మహోన్నత త్యాగానికి ప్రతీక.. బక్రీద్‍

హజ్రత్‍ ఇబ్రహీం త్యాగధనుడైన గొప్ప దైవ ప్రవక్త. ‘ఖలీలుల్లాహ్‍’ అనే బిరుదుతో ఆయనను పిలిచేవారు. అంటే ‘అల్లాహ్‍కు స్నేహితుడు’ అని అర్థం. దేవునితో ఏకత్వం కోసం ఆయన ఎంతగానో తపించారు. మొదట్లో సూర్య చంద్రులు, నక్షత్రాల కాంతితో ఆయన ప్రభావితం అయ్యారు. చివరకు అల్లాహ్‍ కృపతో ఋజుమార్గాన్ని పొందారు. తన జాతి వారిని అల్లాహ్‍ వైపు ఆహ్వానించారు. తన తండ్రితో, జాతితో, ఆనాటి పాలకులతో సైతం దైవ ధర్మం కోసం రాజీలేని పోరాటం సాగించారు. చివరకు దైవం విధించిన ధర్మ పరీక్షలో నెగ్గారు. అనంతరం ఇరాక్‍, ఈజిప్ట్, సిరియా, పాలస్తీనా ప్రాంతాలకు వలస వెళ్ళారు.
సత్య ధర్మ ప్రచారంలోనే ఇబ్రహీం తన జీవితంలో ఎక్కువభాగం ఖర్చు చేశారు. వృద్ధాప్యం వచ్చాక ‘‘ఓ ప్రభూ! నాకు మంచి గుణాలు కలిగిన ఒక కుమారుణ్ణి ప్రసాదించు’’ అని అల్లాహను వేడుకున్నారు. తన ప్రియ దాసుడి మొరను ఆలకించిన అల్లాహ్‍ ఒక బాలుణ్ణి అతనికి అనుగ్రహించాడు. ఆ బాలుడే దైవ ప్రవక్త ఇస్మాయిల్‍.


ఇబ్రహీంను విశ్వప్రభువైన అల్లాహ్‍ మరో పరీక్షకు గురి చేశాడు. భార్య హజిరాను, ముద్దుల కుమారుడు ఇస్మాయిల్‍నూ కటిక కొండల్లో వదిలి పెట్టి రావాలని ఇబ్రహీంను ఆజ్ఞాపించాడు. ‘‘ఎందుకు?’’ అని ఇబ్రహీం ప్రశ్నించలేదు. ‘జనావాసాలు లేని ఆ ప్రదేశంలో తన భార్య, పసి పిల్లవాడి సంరక్షణ బాధ్యత ఎవరు వహిస్తారు?’ అని ఆలోచించలేదు. ప్రభువు ఆజ్ఞను శిరసా వహిస్తూ, ఆయన మీద అపారమైన నమ్మకంతో… భార్యనూ, బిడ్డనూ కొండల మధ్య వదిలిపెట్టి, వెనక్కు చూడకుండా వచ్చేశారు. కారుణ్య ప్రభువైన అల్లాహ్‍ వారిద్దరినీ సంరక్షించాడు. వారి కోసం జమ్‍ జమ్‍ నీటి ఊటను సృష్టించాడు. తనను ప్రసన్నం చేసుకోవడానికి… ప్రియమైన సంబంధ, బాంధవ్యాలను త్యజించే వారికి… ఇహలోక జీవితంలోనూ శుభాలను ప్రసాదిస్తాననీ, వారి ఊహకు అందని మార్గాల్లో ఉపాధిని అనుగ్రహిస్తాననీ లోకానికి వెల్లడి చేశాడు. ఒక రోజు రాత్రి… లేకలేక కలిగిన తన ముద్దుల కుమారుణ్ణి దైవ మార్గంలో… తన చేతులతోనే బలి ఇస్తున్నట్టు హజ్రత్‍ ఇబ్రహీం కలగన్నారు. ఆ విషయాన్ని తన కుమారుడికి ఆయన చెప్పారు. పసితనం నుంచే దైవం పట్ల విధేయతనూ, త్యాగ భావాన్నీ కలిగిన ఆ బాలుడు ఏమాత్రం చలించకుండా ‘‘నాన్నా! అదే దైవాజ్ఞ అయితే మీకు లభించిన ఆదేశాన్ని నిస్సంకోచంగా అమలు పరచండి. దైవం తలచుకుంటే… నన్ను మీరు సహనశీలిగా చూస్తారు’’ అని అన్నాడు.


చిన్నవాడైన ఇస్మాయిల్‍ దైవాదేశాన్ని పాటించి.. తన ప్రాణాన్ని ధార పొయ్యడానికి… నేల మీద ప్రశాంతంగా పడుకున్నాడు. ప్రాణంకన్నా మిన్న అయిన తన కన్న కొడుకు మెడను కొయ్యడానికి… అతని కుత్తుకపై కత్తి పెట్టారు ఇబ్రహీం.అప్పుడు ఇబ్రహీంకు అల్లాహ్‍ వాణి వినిపించింది ‘‘ఓ ఇబ్రహీం! నువ్వు కలను నిజం చేసి చూపావు’’ అంటూ ఆ గొప్ప ఖుర్బానీకి పరిహారంగా పొట్టేలును ఇచ్చి… బలి నుంచి ఇస్మాయిల్‍ను అల్లాహ్‍ తప్పించాడు. భావితరాలలో శాశ్వతంగా నిలిచే కీర్తి ప్రతిష్టలను ఆ తండ్రీ కొడుకులకు ప్రసాదించాడు.
ఈ విధంగా… మనసా, వాచా, కర్మణా తాను తన తల్లితండ్రులు, ఆప్తులు, భార్యాబిడ్డలు, ఆస్తి-అంతస్థులు… వీటన్నిటి కన్నా అల్లాహ్‍ను అధికంగా ప్రేమిస్తున్నాననీ, అల్లాహ్‍ ప్రసన్నత కోసం మనోవాంఛల్నీ, ప్రాపంచిక వ్యామోహాల్నీ, బాంధవ్యాలనూ త్యజించడానికి తాను ఎల్లవేళలా సిద్ధమేననీ ఇబ్రహీం లోకానికి వెల్లడి చేశారు. అందుకే ప్రవక్తలకు పితామహునిగా ఆయన ప్రసిద్ధి చెందారు. మిల్లతే ఇబ్రహీంకు సంస్థాపకునిగా నిలిచిపోయారు. ప్రపంచంలోని ముస్లింలు జిల్‍హజ్‍ మాసం పదవ రోజున బక్రీద్‍ (ఈద్‍ ఉల్‍ అజ్‍హా) పండుగను ఇబ్రహీం మహోన్నత త్యాగానికి గుర్తుగా… విశేషంగా జరుపుకొంటారు. తమ ప్రాణాలను అల్లాహ్‍ మార్గంలో త్యాగం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని ఖుర్బానీ ద్వారా చాటుతారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ రోజున సౌదీ అరేబియాలోని మక్కా నగరం హజ్‍ యాత్రికులతో కళకళలాడుతుంది.


బక్రీద్‍ అంటే ఏమిటి..? ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటి…?

ముస్లింల ప్రధాన పండగలు రెండు ఒకటి రంజాన్‍ రెండవది బక్రీద్‍. ఈ పండుగకు ఈదుల్‍.. అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్‍ అని కూడా అంటారు. ఇస్లామ్‍ క్యాలెండర్‍ ప్రకారం 12వ నెల జిల్‍హేజ్‍ 10వ తేదీన బక్రీద్‍ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‍ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్‍ తీర్థయాత్రకు బయలుదేరతారు.
బక్రీద్‍ పండగను ఎందుకు జరుపుకుంటారు..?
హజ్‍ యాత్రకొరకు అరబ్‍ దేశమైన సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకుని మసీద్‍ లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ మసీద్‍ కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్‍ (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.హజ్‍ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కా నుండి మదీనా (ముహమ్మద్‍ ప్రవక్త గోరీ ఉన్ననగరం) ను సందర్శిస్తారు. అల్లాహ్‍ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‍ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతాడు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్‍ పండుగను జరుపుకుంటారు.
హిజ్రీ అంటే ఏమిటి..?
బక్రీద్‍ అంటే బకర్‍ ఈద్‍ అని అర్థం. బకర్‍ అంటే జంతువని, ఈద్‍ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును ఖుర్బాని (దానం) ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్‍ ఖుర్బాని అని కూడా అంటారు. మహ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుసుకుంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహ్మద్‍ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్‍ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగనిరతితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్‍ పండుగలోని ప్రధాన పరమార్ధం దాగిఉంది.
ఖురాన్‍ ఏం చెబుతోంది..?
ఖురాన్‍ ప్రకారం.. భూమిపైకి అల్లాహ్‍ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరుపొందాడు. ఇబ్రహీం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్‍ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్‍ మెడపై కత్తిపెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం కలగన్నాడు. అల్లాహ్‍ ఖుర్భాని కోరుతున్నాడేమోనని ఓ ఒంటెను బలిస్తాడు. అయినా, మళ్లీ అదే కల రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించిన ఇస్మాయిల్‍ సిద్ధపడ్డాడు. ఇస్మాయిల్‍ మెడపై కత్తి పెట్టి జుబాహ్‍కు ఇబ్రహీం ఉద్యుక్తుడవుతుండగా అతని త్యాగానికి మెచ్చిన అల్లాహ్‍ దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్‍ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచే బక్రీద్‍ రోజున ఖుర్బాని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లిం భావిస్తున్నారు.


ఖుర్బాని పరమార్థం ఏమిటి..?
ఖుర్బాని అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. ఖుర్బాని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం. దైవానికి సమర్పించడం. దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే, ఖుర్బాని ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, రక్తం, ఇవి అల్లాకు చేరవని, భక్తి, పారాయణత హృదయంలో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింల భావన. అంతే కాదు.. ప్రాణత్యాగానికైనా వెనుకాడడని ఇదే ఖుర్బాని పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదల ప్రజలకు, రెండో భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు.
ఖుర్బానిగా కోడిపుంజును ఇవ్వరాదు
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్‍ రోజున ఖుర్బాని ఇస్తారు. జిల్‍ హజ్‍ నెల 11, 12 రోజుల్లో కూడా కొన్ని చోట్ల ఖుర్భాని ఇస్తూనే ఉంటారని తెలుస్తుంది. ఖుర్భానిగా సమర్పించే జంతువులకు అవయవ లోపంలేని, ఆరోగ్యకర మైనవిగా ఉండాలి. ఒంటె, మేక లేదా గొర్రెను దైవమార్గంలో సమర్పించాలి. స్థోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలి. అల్లా నియమ నిబంధనల ప్రకారం ఖుర్బానిగా కోడిపుంజును ఇవ్వరాదు. ఐదేళ్ల వయసు పై బడిన ఒంటె, రెండేళ్ల పై బడిన ఎద్దు, కనీసం ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. ఖుర్భాని చేసే వ్యక్తీ వడ్డీతో కూడిన అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు. ఈ నియమాలను తప్పక పాటిస్తారు.
బక్రీద్‍ పండగ రోజున మటన్‍ మాత్రమే …
బక్రీద్‍ పండుగ సందర్భంగా మటన్‍ బిర్యానీ, మటన్‍ కుర్మా, మటన్‍ కీమా, షీర్‍ కుర్మా, కీర్‍ లాంటి వంటకాలను తయారు చేస్తారు.ఇతరత్రా వంటకాలు చేస్తారు. మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు. సమాధులను అందంగా అలంకరిస్తారు. వారికిష్టమైన దుస్తులు, భోజనం అక్కడ ఉంచుతారు. స్వర్గంలో
ఉన్న వారు వాటిని స్వీకరిస్తారని నమ్మకం. అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమోత్తమమైనది. ఆకలి అనేది అందరి సమానమైనది కాబట్టి ఈ పండగకు నిరుపేద కుటుంబాలకు శక్త్యనుసారంగా దానధర్మాలు చేస్తూ కొంత కొంత మందికైన ఆకలి తీర్చగాలిగాం అని సంతృప్తి చెందుతారు. ధర్మం అంటే దానగుణం ముడిపడి
ఉన్నదే మానవ ధర్మం. మతం ఏదైనా మానవత్వం గొప్పది.

  • సయ్యద్‍ ఖైజర్‍ భాష
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *