ఇక్కడ ఈ దేవాలయం గురించి రాయాలంటే బాధేసింది. అయినా, 800 ఏళ్ల చరిత్రగల కాకతీయ కళా నిలయం శిథిలం కావటం, పదిలపరచటానికి పురావస్తు శాఖపూనుకోవటం, పునర్నిర్మాణంలో అధిగమించరాని అడ్డంకులు, 40 ఏళ్లపాటు నిరీక్షించినా ఇంకా పూర్తికాకపోవటం అన్న విషయాలపై వివరణ ఇవ్వాలనిపించింది. అసలు విషయానికొస్తే. మునుపటి వరంగల్ జిల్లా, జనగామ తాలూకా, నిడిగొండ గ్రామంలో స్థానికంగా కుమ్మరిగుళ్లు అని పిలిచే త్రికూటాలయము 1983 వరకూ ఉండేది. ఈ ఆలయం, ఆంధప్రదేశ్ రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాలల శాఖ రక్షిత కట్టడం. ఈ ఆలయాన్ని పునరుద్ధరిద్దామని అప్పటి పురావస్తు శాఖ డైరెక్టరు, డా. వి.వి. గారు కృష్ణశాస్త్రి నిర్ణయించారు. 1983వ సం।।లో ఆలయాన్ని ఊడదీసి, అస్తవ్యస్తమైన, పడిపోయిన భాగాలను సరిచేసి మునుపటి వైభవాన్ని తీసుకువచ్చే బాధ్యతను నాకు అప్పగించారు. అదే శాఖలో పనిచేస్తున్న డా. బి. సుబ్రహ్మణ్యం సహకారంతో నేను ఈ ఆలయాన్ని ఒక్కోరాయికి నంబర్లు వేసి, మహబుబ్‍నగర్ జిల్లా జటప్రోలులో ఆలయాల్ని ఊడదీసి, పునర్నిర్మించటంలో అనుభవాన్ని సంపాదించిన కన్నయ్య, శంకరరెడ్డి బృందంతో 1984లో ఊడదీశాను. అప్పుడే నాదెండ్ల భాస్కర్‍రావుగారి మంత్రివర్గం పడిపోయింది. అయినా ఆలయం ఊడదీసే పనికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కాకతీయ వాస్తు శిల్పకళ పతాక స్థాయికి చేరిన సమయంలో నిర్మించిన ఈ ఆలయ ద్వారాలు, రంగమండపస్థంభాలు చక్కటి నైపుణ్యంతో తీర్చిదిద్దబడినాయి. దూలాలు, కప్పురాళ్లపై రమణీయ రామాయణ శిల్పాలు కనువిందు చేస్తున్నాయి. స్థంభాలపై కోలాటం, నాట్యం, దూలాటిపై చక్కటి డిజైను, సప్తతాళభంజనం లాంటి రామాయణ దృశ్యాలు, కప్పురాళ్లపై అష్టదిక్పాలకులు, ఇంకా విడిగా నంది, ఏనుగు శిల్పం కాకతీయ శిల్పానికి అర్థం చెబుతున్నాయి. అనేక ఆభరణాలతో ముస్తాబైన నంది, కాకతీయ శిల్పుల నేర్పరితనానికి అద్దం పడుతుంది.
1985 నుంచి పునర్నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. ప్రధానాలయాల కింద ఆధునికపునాదులు వేసి బేస్‍మంట్ వరకూ పనిజరిగింది. 1985, 1986 వరకూ రెండు విడతలుగా ఆలయపునర్నిర్మాణ పనులు సంవత్సరానికి ఒకనెల చొప్పున జరిగింది. 1987లో నిధులు లేవని పనులు చేప్టలేదు. మళ్లీ 1989-90లో ఆలయాల అధిష్టానం వరకూ పూర్తైంది మళ్లీ నిధులు లేక మూడేళ్లపాటు పనులు జరగలేదు. 1992లో కృష్ణశాస్త్రిగారు రిటైరయ్యేముందు ఈ ఆలయాన్ని ఎలాగైనా పూర్తి చేయమని మంజూరు చేసిన నిధులతో ఆలయాల గోడలభాగం పూర్తయింది. రంగమండపం పై స్థంభాలను నిలబెట్టి, ఉన్నంత వరకూ
కప్పురాళ్లు చేద్దామనుకొంటే ఆ సం।। నుంచి 2003 వరకూ నిధులు మంజూరు కాలేదు. ఎవర్నీ ఏమీ అనలేం! కానీ నిడిగొండలోని ఒక ముసలాయన నేను కనిపించినపుడల్లా ‘ఈ ఏడన్నా జాతర సాగేనా’ అని అప్పటికి 10 ఏళ్లుగా అడుగుతూనే ఉన్నాడు.
2004లో కొద్దిపాటి నిధులు మంజూరు కావటంతో మళ్లీ పనులు మొదలుపెట్టాను. నిడిగొండలో నాకు సహాయకుడుగా ఉన్న కోలా కృష్ణమూర్తిని ‘ఆ ముసలాయన కనిపించటంలేదేమిటి’ అని అడిగాను. ‘ఇంకెక్కడి ముసలాయనసారు ఆయన కాలం చేసిండుగా’ అని జవాబిచ్చాడు. నాకు చాలా బాధేసింది. ఆలయాన్ని ఊడదీయకుండా ఉంచినట్లైతే బాగుండేమోననిపించింది. వారసత్వ కట్టడాలు పరిరక్షణలో అలసత్వం పనికిరాదనిపించింది. 2004 లో నేను నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్ప్రిటాలిటీలో ప్రొఫెసర్‍గా నియామకం రావటంతో పురావస్తు శాఖ నుంచి వెళ్లిపోయాను.
నిడిగొండ దేవాలయ పనుల్లో నాకు సహకరించిన కృష్ణమూర్తికి ఆలయం ఊడదీసినపుడు పెళ్లైంది. తరువాత కొడుకు పుట్టారు. కృష్ణమూర్తి కొడుక్కు కూడా పెళ్లైంది. ఇంకా నిడిగొండదేవాలయ పునర్నిర్మాణం పూర్తి కాలేదు. ఇది నా ఆవేదన.
నిడిగొండ దేవాలయం పరిస్థితిలో మార్పులేదు. ఆ తరువాత నిధులు మంజూరైనాయిగానీ, ఆలయానికి కాదు ప్రహరిగోడ కట్టడానికి. ప్రహరీగోడను ఊడదీసి మళ్లీ కట్టారుగాని, మిగిలిన ఆలయ విడిభాగాలు గత 40 ఏళ్లుగా నిరిక్షిస్తూనే ఉన్నాయి. ఎవరో ఒక మానవదేవుడు తమమొర ఆలకిస్తాడేమోనని. నేను ఆశాజీవిని.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446