అపురూప చరిత్రకు అరుదైన సాహిత్యాధారం ‘‘భద్రగిరిశతకం’’


కొన్ని చారిత్రక సంఘటనలకు సరైన ఆధారాలు లభించక పోతే అది మరుగున పడతాయి లేదా పుక్కిటిపురాణాలుగా తేలికైపోతాయి. భదాద్రి ఆలయంపై థంసా దాడిజరగటం మూల విగ్రహాలను గోదారి దాటించి ఐదేళ్ళపాటు పోలవరంలో దాయడం, థంసా మరణం తర్వాత మళ్ళీ తిరిగి మూలవిరాట్టును స్వస్థానానికి చేర్చడం, కళ్ళాణం జరిపించడం భదాద్రి ఆలయ చరిత్రలో ఒక ప్రత్యేక ఉద్విగ్న ఘట్టం. కానీ పరిస్థితులకు ఎదురీది దీన్ని నమోదు చేయడం సాహసం. దాడికి భయపడి విగ్రహాలను దాచిన సమయం నుంచి ‘రాముల దేవారు’ తిరిగి మళ్ళీ భద్రచలానికి ‘వేంచేపు’ చేసేంత వరకూ జరిగిన సంఘనలను శతకరూపంలో నమోదు చేసే సాహసాన్ని పేరయ్య కవి చేసాడు. దానిలో అనేక చారిత్రక వ్యక్తులు, ప్రదేశాలను వాడుక పదాలు, ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలనూ నమోదయ్యాయి.
తాళపత్రాలలో రాసిన పాత శతకాన్ని ఆధారంగా చేసుకుని పిఠాపురం మహారాజా వారి సారద్యంలో శతావధానులు, చరిత్ర పరిశోధకులైన శేషాద్రి రమణ కవులు 1928లో దీనిని పరిష్కరించారు. వీటిని చెన్నపురి వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్‍ సన్స్ అచ్చువేసారు. అయినప్పటికీ పూర్తి శతకం అందలేదు. అనేక పద్యపాదాలు అసంపూర్ణంగానే వున్నాయి. తెలుగు మహాసభల సందర్భంగా సంగిశెట్టి శ్రీనివాస్‍ సంపాదకత్వంలో మరోసారి ఈ శతకం తెలుగువారి ముందుకొచ్చింది.
‘‘భద్రగిరివాస శ్రీరామభద్ర దాస పోష బిరుదాంక రఘుకులాంబుధి శశాంక’’ మకుటంతో 108 పద్యాల ఈ శతకం సాగుతుంది. ప్రధానంగా చారిత్రక అంశాల చుట్టూ తిరుగుతూ కొన్ని పౌరాణిక అంశాలను ప్రస్తావిస్తుంది.


ఎవరీ భల్లా పేరయ్య కవి :
నిజానికి ఈ కవి పేర మరే ఇతర రచనలూ అందుబాటులోకి రాలేదు. ఈ శతక వివరాల ప్రకారం ఆయనది కౌండిన్య గోత్రం, తండ్రి పెద్దన, తాత లింగన, భల్లా వంశము పేరయ నామధేయమన్నాడు. ఒక పద్యంలో రాముడు పోలవరం రావడాన్ని ‘ఈ దరికికి వచ్చి’’ అనడం వల్ల ఆయన గోదావరి నదికి భద్రాచలం అవతలివైపు ఒడ్డు బహుశా పోలవరం అనే విషయం సూచన ప్రాయంగా తెలుస్తుంది.
/ రమణ కౌండిన్య గోత్ర పవిత్రుడను లింగసకు బౌత్రుడను బెద్దనకును బుత్ర
వరుడ బేరయ నామ ధరుడ భల్లావంశవనధి సోముడ బుధవగ్గ మలర


ధంసా అంటే ఏమిటి? ఇబ్రహిం ఖాన్‍ అనే అతనికి ఫాజిలు బేగు అనే పేరు కూడా వుండేదని అతనికి చాలా శక్తివంతమైన పదవి వుండేదని జాల్దుంగు అనే పేరు కూడా తెచ్చుకున్నాడని అతనికి ధంసా అనే బిరుదు వుండేదని పద్యంలో తెలియజేసారు.


/రమణ తోడుగ నిభరహిము ఖానుని సరి యేల పుట్టించెనో యిలను బ్రహ్మ
పుట్టించె గాక యీపుడమి లోపల నేల ఫాజీలుబేగని పలుకు జేసె
పల్కు జేసిన వాడు పదవి చాల యొసంగి ధరను జాల్ధుంగను పేరయేల
తెచ్చె దెచ్చినవాడు దృఢచిత్తుగా జేసి ధంసాయను కితాబు ధరణి నొసగె/


ఔరంగాజేబు గోలుకొండ రాజ్యాన్ని గెలిచిన తర్వాత తన ప్రతినిధిగా ‘‘గాజియుద్దీన్‍’’ ను నియమించాడు. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత 1724లో ‘‘నిజామ్‍ ఉల్‍ ముల్క్’’ ను దక్కను సుబేదారుగా నియమించాడు అసఫ్‍ జా. 1) ఆర్కాటు 2) కడప 3) కర్నూలు 4) రాజమహేంద్రవరము 5) శ్రీకాకుళము అను ఐదు రాష్ట్రాలుగా పరిపాలనా సౌలభ్యం కోసం విభజించుకుని వాటికి అయిదుగురు నవాబులను అధికారులుగా నియమించాడు. ప్రెంచివారు, ఇంగ్లీషువారు తమ వర్తకాలను పెంచుకోవడంతో ఆగక తమ పరిపాలనా కేంద్రాలుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్న కాలం అది. మరాటీ దండులు, తురుష్క దోపిడీ ముఠాలూ అడ్డగోలుగా దోచుకుంటున్న రోజులవి. ఆయా సర్కారుల్లో పరిపాలనా విధానం చూస్తే, ఫౌజుదార్లు లేదా ఖిల్లాదార్లు దేశముఖ్‍, దేశపాంఢ్యాలకు సహాయంగా శిస్తులు వసూలు చేసే భాద్యులుగా పనిచేసేవారు. కొన్నిసార్లు తమ బలం పెంచుకుని స్వతంత్ర పాలకులుగా తమను ప్రకటించుకునే వారు. క్రీ.శ 1748లో నిజాం ఉల్‍ ముల్క్ చనిపోయిన తర్వత ఆయన రెండవ కొడుకు నాసరు జంగు రాజ్యపాలనలోకి వచ్చాడు కానీ ప్రెంచివారు ఆయన మనవడు ముజఫరు జంగును బలపరిచి వాడి సహాయంతో క్రీ.శ 1750 లో నాసరుజంగును చంపించారు. 1751 లో ముజఫరు జంగు ఒకదాడిలో హతుడయ్యాడు. దానితో నిజాం మరో కొడుకు సలాబతు జంగు పరిపాలనలోకి వచ్చాడు. అతని ఇద్దరు తమ్ముళ్ళు నిజామలీ, బసాలతుజంగు అనే వాళ్లు ఒకరు ఔరంగాబాదులోనూ, మరొకరు గుంటూరులోనూ తమ ఆధికారాలను నడిపించుకుంటూ వచ్చారు. నిజామలీ ఇంగ్లీషువాళ్ళకు, బసాలతుజంగు ప్రెంచివాళ్లకు అనుకూలంగా వుంటూ తమకు అదనపు బలాన్ని సమకూర్చుకుంటూ వారి వాణిజ్య అవసరాలకు ఉపయోగపడేవారు. క్రీ.శ 1759లో ఇంగ్లీషువాళ్లచేత ప్రెంచివాళ్లు తరమబడ్డారు. దాంతో నిజామలీఖాన్‍ బలం పెరిగి అతని అధికారం స్థిరంగా మారింది. ఈ సమయంలో భద్రాచల ప్రాంతము అశ్వారావు బహద్దరు ఆధీనంలో వుంది. దేవాలయ నిర్వహణ వారి ఆధీనంలోనే వుండేది.


/ ఈపాటి దొరనౌట యెఱుగక మిము నమ్మి యశ్వరాయడు భూపలాయనంబు
నొందె / / తగు గుమస్తా యనదగు నశ్వరాయని కరుణ నిండారగా గాంచలేక తొలగి పోతిరి /


వరంగల్‍ కు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని వేల్పుకొండ ప్రాంతం నిజాం ఆధీనంలో వున్నప్పుడు రాజ్యంలో వసూలైన పన్నులను జాగీర్దార్లు సక్రమంగా పంపని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని సరిచేసేందుకు నిజాం తమ దగ్గరి బంధువు సైనిక అధికారి అయిన జాఫర్‍ ఉద్‍ దౌలాను వేల్పుగొండకు వెళ్లి విషయాన్ని చక్కబెట్టుకు రమ్మన్నాడు. ఎదిరించిన జాగీర్ధార్ల మెడలు వంచేందుకు అనేక మందీమార్బలాన్ని పెంచుకున్నాడు. ఆ బలాన్ని స్థిరంచేసుకునేందుకు తన పేరుమీదుగా జాఫర్‍ గఢ్‍ కోటగట్టాడు. కేవలం పన్నులు ద్వారా వచ్చే సొమ్ములు చాలక దాడులు దోపిడీలు చేసుకుంటూ చేస్తూ. జమిందారులనూ జమీలనూ దోచుకున్నాడు. అక్కడితో ఆగక దేవాలయాలను కొల్లగొట్టడం విగ్రహాలనూ నిర్మాణాలను ధ్వంసమూ చేయించాడు. ధంసా అనే మాటకు ఉర్ధూ పారసీకాలలో ఎక్కడా బిరుదుగా అర్ధం కనిపించదు. ధ్వంసయుతుడు కావడంతో ధంసాగా జనశృతి. ఖమ్మం దగ్గరలో ధంసలాపురం, ధంసా పేరుతో చెరువులు బట్టి చూస్తే ఇది బిరుదనామమేమో అనిపిస్తుంది. ధంసా ప్రస్తావన భదాద్రి శాసనంలో కూడా కనిపిస్తుంది. పేరయ్య కవి ఇతని బలాన్ని బలగాన్నీ వర్ణించినట్లే దండయాత్ర చేసిన ప్రాంతాలలో నడిపిన దుశ్చర్యలను సైతం భల్లా పేరయ్య కళ్ళకు కట్టినట్లు వివరించారు.


/చెక్కులు నిమురక సీతోర్మిళాదుల గని యూర కుందురే మనసు నిల్పి
పాఱి పోవగనైన బట్టెలు నాకక విడుతురే వైష్ణవ వితతి నెల్ల
బిరుసు గడ్డంబుల బెఱుకక రిత్తగ నాదరింతురె వసిష్టాది మునుల
ముక్కులు గఱువక మును మొనకట్టి పోనిత్తురే కపి నాయ కోత్తములను/


సీత ఉర్మిళలు కనిపించినా సరే బుగ్గలు నిమరకుండా ఊరుకుంటారా? అనడం ద్వారా అప్పట్లో ఆడవాళ్ల స్వాభిమానానికి ఎంత భంగం కలిగించేలా వీరి దుశ్చర్యలు వుండేవో అర్దం అవుతుంది. అదేవిధంగా
/హనుమంతు ముట్టి స్వహంగవేణిలి చేత, నెమరి పెట్టెలమాయ జమరె నొకడు
గరుడాళువారిఱెక్కలు చెక్కు ముక్కులు, నొక్కి మట్టసముగా జెక్కెనొకడు
ఎంబెరు మానారు నింటిలోన నమాజు చదివియు దసిబిసి సలిపెనొకడు
వరుసబన్నిద్ద ఱాళ్వారి నొక్కుమ్మడి డేడిక్కులాడించి వీడెనొకడు/
అంటూ మతపరంగా పవిత్రంగా చూసుకునే అనేక విషయాలలో వీరి దుందుడుకు దురాగతాలను కూడా కళ్ళకు కట్టాడు కవి.
సర్వధారను పేరి సంవత్సరంబున ధంసాకు వెఱచి యిద్దరికి వచ్చి
పోలవరంబులో బొలుపొంద నైదేండ్లు వనవాస మొనరించి వరుస తోడ
శాక్తేయమత యుతు సంహార మొనరించి మంత్రాంగ శక్తి యిమ్మహిని వెలయ
తగ పూసపాటి విజయ రామరాజ సీతా రామరాజులతో రయమున
విజయ సంవత్సరంబున విజయము గను భద్రగిరి కేగి తౌనయ్య భద్రము గను
శ్రీరామ చంద్రులు సీతా సమేతులై వచ్చి భదాద్రిన వాసమునకు
జయనామ వత్సర చైత్రశుద్ధాష్టమి తరువాతి దినమందు దగ వివాహ మరయ


అనే పద్యాల ఆధారంగా శ్రీరాముడు 1768-69 సంవత్సరంలో భద్రగిరి వదిలిపెట్టి పోలవరం వలస వెళ్ళాడని అక్కడ 1773-74 వరకూ వున్నాడు ఇదే ధంసా కాలం కూడా, 1775లో మళ్ళీ భదాద్రిలోనే సీతారామచంద్రుల కళ్యాణం జరిగిందని స్పష్టం అవుతోంది. అంటే ఈ శతక రచన కూడా క్రీ.శ 1770 లో ప్రారంభం అయ్యి 1775 వరకూ జరుగుతూనే వున్నదని కూడా తెలుస్తుంది. ప్రారంభంలో రాముడిని నిందిస్తున్న సాకుతో తెలుగు పౌరుషాన్ని రెచ్చగొట్టినట్లు మాట్లాడిన భల్లాపేరయ్య కవి చివరి పద్యాలలో రాముడి శౌర్యాన్ని పొగుడుతూ తన పొరపాట్లువుంటే మన్నించమనటం కనిపిస్తుంది.
ఇటువంటి అరుదైన చారిత్రక సంఘటనల సాహిత్య ఆధారాలను సంరక్షించుకోవాలి, వాటిపై సమగ్రమైన లోతైనా పరిశోధనలు జరగాలి. ఆయా అంశాల నుంచి మరింత చరిత్రను పునర్నించుకోగలగాలి.

  • కట్టా శ్రీనివాస రావు,
    ఎ : 9885133969

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *