- ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు (జగ్గీ వాసుదేవ్)
- ‘‘సేవ్ సాయిల్’’కి తెలంగాణ మద్ధతు..
- ఈశా ఫౌండేషన్‍తో ఎంవోయూ, భారత్‍లో ఆరవ రాష్ట్రంగా ఘనత
- సద్గురు మార్గం భావి తరాలకు ఆదర్శం: మంత్రి నిరంజన్ రెడ్డి
- సద్గురు ‘సేవ్ సాయిల్’ అద్భుతం: మంత్రి కేటీఆర్
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం : ఎంపీ సంతోష్ కుమార్
మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేశాడు.
చంద్రమండలం మీద అడుగుపెట్టాడు.
గ్రహాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నాడు.
ఆ గ్రహాల మీద నీరు… మట్టి కోసం అన్వేషిస్తున్నాడు.
ప్రాణికోటి నివసించే అవకాశం ఉందా అని పరిశోధిస్తున్నాడు.
భూమికి ఆవల ఏముందో తెలుసుకునే ప్రయత్నమిది.
అయితే… భూమి ఏమవుతుందోననే స్పృహను కోల్పోతున్నాడు.
మన కాళ్ల కింద నేల ఉంది… ఆ నేల మట్టితో నిండినది.
ఆ మట్టిని కాపాడుకున్నప్పుడే మనకు మనుగడ.
‘మట్టి ప్రమాదంలో పడింది… మట్టి ఆరోగ్యాన్ని కాపాడుదాం’…
-సద్గురు జగ్గీవాసుదేవ్
నేల పరిరక్షణ, ఆహారం, ప్రజల ఆరోగ్యం వంటి విషయాలను ప్రస్తావిస్తూ.. సద్గురు Save Soil Movementను ప్రారంభించారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు (జగ్గీ వాసుదేవ్) ప్రారంభించిన ‘నేల పరిరక్షణ’ ( Save Soil Movement ) ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. నేల తల్లిని కాపాడేందుకు ఆయన చేపట్టిన ఈ ఉద్యమానికి కరేబియన్ దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే పలు దేశాలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటివరకు 6 కరేబియన్ దేశాలు సద్గురు నేతృత్వంలోని నేలను రక్షించే ఉద్యమంలో చేరాయి. దీని కోసం ఆయనతో కలిసి ముందుకు సాగడానికి అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి.
సద్గురు జగ్గీవాసుదేవ్‍తో కలిసి నేలను పరిరక్షించే ఉద్యమంలో ఆరు కరేబియన్ దేశాలు.. ఆంటిగ్వా అండ్ బార్బుడా, డొమినికా, సెయింట్ లూసియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, గయానా, బార్బడోస్‍లు చేరాయి. ఆయా దేశాలు నాయకులు సద్గురు ప్రారంభించిన Save Soil Movement లో కలిసి ముందుకు సాగడానికి ఒప్పందంపై సంతకాలు చేశారు. మట్టి క్షీణతను తిప్పికొడుతూ.. నేల తల్లి రక్షణకు కృషి చేస్తూ.. దీర్ఘకాలిక ఆహారాన్ని అందించడానికి తమ దేశాలలో ఖచ్చితమైన చర్యను ప్రారంభించాలని ఒప్పందం సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు.
నేల ఆరోగ్యం కోసం ప్రపంచం మద్దతు తెలుపుతూ.. చర్యలు తీసుకోవడం, నేలలను కనీసం 3-6% సేంద్రియ పదార్ధం ఉండేలా రక్షించడం, పెంపొందించడం మరియు నిలబెట్టుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా విధాన మార్పును నడపడం ఉద్యమం అనేది ఈ ఉద్యమం ( Save Soil Movement ) ప్రధాన లక్ష్యం. మానవ-పర్యావరణ చర్యను ప్రేరేపించడానికి ప్రజలలో అవగాహన కల్పించడానికి ఇది దీర్ఘకాలిక ప్రపంచ ప్రయత్నంగా ప్రారంభించబడింది.
మట్టి ఆరోగ్యం కోసం పాటుపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా మట్టి సంక్షోభాన్ని పరిష్కరించడానికి, సాగు చేయదగిన మట్టిలో సేంద్రియ పదార్థాలను పెంచడానికి జాతీయ విధి విధానాలు ఏర్పాటు చేసి, కార్యరూపం దాల్చడానికి అన్ని దేశాల నాయకులకు మద్దతు ఇస్తుంది.
మార్చి 21 నుండి ప్రారంభమయిన ‘సేవ్ సాయిల్’ ప్రచారంలో భాగంగా యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా మరియు భారతదేశం అంతటా సద్గురు 30,000 కి.మీ మోటార్ సైకిల్ రైడ్‍ను ప్రారంభించే ముందు కరేబియన్ దేశాల ప్రభుత్వాధినేతలు మరియు మంత్రులు ఈ ఎమ్‍ఒయుపై సంతకం చేశారు. 75 రోజుల ప్రయాణం. (భారత స్వాతంత్య్రం 75 సంవత్సరాలు ప్రతిబింబిస్తుంది.) లండన్‍లో ప్రారంభమై జూన్ 4న న్యూఢిల్లీలో ముగిసింది. ఈ యాత్ర 24 దేశాలను కవర్ చేసింది.
లండన్ నుంచి కావేరి వరకూ 30 వేల కిలోమీటర్ల బైక్‍యాత్ర
‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలు తిరిగాను. మన దేశంలో గుజరాత్ నుంచి ఏపీ వరకూ వచ్చాను. తొమ్మిది దేశాలు, ఆరు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నాం. ‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో భాగంగా లండన్ నుంచి కావేరి ప్రాంతం వరకూ 30 వేల కిలోమీటర్లు బైక్‍యాత్ర చేశారు.
ఇక సినీనటి సమంతతో జరిగిన సంభాషణలో జగ్గీదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో రిస్కీ బైక్ రైడ్.. గురించి ఆయన మాట్లాడుతూ.. తాను గడిచిన 30 సంవత్సరాలుగా దాని గురించి (మట్టిని కాపాడటం) మాట్లాడుతున్నానని తెలిపారు. దాని గురించి తాను ఎప్పుడు మాట్లాడినా.. ఇది గొప్పది, ఇది అద్బుతమని ప్రజలు చెబుతారని వాసుదేవ్ అన్నారు. కానీ ఆ వెంటనే జనం నిద్రపోతారని.. అందుచేత వాళ్లని మేల్కొలపాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం 2.8 బిలియన్ల మంది ప్రజలు మట్టి గురించి మాట్లాడినట్లుగా తమ సోషల్ మీడియా గణాంకాలు చెబుతున్నాయని వాసుదేవ్ అన్నారు. ఇక నదీజలాల సంరక్షణ గురించి అడగ్గా.. ఖచ్చితంగా నదీ జలాలు సముద్రంలో కలవాలని, అలా జరగని పక్షంలో ఒకదేశంలో 100 కిలోమీటర్ల వరకు సముద్రం ముందుకు చొచ్చుకొస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఒక దేశం 100 కిలోమీటర్ల మేర భూ భాగాన్ని కోల్పోయినట్లేనని వాసుదేవ్ పేర్కొన్నారు.
ఇప్పటి వరకు భారతదేశంలో 30 శాతం సారవంతమైన భూములు బంజరు నేలలుగా మారిపోవడంతో పంటల దిగుబడి తగ్గిపోయింది. తక్షణ విధాన సంస్కరణల ద్వారా వ్యవసాయ నేలల్లో కనీసం 3 నుంచి 6 శాతం సేంద్రీయ కంటెంట్‍ను భాగం చేయాలని ‘‘సేవ్ సాయిల్’’ ఉద్యమిక ప్రాథమిక లక్ష్యం. ఇక.. ఢిల్లీలో జరిగిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జగ్గీ వాసుదేవ్‍తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమం ఆవశ్యకతను ప్రధాని తెలిపారు. సద్గురు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్ధతు ప్రకటిస్తూ అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి.
మార్చి 21, 2022న ప్రారంభమైన జగ్గీ వాసుదేవ్ బైక్ యాత్ర.. యూరప్, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యాన్ని కవర్ చేసింది. అనంతరం మే 29న గుజరాత్‍లోని పశ్చిమ నౌకాశ్రయ నగరం జామ్‍నగర్‍కి చేరుకుంది. భారత్‍లో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా ఆయన యాత్ర సాగింది. మరోవైపు జగ్గీ వాసుదేవ్ ఉద్యమం కోట్లాది మందికి చేరువైంది. 74 దేశాలు తమ దేశాల్లోని నేలల సంరక్షించడానికి అంగీకరించాయి. 27 దేశాల గుండా సాగిన ఆయన ప్రయాణం తర్వాత 2.8 బిలియన్ల మంది ప్రజలు మట్టి గురించి మాట్లాడుతున్నారు. అలాగే భారత్‍లోని 15 లక్షల మంది చిన్నారులు ఈ దేశంలోని నేలను, వారి భవిష్యత్తును కాపాడేందుకు కృషి చేయాల్సిందిగా ప్రధాని మోడీకి లేఖ రాశారు.
‘సేవ్ సాయిల్’ యాత్రకు ఎలాంటి స్పందన వస్తోంది?
ఇప్పటిదాకా ప్రతీ దేశం నుండి అద్భుత స్పందన వస్తోంది. నాలుగు నెలల కిందట వరకూ మట్టిపై ప్రస్తావనే లేదు. కానీ, ఇప్పుడు ప్రతీచోట ‘సాయిల్’ అనే పదం ప్రతిధ్వనిస్తోంది. తొమ్మిది దేశాలు మట్టిని రక్షించే ఉద్యమంలో అవగాహన ఒప్పందాలు చేశాయి. ఇప్పటికే 74 దేశాలు మట్టిని రక్షించేందుకు కట్టుబడి ఉంటామన్నారు.
భావితరాలకు వ్యవసాయంపై ఆసక్తిలేదు. వ్యవసాయ భూములను విక్రయించి ఇతర ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో వ్యవసాయ భూమి ‘రియల్ ఎస్టేట్’ ఉచ్చులో విలవిలలాడి పోతోంది? పరిష్కారం ఏంటంటారు?
మనం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి తీరాలి. అందుకు ప్రోత్సాహకాలు అందించాలి. లేకపోతే తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటాం. ప్రోత్సాహకాలతో రాబోయే ఏళ్లలో మట్టిలో కనీసం 3 శాతం సేంద్రియ పదార్థం పెంపొందే దిశగా మనం అడుగులు వేయొచ్చు.
మీ 30వేల కిలోమీటర్ల ప్రయాణంలో మట్టిని రక్షించే చర్యలు ఏ దేశంలో సంతృప్తికరంగా ఉన్నాయి? మన దేశంలో ఏ రాష్ట్రంలో పరిస్థితి వుంది?
2015లో ఫ్రాన్సు ‘4 ఫర్ 1000’ అనే కార్యాన్ని నిర్వహించింది. ఇది ‘మట్టిని రక్షించు’ పాలసీలా ఉంది. కానీ, వాళ్లు మట్టిని ఇతర సమస్యలతో ముడిపెట్టారు. దాంతో ఏడేళ్లు గడిచినా వారు దాన్ని అమలుచేయలేకపోయారు.
‘సేవ్ సాయిల్’ ఉద్యమం భవిష్యత్‍లో ఎలా ఉండబోతోంది?
ఈ ఉద్యమం ప్రజలు స్పందించడం కోసమే. మేం 25-30 మంది శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటుచేస్తున్నాం. వీరు మట్టి పునరుద్ధరణపై సహకారం అందిస్తారు.
ఈ ఉద్యమంలో ప్రభుత్వాలు, ప్రజల బాధ్యత ఏంటి?
మట్టి అనేది భూమి మీది జీవనానికి ఆయువుపట్టు. దురదృష్టవ శాత్తు అదిప్పుడు చేజారిపోతోంది. అందరూ మట్టిపై మాట్లాడాలి. స్వచ్ఛమైన నీటికి, స్వచ్ఛమైన గాలికి, మన జీవితాలకి ఆధారం ఆ మట్టే! మట్టి నాణ్యతను సంరక్షించడమే మన పిల్లలకు మనం అందించే గొప్ప వారసత్వం.
కట్టా ప్రభాకర్
ఎ : 8106721111