కాకతీయ వైభవ సప్తాహం వరంగల్‍ గడ్డపై అడుగుపెట్టిన కమల్‍చంద్ర భంజ్‍దేవ్‍


తెలంగాణ ప్రభుత్వం జులై 7 నుండి 13 తేదీ వరకు వారం రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించడం ముదావహం. మధ్యయుగం (12-14 శతాబ్దాలు)లో విలసిల్లిన కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. కాకతీయుల నిర్మాణాలైన దేవాలయాలు, కోటలు, తవ్వించిన చెరువులు, వారి కళాపోషణ వంటివాటి గురించి ఈ తరానికి స్ఫూర్తినందించే విధంగా కార్యక్రమాల ద్వారా తెలియ జేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చందుపట్లలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఇక్కడే కాకతీయ సామ్రాజ్యానికి గొప్ప పేరు తెచ్చిన రుద్రమదేవి మరణాన్ని తెలియజేసే శాసనం ఉంది. వరంగల్‍ జిల్లాలో ఉన్న అనేక కాకతీయ కట్టడాలు, చెరువుల దగ్గర మిగతా కార్యక్రమాలు జరిగాయి.
వరంగల్‍ను పూర్వం ‘ఏకశిలా నగరం’, ఓరుగల్లు అనీ పిలిచేవారు. ‘కాకతి’ అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులకు ఆ పేరు వచ్చింది. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటివారు ఈ రాజుల్లో పేరుపొందినవారు. వీరు వ్యవసాయం కోసం వేలాది చెరువులను తవ్వించారు. అందులో ముఖ్యమైనవి పాకాల, లక్నవరం, బయ్యారం చెరువులు.


వరంగల్‍ కోట, హనుమకొండ లోని వేయి స్తంభాల గుడి, పాలంపేట రామప్ప దేవాలయం వంటి ప్రసిద్ధ దేవాలయాలు, అనేక తోరణాలు వీరి కాలంలోనే నిర్మితమయ్యాయి. అందులో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా కూడా లభించింది. అలనాడు తవ్విన అనేక చెరువులు ఇప్పటికీ తెలంగాణలో వ్యవసాయానికి ప్రాణాధారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాటి చెరువుల పునరుద్ధరణకు ‘మిషన్‍ కాకతీయ’ను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంగా కాకతీయుల ‘తోరణా’న్ని గ్రహించారు. హంసలు, పూర్ణకుంభం, గర్జించే సింహాలు, మొసలి వంటి శిల్పాలు ఈ తోరణంపై ఉన్నాయి.
ఓరుగల్లు కేంద్రంగా రాజ్యపాలన సాగించిన కాకతీయ రాజులు ప్రజల మెరుగైన జీవనం కోసం తెచ్చిన పథకాలు, చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ ఆదర్శనీయమే. ఇందులో భాగంగా బంజ్‍దేవ్‍ వరంగల్‍కు విచ్చేసి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. తమ వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్‍దేవ్‍ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్‍ చంద్ర భంజ్‍దేవ్‍ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.


తల్లి చెంతకు చేరుకున్నట్లు ఉంది…

ఓరుగల్లును సందర్శించే అవకాశం రావటం చూస్తుంటే తిరిగి నా తల్లి చెంతకు చేరుకున్నట్లు అనిపిస్తోంది. మాటల్లో చెప్పలేని ఆనందంతో మనస్సు నిండిపోయింది. వరంగల్‍ ప్రజలతో వీడదీయరాని ఆత్మీయ సంబంధం ఎప్పటికీ ఉంటుంది. వరంగల్‍ గురించి, కాకతీయ వైభవం గురించి నాకు ఎప్పటి నుంచో అవగాహన ఉంది. నేను ఉన్నతవిద్య కోసం లండన్‍ వెళ్లా. మాస్టర్స్ ఇన్‍ ఇంటర్నేషనల్‍ సైన్స్, మాస్టర్స్ ఇన్‍ పొలిటికల్‍ సైన్స్ పూర్తి చేశా. 2009లో తిరిగి భారత్‍కు వచ్చా. ఇప్పుడు నా మూలాలను వెతుక్కుంటూ మళ్లీ ఓరుగల్లుకు వస్తున్నా.
ప్రజాపాలన సాగించింది మా పూర్వీకులే…
రాచరిక చరిత్రలో ప్రజాపరిపాలన సాగించింది కేవలం కాకతీయులు మాత్రమే. మా పూర్వీకులు ప్రజల కోసం ఎన్నో బహుళార్ధ ప్రాజెక్టులు, నిర్మాణాలు, చారిత్రక కట్టడాలు నిర్మించారు. అందుకే ప్రజలు మా వంశీయులని రాజుగా కాకుండా దేవుడిగా చూస్తారు. వరంగల్‍ ప్రజలు ఎప్పుడూ నా వాళ్లే. వారి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. కాకతీయ సంస్కృతిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన అవసరముంది. కాకతీయ గత వైభవానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథస్తం చేస్తా.


బస్తర్‍ కేంద్రంగానే కాకతీయుల పాలన…

బస్తర్‍ వేదికగా రాజ్య పరిపాలన ప్రారంభించింది కాకతీయ రాజులే. 22 తరాలుగా మా వంశీయులు కాకతీయ మూలాలతోనే రాజ్య పరిపాలన చేశారు. మేము కాకతీయ రాజులమేనని పలు శాసనాల్లో ఆధారాలున్నాయి. నాటి బ్రిటిష్‍ ప్రభుత్వం విడుదల చేసిన మెమొరాండం ఆఫ్‍ ది ఇండియన్‍ స్టేట్స్ పుస్తకంలో కూడా మేము కాకతీయ రాజులమేనని ప్రస్తావించింది. బస్తర్‍ వేదికగా ఉన్న పలు శాసనాల్లో కూడా మా వంశం గురించి పొందుపరిచారు. నేటికీ మా సామ్రాజ్యం బస్తర్‍లో విస్తరించి ఉంది. నేను జగదల్‍పూర్‍లో ఉన్న కోటలో ఉంటున్నా.
తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు..
కాకతీయ వైభవ సప్తహం కార్యక్రమాలకు నన్ను ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‍గారికి, రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు. జగదల్‍పూర్‍లోని నా ప్యాలెస్‍కి వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించిన చీఫ్‍ విప్‍ దాస్య వినయ్‍ భాస్కర్‍, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణకు ప్రత్యేక ధన్యావాదాలు.


కాకతీయ పండుగ తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది: కేటీఆర్‍
700 ఏళ్ల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాకతీయ ఉత్సవాలు ప్రతిబింబిస్తాయని మంత్రి కేటీఆర్‍ అన్నారు. ప్రజా సంక్షేమానికి, మానవీయ స్ఫూర్తికి మారుపేరుగా నిలిచిన కాకతీయ పాలకులను ఇప్పటికీ తెలంగాణ సమాజం గర్వంగా తలుచు కుంటుందని అన్నారు. కాకతీయుల స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్‍ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్‍ కాకతీయ’ పేరుతో రాష్ట్రంలోని చెరువుల పునురుద్ధరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని మంత్రి తెలిపారు. 700 సంవత్సరాల కాకతీయ రాజులు వారి సేవలను మరియు మన గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని కూడా ఈ వారం రోజుల వేడుకలు గుర్తుచేస్తాయని అన్నారు.
ఈ నేపథ్యంలో వేడుకల్లో భాగంగా కాకతీయుల విశిష్టతను తెలిపేలా మాదాపూర్‍లోని చిత్రమయి స్టేట్‍ ఆర్ట్గ్యాలరీలో అరవింద్‍ ఆర్య, టార్చ్ సంస్థ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‍లో కాకతీయుల వైభవాన్ని తెలిపే 777 చిత్రాలను ఉంచారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్‍ను కమల్‍చంద్ర భంజ్‍దేవ్‍తో కలిసి మంత్రులు కేటీఆర్‍, శ్రీనివాస్‍గౌడ్‍ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‍ విప్‍ దాస్యం వినయ్‍ భాస్కర్‍, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‍, రసమయి బాలకిషన్‍, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మేయర్‍ గద్వాల్‍ విజయ లక్ష్మి, రవీందర్‍, టీవీ కళాకారుడు విజయ్‍, నాణేల ఎక్స్ఫర్ట్ వైకుంఠాచారి తదితరులు పాల్గొన్నారు.

  • దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *