ఆరోగ్యం కోసం యోగా జూన్‍ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం


2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్‍ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేయడం, ఈ తీర్మానానికి 193 ఐరాస(ఐక్య రాజ్య సమితి) ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇవ్వడం తెలిసిందే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా, ఇంగ్లాండ్‍, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు సహ ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్‍ 2014లో ఆమోదించారు.


దీంతో 2015 జూన్‍ 21న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్‍ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే.. జూన్‍ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు ఇవాళ. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి భారత ప్రధాని మోదీ సూచించారు.


‘‘యుజ్‍’’ అనగా ‘‘కలయిక’’ అనే సంస్కృత ధాతువు నుండి ‘‘యోగ’’ లేదా ‘‘యోగము’’ అనే పదం ఉత్పన్నమైంది. ‘‘యుజ్యతేఏతదితి యోగః’’, ‘‘యుజ్యతే అనేన ఇతి యోగః’’ వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము. యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు వెళ్లడమే యోగ. ‘‘యోగము’’ అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు.
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తు పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, రామాయణము, భాగవతము, భారతము, భగవద్గీతలలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలు గా క్రోడీకరించాడు.


భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావననూ, ప్రాపంచిక దృక్పథాన్నీ బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించాయి.
21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందేందుకు మానవాళికి యోగా ఒక సాధనమైంది. యోగాలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి, సనాతన జీవన విధానం నుంచి వారసత్వంగా వస్తోంది. ఆదియోగి అయిన పరమేశ్వరుడు యోగాను మొదటిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావననూ, ప్రాపంచిక దృక్పథాన్నీ బోధిస్తుంది.


అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించాయి. తూర్పున ఉన్న వ్లాదివస్తోక్‍ నుంచి పశ్చిమాన ఉన్న వాంకోవర్‍ వరకు, దక్షిణాన ఉన్న కేప్‍టౌన్‍ నుంచి ఉత్తరాన ఉన్న కోపెన్‍హాగన్‍ వరకు ప్రతి నగరం యోగాలోని శక్తినీ, రోగనిరోధక సామర్థ్యాన్నీ గుర్తించి వినియో గంలోకి తీసుకొచ్చింది. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్న వారందరూ… ఆనందకర జీవితాన్ని పొందుతున్న తీరే ఇందుకు నిదర్శనం. వివిధ వ్యాధులకు సరైన చికిత్స నుంచి మరికొన్ని సమస్యలు రాకుండా నివారించుకునేందుకు యోగా ఓ సాధనంగా మారింది. 21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా యోగా మానవాళి ఆరోగ్యానికి అత్యవసర, నిత్యావసర సాధనకు వేదికైంది.

  • ఎసికె. శ్రీహరి
    ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *