అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయ అవసరాలు తీర్చుతున్న ఈసీఐఎల్‍


వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్లో స్వయం సంవృద్ధిని సాధించి, దేశీయ అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో ఏర్పడిన ప్రెస్టీజియస్‍ సంస్థ ఎలక్ట్రానిక్‍ కార్పొరేషన్‍ ఆఫ్‍ ఇండియా. ఈసీఐఎల్‍గా అందరికీ సుపరిచితమై ప్రపంచఖ్యాతినార్జించిన ఈ సంస్థ అణు శక్తి విభాగం ఆధ్వర్యంలో 11 ఏప్రిల్‍, 1967లో మన హైదరాబాద్‍లోని కుషాయి గూడ ప్రాంతంలో ఆవిర్భవించింది. దూసుకుపోయే క్షిపణులు, విమానాల కాక్‍పిట్‍ వాయిస్‍ రికార్డర్లు, అణువిద్యుత్‍ను సృష్టించే రియాక్టర్లు, రేడియేషన్‍ను గుర్తించే డిటెక్టర్లు, వినోదాలు పంచే టీవీలు, వైద్య చికిత్సకు ఉపయోగించే ఉపకరణాలు… మరీ ముఖ్యంగా దేశంలో ఓటింగ్‍ పక్రియను సులభతరం చేసిన ఎలక్ట్రానిక్‍ ఓటింగ్‍ మెషిన్‍ – ఈవీఎమ్‍ల తయారీ వంటివి ఈసీఐఎల్‍ సొంతం. ఈసీఐఎల్‍ సంస్థ ఐదు దశాబ్దాలుగా దేశీయ ఎలక్ట్రానిక్స్ ప్రగతిలో ఎంతో కీలకపాత్ర పోషిస్తోంది.


ఈసీఐఎల్‍ ఆవిర్భావం
దేశంలో న్యూక్లియర్‍ ఎనర్జీ వినియోగానికి సంబంధించి పాలసీ, ఫ్రేమ్‍వర్క్ రూపకల్పన కోసం 1960లో ‘ఆటమిక్‍ ఎనర్జీ కమిషన్‍’ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్‍ హోమీ జే బాబా సారథ్యంలో ‘ఆటమిక్‍ ఎనర్జీ ఎస్టాబ్లిష్‍మెంట్‍ ట్రోంబే- ఏఈఈటీ’ ఏర్పాటు అయింది. అత్యంత ప్రతిభావంతుడైన హోమీ బాబా, న్యూక్లియర్‍ ఎనర్జీని మరింత వినియోగంలో తెచ్చేందుకు దేశీయంగా ఎలక్ట్రానిక్‍ ఎక్విప్‍ మెంట్‍లను తయారు చేయాలని తలచారు. ఈసీఐఎల్‍ ఏర్పాటులో… అదే సమయంలో హోమీ బాబాతో కలిసి పనిచేసిన ఎ.ఎస్‍.రావు కీలక పాత్ర పోషించారు. ఈ ఎక్విప్‍మెంట్స్ తయారీకి దేశంలో అణువైన ప్రదేశాన్ని ఎంపిక బాధ్యతను తీసుకున్న ఏఈఈటీ హైదరాబాద్‍ను సూచించింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో… అలా ఈసీఐఎల్‍ ఏర్పాటై తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎ.ఎస్‍.రావు, మొదటి మేనేజింగ్‍ డైరెక్టర్‍గా పనిచేసి… ఈసీఐఎల్‍ సృష్టించిన అద్భుతాలకు సాక్ష్యంగా నిలిచారు.
పరిశోధన, అభివృద్ధి (ఆర్‍ అండ్‍ డి)కి సంబంధించి.. ఈసీఐఎల్‍ ప్రారంభమైన తొలి దశాబ్దకాలం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. బాబా ఆటమిక్‍ రీసెర్చ్ సెంటర్‍, ఏఈఈటీల నుంచి పరిశోధనా విధానాలను అందిపుచ్చుకుంది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈసీఐఎల్‍ పరిశోధకులు అనేక అద్భుతాలను సృష్టించారు. ముఖ్యంగా అసిలోస్కోప్స్, స్పెకోట్రమీటర్స్, అల్ట్రాసోనిక్‍ ఫ్లా డిటెక్టర్స్, రైల్వేలకు అసవరమైన ‘ఈ టైప్‍ ఎక్సైటేషన్‍ సిస్టమ్స్, ఇంకా కొన్ని మెడికల్‍ ఎక్విప్‍మెంట్స్ను ఈసీఐఎల్‍ తయారు చేసింది. డయాడ్స్, ట్రాన్సిస్టర్స్, పవర్‍ ట్రాన్సిస్టర్స్ వంటి యాక్టివ్‍ కాంపోనెంట్స్తోపాటు మౌల్డెడ్‍ మె•ల్‍ ఫిల్మ్ రెసిస్టర్స్, పొటిన్షియోమీటర్స్, టాంటాలమ్‍ కెపాసిటర్స్ను ఉత్పత్తి చేసింది.


ఈసీఐఎల్‍ అభివృద్ధి అడుగులు-
80, 90వ దశకాల్లో ఈసీఐఎల్‍ తన సాంకేతికకు మరింత మెరుగులు దిద్దింది. ఎలక్ట్రానిక్‍ ఓటింగ్‍ మెషిన్లును మరింత ఆధునీకరించింది. పీసీ బేస్డ్ స్పెకోట్రమీటర్స్, పీసీ బేస్డ్ మల్టీ ఛానెల్‍ ఎనలైజర్‍, ఫైర్‍ సేఫ్టీ అలారమ్‍ సిస్టమ్స్, కంప్యూటరైజ్డ్ లేజర్‍ ఐడెంటిటి కార్డ్ ప్రింటింగ్‍ సిస్టమ్‍లను ఈసీఐఎల్‍ అభివృద్ధి చేసింది. ఇన్సాట్‍ శాటిలైట్‍ సిరీస్‍ మాదిరిగానే 120 ఎర్త్ స్టేషన్‍ యాంటెనాలను, 40 వీ-శ్యాట్‍ టెర్మినల్స్ను ఎగ్జిక్యూట్‍ చేసింది. బ్యాంకింగ్‍ రంగంలో కస్టమర్లకు వీలుగా ఉండే ఆఫీస్‍ ఆటోమేషన్‍ను అభివృద్ధి చేయడం లోనూ ఈసీఐఎల్‍ కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు మినియేషన్‍ కాంపోనెంట్స్ను తయారుచేసిన సంస్థ… తరవాతి కాలంలో బహుళ పరికారల సంస్థగా ఆవిర్భవించింది. ఆకాశ్‍, త్రిశూల్‍, బ్రహ్మోస్‍ వంటి మిసైల్స్కు అవసరమైన సీ41 సహకారాన్ని అందించింది. చంద్ర యాన్‍ మిషన్‍కు అవసరమైన 32 మీటర్‍ డీప్‍ స్పేస్‍ నెట్‍వర్క్ యాంటె న్నాను తయారు చేసింది ఈసీఐఎల్‍ నిపుణులే.
2000 సంవత్సరం తర్వాత… స్టాండర్డ్ అప్లికేషన్స్ దశ నుంచి స్ట్రాటజిక్‍ అప్లికేషన్స్ వైపు ఈసీఐఎల్‍ అడుగులు వేసింది. ముఖ్యంగా ఆటమిక్‍ ఎనర్జీ, డిఫెన్స్, స్పేస్‍, సివిల్‍ ఏవియేషన్‍ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీలో ఈసీఐఎల్‍ మరింత అభివృద్ధి సాధించింది. వీటితోపాటు పౌర సేవలు, ఈ గవర్ననెన్స్ అప్లికేషన్స్పై కూడా ఈసీఐఎల్‍ తన మార్క్ పనితీరు చూపించింది. అటు… టెలీ కమ్యూనికేషన్స్ కోసం స్టోర్‍ అండ్‍ ఫార్వార్డ్ టెలిగ్రాఫ్‍ సిస్టమ్స్, డిఫెన్స్కు సంబంధించి ఆటోమేటిక్‍ మెసేజ్‍ సిస్టమ్స్, వీఎస్‍ఎన్‍ఎల్‍ కోసం మెసేజ్‍ రీ ట్రాన్స్మిషన్‍ సిస్టమ్‍, అంతరిక్ష రంగానికి సంబంధించి శాటిలైట్‍ ట్రాకింగ్‍ సిస్టమ్‍, కల్పాక్కం అణు విద్యుత్‍ కేంద్రంలోని ఫాస్ట్ బ్రీడర్‍ టెస్ట్ రియాక్టర్‍ కోసం కంప్యూటర్‍ కంట్రోల్‍ సిస్టమ్స్, ఇండియన్‍ ఎయిర్‍లైన్స్ కోసం ఫైట్‍ డాటా ఎనలైజర్‍, కమర్షియల్‍ డాటా ప్రాసెసింగ్‍ సిస్టమ్‍ వంటివి ఈసీఐఎల్‍ తీసుకొచ్చింది.


ఈసీఐఎల్‍ నిర్వహణ – కార్యకలాపాలు: ఈసీఐఎల్‍ నిర్వహణ బాధ్యత కంపెనీ సీఎండి ఆధ్వర్యంలో నడుస్తుంది. రియర్‍ అడ్మిరల్‍ సంజయ్‍ చౌబె కొత్త చైర్మన్‍ అండ్‍ మేనేజింగ్‍ డైరెక్టర్‍గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సంజయ్‍ చౌబె ఈసీఐఎల్‍లో టెక్నికల్‍ డైరెక్టర్‍గా పనిచేశారు. ఆయనతోపాటు మరో ఐదుగురు డైరెక్టర్‍ ఈసీఐఎల్‍ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‍ కాగా… చెన్నై, ముంబయి, కోల్‍కతా, ఢిల్లీ, బెంగళూరులో జోనల్‍ కార్యాలయాలున్నాయి. ప్రసుత్తం ఈ సంస్థలో 2,375 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.


ఈసీఐఎల్‍ రూపకర్త – తొలి మేనేజింగ్‍ డైరెక్టర్‍-ఎ.ఎస్‍.రావు
ఈసీఐఎల్‍ పేరు చెప్పగానే ఖచ్చితంగా గుర్తుకుతెచ్చుకోవాల్సిన వ్యక్తి ఎ.ఎస్‍.రావుగా సుస్రిద్ధుడైన అయ్యగారి సాంబశివరావు. ఈసీఐఎల్‍ వ్యవస్థాపకుల్లో ముఖ్యవ్యక్తి. ఈయన పేరుమీదుగానే ఈసీఐఎల్‍ ఉద్యోగులు నివసించే ప్రాంతానికి ఎ.ఎస్‍.రావు నగర్‍గా నామకరణం చేశారు. సెప్టెంబర్‍ 20, 1914న పశ్చిమగోదావరి జిల్లా మొగల్లులో ఎ.ఎస్‍.రావు జన్మించారు. బెనారస్‍ హిందూ విశ్వవిద్యాలయంలో సైన్స్లో మాస్టర్‍ డిగ్రీ చేసిన ఆయన.. అక్కడే అధ్యాపకుడిగా ఆరు సంవత్సరాలపాటు వివిధ పరిశోధనలు చేశారు.
1940లో స్టాన్‍ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‍ ఇంజినీరింగ్‍లో మాస్టర్‍ డిగ్రీ చేయడానికి ప్రతిష్టాత్మక సంస్థ టాటా అందించే ఉపకార వేత నాలకు ఎంపికయ్యారు. ఆ తర్వాతి కాలంలో… ముంబైలోని టాటా ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ ఫండమెంటల్‍ రీసెర్చ్లో కాస్మిక్‍ కిరణాలపై ఎ.ఎస్‍.రావు అద్భుత విజయాలు సాధించారు. ఆసియా ఖండంలోనే మొదటిసారిగా భారత్‍ రూపొందించిన అప్సర అణు రియాక్టర్‍కు కంట్రోల్‍, మానిటరింగ్‍ పరికరాలను సమకూర్చారు. బార్క్లో ఎలక్ట్రానిక్స్ గ్రూప్‍కి డైరెక్టర్‍గా పనిచేసినపుడు డిజైన్‍, డెవలప్‍మెంట్‍ ఇంజినీరింగ్‍ అంశాల మీద సాంబశివరావు పరిశోధనలు చేశారు. ఆ తర్వాత అణుశక్తి విభాగంలో అణు శాస్త్రవేత్తగా చేరారు. అక్కడే హోమీ బాబా, విక్రమ్‍ సారాభాయి వంటి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా కేంద్ర ప్రభుత్వం అటమిక్‍ ఎనర్జీ కమిష న్‍ను ఏర్పాటు చేయడం.. డాక్టర్‍ హోమీ బాబా, ఎ.ఎస్‍.రావు వంటి కీలక శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈసీఐఎల్‍ ఏర్పాటైంది. సంస్థ మొదటి చైర్మన్‍గా విక్రమ్‍ సారాభాయి, తొలి మేనేజింగ్‍ డైరెక్టర్‍గా ఎ.ఎస్‍.రావు బాధ్యతలు చేపట్టారు. మొదటి పదేళ్లలో ఈసీఐఎల్‍కు చుక్కానిగా ఉండి ఉత్పత్తి సామర్ధ్యాన్ని, వ్యాపారాన్ని, ఉపాధి సామార్ధ్యాన్ని పెంచడంలో… ఎ.ఎస్‍.రావు ముఖ్య భూమిక పోషించారు. అదే సమయంలో రావును కేంద్ర ప్రభుత్వం 1971లో ఎలక్ట్రానిక్స్ కమిషన్‍లో ముఖ్య సభ్యుడిగా చేర్చుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బ్లాక్‍ అండ్‍ వైట్‍ టీవీలు, కంప్యూటర్‍లతోపాటు అణు శక్తి, విమానయాన, టెలి కమ్యూనికేషన్‍, రక్షణ రంగాలకు… ఎ.ఎస్‍.రావు హయాంలోనే ఆవిష్కరణలు జరిగాయి.


ఎ.ఎస్‍.రావుకు పురస్కారాలు: శాస్త్ర విజ్ఞాన అభివృద్ధితోపాటు ఐక్యరాజ్య సమితిలో అణుశక్తి ఉపయోగాలు వంటి అంశాలపై జరిగే చర్చల్లో భారత్‍ తరపున.. ఎ.ఎస్‍.రావు పాల్గొనేవారు. అనేక విజ్ఞాన పత్రికలకు సంపాదకునిగా, సలహా మండలి సభ్యునిగా పనిచేశారు. పలు అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్కు కూడా సంపాదకునిగా వ్యవహరించారు. 1960లో పద్మశ్రీ, 1965లో శాంతి స్వరూప్‍ భట్నాగర్‍ అవార్డు, 1972లో పద్మభూషణ్‍ పురస్కారంతోపాటు అనేక జాతీయ అవార్డులు ఏ.ఎస్‍.రావుకు వరించాయి. ఈసీఐఎల్‍ ఉద్యోగులు 1980లో సొసైటీని ఏర్పాటు చేసి సుమారు 120 ఎకరాల్లో డాక్టర్‍ ఏ.ఎస్‍.రావు నగర్‍ పేరుతో కాలనీ ఏర్పాటు చేశారు. దేశ సేవలో తరించిన ఎ.ఎస్‍.రావు… అక్టోబర్‍ 31, 2003న తుదిశ్వాస విడిచారు.


అంతర్జాతీస్థాయి పరిశోధనల్లో ఈసీఐఎల్‍: విశ్వరహస్యాల ఛేదనలోనూ.. ఎలక్ట్రానిక్‍ కార్పొరేషన్‍ ఆఫ్‍ ఇండియా కూడా పాలుపంచు కుంటోంది. విశ్వ ఆవిర్భావానికి సంబంధించి ఇప్పటికీ అంతుచిక్కని అనేక రహస్యాలను కనుగొనేందుకు జర్మనీలోని డాంస్టాడ్‍ పట్టణంలో ఓ ప్రయోగశాలను నిర్మిస్తున్నారు. దీనికి అవసరమైన శక్తిమార్పిడి యాంత్రాలు (పవర్‍ కన్వర్ట్ర్స్)ను రూపొందిం చేందుకు ఈసీఐఎల్‍ సిద్ధమైంది. ఈ ప్రయోగ శాలను ఫెసిలిటీ ఫర్‍ యాన్టీ ప్రొటాన్‍ అండ్‍ అయాన్‍ రీసెర్చ్- ఫెయిర్‍గా వ్యవహరి స్తున్నారు. ఈ ప్రయోగాల్లో పాలు పంచుకు నేందుకు… ఐరోపాలోని పలు దేశాలతోపాటు భారత్‍ కూడా 36 మిలియన్‍ యూరోలను అందిస్తోంది. ఈ సహకారంలో భాగంగానే ఈసీఐఎల్‍ సాంకేతిక పరికరాలను తయారుచేసే ఆర్డర్‍ను సొంతం చేసుకుంది. బాబా అణు పరిశోధన కేంద్రం, రాజా రామన్న ఉన్నత సాంకేతిక పరిశోధ నాలయం, వేరియబుల్‍ ఎనర్జీ సైక్లోట్రోన్‍ సంస్థల సహకారంతో పవర్‍ కన్వర్టర్స్ (శక్తి మార్పిడి యంత్రాలను)ను ఈసీఐఎల్‍ తయారు చేస్తోంది. పరికరాల సరఫరాతోపాటు వీటి నిర్వహణ బాద్యత కూడా ఈసీఐఎల్‍ చేపట్టనుంది.


అణు ఇంధన అక్రమ రవాణాకు ఈసీఐఎల్‍ చెక్‍: అణు ఇంధన పదార్థాల అక్రమ రవాణాకు చెక్‍ పెట్టేందుకు ఈసీఐఎల్‍ అత్యాధునిక ‘రేడియోలాజికల్‍ డిటెక్షన్‍ ఎక్విప్‍మెంట్‍- ఆర్‍డిఈ’ ను రూపొందించింది.


ఈసీఐఎల్‍ భవిష్యత్తు లక్ష్యాలు: శాస్త్ర సాంకేతిక వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత స్వయం సంవృద్ధిని సాధించడంలో ఎంతగానో కృషి చేస్తున్న సంస్థ ఈసీఐఎల్‍. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్‍ ఓటింగ్‍ మెషిన్ల ద్వారా ఎన్నికల పక్రియల్లో ఈసీఐఎల్‍ భాగస్వామ్యమై ఉంది. 2019 సాధారణ ఎన్నికల్లో ఓటింగ్‍ యంత్రాలకు వీవీప్యాట్‍ (ఓటర్‍ వెరఫయబుల్‍ పేపర్‍ ఆడిట్‍ ట్రయిల్‍)లను ఈసీఐఎల్‍ అందించింది. ఈవీఎమ్‍లు ట్యాంపరింగ్‍కు గురవుతున్నాయని ఆరోపణల నేపథ్యంలో వీవీప్యాట్‍లను ఈసీఐఎల్‍ రూపొందించింది. అణుశక్తి రియాక్టర్లకు సంబంధించిన కమాండ్‍ అండ్‍ కంట్రోల్స్ తయారీ కోసం ఆవిర్భవించిన ఈసీఐఎల్‍, యాభై ఏళ్లుగా తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ… భద్రతా వ్యవస్థలు, రక్షణ, వైమానిక రంగాలు, ఈ-గవర్నమెంట్‍ కార్యక్రమాలు అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతోంది.


ఎం.డి.కరీం, ఎ: 9618644771

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *