‘‘గోదావరి వరదలు ప్రకృతి విపత్తే’’ కాళేశ్వరం పంప్‍ హౌజ్‍ మునకపై TJAC లేవనెత్తిన అంశాలకు వివరణలు


జులై 12, 13, 14 తేదీల్లో రాష్ట్రంలో కురిసిన అతి భారీ వర్షాలకు గోదావరి నదిలో వచ్చిన వరద నీరు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నేపల్లి పంప్‍హౌజ్‍లను పూర్తిగా ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ మునకకు ప్రకృతి విపత్తే కారణం అని కళ్ళకు కనబడుతూనే ఉన్నది. ఈ విషయంలో ఏమీ ఆందోళన చెందే అవసరంలేదు. ఇటువంటి సంఘటనలు గతంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో, దేశంలో ఇతర ప్రాంతాలలో కూడా సంభవించాయని సాగునీటి శాఖ ఎత్తిపోతల సలహాదారు శ్రీ పెంటారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు. అందులో 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలకు శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‍ కేంద్రం, కల్వకుర్తి పంప్‍ హౌజ్‍ మునిగి పోయిందని పేర్కొంటూ వాటిని అతి స్వల్ప కాలంలోనే పునరుద్దరించినామని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాజకీయాలు పక్కన బెట్టి సమాజం అంతా ఏకతాటిపై నిలబడి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయినా కూడా ప్రతి పక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు అయితే పెంటారెడ్డి గారిని ఆయన అనుభవాన్ని, వయసును కూడా లెక్క చేయకుండా దుర్భాషలాడడం మనం చూసాము. రాజకీయ పార్టీల వైఖరిని పక్కన బెడితే.. రాజకీయ పార్టీ కాని తెలంగాణ ఉద్యమ సంస్థ అయిన తెలంగాణ జాయింట్‍ యాక్షన్‍ కమిటీ కూడా తన సామాజిక బాధ్యతను మరచి కాళేశ్వరం పంప్‍హౌజ్‍ల మునకపై అసంబద్ద విమర్శలు చేసింది. డిజైన్‍ లోపాలను, నాణ్యతా లోపాలను కప్పి పుచ్చడానికే ప్రకృతి విపత్తు అంటున్నారని వారి ప్రధాన విమర్శ. వారి విమర్శలకు వివరమైన సమాధానాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.


TJAC: కనీస ఇంజనీరింగ్‍ పరిజ్ఞానం… నాణ్యత లేకుండా కట్టిన ‘‘కాళేశ్వరం’’ ప్రాజెక్టు డొల్లతనం ఒక్కవరదతో బయటపడింది. ఇరిగేషన్‍ ప్రాజెక్టుల డిజైన్‍కు సెంట్రల్‍ వాటర్‍ కమిషన్‍ (CWC) నిర్దేశించిన స్థాయి వరద రాకుండానే రెండు పంపు హౌసులు (అన్నారం, మెడిగడ్డ) పూర్తిగా మునిగిపోయాయి… కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది… సెంట్రల్‍ వాటర్‍ కమిషన్‍ గోదావరిపై నిర్మాణాలకు నిర్దేశించిన డిజైన్‍ ప్రవాహ అంచనాలతో, నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదు…
వివరణ : ఈ సంవత్సరం సంభవించినది 500 సంవత్సరాలకు ఒకసారి (500 years frequency flood) వరద అన్న సంగతి మరచిపోయి చేస్తున్న విమర్శ తప్ప మరొకటి కాదు. కేంద్ర జల సంఘం వారు 30.10.2017 న కాళేశ్వరం ప్రాజెక్టుకు Hydrology క్లియరెన్స్ ఇచ్చినప్పుడు వారు అంచనా కట్టిన 500 years frequency flood పరిమాణం 81,576 క్యూమెక్కులు. అనగా 28,80,829 క్యూసెక్కులు. కాళేశ్వరం బ్యారేజి ఈ వరదను తట్టుకునే విధంగానే డిజైన్‍ చేయడం జరిగింది. బ్యారేజి నిర్మాణం వలన వచ్చే affluxను కూడా పరిగణనలోకి తీసుకొని 85 గేట్లు అమర్చడం జరిగింది. కేంద్ర జల సంఘం 1986 లో కాళేశ్వరం వద్ద నమోదు చేసిన అత్యున్నత వరద మట్టం (High Flood Level) 107.05 మీటర్లు. ఈ మట్టాన్నిపరిగణలోకి తీసుకొని, బ్యారేజి యొక్క కంట్రోల్‍ లెవెల్స్ (FRL,Gate hoistinglevel, Bridge level మొదలైనవి నిర్ధారించడం జరిగింది. కరకట్టల నిర్మాణం, పంప్‍ హౌజ్‍ల నిర్మాణం చేయడం జరిగింది. కేంద్ర జలసంఘం ప్రమాణాల ప్రకారం గోదావరి నదిలో కాళేశ్వరం వద్ద నది వరద మట్టం 103.5 మీటర్లు ఉంటే అది వార్నింగ్‍ లెవెల్‍గా పరిగణిస్తారు. నది 104.75 మీటర్ల మట్టం వద్ద ప్రవహిస్తుంటే అప్పుడు డేంజర్‍ లెవెల్‍ దాటిందని చెప్పవచ్చు.
కాళేశ్వరం వద్ద గోదావరి వరద మట్టం 1986లో నమోదు అయిన HFLకు మించి 108.19 మీటర్లు 14.7.22న నమోదు అయ్యింది. జులై 13-14 తేదీల్లో నమోదు అయిన వరద పరిమాణం 28-29 లక్షల క్యూసెక్కులకు పైగా ఉందని ఆంచానా కట్టారు. ఇవి తెలంగాణ ఇంజనీర్లు నమోదు చేసినవి కావు, కేంద్ర జల సంఘం వారు నమోదు చేసినవని గమనించాలి.ఈ అసాధారణ వరద పరిస్థితి ఏర్పడిన కారణంగానే కన్నేపల్లి పంప్‍ హౌజ్‍ నీట మునిగిపోయింది తప్ప ఇందులో నాణ్యతా లోపం, డిజైన్‍ లోపం ఎక్కడ ఉన్నదో ఈ పత్రం రాసిన ఇంజనీరింగ్‍ నిపుణులకే తెలియాలి. ఇది పూర్తిగా ప్రకృతి విపత్తు అని స్పష్టంగా తెలిసి పోతున్నా సమస్యను ఒక రాజకీయ పార్టీ లాగా రాజకీయ కోణంలో విమర్శించడం TJAC చేయవలసిన పని కాదు.


TJAC: బ్యారేజీల నిర్మాణ ప్రభావం కారణంగా నదీ ప్రవాహ మార్గం కుచించుకు పోతుంది. నదీ ప్రవాహమార్గం తగ్గి పోవడంతో బ్యారేజీల ఎగువన ప్రవాహం ఎత్తు పెరుగుతుంది. దీన్ని బ్యాక్‍ వాటర్‍ ఎఫెక్ట్ (Back Water Effect) అంటారు. గతంలో వచ్చిన వరద కన్నా తక్కువ స్థాయి వరద వచ్చినా, నది ప్రవహించే ఎత్తు పెరగడానికి ఈ బ్యాక్‍ వాటర్‍ ఎఫెక్ట్ కారణం…. పంప్‍ హౌజుల నిర్మాణానికి ఈ బ్యాక్‍ వాటర్‍ ఎఫెక్ట్ను పరిగణలోనికి తీసుకోవాలి.. ప్రస్తుతం కాళేశ్వరం పంప్‍ హౌజులు మునిగిపోవడానికి, ఈ బ్యాక్‍ వాటర్‍ ఎఫెక్ట్ పరిగణలోనికి తీసుకోకపోవడం, నాణ్యతాలోపాలే ప్రధాన కారణం.
1) రెండవది.. గతంలో కన్నా ఎక్కువ వరద వచ్చిందని కొంత మంది చేస్తున్న వాదన శుద్ద అబద్దం… ‘‘గతంలో ఇన్ని లక్షల క్యూసెక్‍ (cusec)ల ప్రవాహం వచ్చింది. ఇప్పుడు దాన్ని మించి ఇన్ని లక్షల క్యూసేక్‍ల నీళ్ళు ప్రవహించాయి. అందుకే పంప్‍ హౌజులు మునిగి పోయాయి’’ అనే మాట ప్రజలను పక్క దోవ పట్టించడమే…
2) ఎందుకంటే… వరద ప్రవాహం తక్కువగానే ఉన్నా పైన ఉన్న బ్యారేజీలలోని నీరు ఒకే సారి విడుదల చేయడంతో వచ్చే సమస్య ఇది. ఉదాహరణకు నది లో ఒక క్యూసెక్‍ నీటి ప్రవాహం ఉంది అనుకుంటే, సెకనుకు ఒక ఘనపుటడుగు (క్యూసెక్‍) నీరు నదిలో ప్రవహిస్తున్నట్టు… ఈ నీటిని మనం ఒక రిజర్వాయర్‍ లో రోజంతా నింపితే, ఆ రిజర్వాయర్‍ లో నీటి నిల్వ 86,400 (1ఞ60ఞ60ఞ24) ఘనపుటడుగులు ఉంటుంది. ఒక వేళ ఈ రిజర్వాయర్‍లో నిల్వ ఉన్న నీటిని, అంటే, మొత్తం 86,400 ఘనపుటడుగులను ఒకే గంటలో విడుదల చేస్తే, నదిలో ప్రవాహం 24 క్యూసెక్‍లుగా ఉంటుంది. అంటే సెకనుకు 24 ఘనపుటడుగుల చొప్పున గంటలో మొత్తం రిజర్వాయర్‍లోని 86,400 (24ఞ60ఞ60) ఘనపుటడుగుల నీరు నదిలో ప్రవహిస్తుంది. అంటే సాధారణ ప్రవాహం 1 క్యూసెక్‍ కాగా, మనం నిలువ చేసి, ఒకేసారి నీటిని విడుదల చేయడంతో ఈ ప్రవాహం 24 క్యూసెక్‍లుగా మారింది. ఇప్పుడు వస్తున్న వరదనీటి పరిమాణం గతం కన్నా తక్కువగా ఉన్నా, మనం రిజర్వాయర్లలో నిలువ ఉంచి ఒకేసారి వదులుతున్న నీటి పరిమాణం ఎక్కువ ఉండడంతో, గతం కన్నా వరద ఎక్కువ ఉన్నట్టు కనబడుతున్నది… ఇది రిజర్వాయర్ల, వరద ప్రవాహ నిర్వహణకు సంబంధించిన అంశం… పై ప్రాంతాల నుండి ఎంత ప్రవాహం వస్తున్నది అనే అంచనాలను బట్టి, మన రిజర్వాయర్లలో ఎంత నీరు నిల్వ ఉంచుకోవాలి, ముందే ఎంత నీటిని వదలాలి… అని ప్రణాళికలు ముందే సిద్దం చేసుకోవాలి…. క్యూసెక్‍లకు, ఘనపుటడుగులకు మధ్య ప్రజలను గందరగోళం చేసే ప్రయత్నం కనబడుతుంది.


వివరణ : డ్యాములకు, బ్యారేజిలకు తేడా తెలియని ఈ TJAC ఇంజనీరింగ్‍ నిపుణులు ఎవరో కాకి లెక్కలు కట్టి బ్యాక్‍ వాటర్‍ ఎఫెక్ట్ ను పరిగణనలోకి తీసుకోలేదు అని చెప్పి ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నారు. డ్యాంలను, బ్యారేజీలను డిజైన్‍ చేసేటప్పుడు తప్పనిసరిగా బ్యాక్‍ వాటర్‍ ఎఫెక్ట్ (afflux) లెక్క గట్టి ఆ ప్రభావాన్ని కూడా తగ్గించే విధంగానే గేట్ల సంఖ్యను నిర్ధారిస్తారు. డ్యాంలకైతే ఎగువన ఎంత దూరం, ఏ మట్టం వరకు నీరు చేరుతుందో లెక్కగట్టి రక్షణ చర్యలు తీసుకుంటారు. మేడిగడ్డ వద్ద నిజానికి 81,576 క్యూమెక్కుల వరదకు లెక్క గట్టిన గేట్ల సంఖ్య 77 మాత్రమే. కానీ అక్కడ అమర్చిన గేట్ల సంఖ్య 85. ఎందుకంటే affluxను నివారించడానికే అన్న సంగతి గమనించాలి. డ్యాంలు నీటి నిల్వ కోసం నిర్మిస్తారు. డ్యాంలో ప్రధానంగా నీటి నిల్వ కాంక్రీట్‍ గోడ ద్వారా జరుగుతుంది. కొద్ది పరిమాణంలో గేట్లు కూడా నిల్వ చేస్తాయి. బ్యారేజీలు నీటిని మళ్లించే diversion structures. నీటి నిల్వ మొత్తం గేట్ల ద్వారానే జరుగుతుంది. అయితే వరదల సందర్భంగా బ్యారేజి గేట్లు పూర్తిగా తెరచి free flow conditionలోనే ఉంచుతారు.
ఇక వారు వివరించిన పరిస్థితి డ్యాముల్లో ఉంటుంది తప్ప బ్యారేజీల్లో ఉండదు. వరద సమయంలో బ్యారేజి గేట్లు పూర్తిగా ఎత్తి వేసి free flow conditionలో ఉంచుతారు. కాబట్టి బ్యారేజి లేనప్పుడు నది ఏ విధంగా ప్రవహిస్తుందో అదే విధంగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిలని జూలై నెల ప్రారంభం నుంచే free flow conditionలోనే ఉంచారు ఇంజనీర్లు. బ్యారేజిలు ఈ స్థితిలో ఉన్నప్పుడు బ్యాక్‍ వాటర్‍ ఎఫెక్ట్ అనేది ఉండే ఆస్కారమే లేదు. అయితే నదిలో నీటి మట్టం ఎందుకు పెరుగుతుంది అన్నది ప్రశ్న.1986 లో గోదావరిపై ఏబ్యారేజి లేదు. అయినా వరద మట్టం 107.05 మీటర్లకు చేరింది కదా. దానికి కారణం ఏమిటంటే.. నదికి ఉండే సహజ ప్రవాహ సామర్థ్యంకు మించి నీరు నదిలోకి వస్తే నదిలో నీటి మట్టం పెరుగుతుంది. ఒడ్డును దాటి ప్రవహిస్తుంది.100 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న కాలువలో 200 క్యూసెక్కులు వదిలితే ఏమవుతుంది? నీరు కాలువ గట్లను దాటుకొని ప్రవహిస్తుంది. ఇదీ అటువంటిదే. ఈ స్థితి కొన్ని గంటలు ఉండవచ్చు, కొన్ని రోజులు ఉండవచ్చు. ఇది ఎగువన కురుస్తున్న వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. జూలై 13,14 తేదీల్లో కాళేశ్వరం సంగమం వద్ద గోదావరి నుంచి ప్రాణహిత నుంచి వస్తున్న వరద 29 లక్షలకు పైబడి ఉన్నది. ఇంత వరద సామర్థ్యాన్నితరలించే విస్తీర్ణం గోదావరి నది గర్భంలో లేదు కాబట్టే నది మట్టం 108 మీటర్ల పైన చేరింది. అప్పుడు కూడా మేడిగడ్డ బ్యారేజి free flow conditionలోనే ఉంది. కాబట్టి బ్యాక్‍ వాటర్‍ ఎఫెక్ట్ ను పరిగణనలోకి తీసుకోలేదు అన్నది పస లేని, river hydraulicపై అవగాహన లేకుండా చేసిన వాదన. వారు ప్రస్తావించిన బ్యాక్‍ వాటర్‍ ఎఫెక్ట్ అనేది storage reservoirs కి వర్తిస్తుంది కానీ వరద కాలంలో free flow conditionలో ఉండే బ్యారేజిలకు వర్తించదు.


పోలవరం బ్యారేజి కాదు. అది స్టోరేజ్‍ రిజర్వాయర్‍. పోలవరం మొత్తం నిల్వ సామర్థ్యం (Gross Storage) 194 టిఎంసిలు. జలాశయం నుంచి కాలువల్లోకి వాడుకోగలిగే నీటి నిల్వ (Live Storage) 75 టిఎంసి లు. మిగతా నీరు అంటే .. 119 టిఎంసిలు ఎప్పుడు డ్యాంలో నిలువ ఉంటాయి. దీన్ని డెడ్‍ స్టోరేజ్‍ అంటారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులను (Climatic Changes), ఈ ఏడు వచ్చిన వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోలవరం బ్యాక్‍ వాటర్‍ ప్రభావాలను (Back Water Effects) అధ్యయనం చేయాలని, తదనుగుణంగా గోదావరి తీర ప్రాంతాల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్‍ చేస్తున్నది.


ఇకపోతే గోదావరి నది వరదతో ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో చిన్న చిన్న వాగులను తనలో కలువనివ్వదు. దాని వల్ల వాగు ఎగువకు నీరు ఎగదన్నుతుంది. అన్నారం బ్యారేజి మునిగి పోవడానికి ఇదే కారణం. గోదావరికి కుడి వైపు నుంచి వచ్చే చందనాపూర్‍ వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కలువక పైకి ఎగదన్ని అన్నారం పంప్‍ హౌజ్‍ రక్షణ కోసం నిర్మించిన మట్టికట్ట పైనుంచి ప్రవహించి అన్నారం పంప్‍ హౌజ్‍ మునకకు కారణం అయ్యింది. చందనాపూర్‍ వాగులో ఈ స్థాయిలో afflux రావడం గతంలో ఎప్పుడూ లేదు. 0.5 మీటర్లకు మించని afflux ఈ సారి 1.5-2 మీటర్లకు దాకా పెరిగింది. అదే విధంగా బొక్కలవాగు పైకి ఎగదన్ని మంథని పట్టణాన్ని ముంచేసింది. ఈ సంగతులు river hydraulic పై అవగాహన ఉన్న ఇంజనీర్లు మాత్రమే కాదు ఏ మాత్రం విజ్ఞత ఉన్న వారైనా అర్థం చేసుకోగలరు. TJAC తరపున ఈ పత్రం రాసిన పెద్ద మనిషికి మాత్రం అర్థం అయినట్టు లేదు. ఆ జ్ఞాన సంపన్నుడు ఎవరో తెలిస్తే మా లాంటి వారం వినమ్రంగా ఒక నమస్కారం చేసుకుంటాము.


TJAC: మరో వైపు పంప్‍ హౌజ్‍ గేట్లు విరిగి పోయి మేడిగడ్డ పంప్‍ హౌస్‍ మునిగితే, దానిని వరద ప్రవాహానికి ముడి పెడుతున్నారు. ఇది నాణ్యతకు సంబంధించిన అంశం… నాణ్యతా లోపాలను ప్ర కృతికి ముడిపెట్టడం హాస్యాస్పదం…
వివరణ: ఏ నిర్మాణం అయినా దాన్ని డిజైన్‍ చేసినప్పుడు తీసుకున్న ఒత్తిడికి మించి ఒత్తిడి పెరిగితే విరిగిపోయే అవకాశం ఉంది. 20 మంది కూర్చోవడానికి కట్టిన వేదికల మీద 100 మంది ఎక్కితే వేదికలు కూలిపోయిన ఘటనలు ఎన్ని చూడలేదు! మేడిగడ్డ బ్యారేజీకి 20 కిమీ ఎగువన కన్నెపల్లి వద్ద పంప్‍ హౌజ్‍ నిర్మాణం అయ్యింది. పంప్‍ హౌజ్‍ Fore bayలోకి కూడా HFLను దాటి నీరు చేరినందున పంప్‍ హౌజ్‍ మునిగిపోయింది. పంప్‍ హౌజ్‍ రక్షణ గోడ విరిగిందా? ఎంత మేరకు విరిగింది? అనేది నీటిని తోడిన తర్వాత తెలుస్తుంది. ఇది కూడా అసాధారణ వరద ఒత్తిడికి సంభవించిన సంఘటన తప్ప డిజైన్‍ వైఫల్యం అనడానికి వీలు లేదు.
2009 లో కృష్ణా నదికి అసాధారణమైన వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‍ కేంద్రం, ఎస్‍ఎల్‍బిసి సొరంగం, కర్నూలు పట్టణం మునిగిపోయిన వాస్తవం మన ముందు ఉన్నది. శ్రీశైలం డ్యాం డిశ్చార్జ్ కెపాసిటీ FRL 885 అడుగుల వద్ద 12 లక్షల క్యూసెక్కులు, MWL 892 అడుగుల వద్ద 13 లక్షల క్యూసెక్కులు. అయితే ఆ ఏడు 25 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం డ్యాంకు చేరినాయి. డ్యాం MWLను దాటి 896 అడుగులకు చేరింది. ఆ అసాధారణమైన పరిస్థితిలో శ్రీశైలం విద్యుత్‍ కేంద్రం మునకకు డిజైన్‍ వైఫల్యంమే కారణమని ఎవరైనా అంటే నవ్విపోతారు. ఎస్‍ఎల్‍బిసి సొరంగంలో తవ్వకాలు జరుపుతున్న టన్నెల్‍ బోరింగ్‍ మెషీన్‍ కూడా ద్వంసం అయ్యింది. దాన్ని బయటకు తీసి మరమ్మతులు చేసి తిరిగి సొరంగంలో ప్రవేశ పెట్టడానికి రెండు సంవత్సరాలు పట్టింది.


2009లో శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన విపత్తు లాంటిదే ఈ సంవత్సరం కడం ప్రాజెక్ట్ కూడా ఎదుర్కొన్నది. ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన మొత్తం 18 గేట్లు తెరిస్తే నదిలోకి పోయే నీరు సుమారు 3 లక్షల క్యూసెక్కులు. జూలై 12,13 తేదీల్లో కడం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురిసిన అతి భారీ వర్షపాతానికి (40 సెంటీ మీటర్లు) కడం డ్యాం వద్దకు 5, 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ఈ వరదను నదిలోకి పంపించడానికి ప్రాజెక్టు ఇంజనీర్లు విశ్వ ప్రయత్నం చేసినారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) 700 అడుగులు ఉంటే డ్యాం డిశ్చార్జ్ సామర్థ్యానికి మించి వరద చేరిన కారణంగా డ్యాంలో నీటి మట్టం ఒక దశలో 705 అడుగుల వరకు పోయింది. ఈ స్థితి మరికొన్ని గంటలు కొనసాగి ఉంటే డ్యాం తెగి పోయే ప్రమాదం సంభవించేది. అదే జరిగి ఉంటే సముద్రం దాకా గోదావరి తీర ప్రాంతాలలో విపరీతమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించి ఉండేది. అదృష్టవశాత్తు ప్రకృతి సహకరించింది. ఎగువన వర్షపాతం తగ్గినందున వరద ఉదృతి కూడా తగ్గి డ్యాంలో నీటి మట్టం తగ్గుతూ వచ్చింది. జూలై 14 నాటికి డ్యాం ప్రమాదం నుంచి బయటపడిపోయింది. ఇది కూడా పూర్తి ప్రకృతి విపత్తుగానే పరిగణించాలి. కడెం వరదను అంచనా వేయడంలో ఇంజనీర్లు ఘోరంగా విఫలం అయినారని రాజకీయపరమైన విమర్శలు గుప్పించారు. కడం నదిపై వరదని అంచనా వేయడానికి గేజింగ్‍ స్టేషన్లు లేవు. కడం నదిలో కలిసే అనేక చిన్నచిన్న వాగుల నుంచి వచ్చే నీరు ఎంతనో డ్యాంను చేరే వరకు అంచనాకు రాదు. సుమారు 2500 చదరపు కిలోమీటర్ల చిన్నపరీవాహక ప్రాంతం నుంచి వచ్చే నీరు కొన్ని గంటల్లోనే కడం డ్యాంను చేరుకుంటాయి. గేజింగ్‍ స్టేషన్‍ లు లేకపోవడం వలన వరదను ఖచ్చితంగా అంచనా వేయడానికి ఇంజనీర్లకు సాధ్యం కాదు. ఈ ఏడు సంభవించిన వరదలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‍ లో 5,6 లక్షల క్యూసెక్కుల వరదను సురక్షితంగా కిందకు పంపడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నది. అట్లాగే కడం డ్యాంకు ఎగువన కుప్టి వద్ద మరో డ్యాం నిర్మాణాన్ని చేపట్టి రెండేండ్లలో పూర్తి చేస్తే కడం వద్ద వరద నియంత్రణ మరింత సులువు అవుతుంది. కుప్టి డ్యాం నిర్మాణానికి గతంలోనే ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో డ్యాం నిర్మాణాన్ని చేపడతామని బడ్జెట్‍ సమావేశాల్లో ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. కుప్టి ప్రాజెక్టు నిర్మాణం అయితే కడం డ్యాంలోకి ఎంత వరద ఎన్ని గంటల్లో రాబోతున్నది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఆ వరదను సురక్షితంగా కిందకు పంపించడానికి తగినంత జాగాను (Flood Cushion) డ్యాంలో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. డ్యాంలో నీటి మట్టం FRLను దాటకుండా చూసుకోవచ్చు.


ప్రకృతి విపత్తును అంగీకరించే సౌజన్యం లేని TJACగతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో విషం గక్కినట్టే ఇప్పుడూ అదే పని చేస్తున్నది. ప్రకృతి విపత్తులు సంభవించి నప్పుడు సమాజం అంతా రాజకీయ విభేధాలను పక్కనబెట్టిఏకతాటి మీద ప్రజలను ఆదుకునే పనిలో నిమగ్నం కావాలి. కానీ TJAC ఈ కనీస విజ్ఞతను, సామాజిక బాధ్యతను ప్రదర్శించలేక పోయింది.
TJAC: కేవలం భారీ కట్టడాలను చూపించి ‘‘ఇంజనీరింగ్‍’’ అద్భుతంగా అమాయక ప్రజలను మభ్యపెట్టారు… ఈప్రాజెక్టు ఇంజనీరింగ్‍ అద్భుతం కాదు… భారీ ఇంజనీరింగ్తప్పిదంగా ఇప్పటికే (2016,2018) టీజేఏసీ శాస్త్రీయంగా వివరిస్తూ పుస్తకాలు అచ్చువేసింది… ఇంకా పొంచివున్న ముప్పులు కూడా వివరించింది…
ఈ ప్రాజెక్టులో నాణ్యతాలోపాలు, డిజైన్‍ లోపాలు కోకొల్లలు… వీటిని నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు ఇంతకన్నా తీవ్రంగా ఉంటాయి… ఇలాంటి ప్రమాదాలు మల్లన్నసాగర్‍ వంటి భారీ ప్రాజెక్టువద్ద జరిగితే జరిగే ప్రాణ… ఆస్తినష్టాలు అంచనాకందవు.
ఇప్పటికైనా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతను, డిజైన్‍ లోపాలను సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంజనీరింగ్‍ నిపుణులతో తక్షణం ఒక కమిటీని వేసి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. లేకుంటే పాలకుల తప్పులకు తెలంగాణ ప్రజలు మరింత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
వివరణ : TJAC ప్రచురించిన‘‘కాళేశ్వరం ఎత్తిపోతల పధకం రీ ఇంజనీరింగ్‍- భారీ ఇంజనీరింగ్‍ తప్పిదం’’ పుస్తకంలో ప్రస్తావించిన అన్ని అంశాలను పూర్వపక్షం చేస్తూ, వారి వాదనల డొల్ల తనాన్ని ఎత్తి చూపుతూ గతంలోనే వివరమైన సమాధానాలు, వివరణలు తెలంగాణ ఇంజనీర్లు రాసి ఉన్నారు. ఆ వ్యాసాలను సంకలనం చేసి ‘‘తెలంగాణ జీవధార : కాళేశ్వరం ప్రాజెక్టు’’ అనే పుస్తకాన్ని కూడా తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం వారు ప్రచురించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఏ విధంగా ఒక జీవధారగా, ఒక ప్రగతి రథంగా మారిందో అనుభవజ్ఞులైన ఇంజనీర్లు ఆ వ్యాసాలలో వివరించారు. పాఠకులు ఆ పుస్తకాన్ని కూడా చదవమని కోరుతున్నాము.


కాళేశ్వరం ప్రాజెక్టు రోజుకు మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోసే భారీ ప్రాజెక్టు. ప్రాజెక్టులో భారీ కట్టడాలు ఉండక తప్పదు. అవి నిజంగా కూడా ఇంజనీరింగ్‍ అద్భుతాలే. ఇవి మేము చెపుతున్నది కావు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర జల సంఘం ఛైర్మన్‍ మసూద్‍ హుస్సైన్‍, చీఫ్‍ ఇంజనీర్‍ సికెఎల్‍దాస్‍, ఇతర CWC సీనియర్‍ ఇంజనీర్లు ప్రాజెక్టును కళ్ళారా చూసిన తర్వాత చెప్పిన వాస్తవాలు. తాము అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు తమ పదవీ కాలంలోనే పూర్తి కావడం తాము గతంలో ఎన్నడూ చూడని అద్భుతమని వారు కొనియాడారు. 10 స్టేజీల్లో నిర్మాణం అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా ప్రఖ్యాతి గాంచింది. గూగుల్‍ సెర్చ్ ఇంజన్‍ కూడా ఇదే చెపుతున్నది.


కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు మొత్తం 7 లింకుల్లో, 28 ప్యాకేజీల్లో వివిధ జిల్లాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 20 జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజిలు, 16 జలాశయాలు, మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్‍ దాకా 10 స్టేజిల ఎత్తిపోతలు, అన్ని లింకుల్లో కలిపి 21 పంప్‍ హౌజ్‍లు, 108 భారీ పంపులు, సర్జ్ ఫూల్స్, 98 కిమీ డెలివరీ పైపులు, డెలివరీ సిస్టెర్నస్, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, భారీ విద్యుత్‍ సబ్‍ స్టేషన్లు, వందల కిలోమీటర్ల విద్యుత్‍ లైన్లు.. ఇట్లా అనేక కాంపొనెంట్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. వీటిద్వారా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు; శ్రీరాంసాగర్‍, వరద కాలువ, నిజాంసాగర్‍, సింగూరు, వనదుర్గా ప్రాజెక్టులు, చెరువులు, చెక్‍ డ్యాంల కింద ఉన్న 26.75 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తం 45 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించడం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం.
ఈ సంగతి అటుంచితే కాళేశ్వరం ఏమి సాధించిందనేది కీలకమైన అంశం.

  1. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నదిని.. ధర్మపురి నుంచి సమ్మక్క సాగర్‍ దాకా సుమారు 200 కిమీ సజీవం చేసింది. ఇక గోదావరి ఎండిపోయే స్థితి ఎప్పటికీ రాదు. గోదావరి నదీ గర్భంలోనే ఎటువంటి గ్రామాల ముంపు, పునరావాసం లేకుండా 62.81 టిఎంసిల నీటిని నిల్వ చేయగలుగుతాము. దీనివల్ల గోదావరి తీర ప్రాంతంలో భూగర్భ జలాలు పైకి లేచినాయి. మత్స్య కారులకు గొప్ప మేలు జరిగింది. ఈ ప్రాంతంలో భవిష్యత్‍లో పరిశ్రమ స్థాపనకు, దేశీయ జల రవాణాకు, టెంపుల్‍ & ఎకో టూరిజం అభివ•ద్దికి బాటలు వేసింది.
  2. 10 స్టేజీల్లో ఎత్తిపోతల నిర్మాణాలు, రాజరాజేశ్వర (మిడ్‍ మానేరు), అన్నపూర్ణ, రంగనాయక సాగర్‍, మల్లన్నసాగర్‍, కొండపోచమ్మసాగర్‍ జలాశయాల నిర్మాణం పూర్తి కావడంతో శ్రీరాంసాగర్‍, నిజాం సాగర్‍, సింగూరు, వన దుర్గా (ఘనపూర్‍ ఆనకట్ట), వరదకాలువ, వేలాది చెరువులు, చెక్‍ డ్యాంల కింద సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందింది. శ్రీరాంసాగర్‍ రెండో దశ ఆయకట్టుకు రెండు పంటలకు నికరంగా నీరు అందుతున్నది. కాలువలు తవ్విన 20 ఏళ్ళకు ఈ కాలువల్లో నీరు ప్రవహిస్తున్నదంటే అది కాళేశ్వరం ఫలితమే. సూర్యాపేట జిల్లాలో ఆయకట్టు చిట్ట చివరన ఉన్న భూములకు కూడా నీరు అందుతున్నది.
  3. ఇప్పటికే పైన పేర్కొన్న జలాశయాల కింద సిద్దిపేట, మెదక్‍, సిరిసిల్ల కరీంనగర్‍ జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో కాలువల వ్యవస్థ నిర్మాణం అవుతున్నా కొద్దీ కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టులలో కాలక్రమేణా ఆయకట్టు అందుబాటులోకి రావడం సాధారణంగా జరిగేదే.
  4. మిషన్‍ భగీరథ ద్వారా వేలాది గ్రామాలకు తాగునీరు, రాబోయే 50 ఏళ్ల వరకు గ్రేటర్‍ హైదబాదాద్‍ నగరానికి తాగునీరు, గ్రేటర్‍ హైదరాబాద్‍లో వెలసిన పరిశ్రమలకు నీటి సరఫరాకు కాళేశ్వరం పూర్తి భద్రతను కలిగించింది. వీటి కోసం ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సరఫరా చేయ గలుగుతుంది. మంత్రి హరీష్‍ రావు గారు అన్నట్టు.. కాళేశ్వరం Any Time Water ప్రాజెక్టు. ఈపాటికే కాళేశ్వరం ఫలితాలు ప్రజల అనుభవాల్లోకి వచ్చాయి.
  5. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ, టూరిజం, పట్ణాణాభివృద్ది, పర్యావరణం, దేశీయ జల రవాణా తదితర రంగాలను ప్రభావితం చేసి తెలంగాణా సమగ్ర వికాసానికి దోహదం చేసే ఒక ప్రగతి రథం (Growth Engine). ఎవరు ఎంత అక్కసు వెళ్లగక్కినా అదే నిజం.
  • శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *