అడవిని కాచే ఆడపులి!


ఒక చెట్టును నరికెయ్యడానికి ఎంతో సమయం అక్కర్లేదు. కానీ ఒక చిన్న మొక్క పెరిగి వృక్షంగా మారడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అందుకే ఒక్క చెట్టు కూడా అక్రమ నరకివేతకు గురికాకుండా కాపాడాలన్నది మా లక్ష్యం’’ అంటున్నారు జార్ఖండ్‍కు చెందిన గిరిజన మహిళ కందోనీ సోరెన్‍. ‘జంగిల్‍ కీ షేర్నీ’ అంటూ స్థానికులు పిలుచుకొనే ఆమె సారథ్యంలో 45 మంది మహిళలు సంఘటితమై… తమ చుట్టూ ఉన్న అడవిని రక్షిస్తున్నారు.


కందోనీ స్వగ్రామం జార్ఖండ్‍ రాష్ట్రం జంషెడ్‍పూర్‍ జిల్లాలోని సడక్‍ఘుటు. చుట్టూ కొండలతో ఆహ్లాదంగా… అడవిని ఆనుకొని ఉండే ఆ ఊరంటే ఆమెకు ఎంతో ఇష్టం. కానీ క్రమంగా ఆ ఊరు కళతప్పుతూ వచ్చింది. దీనికి కారణం చెట్లను అక్రమంగా నరికి తరలించుకుపోయే మాఫియా. అంతేకాదు వన్య ప్రాణుల్ని చర్మాల కోసం, సరదా కోసం చంపే వాళ్ళు కూడా ఉన్నారు. ‘‘మా ఊరుకు దగ్గర్లోని అడవి చాలా దట్టంగా ఉండేది. ఆ తరువాత కొందరి స్వార్థం వల్ల, అనాలోచిత చర్యల వల్లా అడవికీ, పర్యావరణానికీ తీవ్రమైన నష్టం కలిగింది. గిరిజనులకు అడవే ఇల్లు. దాన్ని నాశనం చెయ్యడంతో పాటు… వారి దారికి అడ్డంగా ఉన్న ఇళ్ళను కూడా అక్రమార్కులు కూల్చేశారు.


అడవిని కాచే ఆడపులి!
ఇది ఇలాగే కొనసాగితే అడవీ, అందులోని జంతువులూ మిగలవు. అందుకే వాటిని కాపాడాలనుకున్నాను’’ అని చెబుతున్నారు కందోనీ. ఈ సమస్య గురించి గ్రామ పెద్దలతో ఆమె చర్చించారు. అడవిని రక్షించుకోవాల్సిన అవశ్యకతను వివరించారు. కానీ పెద్దగా స్పందన లభించలేదు. దీంతో స్వయంగా ఏదైనా చెయ్యాలన్న ఆలోచనతో ‘హరియాలీ సక్కమ్‍’ (పచ్చని ఆకు) పేరిట వన రక్షణ సమితిని ఆమె ప్రారంభించారు. దాదాపు 45 మంది మహిళలు దీనిలో సభ్యులు. వాళ్ళు నాలుగు బృందాలుగా ఏర్పడి… గ్రామం చుట్టూ వంద హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న అడవి రక్షణ బాధ్యతలను విడతలవారీగా నిర్వహిస్తున్నారు.


చంపుతామని బెదిరించారు…కందోనీ ప్రతిరోజూ అడవి అంతా తిరుగుతారు. చెట్లను నరుకుతున్న వాళ్ళతో అనేకసార్లు ఆమె ఘర్షణలు పడ్డారు. చంపుతామనే బెదిరింపులు కూడా మాఫియా నుంచి వచ్చాయి. కానీ ఆమె వాటిని లెక్క చెయ్యలేదు. క్రమంగా గ్రామస్తులు ఆమె ప్రయత్నాలను గుర్తించారు. వర్షపాతానికీ, పర్యావరణ సమతుల్యానికీ చెట్లు ఎంత ముఖ్యమో వారికి ఆమె వివరించారు. దీంతో గ్రామస్తులు కూడా భాగస్వాములు కావడం ప్రారంభించారు. ‘‘అడవిలో ప్రతి మూలా ఆమెకు తెలుసు. చెట్టు ఎక్కడైనా నరుకుతున్నట్టు తెలిస్తే… వెంటనే అక్కడ వాలిపోతుంది. దట్టమైన ఈ అడవిలో ఆమె ఎంతో వేగంగా పరుగెడుతుంది. చెట్లూ, కొండలూ అవలీలగా ఎక్కుతుంది. అందుకే ఆమెను ‘జంగిల్‍ కీ షేర్నీ’ (అడవిలో ఆడపులి) అని పిలుచుకుంటాం అంటారు ఆ గ్రామస్తులు. ఉత్త చేతుల్తో అడవిని కాపాడడం సాధ్యం కాదని కందోనీకి తెలుసు. అందుకే సంప్రదాయ ఆయుధాలైన విల్లు-బాణాలు, కత్తుల లాంటివి సమితి సభ్యుల దగ్గర ఉంటాయి. అత్యవసర సమయాల్లో వాటిని ఉపయోగించడానికి అధికారుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. ‘‘ప్రభుత్వం మీద భారం పడేసి కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. అంతా అయిపోయాక… ఏం జరిగిందో తెలుసుకోడానికి దర్యాప్తులు చేస్తే ఉపయోగం ఏముంటుంది? అదీ కాకుండా మాఫియాతో కొందరు సిబ్బంది లాలూచీ పడడం మామూలైపోయింది. అందుకే… మేమే అడవి రక్షణ బాధ్యత తీసుకున్నాం. స్థానికుల సహకారం లేకుండా ఇది జరగడం అసాధ్యం’’ అంటున్నారు కందోనీ. ఆమె చొరవ అధికారుల మన్ననలు కూడా అందుకుంటోంది. గతంలో అక్కడ ఎన్నో అక్రమ కార్యకలాపాలు, ఘర్షణలు జరిగేవి. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. ఏదైనా సంఘటన జరిగితే ధైర్యంగా ఎదుర్కొని, పోలీసులకు సమాచారం అందించే చైతన్యం గిరిజనుల్లో నెలకొంది.


శ్రమ ఫలితాన్నిస్తోంది… నాలుగేళ్ళ క్రితం జంషెడ్‍పూర్‍ పోలీస్‍ విభాగంలో హోమ్‍గార్డుగా కందోనీకి ఉద్యోగం వచ్చింది. ఆ పని చేస్తూనే… మిగిలిన సమయాన్ని అడవిలో గస్తీ కోసం కేటాయించారు. ఈ మధ్యే ముసబానీలోని యురేనియం కార్పొరేషన్‍ లిమిటెడ్‍లో గార్డుగా ఆమెను నియమించారు. అయినప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికల్లా అడవికి చేరుకుంటారు. మా శ్రమ ఫలిస్తోంది. ఇప్పుడు దురాలోచనల్తో అడవిలోకి ఎవరూ అడుగుపెట్టే పరిస్థితి లేదు. అడవిలో సాగును, ఔషధ మొక్కల పెంపకాన్నీ ప్రోత్సహిస్తున్నాం’’ అని చెబుతున్నారామె.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *