అవును అవి పాదాలే. అక్కడ రెండు జతల పాదాలున్నాయి. అవి నిజంగా నిలువెత్తు పాదాలు. ఇంతవరకూ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో మరెక్కడా ఇంతెత్తున్న ఇలాంటి పాదాలు, ఇలా అరికాళ్లుపైకి కనిపించేలా ఉన్న దాఖలాలు లేవు. శ్రీరామోజు హరగోపాల్‍గారు కొలనుపాకలో ఇంతకంటే చిన్నపాదం గురించి ఇటీవలే తెలియజేశారు. ఇంతకీ ఈ పాదాలు ఎవరివై ఉంటాయి? ఈ పాదాలు జైనతీర్థంకరునివేమో. స్థానికంగా మాత్రం ఇవి దేవుని పాదాలని, ఆ పాదాలను నిలబెట్టి ఉంచిన ప్రదేశాన్ని పాదాలగడ్డ అని అంటారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం, గంగాపురం శివారులోని పాడుబడిన ఆలవానిపల్లి పొలాల్లో ఉన్నాయి. ఇదే ప్రదేశాన్ని గొల్లత్త(క్క) గుడి అని కూడా అంటారు. రాష్ట్ర పురావస్తుశాఖ ఇక్కడ 1971 నుంచి అనేక సంవత్సరాలు తవ్వకాలు జరిపిన తరువాత క్రీ.శ. 7-8 శతాబ్దాల నాటి ఇటుక, రాతి ఆలయాల పునాదులు బయల్పడినాయి. పాదాలగడ్డకు 200 మీటర్ల దూరంలో గల అప్పటి ఇటుక రాతి ఆలయం శిధిలావస్థకు చేరుకొంది.
దీన్ని రక్షిత కట్టడంగా ప్రకటించారు. పోతపోసిన ఇటుకలతో కట్టిన శిఖరం వరకూ ఉన్న ఈ ఇటుకరాతి ఆలయమే మన రాష్ట్రంలో శిఖరం వరకూ గల అతిపురాతన ఆలయం, చాళుక్య – రాష్ట్రకూట సంప్రదాయాలను సంతరించుకొన్న ఈ ఆలయ గోడలపై అపురూపమైన సున్నపు బొమ్మలున్నాయి. (ఉండేవి). అవి నిర్లక్ష్యానికి గురై నేల రాలిపోయాయి. ఈ ఆలయంలోపల పద్మాసనంపై ధ్యానముద్రలో నున్న వర్థమాన మహావీరుని రాతి శిల్పం వల్ల ఈ ప్రదేశం జైన స్థావరమని తెలిసింది. ఒకప్పుడు ఎంతో వైభవంగా విలసిల్లిన జైన బసది సొమ్మసిల్లింది. ఇదే అదనుగా మరో మతం, జైనాన్ని హతమార్చింది. విశాల జైన ప్రాంగణం నిశానీ లేకుండా పోయింది.
అందివచ్చిన చారిత్రక కట్టడాలను రక్షిత కట్టడాల పేరుతో నిర్లక్ష్యం చేయటం మానుకొని, శిధిలాలను పదిలపరచ టానికి పూనుకోవాలి. జైనమతాన్ని వైనంగా బతికించుకోవాలి. వారసత్వ పరిరక్షణలో భాగంగా హోదాలు మరిచి ఒరిగిపోయిన ఈ పాదాలను మళ్లీ నిలబెట్టి. గత వైభవాన్ని పునరుద్దరించాలి. దానికి గ్రామస్థాయి వారసత్వ కమిటీలు పూనుకోవాలి. ప్రభుత్వం కోసం చూడకుండా గ్రామస్తులే కాపాడుకోవాలి.
–ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446