్తిని ఎల్లప్పుడూ ఇస్తుంది. ‘బి’ ఉత్పత్తిని ఒకసారి వాడితే ఇక అది పనికి రానిదైపోతుంది. దానిని ఉత్పత్తి చేసిన యంత్రానికి గాని, ఉత్పత్తి అయిన వస్తువుకు గాని, దానిని వినియోగించిన వారికి గానీ ఇక ఒక అర్థాన్నంటూ అదివ్వదు. అదిక వ్యర్థమే.


అంటే జీవితానికి ఉండే వర్తులు లక్షణాన్ని మానవాళి కోల్పోయింది. అసంఖ్యాక ఈ వలయాలను మనిషి రూపొందించిన బురురేఖీయ సంఘటనలు పూర్తిగా చేశాయి. మనిషి వేసిన ఈ బ్రేకులు ఇకోస్పియర్లో కల్లోలాలనే సృష్టించాయి. ప్రకృతి కలనే తను చిన్నాభిన్నం చేసేసిన శక్తి మనుషులకు ఉంది. భూమండలం మీద వేలాది సంవత్సరాలుగా సుస్థిరంగా ఉన్న జీవితం దుర్భరంగా మారింది. వీటిని మనం అర్థం చేసుకోవలసి ఉంది.
తన పుస్తకంలో డిస్పోజబుల్‍ ధోరణులను గురించి 1970-71 ప్రాంతాలలోనే ప్రస్తావించాడు. వివరించాడు. అయితే కామనర్‍ కూడా ఈ వాడి పారేసే ధోరణి ఎంత చెడును కలిగించగలదో ఊహించలేక పోయాడు. క్లోజింగ్‍ సర్కిల్‍ పుస్తకం ప్రచురితమైన కాలంలో ప్లాస్టిక్‍ సాఫ్ట్డ్రింక్‍ బాటిల్స్ లేవు. అసలు ఆనాడెవరూ మంచినీళ్లను సీసాల్లోకి ఎక్కించి బడా కార్పోరేట్‍ సంస్థలు వ్యాపారం చేస్తాయని కూడా ఊహకి అందలేదు.
ప్రస్తుతం బడా వ్యాపార కార్పోరేట్‍ సంస్థలు సాలీనా 72 బిలియన్ల ప్లాస్టిక్‍ సీసాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అలాగే మనం ఈనాడు వాడే ప్లాస్టిక్‍ గ్రోసరీ సంచులు గురించి కూడా కామనర్‍ చర్చించాడు. 1980ల దాకా ప్రధాన సూపర్‍ మార్కెట్‍ చైన్లు ఏవీ ఈ సంచులను అంతగా వాడలేదు. కానీ, ఈ వేళ ఐదువందల బిలియన్ల సంచులు ఉత్పత్తి అవుతున్నాయి. రకరకాల ప్యాకేజీల కొరకు భిన్న రూపాలలో ప్లాస్టిక్‍ వినియోగం జరుగుతూ ఉన్నది. వాడి పారవేసే విధంగా రూపుదిద్దిన ఏ ఉత్పుత్తులు కూడా ఒహపట్టాన మానవాళిని వదలవు. ఎందుకంటే అవి ప్రకృతిలో దొరికే వాటితో రూపొందించినవి కావు. కృత్రిమమైన పదార్థాలతో రూపుదద్దబడినటువంటివి. వాటికి పుట్టుకే తప్ప మరణం లేనివి.


లూరీ కామనర్‍ నాలుగు విధాలైన పర్యావరణ నియమాలు లేదా సూత్రాలను ప్రకటించాడు. వాటిల్లో మొదటిది ప్రతిదీ ప్రతి దానితో ముడిపడి ఉంటుంది (Every thinn is connected Everything use). రెండవది ప్రతిదీ ఎక్కడికో ఒక చోటకు పోవాలి లేదా చేరాలి (Every thing must go somewhere). ఇక మూడవది ప్రకృతికి ఏది మంచిదో తెలుసు. ఇక నాలుగోది ఏదీ ఊరికే దొరకదు.
కామనర్‍ సూచించిన నాలుగు పర్యావరణ నియమాలలో రెండవది ఈ సందర్భంలో ప్రస్తావించదగింది. ‘ప్రతిదీ ఎక్కడికో ఒక చోటకు చేరవలసిదే’ అన్నది. ఏ పదార్థాలు చాలా నెమ్మదిగా క్షీణించే లేదా క్షమం పొందే లక్షణాన్ని కలిగి ఉంటాయి. వాటి విషయంలో ఇది ముఖ్యంగా ఆలోచించాలి. కొంతమేరకు ప్లాస్టిక్‍ కాల్చివేయ బడుతుంది. మరికొంత రీసైకిల్‍ భూ ఉపరితలం మీదనే మిగిలిపోయి ఎక్కడికో ఒక చోటకు చేరాలి. అది ఎక్కడకు చేరుతూ ఉన్నదంటే సముద్రంలోకి.
క్రిస్‍ మూర్‍ ‘ప్లాస్టిక్‍ ఓషన్‍’ సముద్రాలు ఎట్లా కలుషితమై ప్రమాదకరంగా పరిణమించాయో తెలుపుతుంది కొంతవరకైనా. ప్లాస్టిక్‍ సముద్రంలోకి ప్రవేశించాక అది చేపలకు ఊపిరాడకుండా చేసి విషతుల్యం చేస్తుంది. అది క్షీరదాలను, పక్షులను అంతిమంగా మానవ జీవితాన్ని ప్రమాదకర పరిస్థితులలోకి నెడుతుంది. అంతరింపుల అంచుకు చేరుస్తుంది.


పసిఫిక్‍ మహాసముద్రంలో పదిహేనేళ్ల పాటు ప్లాస్టిక్‍ శిథిలాలను సేకరించటంలోని అనుభవమే క్రిస్‍మూర్‍ చేత పుస్తకం రాయించింది. అంతే కాదు సముద్ర జీవరాసులపై అది చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసింది. సముద్రంలోకి చేరే ప్లాస్టిక్‍ విషపదార్థాల మూలాలనే కాకుండా దానిని నిరోధించడానికి ప్రచారాన్ని కూడా ఎమూర్‍ చేపట్టాడు.
మూర్‍ కార్యకర్త, పరిశోధకుడు. అకడమిక్‍, కార్పొరేట్‍ పరిమితులకు ఆవతల, అతీతంగానూ, స్వతంత్రంగానూ పని చేశాడు. పరిశోధనకూ పునరుద్ధరణకూ మధ్య దూరాన్ని తొలగించి సముద్ర ఆవరణ వ్యవస్థను మెరుగుపరిచే దిశగా కృషి చేశాడు. 1997లో తాను రీసెర్చి బాటలో హవాయి నుంచి కాలిఫోర్నియా వరకు ప్రయాణించాడు. తొలుత ఆశ్చర్యపోయాడు. పిదప విస్మయం చెందాడు. ఎందుకంటే సముద్రంలో వేలకొద్దీ మైళ్ల మేర ప్లాస్టిక్‍ వ్యర్థాలను చూశాడు. ఆ తరువాత మూర్‍ తెలుసుకున్న విషయం ఏమంటే అతను చూసిన ప్లాస్టిక్‍ వ్యర్థాలు ఉత్తర పసిఫిక్‍ సముద్రం మీద గాఢంగా ఉందని, అక్కడ నీటి ప్రవాహాలు ఒకదాని నొకటితో కలుస్తాయి, గాలులు, భూభ్రమణం తదితరాలన్నీ కలిసి టెక్సాస్‍కి రెండింతలుగా ఉండే అతి మెల్లని సుడితిరుగుతూ ఉంటుందని. భూమిమీద ప్లాస్టిక్‍ అంతా ఇట్లా సముద్రాల్లోకి చేరుతుంది.
మిలియన్ల కొద్దీ సంవత్స రాలుగా ప్రజలు చెత్తను సముద్రాలలో కలపటం మనం ఎరిగిన విషయమే. సముద్రాల్లోకి ప్లాస్టిక్‍ను వేయడం కేవలం యాభై ఏళ్ల క్రింద మొదలు పెట్టాం. సముద్రపు సుడిగుండాలలో మిలియన్ల టన్నులు ప్లాస్టిక్‍ఉండటం మనకు ధృవీకరిస్తున్న విషయం ఏమంటే చెత్త, వ్యర్థాల స్వభావం ఇరవైవ శతాబ్ది అర్థభాగం నుంచే మారిందని.


ఈ ప్లాస్టిక్‍ గుట్టలు డెభ్బై నుంచి తొంభై అడుగుల మందం ఉండటం గమనించదగింది అంటూ ఇంటర్‍ నెట్‍లో దర్శనమిచ్చే సమాచారానికి దూరంగా మూర్‍ ఉంటాడు. అదొక పలచటి సూస్‍ లాంటిది. అందులో మనం పేర్కొనని ఎన్నో ప్లాస్టిక్‍ కణాలు, రేణువులుంటాయి. అవి మిలియన్ల సంఖ్యలో ఉంటాయి. నీళ్లలో వేళ్లాడుతూ ఉండే ఈ చిన్న చిన్న రంగుల ప్లాస్టిక్‍ పదార్థ శకలాలు ఆహారం అనే భ్రాంతిని కలిగిస్తాయి. ఇది ఎంతో ప్రమాదకరం.
ప్రతి ఏటా ప్లాస్టిక్‍ వల్ల పెద్ద జంతువులు కూడా మరణిస్తూ ఉన్నాయి. వేల సంఖ్యలో పక్షులు, తాబేళ్లు, సీల్‍ చేపలు, వేల్స్ మొదలైనవి చనిపోతూ ఉన్నాయి. ఆయా ప్రాణుల గొంతులు, పేగులు జీర్ణం కాని ప్లాస్టిక్‍ శిథిలాలతో నిండి ఉంటున్నాయి. ప్లాస్టిక్‍ మొత్తం మీద అన్ని రకాల ప్రాణుల ఆహారపు గొలుసు మీద ప్రభావం చూపుతున్నది. మూర్‍ సాగించిన పరిశోధనలో జీవకాంతిగల ఒక రకపు చేపలు కూడా ప్లాస్టిక్‍ను తింటున్నాయి. ఈ చేపలు ట్యూనా, కాడ్‍, సాల్మన్‍ చేపలకు ఆహారంగా ఉన్నాయి. తిరిగి ఈ చేపలు మానవులకు ఆహారంగా మారతాయి కనుక మనుషుల ఆహారంలో ప్లాస్టిక్‍ మిళితమై ఉంటుందనేది గమనించాలి.
ప్లాస్టిక్‍ నేరుగా జీర్ణక్రియ వ్యవస్థను దెబ్బతీయటమే కాకుండా, ప్లాస్టిక్‍ శకలాలు విష రసాయనాల విడుదల వ్యవస్థకు దోహదపడతాయి. కొన్నేమో వాటి ఉత్పత్తి క్రమంలో విషరసాయనాల విడుదలకు కారణమైతే, మరికొన్ని సముద్ర తీరాల్లో కాలుష్య కారకాలుగా తేలియాడుతూ విషతుల్యం చేస్తాయి. ప్లాస్టిక్‍ నుంచి వచ్చే విషతుల్య రసాయనాలు వినాశ గ్రంధుల వ్యవస్థను దెబ్బతీసి హార్మోన్ల విడుదల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుంది. ఒక అసమతుల్యతకు దారితీస్తుంది. ఇటువంటి మార్పులు జీవపరిణామ క్రియతో జోక్యం కలిగి ఉంటాయి. ఇవి పిండం పెరుగుదలను నిరోధిస్తాయి. అసంఖ్యాక ప్రాణుల్లో ఇవి గర్భస్రావాలకు, మృత పిండాలకు కారణమవుతాయి. ఈ రసాయనాలే మనుషులు తినే చేపల్లో చేరి అనేక రకాలైన వ్యాధులకు కారణభూతమవుతున్నాయి. శాస్త్రవేత్తలకు ఈ విషయాలు క్షుణ్ణంగా తెలిసినప్పటికీ ప్లాస్టిక్‍ కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు మరింత ఉద్ధృతం కావలసీ ఉంది.


ప్లాస్టిక్‍ వ్యర్థాలనుండి సముద్రాలు విముక్తమయ్యేందుకు ఒక మార్గం కావాలి. మూర్‍లాంటి కార్యకర్తలు ఒక విధాన రూప కల్పన కోసం గొంతెత్తారు. వాడి పారేసే ప్లాస్టిక్‍ ఉత్పత్తులను ఆపకుండా సముద్రాలను శుభ్రపచే పనులు ఫలితమివ్వవు.
మొత్తం మీద మూర్‍ మనకిస్తున్న అవగాహన ఏమంటే సమస్యకు మూలం వ్యవస్థ. పర్యావరణం కంటే, మానవ మనుగడకంటే కార్పొరేట్‍ ఆసక్తులకు పెద్దపీట వేసే వ్యవస్థలున్నంత కాలం ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. నిజానికి మార్పు రావటమనేది చాలా కష్టం. శక్తివంతమైన ప్రజలు, ప్రభావశీల వ్యవస్థలు యథాతథ స్థితి నుండి ఎంతయినా లాభాన్నే రాబడతారు. శక్తివంతమైన ప్రజలంటే పలుకుబడిగల పెద్ద మనుషులు. ప్లాస్టిక్‍ను నియంత్రించడం అంటే ఉత్పత్తిని ఆపడమే తప్ప మరొకటి కాదు. ప్లాస్టిక్‍ విముక్త సముద్రాలను చూడదలిస్తే ప్లాస్టిక్‍ ఉత్పత్తులను లేకుండా చూడటం.


ఇది జరగాలంటే ప్రభుత్వం పరిశ్రమలతో తలపడాలి. ఎదుర్కోవాలి. ఎక్కడ ప్లాస్టిక్‍ ఉత్పత్తి ఉన్నదో ఉత్పత్తిదారుల మీద బాధ్యతను మోపాలి. అంతే తప్ప వాలంటీరు బృందాలు, ప్రభుత్వ మద్ధతుతో నడిచే సంస్థలు, ఎన్‍.జి.ఓల ద్వారా నియంత్రణ సాధ్యాసాధ్యాలు ఆలోచించాల్సిన విషయమే.
ప్లాస్టిక్‍ ఉత్పత్తులు, ప్యాకేజీ పదార్థాలు నిరంతరంగా పెరిగే చోట ఇది సాధ్యమయ్యే పనేనా అనిపిస్తుంది. సైన్సు టెక్నాలజీలు అనేవి ఈ కాలుష్యాల నుండి మనలను రక్షిస్తాయా?
అందుకోసం మనం చేయవలసిందేమిటి? సమాజంలో మౌలిక మార్పులను ఎట్లా తీసుకురాగలం? ఎటువంటి సామాజిక, ఆర్థిక మార్పులు అవసరమవుతాయి.
మహా కార్పోరేటు సంస్థలు, వాటి లాభాలు కాలుష్యంపైనే ఆధారపడి సాగుతున్నప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు ఏ తరహా ఉద్యమాలను నిర్మించుకోవాలి? ఎట్లాంటి అవగాహనా చైతన్యాలను పెంచుకోవాలి.
బారీ కామనర్‍ మాత్రం ఒక తీవ్రమైన ప్రకటన చేశాడు. ‘‘వర్తమాన ఉత్పత్తి విధాన వ్యవస్థ స్వీయ విధ్వంసాత్మకం. ప్రస్తుత మానవ నాగరికతా ప్రస్థానం ఆత్మహత్యా సదృశ్యం’’ అన్నాడు. ఈ ప్లాస్టిక్‍ ప్లేగు బారిన పడకుండా మానవాళి. మనుగడ సాగించేందుకు ప్రతి ఒక్కరం ఆలోచించాలి. ఆచరణవైపు అడుగులు వెయ్యాలి.

డా।। ఆర్‍. సీతారామారావు
ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *