కోహినూర్ వజ్రము, మొనాలిసా పెయింట్ గురించి మనలో తెలియని వారుండరు. ఎందుకు వాటికి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అవి ఎంతో విలువైనవి మరియు అచ్చం వాటిలాగే ఉంటూ, వాటి స్థానాన్ని భర్తీ చేయగలిగిన కళా ఖండాలేవీ ఇంత వరకూ వెలుగులోకి రాలేదు. అందుకే వాటికి అంత ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇలా భౌతిక రూపంలో ఉన్న వస్తువులను డిజిటల్ రూపంలోకి మార్చి ఆన్‍లైన్ వేదికగా వేలం పాట నిర్వహిస్తే, చాలా మంది ఔత్సాహికులు వీటిని కోట్ల రూ।।లు వెచ్చించి కొనే అవకాశం ఉంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్స్గా వ్యవహరిస్తున్నారు. నాన్ ఫంజిబుల్ టోకెన్ విధానం ద్వారా అంతర్జాల మాధ్యమంలో క్రయ, విక్రయాలు జరుపుతూ సాధారణ స్థాయి వ్యక్తులు కూడా కోటీశ్వరులుగా మారే అవకాశం ఉందన్న సాంకేతిక నిపుణుల విశ్లేషణలు నాన్ ఫంజిబుల్ టోకెన్ల పట్ల మరింత ఆకర్షణీయతను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో నాన్ ఫంజిబుల్ టోకెన్ల ఆవిర్భావం, వాటి తీరుతెన్నుల గురించి విఫులంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అసలేమిటీ నాన్ ఫంజిబుల్ టోకెన్స్…!!
ఒక వస్తువు స్థానాన్ని మరొక వస్తువు భర్తీ చేయగలిగితే వాటిని ఫంజిబుల్ (మార్పిడికి వీలున్న వస్తువులు) వస్తువులు అంటారు. అలా కాకుండా మన దగ్గరున్న వస్తువు స్థానాన్ని భర్తీ చేయగల మరొక వస్తువు ఈ భూమిపైన లేకపోతే, అలాంటి వస్తువులను నాన్ ఫంజిబుల్ వస్తువులు (మార్పిడికి వీలులేని వస్తువులు) అంటారు.
మన దగ్గర ఇతరులు మార్పు చేయుటకు వీలులేని పెయింటింగ్, ఆటవస్తువులు, జీఐఎఫ్‍లు, ట్వీట్‍లు, సంగీతం, ఇమేజెస్ లాంటివి ఉన్నట్లయితే వాటిని అంతర్జాలంలో నాన్ ఫంజిబుల్ విభాగంలో అమ్మేందుకు నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆ వస్తువులకు ఇథీరియమ్ బ్లాక్‍చైన్ టెక్నాలజీ ద్వారా ఒక డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. ఇలా డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేయబడిన నాన్‍ఫంజిబుల్ వస్తువులను ‘‘నాన్ ఫంజిబుల్ టోకెన్‍లు’’ అని వ్యవహరిస్తారు.
నాన్‍ఫంజిబుల్ టోకెన్ల ఆవిర్భావం :
బ్లాక్ చైన్ బిట్‍కాయిన్ విధానంలో 2012లో మెని రోసెన్ ఫీల్డ్ అన్న సాంకేతిక నిపుణుడు రంగునాణేలు (Coloured Coins) అన్న భావనకు సంబంధించి ఒక పత్రాన్ని విడుదల చేశారు. ఇక్కడి నుండి నాన్ ఫంజిబుల్ టోకెన్ల ప్రస్తావన మొదలౌతుంది.
రంగు నాణేలు, బ్లాక్ చైన్ బిట్‍కాయిన్‍ల వాస్తవ ప్రపంచ ఆస్తుల (Real world Assets)ను సూచించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన విధానాలను వివరిస్తాయి. మరియు ఆ ఆస్తుల యాజ మాన్యాన్ని నిరూపించడానికి ఉపయోగించు కోవచ్చు.
ఇలా రంగు నాణేలు భవిష్యత్‍లో ఎన్‍ఎఫ్‍టీ (నాన్ ఫంజిబుల్ టోకెన్ల)ల అభివృద్ధి మరియు ప్రయోగాలకు పునాది వేసినప్పటికీ, బిట్ కాయిన్‍కు ఉన్న పరిమితుల కారణంగా రంగు నాణేలకు తగిన గుర్తింపు రాలేదు.
క్రిప్టోకరెన్సీ మార్కెట్‍లోకి ఇంకా ప్రవేశించక మునుపు – మే, 2014లో కెవిన్ మెక్‍కాయ్ అన్న మరో సాంకేతిక నిపుణుడు ‘‘క్వాంటం’’ అన్న పేరుతో మొట్టమొదటి ఎన్‍ఎఫ్‍టీని పరిచయం చేశాడు. ఇది బిందువులతో కూడిన (Pixelated) అష్టభుజి ఆకారంలో ఉంటుంది.
2014 నుండి 2016 వరకు బ్లాక్ చైన్ టెక్నాజీలో వివిధ రకాల ప్రయోగాలతో పాటు మెరుగైన పురోగతి కూడా కనిపించింది. 2014లో ఇథీరియమ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ పరిచయంతో ఎన్‍ఎఫ్‍టీల సరికొత్తయుగం ప్రారంభమైంది. డిజిటల్ ఆస్తులను సృష్టించడానికి ఒక గుర్తించదగిన సాధనంగా కౌంటర్‍పార్టీ ప్లాట్ ఫామ్ అన్న వేదిక ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ వేదిక ద్వారా 2016లో రేర్ పెప్స్ (Rare Pepes) అన్న పేరుతో ఎన్‍ఎఫ్‍టీలను విడుదల చేయడంతో ఎన్‍ఎఫ్‍టీలలో పోటీయుగం ప్రారంభమైంది. 2017 నుడి 2021 మధ్య కాలంలో ఎన్‍ఎఫ్‍టీలు ప్రజాబాహుళ్యం (Public)లోకి ప్రవేశించాయి. ఎన్‍ఎఫ్‍టీల పట్ల ఆసక్తి పెరిగేకొద్దీ, వాటి పెరుగుదల కూడా వేగాన్ని అందుకుంది. ఇథీరియమ్‍తో పాటు ఇతర బ్లాక్ చైన్ ఆధారిత సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించి కొత్తరకమైన ఎన్‍ఎఫ్‍టీలను విడుదల చేయడంతో పాటు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. ఎన్‍ఎఫ్‍టీలకు వస్తున్న డిమాండ్‍ను చూసి రాబోయేది ఎన్‍ఎఫ్‍టీల యుగమేనని ప్రధానస్రవంతి మీడియా అభివర్ణించింది. అందుకే తాజాగా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎన్‍ఎఫ్‍టీలు ఒక ముఖ్యమైన అంశంగా మారాయి.
ఎన్‍ఎఫ్‍టీలు ఎలా పనిచేస్తాయి!!
1.ఎన్‍ఎఫ్‍టీలు బ్లాక్‍చైన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి. ప్రధానంగా ఇథీరియమ్ ఆధారిత బ్లాక్‍చైన్ టెక్నాలజీతో వీటిని నిర్వహించవచ్చు.
2.ఒక భౌతిక వస్తువును చేతులు మారకుండా డిజిటల్ రూపంలోకి మార్చి అంతర్జాల ఆధారిత ఎన్.ఎఫ్.టీ మార్కెట్ వేదికలలో విక్రయించినపుడు ఆ ఎన్‍ఎఫ్‍టీ కొనుగోలుదారు బ్లాక్‍చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ యాజమాన్య ధృవీకరణ పత్రాన్ని(Digital Owner Ship Certificate) పొందుతారు. ఇలా ధృవీకరణ పత్రం విడుదలై, బ్లాక్‍చైన్ ద్వారా ధృవీకరణ జరిగిన తరువాత ఇది ఒక రహస్య సంచి (Crypto wallet)తో నిల్వ చేయబడుతుంది.
3.ఎన్‍ఎఫ్‍టీలు ఒకేసారి ఒక యజమానిని మాత్రమే కలిగి ఉంటాయి.
4.ఎన్‍ఎఫ్‍టీలు సాధారణంగా ఓపెన్‍సీ, వేరియంట్, ఫౌండేషన్, నిఫ్టీగేట్‍వే లాంటి మార్కెట్ ప్లేస్‍ల ద్వారా విక్రయించబడతాయి, కొనుగోలు చేయబడతాయి మరియు వేలం వేయబడతాయి.
ఎన్‍ఎఫ్‍టీలు – ప్రధాన లక్షణాలు
1.మార్పిడి వీలు లేనివి (Non fungible)
ఏవైనా రెండు ఎన్‍ఎఫ్‍టీలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు. తద్వారా వాటిని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు వీలుకాదు. ఎన్‍ఎఫ్‍టీలను వేరే వాటితో భర్తీ చేయుటకు వీలుకాదు. ఈ లక్షణాలే ఎన్‍ఎఫ్‍టీలకు ప్రత్యేక విశిష్టతను తెచ్చి పెట్టాయి. విశిష్టమైన ప్రతి ఎన్‍ఎఫ్‍టీ యొక్క ఆస్తి ప్రత్యేకమైన టోకెన్లయొక్క మెటాడేటాలో నిల్వచేయబడుతుంది.
2.డిజిటల్ రూపంలో లభ్యత తక్కువగా ఉన్న వనరు (Digitally Scarce resource)
ఎన్‍ఎఫ్‍టీలు చాలా విలువైనవి. కాబట్టి, అవి డిజిటల్ రూపంలో చాలా తక్కువగా లభ్యమౌతాయి.
3.అవిభాజ్యమైనవి (Indivisible)
ఎన్‍ఎఫ్‍టీలను చిన్నచిన్న మారకాలుగా (Smaller denominations) విభజించలేము. అనగా ఎవరైనా ఎన్‍ఎఫ్‍టీలలో కొంత భాగాన్ని మాత్రమే కొనుగోలు చేయలేరు మరియు బదిలీ చేయలేరు.
4.మోసనిరోధకాలు (Fraud Proof)
ఎన్‍ఎఫ్‍టీల విడుదల, బదిలీ మరియు నిర్వహణ అనేది వికేంద్రీకృత మరియు మార్చుటకు వీలుకాని పబ్లిక్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్‍లలో నిర్వహించబడి ధృవీకరించబడతాయి. కొనుగోలు దారులు ప్రతి నిర్దిష్ట ఎన్‍ఎఫ్‍టీ యొక్క ప్రామాణికతను స్వయంగా పరిశీలించడం ద్వారా విశ్వసించవచ్చు.
5.యాజమాన్యం మరియు ప్రామాణికత ధృవీకరణ (Ownership and Authenticity certification)
ప్రతి ఎన్‍ఎఫ్‍టీ నమోదు చేయబడే మెటాడేటా అనేది మార్పు చేయుటకు వీలుకాని ఒక రికార్డు అని చెప్పవచ్చు. అదే విధంగా ప్రతి ఎన్‍ఎఫ్‍టీ ఒక ప్రామాణిక ధృవపత్రాన్ని పొందుతుంది. ఎన్‍ఎఫ్‍టీలను సృష్టించిన వాటి అసలు సృష్టికర్తలు ఎన్‍ఎఫ్‍టీలను కలిగి ఉన్న ఖాతాలను ఒక ప్రైవేట్ కీ ద్వారా నియంత్రిస్తారు. తద్వారా వారు ఎన్‍ఎఫ్‍టీలను ఏ ఖాతాలకైనా బదిలీ చేయవచ్చు.
6.పరస్పర మార్పిడి (Inter operability)
ఎన్‍ఎఫ్‍టీలను వికేంద్రీకృత వారధుల (Decentralized bridge)లేదా కేంద్రీకృత రక్షణాత్మక సేవ (Centralized Custodial Service)లను ఉపయోగించి వివిధ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాజీలలో క్రయ, విక్రయాలు జరపవచ్చు.
క్రిప్టోకరెన్సీ మరియు ఎన్‍ఎఫ్‍టీల మధ్య వైవిధ్యం :
క్రిప్టోకరెన్సీ మాదిరిగానే ఎన్‍ఎఫ్‍టీలు ఒకేరకమైన పోగ్రామింగ్‍ను ఉపయోగించి నిర్మించబడినప్పటికీ అవి ఒకే మాదిరిగా ఉండవు. భౌతికంగా మనం ఉపయోగించే కరెన్సీ నోట్లు మరియు క్రిప్టో కరెన్సీలు ఒకదానితో మరొకటి భర్తీ చేయవచ్చు లేదా మార్పిడి చేయవచ్చు. అయితే ప్రతి ఎన్‍ఎఫ్‍టీకి ఒక డిజిటల్ ధృవ పత్రం ఉన్నందున వాటిని ఒకదానితో మరొకటి మార్పిడి చేయుటకు వీలుకాదు. అనగా ఇవి నాన్‍ఫంజిబుల్ స్వభావాన్ని కల్గి ఉంటాయి.
ఎన్‍ఎఫ్‍టీలు – భారతదేశం
నిశితంగా పరిశీలించినట్లయితే ఇటీవలికాలంలో భారతదేశంలోని ధనికవర్గాలలో ఎన్‍ఎఫ్‍టీల పట్ల ఆదరణ క్రమంగా పెరుగుతోందని చెప్పవచ్చు. ఎప్పుడూ బంగారం, రియల్‍ఎస్టేట్, నిర్మాణరంగం లాంటి రంగాల్లోనే కాకుండా మనదేశంలోని ధనిక వర్గాలు ఎన్‍ఎఫ్‍టీలలో కూడా పెట్టుబడులు పెడుతూ, తమ పెట్టుబడుల ప్రాథమ్యాలలో వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తద్వారా ఎన్‍ఎఫ్‍టీలు ఆస్తి తరగతి (Asset Class) విశ్వసనీయతను పొందు తున్నాయి. ఉదా।। రామ్‍గోపాల్ వర్మ తన డేంజరస్ అన్న సినిమాను, దుల్కర్ సల్మాన్ తన ‘‘కురుప్’’ అన్న సినిమాను ఎన్‍ఎఫ్‍టీలో అమ్మకానికి పెట్టారు.
నాస్‍కామ్ అధ్యయనం ప్రకారం మనదేశంలోని సగానికి పైగా రాష్ట్రాలలో ప్రభుత్వ రంగం బ్లాక్‍చైన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానానికి మద్దతునిచ్చి, నడిపిస్తోంది. పరిశ్రమల ద్వారా పెద్ద ఎత్తున నిర్వహించ బడుతున్న వ్యాపారరంగంలో బ్లాక్‍చైన్ ఆధారిత అనువర్తనాలు విస్త•తమైన ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి.
అయితే మనదేశంలో ఎన్‍ఎఫ్‍టీల కొనుగోలు మరియు అమ్మకాన్ని నిషేధించే ప్రత్యేకమైన చట్టమేదీ లేదు. క్రిప్టోకరెన్సీల పట్ల మనదేశంలో నెలకొని ఉన్న ఒక అస్పష్టపూరిత వాతావరణం, ఎన్‍ఎఫ్‍టీల వర్తకంపై కూడా ప్రభావం చూపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.
‘‘క్రిప్టోకరెన్సీ నిషేధం మరియు అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ-2019’’ పేరుతో ఉన్న క్రిప్టోకరెన్సీ ముసాయిదా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తరువాత ఎన్‍ఎఫ్‍టీల క్రయ విక్రయాల నియంత్రణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్‍ఎఫ్‍టీల వ్యాపారం సులభశైలిలో జరగాలంటే భారతదేశంలో క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత కల్పించాలి. దీంతో పాటు మనీ లాండరింగ్, మేధోసంపత్తి హక్కుల
ఉల్లంఘన, పన్నుల విధింపు విషయంలో అనేక ఆందోళనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్‍ఎఫ్‍టీల వర్తకం విషయంలో మెరుగైన, ముందు చూపుతో కూడిన వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది.
అనుకూలతలు :
1.డిజిటల్ ఆస్తిపై యాజమాన్య హక్కులు (Ownership Rights over a digital Asset)
ఏదైనా ఒక భౌతిక వస్తువును డిజిల్ రూపంలో ఎన్‍ఎఫ్‍టీలుగా మార్చిన వాటి సృష్టికర్తలకు (Creators) దానిపై యాజమాన్య హక్కులుంటాయి. ఆ ఎన్‍ఎఫ్‍టీని ఒకరి నుండి మరొకరికి అమ్మేకొద్దీ దాని సృష్టికర్తలకు లాభాల నుండి 10 శాతం ఆదాయం బదిలీ చేయబడుతుంది.
2.ప్రత్యేకమైనది మరియు సేకరించదగినది (Unique and collectable)
ఎన్‍ఎఫ్‍టీలు ప్రత్యేకమైనవి మరియు అరుదైనవి కాబట్టి వాటిని సేకరించాలనే కోరిక ప్రజల్లో ప్రబలంగా ఉంది.
3.మార్పులేని తత్వం (Immutability)
ఎన్‍ఎఫ్‍టీలు బ్లాక్‍చైన్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తాయి. కావున వాటిని సవరించడం, నిర్మూలించడం, లేదా వేరొకదానితో పునఃప్రతిష్టించడం అసాధ్యం. ఒక డిజిటల్ కంటెంట్ యొక్క ఆవిర్భావాన్ని మరియు ప్రామాణికతను కూడా నిరూపించేందుకు అవి సహకారాన్ని అందిస్తాయి.
ప్రతికూలతలు
1.ఊహాజనిత మార్కెట్ (Speculation Market)
ఎన్‍ఎఫ్‍టీల యొక్క నిజవిలువ ఇంత వరకూ నిర్ధారించబడలేదు. భావోద్వేగపూరిత నాణ్యత (Emotive Quality)™పై ఆధారపడి మాత్రమే వాటి విలువను నిర్ణయిస్తున్నారు. తద్వారా ఎన్‍ఎఫ్‍టీల వర్తకం అనేది ప్రస్తుతం ఒడిదుడుకుల దశలో ఉంది.
2.డిజిటల్ ఆస్తుల యొక్క అనుకరణ ప్రమాదం (Risk of Imitation of Digital Assets)
ఎన్‍ఎఫ్‍టీలు డిజిటల్ ఆస్తులైనప్పటికీ దానిని సరిపోలిన కాపీలు లేవని చెప్పలేము. దాని అనుకరణను నియంత్రించవచ్చు కాబట్టి అనుకరించే ప్రమాదం ఉంది. వివిధ వెబ్‍సైట్‍లలో ఉంచబడిన పెయిం టింగ్, జీఐఎఫ్ మరియు వీడియోల యొక్క ప్రామాణికత యొక్క టోకెన్ యజమాని వద్ద ఉంటుంది. కాబట్టి అవి అనేకసార్లు అనుకరించవచ్చు.
3.అధిక ఇంధన వ్యయం (High Fuel Cost)
ఎన్‍ఎఫ్‍టీలు బ్లాక్‍చైన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి కాబట్టి సమాచారాన్ని రికార్డులో నమోదు చేయడానికి పెద్ద మొత్తంలో కంప్యూటర్లు మరియు వాటిని నిర్వహించడానికి విద్యుచ్ఛక్తి అవసరం. అధిక ఇంధన వినియోగం పర్యావరణానికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. తద్వారా ఎన్‍ఎఫ్‍టీల ద్వారా సృష్టించబడే డిజిటల్ ఆస్తులు సుస్థిరమైనవా కాదా అన్నది నిర్ధారించడం కష్టం.
4.దొంగిలించబడే ప్రమాదం (Risk of theft)
మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఎన్‍ఎఫ్‍టీలు బ్లాక్‍చైన్ వంటి సుస్థిరమైన సాంకేతికతతో నిర్వహించబడుతున్నప్పటికీ ఎన్‍ఎఫ్‍టీల క్రయవిక్రయాలు జరిపే ట్రేడింగ్ ప్లాట్ ఫాంలు మరియు ఎక్సేంజీలు పూర్తిగా సురక్షితం కాదు. సైబర్ నిబంధనల ఉల్లంఘనల వల్ల ఎన్‍ఎఫ్‍టీలు చోరీకి గురైనట్లు అనేక నివేదికలు తెలుపుతున్నాయి.
చివరిగా :
అనూహ్యంగా, రెట్టించిన వేగంతో వివిధ రూపాలలో నేడు డిజిటల్ టెక్నాలజీ పురోగమిస్తున్నందున, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత ఎన్‍ఎఫ్‍టీలలో చిన్నచిన్న లోపాలను సవరించినట్లయితే భవిష్యత్ డిజిటల్ లావాదేవీలలో అవి ప్రభంజనం సృష్టించడం ద్వారా మానవాళికి మహోపకారం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
-పుట్టా పెద్ద ఓబులేసు, ఎ : 9550290047