ఆరోగ్యదాయిని.. అమ్మకు బోనం


మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా మన భాగ్యనగరం (హైదరాబాద్‍), లస్కర్‍ (సికింద్రాబాద్‍) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తరువాత సికింద్రాబాద్‍ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగగాను నిర్వహిస్తారు ఆతరువాత చివరగా లాల్‍ దర్వాజ సింహవాహిని ఆలయంలో, ఇతర చోట్ల నిర్వహిస్తారు ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు. బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

ప్రకృతికీ మనిషికీ విడదీయరాని బంధం ఉంది. మానవాతీత శక్తి మనల్ని నడిపిస్తోందని అనాదిగా నమ్ముతున్నాం. మన పుట్టుక, జీవనం, మరణం.. అన్నీ చిత్రవిచిత్రాలే. వాటి వెనుక శాస్త్రీయత ఎంత ఉన్నా.. విప్పలేని చిక్కుముళ్లెన్నో! అవి ప్రశ్నలుగానే మిగులు తున్నాయి. ఒక్కోసారి ఆలోచనాపటిమతో మనల్ని మనం స్థిమితపరచుకున్నా అనేక సందర్భాల్లో దైవశక్తిని విశ్వసించి ఆత్మస్థైర్యం పొందుతుంటాం. బోనాలు అందుకు సాక్షాత్కారం.


సృష్టికి మూలమైన శక్తిరూపంగా ‘అమ్మ’ దుర్గమ్మగా, కాళీమాతగా ఎన్నో రూపాల్లో పూజలందుకుంటోంది. దుష్టసంహరణార్థం పలు అవతారాలు దాల్చిన అమ్మవారు గ్రామ ప్రజల్ని, పాడిపంటల్ని కాపాడేందుకు గ్రామదేవతగా సాక్షాత్కరిస్తుంది. జగదాంబ, ఎల్లమ్మ, రేణుక, చండీ, మహంకాళి, దుర్గ, పోశమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, డొక్కలమ్మ, కట్టమైసమ్మ, గండిమైసమ్మ- ఇలా తీరొక్క రూపాల్లో వెలసిన అమ్మవారిని పూజించి, ఆమె కృపతో రక్షణ పొందిన ప్రజలు, ఆషాఢ, శ్రావణ మాసాల్లో కృతజ్ఞతతో పూజిస్తారు. ఏడాదంతా కాపాడమంటూ వేడుకుంటారు.
తెలంగాణలో అమ్మవారిని పూజించే ఉత్సవం బోనాల పండుగ. సంస్కృతీ సంప్రదాయాలు కలబోసిన గ్రామదేవతల పండుగిది. ఆషాఢమాసంలో మొదలైన బోనాలు ఆ నెలంతా కొనసాగుతూ ఆదివారం నాడు బోనమెత్తే కార్యక్రమం అంగరంగవైభవంగా సాగుతుంది. ఆయా ఊళ్లలో, ఆయా బజారుల్లో తమ ప్రత్యేక రోజుల్లో బోనమెత్తి పండుగ జరుపుకుంటారు.
ప్రస్తుతం బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తున్నా.. నిజానికి ఈ వైభవం ఇప్పటిది కాదు. కాకతీయుల కాలంలో కాకతీ దేవతకు బోనాలు సమర్పించినట్లు ఆధారాలున్నాయి.


ఆషాఢంలో బోనాలు.. విశేషాలు..
బోనం అంటే భోజనం, అన్నం. పాడిపంటల్ని వృద్ధి చేసిన తల్లికి క•తజ్ఞతగా నిండుగా భోజనాన్ని సమర్పించడమే బోనాలు. వర్షాకాలం ఆరంభమై వానలతో నీటి గుంటలతో ఊరంతా చిత్తడిగా పాచిపట్టినట్టుగా ఉండి అంటు వ్యాధులు ప్రబలుతుంటాయి కనుక ఇంటినీ, ఊరినీ శుభ్రంచేస్తారు. సాన్పి (కళ్లాపి), ముగ్గు, వేపాకు, పసుపులతో సూక్ష్మక్రిములు దూరమౌతాయి.
బోనాలకు దగ్గరి బంధువులను పిలుచుకుంటారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. పసుపు రాసి వేపాకులతో అలంకరించిన బోనం కుండలో అన్నం, ఉల్లిగడ్డ, మిరియాలు, పరమాన్నం మొదలైనవి ఉంచి మూతపెట్టి, మూతలో నూనె పోసి, దీపం వెలిగిస్తారు. మొదట ఇంట్లో దేవుడి దగ్గరుంచి, తర్వాత ఆ బజారులోఉన్న దేవతామూర్తి గుడికి తీసుకెళ్తారు. మహిళలు కొత్త దుస్తులతో ముస్తాబై, తలపై బోనాన్ని పెట్టుకోగా.. కుటుంబసభ్యులు పూజా సామగ్రి తీసుకెళ్తారు. ఇంకొందరు అమ్మవారికి ఒడిబియ్యం, పూలు, గాజులు సమర్పిస్తారు. వంశం అభివృద్ధి చెంది, పిల్లాపాపలతో ఇల్లు ఆనందంగా ఉండాలని తొట్టెల కడతామని మొక్కులు చెల్లిస్తారు. బోనంతో ఇంటి నుంచి బయల్దేరేవేళ నీటితో సాకను పోస్తారు. మశూచి లాంటి అనారోగ్యాలు రాకూడదంటూ గుడి ముందు సాకబోయడం చూస్తాం. బోనాలవేళ జంతుబలి కూడా ఉంటుంది. ఇటీవల కోడిని సమర్పిస్తున్నారు. వైభవంగా సాగే బోనాల ఉత్సవం భాగ్యనగరానికే శోభను తెచ్చేలా నిర్వహిస్తారు.
గోలుకొండ ఖిల్లా మీద జగదాంబిక
మా నాగాంబిక
డప్పుల మోతలు అమ్మా జగదాంబ
దరువుల చప్పుడు అమ్మా జగదాంబ

అంటూ డప్పుల మోతలతో సాగే బోనాల పాటలతో జంటనగరాలు ఉత్సాహంతో పోటెత్తుతాయి. పల్లెల్లోనూ పట్టణాల్లోనూ శోభాయమానంగా వెలిగే ఈ ఉత్సవం ఉత్సాహం నింపే సంబురం. జులై 3న గోలకొండ జగదాంబ అమ్మవారితో మొదలయ్యే బోనాలు జులై 24న సికింద్రాబాద్‍ ఉజ్జయిని అమ్మవారి మహంకాళి జాతరగా ముగుస్తుంది. లాల్‍ దర్వాజ తదితర ప్రాంతాల్లోనూ ఈ ఉత్సవాలు దివ్యంగా సాగుతాయి.
సుఖ, సంతోషాలను ప్రసాదించే దేవతామూర్తులను కృతజ్ఞతతో శాంత పరిచే పండుగిది. ఇందులో కొంత శాంతం, కొంత రౌద్రం ఉంటుంది. ఘటం, రంగం, పోతు రాజుల విన్యాసం- ముఖ్య ఘట్టాలు. బోనం కుండను ఘటం అంటూ దేవి పుట్టింటికి వచ్చిందని, ఆమె సోదరులు పోతురాజులు వెంటరాగా, రంగంలో భవిష్యవాణిని వినిపించడం చూస్తాం.


బోనం
బోనం అంటే భోజనం అని అర్ధం. ఆ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేజ్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సంప్రదాయం. ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు. ఆలావండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడ్తారు. అలాగే ఆ కుండపై ఒక దీపాన్ని ఉంచుతారు. ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుభ్రమైనది కూడా. ఆలా వండిన బోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు. ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవ్వన్ని యాంటీ సెప్టిక్‍, యాంటీ బైయోటిక్‍కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు. అందువలన ఈ బోనానికి ఇంతపవిత్రత, శుభ్రత ఉంటుంది. అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే త్రోవ్వ చూపిస్తుంది. అంటే దారిలో వెలుగు మాట. ఇది బోణం యొక్క ప్రత్యేకత.
ఆషాఢ మాసంలో పండగ ఎందుకు చేస్తారు
మనకు ముఖ్యంగ వానా కాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భాద్రపద మాసంలో ముగుస్తుంది. వానాకాలంలో మనకు కలరా, మలేరియా వంటి అంటు వ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి. వానా కాలంలో వచ్చే అంటు వ్యాధులు చాలా ప్రమాదకరం. సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాఢ, శ్రావణ మాసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు. ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరికాళ్ళు చెడుతాయి. అలా కాకుండా మహిళలు పసుపును కాళ్ళకు పెట్టుకుంటారు.
బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడ్తారు. ఆ వేపాకులో ఉండే గుణం ఆ క్రిమి కీటకాలను నాశనంచేస్తుంది. వేపాకులో ఉన్న ఈ గుణం వల్ల ఎటువంటి అంటూ వ్యాధులు మనకురావు.
బలి
బోనాల పండుగలో ముఖ్యమైనది బలి. ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు. ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలయ్యే వానా కాలం వలన వచ్చే అంటు వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేకలకు, గొర్రెలకు మొదలైన వాటికీ త్వరగా సోకే అవకాశం ఉంది. కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు. బహుశా అందువలననేమో శ్రావణ మాసంలో కొంత మంది మాంసాహారం తినరు.


అమ్మవారి ఊరేగింపు

బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు. ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు, గుగ్గీలం లేదా మైసాచి పొగలు వేస్తారు. ఈ ఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి. ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్లు ఆ చప్పుళ్లతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు. అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి.
గుగ్గిలం లేదా మైసాచి పొగ
అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగ వేస్తారు. ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే. వానా కాలంలో దోమలు, ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి. అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి. అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు.
కుటుంబ ఆచారంగా, కృతజ్ఞతాసూచకంగా సాగే ఆషాఢ బోనాలు తెలంగాణ ప్రత్యేకం. కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలోనూ బోనాలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. అనాదిగా ఉన్న ఈ గ్రామ దేవతారాధన నేటికీ కొనసాగడం దివ్యమైన అంశం. సౌభాగ్య ఆరోగ్య ప్రదాత అయిన అమ్మను బోనాల వేళ పూజించి తరిద్దాం.

  • ఎసికె. శ్రీహరి, ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *