ఆధ్యాత్మిక నిలయం హంపి 1986లో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు


భారతదేశంలో ఉన్న చాలా ఆలయాలు చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లుగా తారసపడడం అత్యంత సహజం. అయితే చారిత్రక విశేషాలతో పాటు పౌరాణిక ప్రాశస్త్యాన్ని కూడా కల్గిన మహత్తర ఆలయాలెన్నో మన దేశంలో ఉన్నాయి. అది మహత్తర ఆలయమే కాదు, మనం అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే వసంతోత్సవానికి (హోలీ) పునాది వేసిన పుణ్య స్థలమది. అదే కర్ణాటక రాష్ట్రంలోని హంపి.
13-15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజధాని. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్యస్వామి ఆశీస్సులతో స్థాపించబడిన విజయనగర సామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయనగరసామ్రాజ్యం ఒకటి. గోపురం నీడ ప్రధాన ఆలయంలోని ఒక చిన్న రంధ్రంలో నుండి క్రింద నుండి పైకి అనగా తలక్రిందులుగా కనపడటం అప్పటి కళా చాతుర్యానికి నిదర్శనం.
హంపి అనగానే అద్భుతమైన కట్టడాలు, దేవాలయాలు స్ఫురణకు వస్తాయి. ప్రపంచ వారసత్వ సంపదగా రికార్టులకెక్కింది. హైదరాబాద్‍ నుంచి బళ్ళారి సుమారు 360 కిలోమీటర్లు దూరం. హైద్రాబాద్‍ నుంచి సుమారు ఎనిమిది గంటలు పడుతుంది. అక్కడ నుంచి మరో 75 కిలోమీటర్ల దూరంలో హంపి ఉంది. అందువల్ల బళ్ళారి నుంచి గంటన్నర సమయం పడుతుంది.


బెంగళూరు నుంచి హోస్పేటకు రెగ్యులర్‍ ఆర్టీసీ బస్సులున్నాయి. హోస్పేట నుండి హంపికి 12కిలోమీటర్ల దూరం. బెంగళూరు నుండి హోస్పేటకు రెగ్యులర్‍గా ట్రైయిన్స్ ఉన్నాయి. 12 కిలోమీటర్ల దూరంలోని హంపీ చేరుకోవడానికి ప్రైవేటు ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
హంపి పరిసరాల్లోకి చేరుకోగానే అద్భుతమైన రాతి ద్వారాలు, కొండలు, గుట్టలు, కట్టడాలు విపరీతంగా ఆకర్షిస్తాయి. మరో లోకంలోకి అడుగుపెట్టడం లేదుకదా అన్న అనుమానం కూడా మనలో కలుగుతుంది. అంత అందమైన చిత్రమైన కట్టడాలను అంతకు ముందు మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అలా నఖశిఖ పర్యంతం చూస్తూ ఉండిపోతాం. హంపిలో అందర్నీ బాగా ఆకర్షించే దేవాలయం విరూపాక్ష దేవాలయం.


విజయనగర రాజుల కళాభిరుచికి, వారి ధార్మిక ప్రవృత్తికి నిదర్శనంగా నిలిచిన దివ్య క్షేత్రమిది. ఈ దివ్య క్షేత్రంలో శివుడు విరూపాక్షేశ్వర స్వామిగా పూజాదికాలందుకుంటున్నాడు. హంపి ఆధ్యాత్మిక చారిత్రక వైభవానికి ప్రధాన సాక్ష్యం పంపా విరూపాక్ష దేవాలయమని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. హంపి విజయ నగర ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన పంపా విరూపాక్ష ఆలయం అంతు తెలియని అనేక ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. విజయనగర స్థాపన, హరిహర బుక్కరాయల ధర్మరాజ్య స్థాపనాదీక్ష ఈ ఆలయం నేపథ్యం నుంచే ప్రారంభమైంది. ఈ ఆలయ రాజగోపురం దూరం నుంచే కనిపిస్తుంది. తొమ్మిది అంతస్థులతో ఈ గోపురం ఉంది.


ఈ తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ. దానిని కింద నుంచి చూడడం బలే ముచ్చటేస్తుంది. గోపురం లోపల ఎలాంటి అడ్డ నిలువు దూలాలు వాడకుండా పైదాకా సూచీ ముఖంగా నిర్మాణం చేపట్టారు. అష్టకోణాక•తిగా ఉండే ఈ రాజగోపురం నిర్మాణ సాంకేతిక నైపుణ్యం ఈనాటికీ అబ్బురమే. ఈ గోపురం 165 అడుగుల ఎత్తు, కింది భాగం 20 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు కలిగి పదకొండు అంతస్థులతో కనిపిస్తుంది. దీనిని బిష్టప్పయ్య గోపురమని పిలుస్తారు. విరూపాక్ష ఆలయానికి రెండు గోపురాలున్నాయి. మొదటి ప్రాంగణం నుంచి పశ్చిమ దిశకు వెళితే మరో గోపురం కనిపిస్తుంది. ఈ గోపురాన్ని రాయల గోపురమని పిలుస్తారు. ఈ గోపురం ద్వారా ప్రవేశిస్తే రెండో ప్రాకారం ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభాలు, దీపస్తంభాలుంటాయి. ఎడమవైపున పాతాళేశ్వర, ముక్తి, నరసింహ, సూర్యనారాయణ స్వామి ఆలయాలు, కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, మహిషాసుర మర్దని, వేంకటేశ్వర స్వామి ఆలయాలున్నాయి. దీనికి ఎదురుగా విరూపాక్షేశ్వరస్వామి వారి సన్నిధి ఉంది. ఆలయానికి ముందు రంగమండపం ఉంది. 1509లో శ్రీకృష్ణ దేవరాయలు దీనిని కట్టించారు.


7వ శతాబ్దం నుండి ఈ ఆలయం ఉందని స్థానికులు చెపుతారు. ప్రధాన దేవాలయానికి చాళుక్యులు, హోయసాల రాజుల పరిపాలన కాలంలో అనేక మార్పులు చేర్పులు జరిగాయని, అయితే ప్రధానాలయాన్ని మాత్రం విజయనగర రాజులే నిర్మించినట్లు తెలిసింది. విజయనగర రాజులు పతనమయ్యాక 16వ శతాబ్దం ప్రాంతంలో జరిగిన దండయాత్రల వల్ల హంపి నగరంలోని అత్యద్భుత శిల్ప సౌందర్యం పూర్తిగా నాశనమైపోయిందట. కానీ విరుపాక్ష- పంపా ప్రాకారం మాత్రం దండయాత్రల బారిన పడలేదు. ఆ సమయంలో విరుపాక్షునికి ధూప దీపనైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయట. అనంతరం 19వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కొంతమేర జీర్ణోద్ధరణ చేసినట్లు అక్కడి ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది. హంపిని పూర్వం పంపావతి అని పిలిచేవారు. తుంగభద్ర నదీతీరంలో ఉన్న ఈ దివ్యాలయాన్ని ఎప్పుడు నిర్మించిందీ ఇతిమిద్దమైన ఆధారాలు లేక పోయినప్పటికీ, క్రీ.శ. 1510 సంవత్సరంలో మాత్రం ఈ ఆలయం మొదటిసారిగా జీర్ణోద్ధరణ అయ్యిందని అక్కడి వారి చెపుతారు. హంపి దివ్య క్షేత్రం ఐదు పర్వతాల సముదాయం. మాతంగ, మాల్వవంత, హేమకూలు, బసవశ•ంగ, కిష్కింధ లాంటి ఐదు పర్వతాల నడుమ ఇది అలరారుతోంది. త్రేతాయుగంలో వనవాసకాలంలో శ్రీరాముడు ఇక్కడున్న పంపావతి అమ్మవారిని, విరూపాక్షేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది. అలాగే శ్రీరాముడు సుగ్రీవ, హనుమంతులను కలుసుకుని సుగ్రీవుని ఇక్కడే రాజుగా చేశాడట. ఆనాటి నుంచి రామలక్ష్మణులు ఈ క్షేత్రంలో ఉన్నారని చెబుతారు. అలాగే హనుమంతుడు సీతమ్మవారిని కనుగొని రాములవారికి తెలియ చేసిన క్షేత్రమిదేనట. ఆ కారణంగా ఈ క్షేత్రానికి కిష్కింధకాండ అనే పేరు వచ్చింది.


పురాణ గాధ :
ఇక్కడ శివుడు విరూపాక్షుడిగా పేరు పొందడానికి పురాణగాధ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఇంద్రాది దేవతలు, మునులు అసురుల అక•త్యాలకు విసిగి బ్రహ్మదేవుడ్ని శరణువేడారట. అంతట బ్రహ్మదేవుడు శివ కుమారుని వల్లే ఈ సమస్య తీరుతుందని, అయితే శివుడు తపోనిష్టుడై పార్వతిని విడిచి వెళ్ళడం వల్ల కుమార సంభవం అసంభమని చెప్పాడట. దాంతో శివుడ్ని తిరిగి పార్వతి వైపు మళ్ళించడానికి ఒక్క మన్మథుడే అర్హుడని, మన్మథుడ్ని ఆ పనికి పురమాయించారట. మన్మథుడు తన మన్మథ బాణాలతో శివుడి తపస్సుని భంగపరచి, అతని మనస్సును మళ్ళించే ప్రయత్నం చేశాడట. దాంతో తపోభంగంతో కోపించిన మహాదేవుడు తన మూడో నేత్రంతో మన్మథుడ్ని భస్మం చేయగా, ఇంద్రాది దేవతలు శివుడిని ప్రార్ధించగా శివుడు శాంతించి మన్మథుడ్ని రూపం లేకుండానే జీవించమని అనుగ్రహించాడట. ఆనాటి నుంచి శివుడికి విరూపాక్షుడనే పేరు సార్ధకమైంది. మన్మథుడు తిరిగి జీవం పోసుకున్న రోజుకు గుర్తుగా ఆనాటి నుంచి వసంతోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది.


గర్భాలయానికి సమీపంలో విద్యారణ్య స్వామి ప్రతిష్టించిన శ్రీచక్రం ఉంది. అలాగే పంపాదేవిగా పురాణకాలంలో భువనేశ్వరి దేవిగా చారిత్రక కాలం నుంచీ పూజలందుకుంటున్న దుర్గాదేవిని, పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలను కూడా దర్శించ వచ్చు. దీనికి సమీపంలోనే పాతాళ మాధవ స్వామి ఉన్నాడు. ఈ ఆలయంలో ఉత్తర భాగాన మణక గోపురం ఉంది. దీనిని కనకగిరి గోపురమని పిలుస్తారు. ప్రధానాలయానికి వెనుక భాగంలో విద్యారణ్య స్వాముల వారి దేవాలయం ఉంది. దీనికి ఉత్తరాన మఠం ఉంది. దీనికి సమీపంలోనే లోక పావన తీర్ధముంది. ఇక్కడ నుండి వెనుతిరిగి మహా ద్వారం గుండా బయటకు వస్తే గోపురానికి ఎదురుగా సుమారు రెండు కిలోమీటర్లు పొడవైన హంపి రాజవీధిని దర్శించుకోవచ్చు.


దర్శనీయ స్థలాలు
నగర ప్రవేశం

14వ శతాబ్దం నగర అవశేషాలు 26 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఉత్తరం వైపు తుంగ భద్ర నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతో అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెలిబుచ్చుతాయి.
నగరం యొక్క ప్రధాన అవశేషాలన్ని కమలాపుర్‍ నుండి హంపి వెళ్ళే రహదారిలో కనిపిస్తాయి. కమలాపుర నుండి హంపి వెళ్లే దారిలో కమలాపురకు మూడు కి.మీ. దూరంలో మల్యంవంత రఘునాధ స్వామి దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం ద్రవిడ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆ ఆలయంలో వైవిధ్య భరితంగా చెక్క బడిన చేపలు, జలచరాలు పర్యాటకుల కళ్ళకు విందు.


విరుపాక్ష దేవాలయం
800 గజాల పొడవు 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీధులలో అత్యంత సుందరమైన ఇళ్ళున్నాయి. హంపి వీధికి పశ్చిమ చివర విరుపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరుపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరుపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపా దేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరుపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా.


చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయసల పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగర రాజులే నిర్మించారు. విజయనగర రాజుల పతనమయ్యాక దండయాత్రల వల్ల 16వ శతాబ్ధానికి హంపి నగరంలోని అత్యాద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది.
విరుపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారి పడలేదు. విరుపాక్ష దేవాలయంలో దేవునికి దూపనైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19వ శతాబ్దం మెదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది.


ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి మిగతా 7ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్థంబాలతో కూడి కప్పబడిన వసారా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. దీన్ని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భగుడి వస్తుంది.


తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది.
ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్థంబాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసారాని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడని కుడా శిలాశాసనాలు చెబుతున్నాయి. విరుపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మీ. దూరం వరకు కనిపిస్తుంది.


విఠల దేవాలయ సముదాయం
హంపికి ఈశాన్య భాగంలో అనెగొంది గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తికి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్తంభాలు. ఈ దేవాలయంలోనే పురందరదా ఆరాధనోత్సవాలు జరుతాయి.
శిలా రథం
ఈ ఏక శిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగంలో ఉంది. ఇంకో విశేషం ఏమంటె ఈ రథానికి కదిలే చక్రాలు ఉంటాయి.


గజ శాల
పట్టపు ఏనుగులు నివాసం కొరకు వాటి దైనందిన కార్యకలాపాల కొరకు రాజ ప్రసాదానికి దగ్గరలోనే గజశాల ఉంది. ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాలకు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉంది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారంలో ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. మావటి వారు సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన సైనిక స్థావరాలు ఉన్నాయి.


గుళ్ళు తిరగడం
హంపిలో బహుశ అందరూ చేసే మొదటి పని, అధ్భుతమైన గుళ్ళు అన్నిటిని చూడటం. పురాతన పుణ్యక్షేత్రం కావడం వల్లన విరూపాక్ష గుడి ఒక అందమైన కళాఖండం.అందువలన దీనిని ఏడాది అంతా పర్యాటకులు మరియు యాత్రికులు సందర్శిస్తూ ఉంటారు. మీరు చూడాల్సిన మిగతా గుళ్ళలో కృష్ణ గుడి, అచ్యుతరాయ గుడి మరియు దాని సంత స్థలం, విఠ్ఠల గుడి ఇంకా కొండ మీద ఉన్న హేమకుట కట్టడం ముఖ్యమైనవి.


గుట్టలు ఎక్కడం
హంపి ఎన్నో లెక్కలేనన్ని కొండలకి, గుట్టలకి నిలయం కాబట్టి, కొండలు, గుట్టలు ఎక్కడానికి ఇది అద్భుతమైన ప్రదేశం. కొన్ని స్థానిక సేవా సిబ్బందులు, భద్రతా కొలమానాలతో గుట్టలు మరియు కొండలు ఎక్కడానికి సౌకర్యాలు కలిగిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మీలో అణచిపెట్టి ఉన్న అడ్రినాలిన్‍ బయటకు తీసి ఇలాంటి ఒక సాహసానికి ప్రయత్నించండి.


విరుపాపూర్‍ గడ్డి దగ్గర
హిప్పీ జీవన శైలి గడపండి. హిప్పీ ద్వీపం అని ప్రేమగా పిలవబడే విరుపాపూర్‍ గడ్డి, హంపీకి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. విదేశీ యాత్రికుల రాకపోకలతో, దాని నిర్మలమైన అందంతో ఈ ప్రదేశం అందరి దృష్టిని ఆకట్టుకొంది. హంపీ నుంచి ఈ హిప్పీ ప్రదేశం చేరుకోవడానికి పట్టణం మధ్య నుంచి తెప్పలో నదిని దాటాలి.


హంపీ బజార్‍లో షాపింగ్‍…
విజయనగర సామ్రాజ్య సమయంలో హంపీ బజార్‍ ఒక ముఖ్యమైన మార్కెట్‍ స్థలంగా ఉండేది. ఇప్పుడు ఆ మార్కెట్‍కి పూర్వపు వైభవం లేనప్పటికీ, ఇంకా కొన్ని పురాతన వస్తువులు అమ్మే మార్కెట్‍గా కొనసాగుతుంది. వివిధ దేశాల నుంచి హిప్పీ జనాల ఆకర్షణ పెరగడం వలన వివిధ ఉల్లాసకరమైన, ప్రాచీనమైన ఆభరణాలు, కళాఖండాలు ఇక్కడ మీకు దొరుకుతాయి. నాణేలు, అరుదైన నగలు, మట్టి వస్తువులు తదితరమైనవి కొనుగోలు చేయవచ్చు.


హేమకుట కొండ సూర్యాస్తమయాన్ని చూసి తీరాల్సిన ప్రదేశం. హేమకుట కొండ ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్న విగ్రహాల నిధి. ఈ విగ్రహాలన్నీ విజయనగర నిర్మాణ శైలిలో కాకుండా వేరే విధంగా కట్టబడటంచే జైన్‍ మందిరాలు అనుకొని పొరపడతారు. ఈ కొండ మీద షుమారు 50 విగ్రహాలు, గుళ్ళు, గ్యాలరీలు
ఉన్నాయి. ఇవి విజయనగర పరిపాలన కంటే ముందే కట్టబడ్డాయి. కొండ మీదకు నడిచి వెళ్ళి అద్భుతమైన సూర్యాస్తమయం, హంపీ యొక్క విస్తృత వ్యూ దృశ్యాన్ని వీక్షించవచ్చు.
అవశేషాలను కలిగిన హంపి ఆలయ శిధిలాలను, స్మారక చిహ్నాలను కఠినమైనవిగా, గొప్పవిగా అభివర్ణిస్తూ 1986లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా హంపిని గుర్తించింది.


సువేగా,
ఎ : 9030 6262 8

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *