ప్రకృతే నియంత్రిస్తుంది! 14 ప్రకృతే శాసిస్తుంది!! అనునిత్యం అవిటిదైపోతున్న అవని!


(గత సంచిక తరువాయి)
విష్ణు పురాణాల్లో మూడవ అవతారంగా చెప్పబడే వరాహావతారం గాథ తెలిసిందే! హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి పాతాళంలోకి విసరాలని చూడగా, పాతాళంలో వరాహా వతారంలో వున్న విష్ణువు తన మోరచే ఆపి తిరిగి భూమిని పైన నిలిపారని చెపుతారు. శాస్త్రీయ దృక్పథం ముందుకు వస్తున్నకాలంలో, భూమి గుండ్రంగా వుందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ప్రపంచ వ్యాపితంగా భూమి బల్లపరుపుగా వుందనే కల్పిత గాథల్ని ఈ విధంగా ముందుకు తెచ్చాయి.
అయితే నేటి 21వ శతాబ్దంలో నాటి హిరణ్యాక్షుడు లేకున్నా యావత్‍ భూగోళాన్ని కబళించి స్వంతం చేసుకునేవారి సంఖ్య విశ్వవ్యాపితమైంది. వీరి విషకౌగిలిలో చిక్కుకున్న నేలతల్లి ఊపిరి సలుపలేక సతమత మవుతున్నది. తన సహజ కవచ కుండలాలైన విభిన్న భూభాగాలు, జలభాగాలు సహజత్వాన్ని కోల్పో తున్నాయి. ఈ స్థితి ఇలాగే కొనసాగితే నివాసయోగ్య ధరిత్రి అతిత్వరలోనే నిర్వీర్యంగా మారుతుంది.


సమన్యాయమే భూతల్లి విధానం! (Balancing Act of Earth)
సమస్త జీవకోటికి, సూక్ష్మ జీవులకు, మొక్కలకు, జంతువులకు, పక్షులకు, జలచరాలకు ప్రాణవాయువును, నీటిని, మొక్కలకు కార్బన్‍ డయాక్సైడ్‍ను, తగినంతగా వేడిమిని అందించి వాటి మనుగడకు భూమి కన్నతల్లి పాత్రనే పోషిస్తుంది. నిజానికి భూమాతకు అన్ని జీవులు సమానమే! అపకారులు, ఉపకారులు, క్రూర జంతువులు, విషజంతువులు, కీటకాలు అంటూ వ్యత్యాసం వుండదు. ఇవి మానవుడు ఏర్పర్చుకున్న కృత్రిమ భావాలు మాత్రమే! తన సౌఖ్యాన్నే పరమావధిగా భావించి సృష్టించుకున్న మాయమాటలివి. భూమి మానవుడికి ప్రత్యేక స్థానమంటూ ఏమీ ఇవ్వలేదు. అన్ని జీవులకు ప్రాణం పోసినట్లే మానవుడికి ఊపిరి పోసింది. ఈ జీవకోటి మనుగడకు, బతికిబట్టకట్టడానికి భూవ్యవస్థ ఓ నిర్థిష్ట ప్రామాణికతను ఏర్పర్చుకున్నది. అవి ఈ కింది విధంగా వున్నాయి.

1. సముద్రాల్లోని ఏకకణఫైటో ప్లాంక్‍టన్‍ (Phyto plankton) జీవులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా జీవరాసికి కావల్సిన 50 శాతం ఆక్సిజన్‍ను ఉత్పత్తి చేస్తాయి. మొక్కలు మాత్రమే జీవకోటికి కావల్సినంత ఆక్సిజన్‍ను అందించలేవు. చాలామంది భావించినట్లు మొక్కలు ఆక్సిజన్‍ను సృష్టించవు. గాలిలో మిశ్రమ రూపంలో ( N2 + O2 + జడవాయువులు + CO2) వున్న ఆక్సిజన్‍ను కిరణజన్య సంయోగ క్రియద్వారా గ్రహించి, కార్బన్‍ డయాక్సైడ్‍ను స్వీకరించి, ఆక్సిజన్‍ను బయటకు వదులును. తిరిగి శ్వాసక్రియ సందర్భంగా మొక్కలు కూడా జంతువర్గంలా ఆక్సిజన్‍ను గ్రహించి, కార్బన్‍ డయాక్సైడ్‍ను వదులును. ఈ పక్రియ రాత్రుల్లో అధికంగా వున్నందున, రాత్రుల్లో చెట్లకింద నిద్రించరాదనేది ఓ సూక్తి!

2. చిత్తడి నేలలు మొక్కల్లో కార్బన్‍ను నిలువచేసే (carbon sink) గోదామ్లుల్లా, ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అంటే ఈ నేలలు కార్బన్‍ స్థాపకాలన్న మాట! అలాగే పొడుగాటి వేరు వ్యవస్థగల గడ్డిజాతిని కలిగి భూమి కోతను (soil erosion) అరికడుతాయి. ఈ గడ్డి ఎన్నో రకాల భూచరాలకు, పక్షులకు,
ఉభయచరాలకు, సరీసృపాలకు, నేలను గుల్లభారించే వానపాముల్లాంటి అన్నెలిడా (annelida) లకు నిలయంగా ఉండి, చక్కని ఆహారపు గొలుసును ఏర్పరుస్తాయి. మానవులు వీటి ఆధారంగా అనేక రకాల వృత్తుల్ని కొనసాగిస్తూ జీవనం సాగిస్తారు. వాతావరణ సమతుల్యతను కాపాడంలో చిత్తడి నేలలు విశేషకృషి చేస్తాయి.

3. ధృవప్రాంతాలు 90 శాతం స్వచ్ఛమైన నీటిని మంచు రూపంలో నిలువచేస్తాయి. నిజానికి ఇవి భూగోళపు శీతలీకరణ కేంద్రాలని ఇంతకు ముందు కథనాల్లో చూసాం. అలాగే ప్రత్యేకమైన జంతువులకు (ధృవకుక్కలు, ఎలుగుబంట్లు, పెంగ్విన్‍లు మొ।।) ఇవి నిలయాలు. అన్నింటికి మించి ఇంకా కలుషితానికి గురికాక, భూ చరిత్రను తెలిపే పురాతన భాండాగారాలు (archives).

4. ఎడారులు, పొడినేలలు (dry lands) కూడా భూమండలాన్ని నియంత్రిస్తాయి. వీటి ఆవాసంగా వుండే బాక్టీరియాలు వాతావరణంలోని కార్బన్‍ను భూపొరల్లో నిక్షేపిస్తాయి. ఇది కిరణజన్యసంయోగక్రియకు దోహదం చేసి, యావత్‍ జీవకోటికి ఆహారాన్ని అందిస్తాయి.

5. ఉష్ణమండల ప్రాంత వర్షపు అడవులు (Tropical rain forests) వాతావరణంలో వెలువడే 50 శాతం కార్బన్‍ను గ్రహించే అతిపెద్ద భూగోళపు శుద్ధి కర్మాగారా కేంద్రాలు. అన్నీంటికి మించి జలచక్రాన్ని తీర్చిదిద్దే మహారణ్యాలు. ఇవే వాతావరణ మార్పులకు దోహదం చేసి, రుతువులకు కారణభూతమైతాయి. మేఘాల్ని సృష్టించడంలో, వర్షాల్ని కురిపించడంలో వీటి కృషి అద్వితీయం.
జీవకోటి గ్రహించే మొత్తం ఆక్సిజన్‍లో 28 శాతం ఆక్సిజన్‍ను కార్బన్‍డయాక్సైడ్‍ నుంచి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఈ ప్రాంతపు చెట్లు విడదీసి అందిస్తాయి.

6. జలావరణ వ్యవస్థల గూర్చి తెలిసిందే! మహానదులు, సరస్సులు, సముద్రాలు ఉష్ణోగ్రతను నియంత్రించి భూ, సముద్ర జీవుల మనుగడకు కారణమైతున్నది. కార్బన్‍ను గ్రహించి, గాలిని శుభ్రంచేసే అతిపెద్ద యంత్రాంగాలు ఈ సముద్రాలే! భూమిపై నియమిత పద్దతుల్లో, అవసరానికి అనుగుణంగా వర్షాల్ని కురిపించుటలో సముద్రాల పాత్ర వెలకట్టలేనిది.
అతిపెద్ద జీవావరణ వ్యవస్థకు ఇవి ఆవాసప్రాంతాలు కూడా!
ఇంత పటిష్టంగా, నిర్ధిష్టంగా నిర్మాణమైన భూ, జల, వాయు జీవావరణ వ్యవస్థలను మానవుడు ధ్వంసం చేసుకుంటూ పోతున్నాడు. ఆశ్రయమిచ్చిన ఆవాసాన్నే తగలబెట్టుకుంటున్నాడు.
ఈ సందర్భంగా కొన్ని వాస్తవల్ని కూడా చూడాలి! అయినా మనకు జ్ఞానోదయం కాకపోవచ్చు! ఈ మధ్యన తరచుగా జరుగుచున్న కొన్ని ప్రకృతి విపత్తుల్ని చూద్దాం!


నిత్యకృత్యమైన తుఫానులు:
తేమతో కూడుకున్న తీవ్రమైన గాలులు సుడులు తిరిగి తీవ్ర భీభత్సాన్ని కలుగజేస్తాయి. వీటి తీవ్రతను బట్టి, ప్రాంతాలను బట్టి వీటికి పేర్లు పెడుతారు. ప్రతీ సముద్రానికి ఓ పరివాహక ప్రాంతం వుంటుంది. అనేక దేశాలు, ప్రాంతాలు ఈ పరివాహక ప్రాంతంలో వుండడంతో, ఈ దేశాలు సూచించే పేర్లను వరుసక్రమంలో ఈ సముద్రాల్లో ఏర్పడే తుఫానులకు ఆ పేర్లు పెడుతూ వుంటారు. భూమధ్యరేఖ మధ్య అక్షాంశాల ప్రాంతాల్లో ఈ తుఫానులు అత్యధికంగా సంభవిస్తూ ఉంటాయి. వీటి తీవ్రతను బట్టి వీటిని తుఫానులుగా (cyclone), చండమారుతము, చక్రవాతముగా (hurricane), తీవ్ర తుఫానుగా (tornado), సునామీగా (sunami), అల్పపీడనం (depressionగా పిలుస్తారు. వీటి వేగాన్ని బట్టి వీటి తీవ్రతను గుర్తిస్తారు.


సాధారణ తుఫానులు – గం.కు – 63- 88 కి.మీ. వేగం
తీవ్రమైన తుఫానులు – గం.కు – 87-164 కి.మీ. వేగం
అతి తీవ్రమైన తుఫానులు – గం.కు-118-185 కి.మీ. వేగం
తీవ్రాతి తీవ్రమైన తుఫానులు – గం.కు-185 కి.మీ.కు పైన వేగం.


వాతావరణంలో చలి, పొడి, వేడి గాలులతో, తేమలో అసమతుల్యత ఏర్పడినప్పుడు ఇవి రూపొందుతాయి. ఎండ తీవ్రతను బట్టి వందల సంఖ్యలో ఇవి రోజు ఏర్పడినా తీరాన్ని చేరేవి చాలా తక్కువ. ఒకవేళ దాటినా వేగం తక్కువగా వుంటే తేలికపాటు వర్షాలు పడవచ్చు. కాబట్టి నష్టం వుండదు. తీవ్రత ఎక్కువైతేనే అపార నష్టాన్ని కలిగిస్తాయి.
అమెరికాలోని దాదాపు 48 రాష్ట్రాలు ఈ అక్షాంశాలలో వుండడంతో నిరంతరం సుడిగాలులకు (tornado) గురవుతూ వుంటాయి. కారణం మెక్సికో గల్ఫ్ (gulf) ప్రాంత వేడినీరు, అమెరికా తూర్పు ప్రాంత రాకీ (Rocky) పర్వతాల నుండి వీచే పొడిగాలి,
ఉత్తర అమెరికా ఉత్తర ప్రాంతపు సగభాగం నుంచి వీచే చల్లనిగాలితో మిలితమైన చోట ఈ టొర్నడోలు ఏర్పడును. పశ్చిమ అప్పలాచియన్‍ (Appalachian) పర్వత ప్రాంతాల్లో ఇవి తరుచుగా సంభవించును. ఇలాంటి భిన్న గాలుల కలయిక మిగతా భూగోళంపై లేనందున, ఈ తీవ్ర టొర్నడోలు ఉత్తర అమెరికాకే పరిమితంగా వుంటున్నాయి. అమెరికాలో సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం 1200 టొర్నడోలు సంభవిస్తున్నట్లు ఆదేశ నేషనల్‍ ఓసియానిక్‍ ఎట్మాస్‍పియర్‍ అడ్మినిస్ట్రేషన్‍ (NOAA) గణాంకాలు చెపుతున్నాయి.


టొర్నడోలు ఎప్పుడు, ఎక్కడ, ఏ రోజు సంభవిస్తాయో గుర్తించడం చాలా కష్టం. ఇప్పటికి వీటిని పసిగట్టే యాంత్రిక శక్తి అందుబాటులోకి రాలేదు. కాని అత్యధికంగా సాయంత్రం 4 నుంచి 9 గం।। మధ్యన సంభవిస్తున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఎక్కువగా అమెరికా దక్షిణప్రాంతంలో మార్చి, మే మధ్య కాలంలో సంభవించడం గమనార్హం. ప్రపంచమంతా ఇలాంటి సుడిగాలులల వేసవిలో సంభవించడం చూస్తూనే వుంటాం. కాని, వీటి తీవ్రత తక్కువగా వుంటుంది. అయితే న్యూజిలాండ్‍ ఉత్తరభాగం లోని అక్‍లాండ్‍ ప్రాంతంలో సంవత్సరానికి 20 ఏర్పడుతున్నట్లు వాతావరణశాఖ తెలుపుతున్నది. (మన రాజకీయ నాయకులు అకస్మాత్తుగా చేసే పర్యటనల్ని సుడిగాలి పర్యటన అని పత్రికలు రాయడం తెలిసిందే!)


గత సంవత్సరం అమెరికాలో (డిసెంబర్‍ 10,11 తేదీలలో కెంటుకి (Kentucky) ఇలియానిస్‍ (llionis), అర్కాన్‍సస్‍ (Arkansus), మిస్సౌరి (Missouri), ఓహి మరియు మిస్సిస్సిప్పి (Missisipi) రాష్ట్రాలలో సంభవించిన టొర్నడో అతి పెద్దదని, ఇది గంటకు 310 కి.మీ. వేగంతో వీచి, వేలాది ఆవాసాలను, ఇండ్లను ధ్వంసం చేసిందని వాతావరణ శాఖ తెలిపింది. కార్లే కాకుండా, పెద్ద వాహనాలు సైతం ఆటబొమ్మలా ఎగిరిపోవడం టివిలో మనందరం చూసాం!.
(తరువాయి వచ్చే సంచికలో)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *