అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’


కృష్ణదేవరాయల వారి కాలంలో విజయనగర వీధులలోనే కాదు కుతుబ్‍షాహీల పరిపాలనలో కార్వాన్‍ సడక్‍ల మీద కూడా కుప్పలు తెప్పలుగా ముత్యాల వ్యాపారం జరిగింది. ఇది ‘‘హవామే పుకార్‍’’ గాలి వార్తలు ఎంత మాత్రం కాదు. శంకా నివృత్తి కోసం ట్రావెర్నియర్‍ అనే ఫ్రెంచి యాత్రికుడు రాసిన జ్ఞాపకాల పుస్తకమో లేక ఫిలిప్స్ మెడాస్‍ టేలర్‍ రాసిన ‘‘కన్‍ఫెషన్స్ ఆఫ్‍ ఎ థగ్‍’’ అన్న నవలో చదవవచ్చు. వర్తకుల బిడారును లేక యాత్రికుల సమూహాన్ని ‘‘కారవాన్‍’’ అని ఉర్దూలోనూ, ఇంగ్లీష్‍లోనూ దాదాపు ఒకే అర్ధం ఉంది. ఆరోజులలో మచిలీపట్నం ఓడరేవుకు వెళ్లే ప్రధాన రహదారిపై అటు గోల్కండకు ఇటు పురానాపూల్‍కు మధ్య ఉన్న వ్యాపార నగరమే ‘‘కార్వాన్‍’’. అప్పటికింకా హైద్రాబాద్‍ నగరం శైశవదశలోనే ఉంది. అటువంటి రోజులలో ఇక్కడి విఫణి వీధులలో ముత్యాల వ్యాపారం జరిగింది. ఇరాన్‍, ఇరాక్‍ దేశాల నుండి కూడా ముత్యాలు వచ్చేవి. దేశవిదేశాల లాభాల బేహారులు, లోక సంచార యాత్రికులు ఇచ్చోటనే బస చేసేవారు.


ఇపుడు కార్వాన్‍ అంతరించిన గతించిన ఒక వైభవోజ్వల జ్వాల. పాతనగరంలో నిరుపేదలు నివసించే అనేకానేక బస్తీలలో మొహల్లాలో ఇపుడు ఇది కూడా ఒకానొక ప్రాంతం మాత్రమే. అయితేనేం? ఇప్పటికీ కాలం చెల్లిన పాత భవంతు లను కూలగొడుతుంటే వెండి, బంగారాలను దాచి పెట్టిన లంకె బిందెలు, గుప్త నిధులు దొరుకు తాయట! గత కాలపు వైభవానికి ఇంత కన్నా ఇంకేం ఆనవాళ్లు, సాక్ష్యాలు కావాలి?
ముందు కోహినూర్‍ వజ్రం గురించి మాట్లాడుకుందాం. గోల్కొండ రాజ్యంలో వజ్రాల గనులు చాలా చోట్ల ఉండేవి. ఆ ముడి వజ్రాలను కార్వాన్‍కు తీసుకొచ్చి అక్కడ సానపట్టి, మెరుగులు దిద్దేవారు. ఈ పరిశ్రమలో సుమారు 60వేలమంది కార్మికులు కార్వాన్‍లో పనిచేస్తున్నారని ట్రావెర్నియర్‍ తన జ్ఞాపకాలను గ్రంధస్తం చేసాడు. కృష్ణాతీరంలోని కొల్లూరు ప్రాంతంలో ఈ కోహీనూరు వజ్రం దొరికింది. అప్పుడు దాని బరువు 787 కారెట్లు. కుతుబ్‍షాహీల నుండి ఇది మొగల్‍ చక్రవర్తుల పరం అయ్యింది. ఆ తర్వాత 1739లో నాదిర్షా దిల్లీని దోచుకుని కోహీనూర్‍ను పర్షియాకు పట్టుక పోయాడు. అట్లా అట్లా చేతులు మారి బ్రిటిష్‍ రాణి క్వీన్‍ విక్టోరియా కిరీటంలో ‘‘శీర్షమాణిక్యంలా’’ వెలిగిపోయింది. ప్రస్తుతం లండన్‍ మ్యూజియంలో మనం చూడవచ్చు. కృష్ణానదీ తీరాన దొరికిన కోహినూర్‍ ఆఖరికి లండన్‍ థేమ్స్ నది ఒడ్డున కొలువు తీరింది.


కార్వాన్‍ పక్కన్నే కుల్సుంపురా అని ఒక బస్తీ ఉంది. కుల్సుంబీ హయాత్‍ బక్షీ బేగం కూతురు. కుల్సుంబీ ఇక్కడే నివసించి కార్వాన్‍లో ఒక పెద్ద మసీదును నిర్మించింది. దాని చుట్టు వందల కొద్దీ సత్రపు గదులను నేటికీ మనం చూడవచ్చు. దేశవిదేశీ ముసాఫిరులు ఇందులో బస చేసేవారు. కుల్సుంపురా దాటగానే టపాచబూత్రా అనే బస్తీ వస్తుంది. చబూత్రా అంటే చావిడి అని అర్థం. అది ఇప్పటికీ చెక్కు చెదరక సురక్షితంగానే ఉంది. కుతుబ్‍ షాహీల కాలంలో అక్కడికి టపా (పోస్ట్) వచ్చి అక్కడ్నుంచే వివిధ ప్రాంతాలకు రవాణా అయ్యేది. అది ఒక విధంగా ‘‘డాక్‍ఖానా’’ పోస్ట్ ఆఫీస్‍ అన్నమాట. టపా చబూత్రా దాటగానే ‘‘మియా మిష్క్ మసీద్‍’’ వస్తుంది. చాలా కళాత్మకంగా ఉంటుంది. దీనిని 1678లో మిష్క్మియా నిర్మించాడు. ఇతను ఇథియోపియాలోని హబ్సీ తెగకు చెందినవాడు. అక్కడ్నుండి వచ్చి ఆఖరు నవాబు అబుల్‍ హసన్‍ తానీషాకు అంతరంగిక కార్యదర్శిగా నవాబుగారి అంతఃపురానికి సైన్యాధికారిగా పనిచేసాడు. ప్రజలు ఇతనిని ‘‘బడే మాలిక్‍’’ అని గౌరవంగా పిలిచేవారు. ఇతను నివసించిన ప్రాంతమే మాలిక్‍పేట. అదే నేటి మలక్‍పేట. ఈయన 1680లో చనిపోగా ఈ మసీదు ప్రాంగణంలో ఇతనిని సమాధి చేసారు. ఆ ‘‘మక్బరా’’ కూడా పర్షియన్‍ వాస్తుశైలిలో నాజూకు నగిషీలతో కళాత్మకంగా ఉంటుంది. ఈ మిష్క్మియా మసీదు దాటగానే పురానాపూల్‍ వస్తుంది.
ఇక ఇటు కార్వాన్‍ నుండి గోల్కొండకు వెళ్లే ధారిలో ‘‘టోలీమసీదు’’ ఉంది. ముందు ఒక ఎత్తైన వేదిక నిర్మించి దీనిపైన మసీదు కట్టారు. నాలుగు మినారులతో చార్మినార్‍ లాగే ఉంటుంది. లోపల రెండు విశాలమైన ప్రార్థనా స్థలాలు ఉంటాయి. 1671లో దీనిని మూసాఖాన్‍ అను అధికారి నిర్మించాడు. కూకట్‍పల్లి దగ్గరి నేటి మూసాపేట్‍ ఆరోజులలో ఇతని జాగీరు గ్రామం. ఈ టోలీ మసీదుకు ఒక కహానీ ఉంది. ‘‘మక్కామసీదు’’ నిర్మాణానికి పర్యవేక్షకుడు, అధికారి ఈ మూసాఖానే. ‘‘మక్కామసీదుకు రాయితప్ప మట్టి లేదు. చార్మినార్‍కు మట్టి తప్ప రాయి లేదు’’ అని ‘‘చార్మినార్‍ నగీనా ఊపర్‍ చున్నా అందర్‍ మట్టీ’’ అని పాత కాలం సామెతలు. మక్కా మసీదుకు కావలసిన రాయిని మూసాఖాన్‍ శంషాబాద్‍కు వెళ్లేదారిలో ఉన్న గగన్‍పహాడ్‍ నుండి తెప్పించేవాడు. నవాబుగారు అంత పెద్ద మక్కామసీదును నిర్మిస్తున్నప్పుడు తాను మాత్రం ఒక చిన్న మసీదును ఎందుకు నిర్మించవద్దన్న సదుద్దేశ్యంతో రాయిని తెస్తున్న కొన్ని ఎడ్లబండ్లను కార్వాన్‍లోని ఈ మసీదుకు మళ్లించాడు.


ఇకపోతే ‘‘టోలీమసీద్‍’’ అన్న పేరు వెనక కూడా ఒక కథ ఉంది. టోలీ ఉర్దూ పదం. దమ్మిడి తెలుగు పదం. టోలీ నుండే ‘‘టోలీచౌకీ’’ బస్తీపేరు వచ్చింది. అక్కడ బొంబాయి నుండి గోల్కొండ రాజ్యానికి వచ్చే వస్తువులు, దినుసులపై సుంకం విధించే కచ్చీర్‍ (ఆఫీస్‍) ఒకటి ఉండేది. కనీసపు సుంకం ఒక టోలీఐనా వసూలు చేసేవారు కావున ‘‘టోలీ చౌకీ’’ అని పేరు వచ్చింది. చౌకీ అన్నా నాకా అన్న వొకటే అర్థం. ఉదాహరణకు పోలీస్‍ చౌకీ, పోలీస్‍ నాకా, చత్రీనాకా. నేడు జాతీయ రహదారులపై ఉన్న టోల్‍గేటు అన్న పదం కూడా ఈ ‘‘టోలీ’’ నుండే వచ్చింది. అయితే ఇపుడు అక్కడ వాహనదారులకు ఒక టోలీ కాక తోలు తీసే విధంగా పన్నులు వసూలు చేస్తున్నారు.
సరే మళ్లీ మనం మూసాఖాన్‍ దగ్గరికి వెళ్లుదాం. మక్కామసీదు నిర్మాణ సమయంలో ఆయన రాళ్లు మాత్రమే మక్కా మసీదుకు మళ్లించకుండా ప్రతిరోజూ మక్కా మసీదుకు వెచ్చించే వ్యయంలో ఒక దమ్మిడి అంటే టోలీ పక్కన పెట్టేవాడు. అట్లా జమ చేసిన టోలీలతో కట్టిన ఈ చిన్న మసీదుకు ప్రజలు టోలీమసీద్‍ అని నామకరణం చేశారు. ప్రభుత్వ సొమ్ముతో గుడి కట్టించిన రామదాసు చెరసాల పాలైనాడు. మక్కామసీదుకు పోటీగా ప్రభుత్వం సొమ్ముతో టోలీ మసీద్‍ కట్టించిన ముసాఖాన్‍ను నవాబు ఏం చేసాడో ఆ అల్లాకే ఎరుక!


ఈ టోలీమసీదు దాటగానే లంగర్‍హౌజ్‍ వస్తుంది. దీనికి కూడా ఒక కథ ఉంది. ఈ లంగర్‍హౌజ్‍ ప్రాంతానికి ఔరంగజేబు గోల్కొండ పైకి అనేకసార్లు దాడి చేసాడు. కాని ఫలితం శూన్యం. ఆఖరిసారి ప్రకృతి కూడా అతని మీద కన్నెర్ర చేసింది. ముచికుందా నదికి వరదలొచ్చి గోల్కొండ వద్ద విడిది చేసిన అతని సైన్యం, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఫిరంగులతో సహా ఆ ఉప్పెనలో, వెల్లువలో కొట్టుక పోయినాయి. చింతాక్రాంతుడైన ఔరంగజేబుకు ఇద్దరు సూఫీ ఫకీర్లు బాబా యూసుఫ్‍ ఉద్దీన్‍, బాబా షరీఫ్‍ ఉద్దీన్‍లు లంగర్‍ హౌజ్‍ దర్వాజా వద్ద ఒక ఫకీర్‍ చెప్పులు కుడుతూ (మోచీ) కుచుంటాడని అతన్ని కలవమని సలహా ఇచ్చారు. ఔరంగజేబు అక్కడికి చేరుకోగానే ఆ మోచీ మాయమైనాడట! తర్వాత గోల్కొండ కోట అతనికి స్వాధీనమైంది. అంటే ఆ మోచీ మరెవరో కాదు. గోల్కొండ దుర్గానికి రక్షణగా కాపలా కాస్తున్న ఒక ఫరిస్తా (దేవతా) అన్నమాట.
సరే మళ్లీ వెనక్కి తిరిగి కార్వాన్‍కు వద్దాం. కార్వాన్‍కు దక్షిణ దిశలో ‘‘తాళ్లగడ్డ’’ అనే బస్తీ ఉంది. ఇక్కడ కూడా రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి విశాలమైన ప్రాంగణంతో ‘‘దాదా జైన్‍వాడి మందిర్‍’’. ఇక్కడ జైన మునులు వర్షాకాలంలో నివసించేవారు. ప్రశాంత వాతావరణంలో దేవతలు నివసిస్తారు అన్నట్లు ఇక్కడ ప్రకృతి పరమప్రశాంతంగా గాలికూడా సడిచేయని నిశ్శబ్దంతో ఉంటుంది. కాకతీయుల కాలంలో జైనమతం ఉచ్చదశలో ఉండేది. ఈ జైన దేవాలయం కూడా ఆనాటిదే. శాలీబండాలో ఉన్న ‘‘జైనానాథ్‍’’ దేవాలయం కూడా అప్పటిదే.
ఇక రెండవ విశేషం. రాజా భగవాన్‍ దాస్‍ భాగ్‍ చూడ చక్కని పూదోటల మధ్యలో ఆయన నివసించిన ప్యాలెస్‍ ఉంది. 26 ఎకరాల విస్తీర్ణ స్థలంలో దీనిని నిర్మించారు. కర్నాటకలోని శ్రీరంగ పట్నంలోని టిప్పుసుల్తాన్‍ ప్యాలెస్‍కు దీనికి దగ్గర పోలికలు ఉన్నాయి. రెండు అంతస్థుల ఈ భవనాన్ని నాణ్యమైన కలపతో, నిర్మించారు. లోపలి కళాత్మకమైన నగిషీలు, చెక్కణం పని ‘‘అవ్వల్‍ దర్జా’’ స్థాయిలో ఉంటుంది. చార్మినార్‍కు దగ్గరలో ఉన్న ‘‘మాల్వాలా ప్యాలెస్‍’’ మాత్రమే దీనికి సాటిగా నిలబడింది. ప్రస్తుతం ఈ భగవాన్‍దాస్‍ భాగ్‍ మొత్తం ఆక్రమణలకు గురైంది.


ఈ తాళ్లగడ్డ దాటగానే ‘‘మందులగూడ’’ అనే బస్తీ వస్తుంది. వనమూలికలు, చెట్లు మందులు అమ్మే మందుల కులం వారు ఇక్కడ నివసించేది. దీనిని గుడిమల్కాపూర్‍ అని కూడా అంటారు. ఇక్కడ ‘‘జాంసింగ్‍ దేవాలయం’’ ఉంది. దీనికి కూడా ఒక కథ ఉంది.
జాంసింగ్‍ రాజపుత్ర వంశానికి చెందినవాడు. మూడవ నిజాం సికిందర్‍జా కొలువులో ఆశ్విక సైన్యాధికారి. గుర్రాలు కొనటానికి డబ్బులతో బయలుదేరి అడవిలో ఒకచోట అలసటతో నిద్రించగా కలలో ‘‘బాలాజీ’’ కనిపించి నిద్రించిన స్థలంలోనే ఒక గుడిని నిర్మించమని ఆదేశించాడట. ఇంకేం ఆ ప్రభుత్వ ఖజానాతో 1810లో గుడి కట్టించాడు. ప్రజలు దానిని జాంసింగ్‍ దేవాలయం అని పిలిచారు. గుడిలోనూ, చుట్టుపక్కలా బోలెడన్ని సత్రపు గదులను యాత్రికుల కోసం నిర్మించాడు. ఆలయానికి దగ్గరలో బావిని తవ్వించాడు. అక్కడ పర్షియన్‍ బాషలో ఉన్న శిలాఫలకంలో ‘‘యాత్రికులు ఆ బావిలోని మంచి తీర్థాన్ని సేవించి కాసేపు విశ్రమించమని’’ ఆహ్వానిస్తూ రాసి ఉంది. దేవాలయం ప్రధాన ద్వారం తూర్పు దిక్కు నుండి ప్రవేశించగానే నల్లటి గ్రానైటు రాయితో ఏకశిలా స్తంభం కనబడుతుంది. పన్నెండు మంది ఆళ్వార్లకు గుర్తుగా పన్నెండు స్తంభాలతో సభా మంటపం ఉంది. గుడిలో ఒక మూలన తోలు ఢంకా అతిపెద్ద ఆకారంలో కనబడుతుంది. గుడి ముందు రెండంతస్తుల ‘‘నక్కర్‍ఖానా’’ను కూడా నిర్మించారు. పూజా సమయంలో అందులో కూచుని వాయిద్యాలను మోగించేవారు. ఈ సంగతి నవాబుగారికి తెలిసి జాంసింగుపై ఆగ్రహించారు. దివాన్‍ చందూలాల్‍గారు జోక్యం చేసుకుని దాని ఎదురుగా మసీదును నిర్మించటంతో నేలకు రాలవలసిన జాంసింగుకు తల రక్షింపబడింది.
1908 మూసీ వరదలు తర్వాత మార్వాడీ గుజరాతీ షావుకార్లు అందరూ కార్వాన్‍ను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి పోగా ముత్యాలు వజ్రాలు అమ్మిన కార్వాన్‍ పేద ప్రజల బస్తీగా మిగిలి పోయింది.
‘‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?’’


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *