తెలంగాణాలో సాగునీటి ప్రాజెక్టులు – పర్యావరణ పునరుద్దరణ


మిషన్‍ కాకతీయ:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణా ప్రజల స్వప్నం అయిన చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని మిషన్‍ కాకతీయ పేరుతో, మన ఊరు మన చెరువు ట్యాగ్‍ లైన్‍తో బృహత్తరమైన ఫ్లాగ్‍ షిప్‍ పోగ్రాంని రూపకల్పన చేసారు ముఖ్యమంత్రి కెసిఆర్‍. ఆ పోగ్రాంని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాక ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో నడిచే ఒక ప్రజా ఉద్యమ కార్యక్రమంగా జరగాలని ఆయన బావించారు. ఈ నాలుగేండ్లలో మిషన్‍ కాకతీయ కార్యక్రమం నాలుగు దశల్లో అమలయింది. తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల పునరుద్దరణ జరిగిన తర్వాత గొప్ప మార్పు కనిపిస్తున్నది. సుస్థిర వ్యవసాయం ఇప్పుడు సాధ్యం అవుతున్నది. చెరువుల్లో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రజల వలసలు తగ్గిపోయినాయి. పశువులకు, గొర్లు, మేకలకు నీటి తావులు ఏర్పడ్డాయి. మేతకు దూర ప్రాంతాలకు తోలుకుపోయే అగత్యం తగ్గింది. పశు పక్ష్యాదులకు నీటి తావులు ఏర్పడినాయి. భూగర్భ జలాల్లో వృద్ది కనిపిస్తున్నది. చేపల పెంపకం రెట్టింపు అయ్యింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కనబడని పక్షి జాతులు చెరువుల వద్ద దర్శనమిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి వలస పక్షుల రాక గతంలో కంటే పెరిగినట్టు ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ వారు నిర్వహించిన ‘‘బర్డ్ వాచ్‍’’ కార్యక్రమాల్లో తేలింది. మిషన్‍ కాకతీయ ప్రభావాలు, ఫలితాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం.
మిషన్‍ కాకతీయ ఫలితాలు :
1) చెరువుల కింద మొత్తం ఆయకట్టు : 21 లక్షల ఎకరాలు
2) నాలుగు దశల్లో పునరుద్దరణ పొందిన చెరువులు : 27,625
3) పూర్తి అయిన చెరువుల కింద స్థిరీకరించబడిన ఆయకట్టు : 15.05 లక్షల ఎకరాలు
4) చెరువుల్లో నుంచి తరలించిన పూడిక మట్టి : 25 కోట్ల క్యూబిక్‍ మీటర్లు
5) చెరువుల్లో పెరిగిన అదనపు నీటి నిల్వ సామర్థ్యం:9 టిఎంసిలు
మిషన్‍ కాకతీయ ప్రభావాలు :
1) పెరిగిన సాగు విస్తీర్ణం : 57.50%
2) ఖరీఫ్‍ లో పెరిగిన వరి సాగు విస్తీర్ణం : 4.7%, రబీలో : 26%
3) పెరిగిన వరి పంట దిగుబడి : 4.1%
4) పెరిగిన పత్తి పంట దిగుబడి : 4.7%
5) పూడిక మట్టి చల్లుకున్నండు వలన తగ్గిన రసాయనిక ఎరువుల వాడకం : 30%
6) పూడిక మట్టిని పొలాల్లో చల్లుకున్నందు వలన పెరిగిన పంట దిగుబడి ఈ విధంగా నమోదు అయ్యింది :
వరి దిగుబడి ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్ళు
పత్తి దిగుబడి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు
కందుల దిగుబడి ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు
మక్క దిగుబడి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు
7) పెరిగిన చేపల ఉత్పత్తి : 62%
8) చెరువుల్లో సగటున 10 నెలల పాటు నీటి నిల్వలు
ఉంటున్నందున భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరిగినట్టు భూగర్భ జల శాఖ నిర్ధారించింది.
9) చెరువుల కట్టలను బలోపేతం చేసినందు వలన చెరువుల వరద నష్టాలు గణనీయంగా తగ్గిపోయినాయి. వేల సంఖ్యలో ఉండే నష్టాలు వందల్లోకి తగ్గిపోయినాయి.


ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం :
అయితే ముఖ్యమంత్రి ఆలోచన చెరువుల పునరుద్దరణతోనే ఆగిపోలేదు. మిషన్‍ కాకతీయ విజన్‍ సఫలం కావాలంటే వానలు పడినా పడకపోయినా ప్రతీ ఏడు కనీసం 10 నెలల పాటు చెరువుల్లో నీరు నిలువ ఉండాలి. రెండు పంటలకు నీరు అందాలి. భూగర్భ జలాలు పైకి రావాలి. ఇందుకు చెరువులను భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేసినప్పుడే సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి భావించారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఐదేండ్ల పాలనా కాలంలో అనేక భారీ, మధ్యతరహా, ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసుకొని 2020 వర్షా కాలానికి నీటి సరఫరాకు సిద్దం అయినాయి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణా జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినందువలన వందలాది చెరువులను నింపే అవకాశం వచ్చింది. వీటిని చెరువులతో అనుసంధానం చేయడం ద్వారా చెరువులన్నీ రెండు పంటలకు నీరివ్వగలిగే స్థితి వచ్చింది. వర్షాలు పడినా పడకపోయినా చెరువులను నింపితే గ్రామీణ ఆర్థిశ వ్యవస్థ సుస్థిరం అవుతుందన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేసారు. ప్రాజెక్టులను చెరువులతో అనుసంధానం వలన రాష్ట్రంలో వేలాది చెరువులు నిండినాయి. ఈ కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే శ్రీరాం సాగర్‍ ప్రాజెక్టు మొదటి దశ, రెండో దశ ఆయకట్టు పరిధిలో సుమారు 1200 చెరువులు నిండినాయి. అట్లనే దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‍ సాగర్‍, ఎల్లంపల్లి, తదితర భారీ మధ్యతరహా ద్వారా సుమారు 12 వేల చెరువులు నింపినట్టు ప్రాజెక్టుల ఇంజనీర్లు సమాచారం ఇచ్చినారు. చెరువుల అనుసంధానం కూడా జయప్రదం కావడంతో చెరువుల కింద రబీ పంటకు నికరంగా నీరు అందే పరిస్థితి ఏర్పడింది. చెరువులలో నీటి నిల్వ బాగా పెరిగినందు వలన రాష్ట్రంలో భూగర్భ జలాలు పైకి లేచినాయి. ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నందున 30 లక్షల బోరు బావుల కింద 50 – 55 లక్షల ఎకరాల్లో సాగు సుస్థిరం అయ్యింది.


వాగుల పునర్జీవనం కోసం వాగులపై చెక్‍ డ్యాంల నిర్మాణం:
చెరువుల అనుసంధానం తో పాటు తెలంగాణా రాష్ట్రంలోని ఆన్ని ప్రధాన వాగులు, వంకలు పునర్జీవనం పొందాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కింద 1.25 కోట్ల ఎకరాల్లో సాగునీరు సరఫరా చేసిన తర్వాత వాగుల్లోకి, నదుల్లోకి వచ్చే 20% పడవాటి (=వస్త్రవఅవతీ••వ•) నీటిని ఎక్కడికక్కడ ఒడిసి పట్టడానికి రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉండే అన్ని వాగులపై, నదులపై చెక్‍ డ్యాంలని నిర్మించాలని ముఖ్యమంత్రి తలపోశారు. ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతున్న కారణంగా దాదాపు రాష్ట్రమంతా (కొన్ని ఎత్తైన ప్రాంతాలు మినహా) ఆయకట్టు ప్రాంతంగా మారబోతున్నది. ఈ ఆయకట్టు నుండి వచ్చే పడవాటి నీరు (Regeneratedwater) తిరిగి ఈ వాగుల్లోకి చేరుతాయి. వీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసుకోగలిగితే ఆ ప్రాంతాల్లో ఆ వాగులు పునర్జీవనం చెంది భూగర్భ జలాలు రీచార్జ్ కావడంతో పాటు అనేక రకాలుగా ఈ నీరు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంలోనికి రానున్నాయి. ఈ పడవాటి నీటిని వొడిసి పట్టడానికి చెక్‍ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ, పంచాయతిరాజ్‍ శాఖ వారు వాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను చెక్‍ డ్యాంలతో సహా నిర్మించాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చినందున ఆ శాఖలు కూడా చెక్‍ డ్యాంల నిర్మాణాలు చేపట్టినాయి. వాటిని కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినారు. ముఖ్యమంత్రి సూచించిన ఈ రెండు కార్యక్రమాల అమలు కోసం సాగునీటి శాఖ విస్త•త అధ్యయనం చేసింది. సర్వే ఆఫ్‍ ఇండియా వారి మ్యాపులతో పాటు నేషనల్‍ రిమోట్‍ సెన్సింగ్‍ ఏజెన్సీ (NRSA) వారి ఉపగ్రహ చిత్రాల సహకారంతో సమాచార సేకరణ సేకరణ చేసి విశ్లేషణ జరిపినారు.
రాష్ట్రంలోని నదులను, వాగులను మొత్తం 8 స్థాయిల్లో వర్గీకరించడం జరిగింది. చెక్‍ డ్యాంల నిర్మాణానికి స్థలాలను 4 ఆ పైన స్థాయి కలిగిన నదులపై ఎంపిక చేయాలని, ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్న వాగులను ప్రథమ ప్రాధాన్యత కింద ఎంపిక చేయాలని ఇంజనీర్లకు సూచించారు. ఇప్పటికే నిర్మించబడిన చెరువులు, జలాశయాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగినంత నీటి లభ్యత ఉన్న వాగుల పైననే చెక్‍ డ్యాంలను ప్రతిపాదించాలని, చెక్‍ డ్యాంల మధ్య దూరాన్ని అక్కడి స్టానిక పరిస్థితులను బట్టి నిర్ణయించాలని, ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో షేక్‍ హాండ్‍ చెక్‍ డ్యాంలు ప్రతిపాదించాలని, ఆయకట్టులో లేని వాగులపై అక్కడి స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతిపాదించాలని సూచించారు. మంచి రాతి పునాది కలిగిన స్థలాలను ఎంపిక చేయాలని, 3 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యం అవుతున్న ప్రాంతాల్లో చెక్‍ డ్యాంలను ప్రతిపాదించరాదని, భూగర్భ జలాలను అధికంగా తోడేసిన (over exploited) గ్రామాలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని భూగర్భ జల శాఖ వారు సూచించారు. ఈ అంశాలన్నిటిని కలిపి మార్గ నిర్దేశనాలు జారీ చేయడం జరిగింది.


ఇంజనీర్లు సేకరించిన సమాచారం, నేషనల్‍ రిమోట్‍ సెన్సింగ్‍ ఏజెన్సీ (NRSA) పటాల అధ్యయనం తర్వాత రాష్ట్రం మొత్తంలో 559 మండలాల్లో సుమారు 48,845 చిన్న నీటి వనరులున్నాయని తేలింది. వీటిలో 27,814 చెరువులు, కుంటలు 12,154 గొలుసుల కింద ఉన్నట్టు తేలింది. ఈ చెరువులను నింపడానికి ప్రాజెక్టుల కాలువలకు ఎక్కడెక్కడ తూములు నిర్మించాలన్న దానిపై స్పష్టత వచ్చింది. గొలుసులకు బయట ఉన్న16,771 చెరువులు, కుంటలను నింపడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఇంజనీర్లు అధ్యయనం చేసినారు. ప్రతీ మండలానికి ఒక ఇర్రిగేషన్‍ చిత్రపటాన్ని రూపొందించి క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు అందజేయడం జరిగింది. ఈ పటాల్లో అ మండలంలో ఉన్న చెరువులు, కుంటలు, భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, వాటి ఆయకట్టు వివరాలు, కాలువల అలైన్మెంట్‍ తదితర వివరాలు ఉంటాయి. తూముల నిర్మాణానికి, ఫీడర్‍ చానళ్ళ పునరుద్దరణకు అంచనాలు రూపొందించే పని ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రతీ చెరువుకు ఫీడర్‍ చానల్‍ తప్పని సరిగా ఉంటుంది కనుక వీటికి ఎటువంటి భూసేకరణ అవసరం ఉండదు. అయితే తూముల ద్వారా వాటి సహజ ఫీడర్‍ కు నీరు చేర్చడానికి కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి భూసేకరణ అవసరం పడుతుంది. వాటి వివరాలు కూడా సేకరించమని ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది.


చెక్‍ డ్యాంల నిర్మాణం :
రాష్ట్రం మొత్తంలో ఉండే నదులను, వాగులను, వంకలను 8 స్థాయిల్లో (Orders) వర్గీకరించడం జరిగింది. 4 నుంచి 8 స్థాయి కలిగిన వాగులను పెద్ద వాగులుగా పరిగణించాలి. ఇవి రాష్ట్రంలో 683 ఉన్నట్టు, వారి పొడవు 12,183 కిలోమీటర్లు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. వీటిలో నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉంటాయి కనుక ప్రథమ ప్రాధాన్యతలో ఈ వాగులపై చెక్‍డ్యాంలను ప్రతిపాదించాలని సూచించడం జరిగింది. చెక్‍డ్యాంల నిర్మాణం రెండు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినారు. పూర్తి అయిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో ఉండే వాగులను మొదటి దశలో ఎంపిక చేసుకోవాలని, రెండవ దశలో ఒకటి రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోబోతున్న ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో ఉండే వాగులపై చెక్‍ డ్యాంలను ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి సూచించినారు.
ఈ వాగులపై ఇప్పటికే 510 చెక్‍ డ్యాంలు, 245 ఆనకట్టలు, 29 కత్వాలు, 1 మాటు ఉన్నట్టు తెలుస్తున్నది. అని స్థాయిల వాగులపై ఇప్పటికే నిర్మాణం అయి ఉన్న చెక్‍ డ్యాంల సంఖ్య 2,376 ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అయితే చిన్న స్థాయి వాగుల పైననే పెద్ద సంఖ్యలో చెక్‍ డ్యాంల నిర్మాణం జరిగినట్టు తెలుస్తున్నది. నాగార్జున సాగర్‍, శ్రీరాంసాగర్‍, నిజాంసాగర్‍, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కడం, కొమురం భీం తదితర భారీ మధ్య తరహా ప్రాజెక్టుల కమాండ్‍ ఏరియాల్లో ఉన్న పెద్ద స్థాయి వాగులపై ఇంకా సుమారు 1235 చెక్‍ డ్యాంల నిర్మాణానికి అవకాశం ఉన్నట్టు అధ్యయనంలో విశ్లేషించారు. చెక్‍ డ్యాంల స్థల ఎంపిక దగ్గర నుంచి ప్రతీ దశలోనూ భూగర్భ జల శాఖతో సమన్వయము చేసుకోవాలని క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు సూచించినారు. భూగర్భ జల శాఖ ఎంపిక చేసుకున్న చెక్‍ డ్యాంల వద్ద రీచార్జ్ గొట్టాలను అమర్చాలని కూడా సూచించారు. ఈ ప్రాథమిక అధ్యయనాల తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానానికి అవసరమయ్యే అదనపు తూముల నిర్మాణానికి (3500), ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్న వాగులపై చెక్‍ డ్యాంల (1235) నిర్మాణానికి రూ. 4296 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ తేదీ 8.3.2019న జిఓ 8ని జారీ చేసింది ప్రభుత్వం. దానితో పాటూ వీటి నిర్మాణానికి పాటించవలసిన మార్గనిర్దేశానాలని కూడా జారీ చేసింది. 2019 వర్షాకాలం నాటికి 80% అదనపు తూముల నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపే కార్యక్రమం జయప్రదంగా అమలు అవుతున్నది.


మొత్తం 1235 చెక్‍ డ్యాముల్లో మొదటి దశలో 635 చెక్‍ డ్యాంలు, మిగిలిన 600 చెక్‍ డ్యాంలు రెండో దశలో నిర్మాణానికి ఎపిక చేయాలని ముఖ్యమంత్రి సాగునీటి శాఖ అధికారులను ఆదేశించినారు. మొదటి దశ చెక్‍ డ్యాంల నిర్మాణం 2021 జూన్‍ నాటికి పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి సాగునీటి శాఖ అధికారులను ఆదేశించినారు. వీటికి తోడు రోడ్డు భవనాల శాఖ వారు తెలంగాణా రాష్ట్రంలో నిర్మిస్తున్న వంతెనల వద్ద సుమారు 200 చెక్‍ డ్యాములను నిర్మిస్తున్నారు. తెలంగాణా వ్యాప్తంగా వాగులు, వంకలు, మంజీరా, మానేరు, కడెం, స్వర్ణ, హల్ది వాగు, మున్నేరు, డిండి, ఆలేరు, ఆఖేరు లాంటి నదులు కూడా సజీవం కానున్నాయి. మొదటి దశ చెక్‍ డ్యాంలు పూర్తి అయిన ప్రాంతాల్లో పర్యావరణంలో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాగులు పునరుజ్జీవనం చెందాయి. భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా పెరిగినాయి. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు, మేకలు, గొర్లకు, వన్య ప్రాణులకు, పక్షులకు తాగునీటి సమస్య తీరింది. అడవులు తిరిగి పునరుజ్జీవనం పొందడానికి చెక్‍ డ్యాములు దోహదం చేయనున్నాయి. బహుముఖ ప్రయోజనాలున్న చెక్‍డ్యాంల నిర్మాణాలు తెలంగాణా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి.


కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది పునరుజ్జీవనం – గోదావరి జలాల సమగ్ర వినియోగం:
గోదావరి ట్రిబ్యునల్‍ అవార్డు ఆధారంగా గోదావరి జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి 75% విశ్వసనీయత కలిగిన నికర జలాల కేటాయింపులు 1480 టిఎంసిలు ఉంటాయని లెక్క గట్టి అందులో 968 టిఎంసి లను తెలంగాణా ప్రాజెక్టులకు కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రం ఈ కేటాయింపులు చేసినప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం చేత అవన్నీ కాగితాలకే పరిమితం అయినాయి.వాస్తవ వినియోగం ఏనాడూ 400 టిఎంసి లకు మించ లేదు. తెలంగాణా ప్రభుత్వం ఈ అంశాలను కూలంకషంగా మధించి గోదావరి జలాల గరిష్ట వినియోగం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే సాధ్యం అవుతుందని భావించి కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసింది. నాలుగేండ్ల రికార్డు సమయంలో పూర్తి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణా కోటి ఎకరాల మాగాణిగా మారేందుకు దోహద పడనున్నది. ఎండిపోయిన గోదావరి నది 5 బ్యారేజిల (ఎల్లంపల్లి, సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క) నిర్మాణంతో సజీవం అయింది. ఎల్లంపల్లి తుపాకుల గూడెం బ్యారేజీల మధ్యన 200 కిలోమీటర్ల గోదావరి నది సజీవం అయినందున పర్యావరణం వృద్ది అవుతుంది. వట్టిపోయిన శ్రీరాంసాగర్‍, నిజాంసాగర్‍, సింగూరు, దిగువ మానేరు తదితర జలాశయాలు, మంజీరా, మానేరు, కూడెల్లి వాగు, హల్దీ వాగు, మోహి తుమ్మెద వాగు తదితర వాగులన్నీ జలకళతో నిందినాయి. ఈ వాగులు, నదులపై చెక్‍డ్యాంలు పొంగి పొరలుతున్నాయి. అవితమ ప్రతిపాదిత లక్ష్యాలను నేరవేర్చ గలుగుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుమారు 45 లక్షల ఎకరాలకు (శ్రీరాంసాగర్‍, నిజాంసాగర్‍, సింగూరు, చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణ కలుపుకొని) సాగునీరు అందుతుంది. 1 కోటి 80 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందిస్తుంది. పరిశ్రమలకు స్థాపనకు నీరు అందిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్దికి ఒక ప్రగతి యంత్రంగా (Growth Engine) మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టు.

– శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *