బ్రిటిష్ వాళ్ల కాలంలో ఉన్న కోర్టులు, స్వాతంత్రం వచ్చిన తరువాత వున్న కోర్టుల కన్నా చాలా బాగా పనిచేసాయి. ఈ విషయం మన అనుభవం లోకి రాలేదు కానీ, అవి మంటో అనుభవంలో వున్నవే. మంటో వాటిని చూశాడు ఇబ్బందులు కూడా పడ్డాడు. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మంటో సమస్యలు మరింత పెరిగాయి. కొత్తగా ఆవిర్భవించిన పాకిస్థాన్లో అతను ఒక విభిన్నమైన ‘మోరల్ కోడిని’ చూశాడు. అసహనంతో ఉన్న ‘‘రాజ్యాన్ని’’ చూశాడు. కొత్త కేసులని ఎదుర్కొన్నాడు.
అతని రాతలు అసభ్యకరంగా ఉన్నాయని మంటోపై చాలాసార్లు బ్రిటిష్ ఇండియాలో కేసులు పెట్టారు. అతను విచారణని ఎదుర్కొన్నాడు. అయితే బ్రిటిష్ ఇండియా తర్వాత అతని కష్టాలు మరింత పెరిగాయి.
‘‘తండా ఘోస్ట్’’ కథ తరువాత మంటో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఐదు విచారణలను ఎదుర్కొన్నాడు. దాని మీద ఓ వ్యాసం రాసాడు. కొత్త కేసు మొదలైంది. విచారణ లాహోర్ లో జరిగింది.
మంటో మాటల్లో ..
నేను రాసిన రాతలకి నేను నాలుగుసార్లు విచారణని ఎదుర్కొన్నాను. ఐదవ విచారణ గురించి అది మొదలైన విధానం గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. నాలుగు విచారణలు ఎదుర్కోవడానికి కారణం నేను రాసిన నాలుగు కథలు వరుసగా
1. కాళీ శల్వార్ (బ్లాక్ లెగ్గిన్స్)
2. ద్రువ్ (స్మొక్)
3. భూ
4. తండా ఘోస్ట్ (కోల్డ్ మీట్)
ఈ నాలుగింటి తో పాటు నేను రాసిన ఒక వ్యాసం కూడా విచారణ ఎదుర్కోవడానికి దారితీసింది.
ఊపర్ నీచే ఔర్ దర్మియా (above, neechey and in between) కాళీ శల్వార్ మీద విచారణ కోసం నేను ఢిల్లీ నుంచి లాహోర్‍కి మూడు సార్లు వచ్చాను. దువాన్, భూ కేసులు మరీ బాధ పెట్టాయి. నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. బాంబే నుంచి లాహోర్‍కి తిరగాల్సి వచ్చింది.
‘తండా ఘోస్ట్’తో అది పరాకాష్టకు చేరుకుంది. అప్పటికే నేను పాకిస్థాన్‍లో స్థిరపడ్డాను. ఆ కేసు కోసం ప్రత్యేకంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు.
అయినా కేసు విచారణ జరిగిన పద్ధతిని నేను భరించలేక పోయాను. సున్నిత మనస్కులు ఎవరూ ఆ బాధని భరించలేరు. మరీ ముఖ్యంగా నా లాంటి వ్యక్తి.
అన్ని అవమానాలకు కేంద్రం కోర్టు. అన్ని అవమానాలని మౌనంగా భరించాల్సి ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్లకుండా
ఉండాలని నేను అల్లాని ప్రార్దిస్తాను. దాన్నే మనం కోర్ట్ ఆఫ్ లా అని అంటున్నాం. అలాంటి స్థలాన్ని నేనెప్పుడూ చూడలేదు. నేను పోలీసులని ఇష్టపడను. తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులతో ప్రవర్తించినట్టుగా నాతో పోలీసులు ప్రవర్తించారు.
కరాచీలో ఉన్న ఓ మ్యాగజైన్. దాని పేరు పాయల్ ఈ మాస్రిక్. (message of the east) నా వ్యాసాన్ని నా పర్మిషన్ లేకుండా అందులో ప్రచురించారు. లాహోర్ లోని ఓ పత్రికలో నుంచి ఆ వ్యాసాన్ని వారు తీసుకున్నారు. దాని మీద కరాచీ ప్రభుత్వం వారెంట్‍ను జారీ చేసింది.
నేను ఇంట్లో లేనప్పుడు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్‍లు, నలుగురు కానిస్టేబుల్స్ మా ఇంటిని చుట్టుముట్టారు ‘నా భర్త ఇంట్లో లేడు. మీకు అవసరమైతే అతని నేను పిలిపిస్తాను’ వాళ్లతో చెప్పింది నా భార్య. కానీ వాళ్లు ఆమె చెప్పిన విషయాన్ని ఏ మాత్రం నమ్మలేదు.
నేను ఇంట్లొనే ఉన్నానని వాళ్లు అనుమానించారు. అబద్ధం చెబుతోందని అనుకున్నారు.
అప్పుడు నేను చౌదరి నజీర్ అహ్మద్ సవేరా దగ్గర వున్నాను. అతను సవేరా పత్రికకి యజమాని. ఓ కథ రాయమని నన్ను కోరాడు. ఓ కథ రాయడానికి నేను సిద్ధమయ్యాను. ఓ పది వాక్యాలు రాశాను. సరిగ్గా అప్పుడే రషీద్ నాకు తమ్ముడి వరస అవుతాడు. అతను అక్కడికి వచ్చాడు. కొన్ని క్షణాలు ఆగి ‘కథ రాస్తున్నావా..?’ అని అడిగాడు.
‘‘ఇప్పుడే కథ రాయడం మొదలు పెట్టాను’’ అన్నాను నేను. అది పెద్ద కథగా మారే అవకాశం ఉంది.
‘‘ఓ చెడు వార్త చెప్పడానికి వచ్చాను. పోలీసులు మీ ఇంటి చుట్టు ముట్టారు. నువ్వు ఇంట్లో లేవు అని చెప్పినా కూడా వాళ్లు నమ్మడం లేదు. ఇంట్లోకి వెళ్ళే మాదిరిగా ఉన్నారు’’ అని చెప్పాడు.
అహమ్మద్ రాతీ, హమీద్ అక్తర్ అన్న నా మిత్రులని తీసుకొని ఇంటికి బయల్దేరాను. ఇంటికి బయలుదేరే ముందు చౌదరి రాశీద్‍తో ఒక మాట చెప్పాను. ‘‘పత్రికల వాళ్ళు అందరికి ఈ విషయం తెలియ చేయండి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మరుసటి రోజు పేపర్లో వచ్చే విధంగా చూడండి’’ అని చెప్పాను.
నేను ఇంటికి చేరుకోగానే పోలీసులు ఇంటి బయట కనిపించారు. నా బంధువులు హమీద్ జలాల్, మా బావ మరిది జహీరుద్దీన్ పోలీసు వారి కార్ల దగ్గర నిల్చుని ఉన్నారు.
‘‘మీరు ఇంటిని సోదా చేస్తే చేయండి. కానీ మంటో ఇంట్లో లేడు’’ అని వాళ్లు చాలా మర్యాదపూర్వకంగా పోలీసులకి చెబుతున్నారు.
అబ్దుల్ మాలిక్ కూడా అక్కడ ఉన్నాడు. ఎవరో పోలీసులతో మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఓ ఫేక్ కమ్యూనిస్ట్.
సబ్ ఇన్స్పెక్టర్ మా ఆవిడని, మా చెల్లెలిని కూడా బెదిరించినట్టు నాకు తెలిసింది. వాళ్లు బలవంతంగా ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నం కూడా చేశారని కూడా తెలిసింది. నన్ను చూసి వాళ్లు కొంత శాంతించినట్లు అనిపించింది. వాళ్లని ఇంట్లోకి ఆహ్వానించాను.
ఇద్దరు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్లు చాలా కఠినంగా ఉన్నారు.
‘‘ఎందుకు వచ్చారు’’ అని వాళ్లను అడిగాను.
తమ దగ్గర వారెంట్ ఉందని, ఇల్లు సోదా చేయడానికి వచ్చామని, ఆ వారెంట్ కరాచీ ప్రభుత్వం ఇచ్చిందని’’ చెప్పారు.
నేను ఆశ్చర్యపోయాను. నేను గూఢచారిని కాదు. స్మగ్లర్‍ని, మాదకద్రవ్యాలను అమ్మే వ్యక్తిని అంతకన్నా కాదు. నేను ఒక రచయితని. ఇప్పుడు నా ఇల్లు సోదా చేయాల్సిన అవసరం ఏముంటుంది. వాళ్లకి ఎక్కడ ఏమి దొరుకుతుంది.
‘‘నీ లైబ్రరీ ఎక్కడుంది..?’’ అని నన్ను వాళ్లు ప్రశ్నించారు.
‘‘పాకిస్తాన్‍లో నా లైబ్రరీ ఏమీ లేదు’’ అని వాళ్లకు చెప్పాను.
‘‘నేను నా వెంట కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను అందులో మూడు డిక్షనరీలే. ఎక్కువగా ఏమీ లేవు’’ అని వాళ్లకు చెప్పాను.
నా లైబ్రరీని బాంబేలో వదిలిపెట్టి వచ్చాను అని కూడా చెప్పాను.
ఏదైనా ప్రత్యేకంగా వెతుకుతున్నట్టైతే బొంబాయి అడ్రస్ ఇస్తాను. అక్కడ మీరు వెతుక్కోవచ్చు అని చెప్పాను.
నేను చెప్పే మాటలు వాళ్ళకి రుచించలేదు. నా ఇంట్లో సోదా చేయడం మొదలుపెట్టారు. నా ఇంట్లో ఆరు పుస్తకాలు, ఎనిమిది ఖాళీ బీరు సీసాలు తప్ప మరేమీ లేవు. ఓ చిన్న బాక్స్లో కాగితాలు మాత్రం ఉన్నాయి. అవి పేపర్ క్లిప్పింగ్స్. ఆ కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ పేపర్ క్లిప్పింగ్స్ని పోలీసులు జప్తు చేశారు.
ఆ దశలో వారెంటు చూపించమని పోలీసులని అడిగాను. వాళ్లు నిరాకరించారు. ఓ కానిస్టేబుల్ చాలా దూరం నుంచి వారంట్‍ని చూపించాడు.
‘‘ఏమిటి ..?’’ అని అడిగాను.
‘‘దానివల్లే ఇక్కడిదాకా వచ్చాం’’ అని వాళ్ళు చెప్పారు.
అది చూడాలని నేను ఒత్తిడి చేశాను. వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు తప్ప చూపించలేదు.
‘‘కనీసం చదవండి’’ అని అడిగాను.
దాన్ని నేను పరిశీలనగా చూశాను. అది నా అరెస్టు వారెంట్.
జామీన్ దార్‍ల కోసం నా మనసు ఆలోచించడం మొదలు పెట్టింది. అధికారులు నేను చెప్పిన జామీన్ దారులను ఆమోదించడానికి నిరాకరించారు.
మా అల్లుడు ఒకతను గెజిటెడ్ ఆఫీసర్. మా బావ మరిది కూడా.
‘‘మీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇలాంటి వ్యక్తికి మీరు జామీను ఇస్తే మీరు డిస్మిస్ అవుతారు’’ అని వాళ్ళని బెదిరించారు పోలీసులు.
ఆ తరువాత నన్ను అరెస్టు చేశారు. ఆ బెయిల్ మీద విడుదలయినాను. వాయిదా వాయిదాకి నేను కరాచీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఆరోగ్యం బాగా లేదని డాక్టర్ సర్ట్టి ఫికేట్ పెడితే హాజరు మినహాయింపు లభించేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది.
నాకు బెయిల్ ఇవ్వడం కోసం చాలా మంది మిత్రుల కోసం చూశాను. కానీ వాళ్ళు ఎవరు వాళ్ళు ఇళ్లలో కనిపించలేదు.
చివరికి మహమ్మద్ తుఫైల్ జామీను ఇచ్చాడు. అతను నక్యూష్ అనే పత్రిక యజమానీ సంపాదకుడు కూడా. తన తన దగ్గర ఉన్న అన్ని పుస్తకాలని ఐదు వేల రూపాయల విలువ గల వాటిని జామీను గా ఇచ్చాడు.
కోర్టు సంతృప్తి చెందలేదు.
తుఫెయిల్ సాహెబ్ మా ఇంటికి వచ్చాడు. ఆరోజు నేను కరాచీ వెళ్ళాలి ఐదు గంటలకి. రెండు సెకండ్ క్లాస్ టికెట్లు తీసుకొని వచ్చాడు. ఓ స్నేహితుడిని నా వెంట పంపించాడు. అతని పేరు నాసిర్ అన్వర్. అతను కరాచీలో జామీన్ తెస్తాడని చెప్పాడు.
రైల్వే స్టేషన్ దాకా వచ్చి అతను వెళ్ళిపోయాడు.
కరాచీలో ఏం జరిగింది ఎలా జరిగింది..
ఆ తరువాత..
-మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001