గ్రామనామాలు – చారిత్రకప్రాధాన్యత


తొస్సిపూడి తాడి తొండంగి ముంగొండ
లొల్ల పూళ్ళ దూసి గుల్లిపాడు
ఆముదాలవలస అనమనయూర్లయా
విశ్వదాభిరామ వినురవేమ!


అని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఊర్ల పేర్లమీద ఒక పేరడీ పద్యం రాశారు. ఆయన సరదాగా రాసినా, గ్రామ స్థలనామాలు చాలా ముఖ్యమైనవనీ, వాటిలో భాషాపరిణామం, సామాజిక అంశాలు, చారిత్రక వాస్తవాలు ఇమిడి వుంటాయని, అవి పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడతాయని పరిశోధకులు గుర్తించారు.
ఈ నామ విజ్ఞానానికి సంబంధించి ప్రధానంగా రెండు శాఖలున్నాయి. ఒకటి వ్యక్తి నామ విజ్ఞానం (Anthroponymy), రెండవది స్థలనామ విజ్ఞానం (Toponymy). ఈ రెండు శాఖలకు సంబంధించిన పరిశీలన కేవలం భాషాశాస్త్రజ్ఞులకే కాక ఇతర సామాజిక శాస్త్రజ్ఞులకు, సామాన్యులకు కూడా ఆసక్తికరం. ప్రస్తుత ప్రసంగం స్థలనామ విజ్ఞానానికి, అందులోనూ చరిత్ర పరిశోధనలో స్థలనామ విజ్ఞానానికి గల ప్రాధాన్యతకు పరిమితం.


స్థలనామాలన్నప్పుడు కేవలం ఊర్లపేర్లే కాకుండా నాడులు, నదులు, వాగులు, గుట్టలు, కొండలు, కోనలు, అడవులు, అలాగే గ్రామం లోని వీధులు, గడ్డలు, డొంకలు మొదలైన భౌగోళిక రూపాలకు ఆయాభాషలలో అనాదిగా ఉన్నా పేర్లన్నీ కూడా స్థలనామాలుగానే భావించాలి. వ్యాసంలో గ్రామనామం అని పేర్కొన్నప్పుడు దాని విస్తృతార్థంలో పైవన్నీ ఉంటాయని భావించాలి.
గ్రామ స్థల నామాల మీద పరిశోధన ప్రారంభమై ఒక శతాబ్దం పైగానే అయింది. ఈ శతాబ్దకాలంలో ఆ పరిశోధన అతిశాస్త్రీయంగా రూపొందించబడింది. వివిధ దేశాలలో స్థలనామాల సర్వేలు కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో స్థలనామాలకు సంబంధించి తొలి కృషి చేసినవారు, ఆంగ్లేయులు. మెకంజీ, కాల్ద్వెల్‍, బ్రౌన్‍ వంటివారు స్థలనామాలకు సంబంధించిన రచనలను 19వ శతాబ్దంలోనే ప్రచురించారు.


తెలుగులో గ్రామనామాలపై చిలుకూరి నారాయణరావు, నాయని కృష్ణకుమారి, కేతు విశ్వనాథరెడ్డి వంటివారు తెలుగు పత్రికలలో వ్యాసాలు రాశారు. బూదరాజు రాధాక•ష్ణ ‘ప్రాచీనాంధ్ర శాసనాలు’ పుస్తకంలో గ్రామ నామ వ్యుత్పత్తులను గురించి వివరించారు. కుందూరి ఈశ్వర దత్తు ‘ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళము’ పేరిట చారిత్రకంగా శాసనాలలో పేర్కొన్న స్థలాలను, నాడులను గుర్తించి వివరించారు.
తెలుగు ఊర్ల పేర్లపై గణనీయమైన కృషి చేసినవారు కేతు విశ్వనాథరెడ్డి. ఆయన కడప ఊర్ల పేర్లపై తొలి పి.హెచ్‍.డి. అందుకున్నారు. ఆయన పరిశోధన గ్రంథం ఊర్లపేర్ల పరిశోధన ఎందరికో మార్గదర్శి అయింది. నెల్లూరు జిల్లా గ్రామనామాలపై పరిశోధనకు ఆయన మార్గ దర్శకత్వం వహించారు. అలాగే యార్లగడ్డ బాలగంగాధరరావు కూడా తెలుగు వారి ఇంటిపేర్లు మరియు ఊర్ల పేర్లపై గణనీయమైన కృషిని చేశారు. క్రమంగా ఊర్లపేర్లపై పరిశోధనలు జిల్లాలవారీగానే కాకుండా తాలూకా మరియు మండల స్థాయిలో కూడా జరిగాయి.


తెలంగాణాలో గ్రామనామాలపై తొలి పరిశోధన చేసింది పి. మాణిక్‍ ప్రభు. మెదక్‍ జిల్లా గ్రామనామాలపై పరిశోధనచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీ.హెచ్‍.డి. పొందారు. తరువాత మాణిక్‍ ప్రభు పర్యవేక్షణలో కరీంనగర్‍ జిల్లా గ్రామనామాలపై పరిశోధన జరిగింది. తరువాత నల్లగొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా గ్రామనామాలపై పరిశోధనలు జరిగాయి. నాగర్‍కర్నూల్‍ తాలూకా గ్రామనామాలపై పరిశోధనతో మొదటి ఎంఫిల్‍ పట్టాను కపిలవాయి అశోక్‍బాబు అందుకున్నారు. వీరు సుప్రసిద్ధులయిన కపిలవాయి లింగమూర్తి గారి కుమారుడు. హైదరాబాద్‍, సికిందరాబాద్‍ జంటనగరాల స్థలనామాలపై ఎం. వెంకటేశ్వర్లు ఆచార్య ఎన్‍.గోపి పర్యవేక్షణలో పరిశోధించారు. ఇవేకాక తెలంగాణాలో అనేక తాలూకాలు, మండలాల గ్రామనామాలపై పరిశోధనలు జరిగాయి. ఇది క్లుప్తంగా గ్రామనామాలపై ఇప్పటిదాకా జరిగిన పరిశోధన చరిత్ర.


గ్రామనామాలు భాషా పరిణామము, చరిత్ర, సామాజిక పరిణామములపై పరిశోధనకు ఎంతో ఉపయోగపడతాయని ఇంతకుముందే అనుకున్నాం. ఊర్ల పేర్లు హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డవి కాదు. మనుష్యుల పేర్లయినా, ఇంటిపేర్లయినా, స్థలాలపేర్లయినా, ఊర్లపేర్లయినా వేలవందల సంవత్సరాల వివిధ సామాజిక స్థితిగతులకు, నాగరికతకు, చరిత్రకు అనుగుణంగా ఏర్పడ్డవి. వాటిని సమగ్రంగా పరిశీలించి అర్థం చేసుకోగలిగితే చారిత్రక పరిశోధనలో ఎంతో ఉపయోగపడతాయి.
ఊర్ల పేర్లలో భాషాపరమైన అంశాలజోలికి ఎక్కువగా పోకుండా, పరిశీలించినప్పుడు చాలా ఊర్లపేర్లు రెండుభాగాలుగా ఉండడం గమనించవచ్చు. ఉదాహరణకు మల్లేపల్లి, కోటిలింగాల, కొత్తగూడెం వంటివి. అరుదు కాదు కానీ, ఒక్క పదంతో ఉండే ఊర్ల పేర్లు తక్కువ. ఉదాహరణకు బెక్కెం, బమ్మెర, కుక్కడం వంటివి. మూడు పదాలతో ఉండే ఊర్లపేర్లు అరుదుగా కనబడతాయి. లింగాలఘణపురం, కోట్లనర్సింహులపల్లె వంటివి.


రెండు పదాలు కలిగిన గ్రామనామాలలో ఉత్తర పదాలకు (-పూడి, -పర్రు, -తుర్రు), పూర్వపదాలు విశేషాలుగా ఉపకరిస్తున్నాయి. ఉదా: మునిపల్లి, కొంపల్లి, నాంపల్లి అనే గ్రామనామాల్లో -పల్లి అనేది ఉత్తరపదం. కాగా ముని, కొం, నాం, అనేవి దానిపై విశేషణాలుగా చేరి మూడు స్వతంత్ర గ్రామాలకు పేర్లుగా సిద్ధించాయి. కేవలం ఏదో ఒక పేరు పెట్టడమే లక్ష్యమైతే, ఉత్తరపదంగా కన్పిస్తున్న వాటిలో ఏదో ఒక పదంపై విశేషణాలు అనేకం చేర్చితే జనావాసాలకు పేర్లు ఏర్పడి ఉండేవి. అలా కాక, పూర్వపదంలో వైవిధ్యం పాటించడమే కాక ఉత్తర పదంలో కూడ వైవిధ్యాన్ని పాటించారంటే మన ప్రాచీనుల ఉద్దేశం కేవలం ఏదో ఒక పేరు పెట్టడం కాదని తెలుస్తుంది. అంటే అవి కేవలం జనావాసాలనే కాక ఆ జనావాసాల్లో వున్న వివిధ తరగతులను, వైరుధ్యాలను సూచిస్తున్నాయి. ఆ పదాల అర్థం తెలిస్తే ఆ వైవిధ్యం బోధపడుతుంది. దీనిని బట్టి మన ప్రాచీనులు తమ జనావాసాలకు పేర్లు పెట్టడంలో స్థానిక నైసర్గిక స్థితిగతులకు ఎంతో ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తుంది. -పూడి, -పర్రు, -తుర్రు, -కుర్రు మొదలైన పదాలకు నిఘంటువుల్లో ప్రత్యేకమైన అర్థాలు కనిపించవు. స్థానిక గిరిజన భాషలలో ఈ పదాల వ్యుత్పత్తులను కనుగొనాల్సిన అవసరం వుంది.


యార్లగడ్డ బాలగంగాధరరావు గ్రామనామాల్లో కనిపించే ఉత్తరభాగాలకు కొన్ని అర్థాలు చెప్పారు. అవేమిటో చూద్దాం:
పూడి అనేది వాగులు వంకలు మొదలైన ప్రవాహాల ప్రక్కన, ఆ ప్రవాహాలకు ఏ మాత్రం వరద వచ్చినా మునిగిపోయేచోట కన్పిస్తుంది. నేడు కాలబోధకంగా ఉపయోగిస్తున్న సామెత ‘ఏండ్లు పూండ్లు గడిచా’యనేది నిజానికి ఆ అర్థంలో వచ్చింది కాదు. ఏండ్లు, పూండ్లు గడవడం అంటే ఏరులు అంటే నదులు, పూండ్లు అంటే బురదనేలలు దాటి వచ్చాయనేది అసలైన అర్థం. పర్రు, పై స్థితికంటే ఎత్తైన భూభాగానికి వర్తిస్తుంది. తుర్రు, కుర్రు అనేవి పర్రు కంటే ఎత్తైన భూభాగాలను, ఇసుక, నల్లరేగడి కలిసిన భూములను సూచిస్తాయి. ‘పెంట’ అంటే పశువులను మంద వేసే స్థలం. ‘తడ’కు సరిహద్దు అని అర్థం. పాలెం మొదటి అర్థం, పాలెగాడు వుండే చోటు. అనంతరం కాలంలో శివారు అని అర్థంలో రూఢమైంది.


పల్లె మొదట బౌద్ధుల నివాసం. పాడు జైనులుండే చోటు. చీకటి అంధకారం అనే అర్థంలో కాక చెట్టును సూచిస్తుంది. వాడ నగరంలో ఒక భాగానికి పేరు. చెరువు, కుంట, గుంట, కొలను, కుళం, మడుగు, కంభం మొదలైనవి పరిమాణాన్నిబట్టి జలాశయాల్ని సూచించేవి. ప్రోలు, పురానికి విక•తిగా భావించడం కద్దు. కాని ప్రోలు దేశ్యపదం. ప్రభుత్వ ఖజానా వుండే చోటు. దానిమీద అధికారి ప్రోలయ. తరువాత వ్యక్తి నామంగా మారింది. చింత్రియాల మొదలైన వానిలోని ‘ఆల’ గడ్డిజాతికి చెందిన మొక్క. ఆకూ అలము అనడం మన ఎరుకలోనిదే. ‘గడ్డ’ ఏటి ఒడ్డున వున్న ఎత్తైన భూభాగాన్ని సూచిస్తుంది. ‘లంక’ నదీ మధ్యంలోని విశాలమైన భూభాగాన్ని, ‘తిప్ప’ అంతకంటె తక్కువ పరిమాణం గల భూభాగాన్ని సూచిస్తాయి.


వరాని కర్థం ఒక పెద్ద గ్రామంలోని కొంత భూభాగాన్ని విడదీసి ఇచ్చినది. ఆ విడదీయబడిన భూభాగం ‘వరం’. వాక, వాయి చిన్న ప్రవాహాలను సూచిస్తాయి. ఈ ఉదాహరణల వలన, ముందు చెప్పినట్లుగా, మన ప్రాచీనులు పరిసరాలను దృష్టిలో వుంచుకొని తమ ఆవాసాలకు పేర్లు పెట్టారని అవగతమవుతుంది.
ఇక బూదరాజు రాధాకృష్ణ ప్రాచీనాంధ్ర శాసనాలలో 45 స్థలనామ ప్రత్యయాలను గుర్తించారు. అలి, ఇండి, ఇలి, ఊర్‍, ఇంకి, ఏరు, గట్ట, కల్లు, గాడు, గుణ్ట, కుదురు, కుర్రు, కూరు, కొన్ర, కొలన్‍, గోడు, గామ, వి, చెరువ్‍, చేడు, చేరి, తుర్ల, తొరె, దల, నాణ్టి, నూర్‍, పర, పర్రు, పల్లి, పల్లు, పాక, పాడ్‍, పోరము, పూణ్డి, పూర, పురోల్‍, మడి, మజ్గలంబు, మడువు, మణ్డ, రేవు, వ, వాడ, పట్టంబు, శాల.
ఈ ప్రత్యయాల చరిత్ర చాలా వివరంగా వుంది. బాలగంగాధర రావు చెప్పినవి అన్నీ అంగీకారయోగ్యం కాకపోవచ్చు. కొన్ని ప్రాచీన ప్రత్యయాలకు వ్యుత్పత్తులు కనుగొనడం కష్టసాధ్యంగా వుంది. ఒకే ప్రత్యయాన్ని వివిధ గ్రామనామాలలో వేర్వేరు సందర్భాలలో వాడడం వల్ల వీటి వాడకంలో స్థానిక భేదాలున్నాయని గమనించాలి.
ఇక గ్రామనామాల్లోని ప్రథమ భాగాలను చూస్తే, వీటిలో కూడ చాల వైవిధ్యముంది. వ్యక్తినామాలు, కులనామాలు, వృత్తినామాలు, నైసర్గిక స్థితికి సంబంధించినవి. వృక్షాల పేర్లు, పక్షుల పేర్లు, సంఘటనల పేర్లు, మతసంబంధమైనవి. ఇలా మానవ నాగరికత, సంస్కృతి వికాసాలు ముడిపడి వున్న అన్ని అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి.
గ్రామనామాల్లోని వ్యక్తినామాలు ఆ గ్రామాన్ని నిర్మించిన వారి పేర, గ్రామాన్ని దానంగా పుచ్చుకొన్నవారి పేర, ప్రముఖులైన వ్యక్తుల పేర వస్తుంటాయి. ఉదా. గణపేశ్వరం, రుద్రంపూర్‍ వంటివి.
కులాలు, వృత్తుల పేర్లు, వారు ముందుగా ఆ చోట నివాస మేర్పరచుకోవడం వల్ల వస్తాయి. ఉదా. కుమ్మరిపల్లె, బ్రాహ్మణపల్లె


నైసర్గిక స్థితికి సంబంధించిన పేర్లు:

గుట్టకిందిపల్లె, మిట్టపల్లె. వృక్షాలపేర్లు, పక్షులపేర్లు కలవి మర్రిపాలెం, వేములఘాట్‍, పిచ్చుకపాలెం వంటివి. మతసంబంధ మైనవి యాదగిరి, ఫణిగిరి, ధూళికట్ట, జనగాం వంటివి.
గ్రామనామాలు చారిత్రకంగా రూపాంతరం చెందుతుంటాయి. ఇలా రూపాంతరం చెందడం సహజంగా జరిగే పక్రియ. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. రాచరికాలు మారడం, మతాలు తమ ప్రాభవాన్ని కోల్పోవడం, ప్రకృతి విపత్తులవల్ల ప్రజల వలసలు వంటి భౌతికమైన కారణాలే కాకుండా భాషాపరమైన సహజమైన మార్పులు గ్రామనామాలు రూపాంతరం చెందడానికి కారణమవుతాయి. ఈ మార్పులను పరిశీలిస్తే, చరిత్ర పరిశోధనకు గ్రామనామాలు ఎలా ఉపయోగపడతాయో అర్థమవుతుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం.


రాచరికాలు మారడం:
చారిత్రక కాలంలో రాజవంశాలు వ్యవసాయాన్ని పోషించి కొత్త గ్రామాలను స్థిరపరిచినప్పుడు వారిపేరుపై గ్రామాలు ఏర్పడతాయి. ఇది రాజుల పట్ల ప్రజలు చూపిన కృతజ్ఞత.
ఉదాహరణకు శాతవాహన వంశాన్ని సూచిస్తూ సాతానికోట, సాతులూరు, శతకోడు మొదలగు గ్రామనామాలు. ఇందులో సాతవాహన పదం కాలక్రమేణా సాత, సాతు, శత గా మారిపోవడం గమనించవచ్చు. శాతవాహన రాజైన విజయ శాతకర్ణి తన పేర నిర్మించిన విజయపురి (ప్రస్తుత నాగార్జునసాగర్‍) పేరు అలానే కొనసాగడం విశేషం. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా గ్రామనామం శత, సాత వంటి పూర్వపదాలతో మొదలైతే, అది చారిత్రక గ్రామమనే భావనతో పరిశోధన చేపట్టవచ్చు. నల్గొండ జిల్లాలో హాలియా గ్రామం వుంది. తెలుగులో ‘హ’తో పేర్లు సాధారణంగా కనబడవు. శాతవాహన చక్రవర్తి అయిన హాలునికి ఈ గ్రామనామంతో ఏదైనా సంబంధం వుందేమో పరిశోధించాలి.


బౌద్ధమతం:
తెలంగాణాలో బుద్ధుని కాలంలోనే బౌద్ధమతం ప్రవేశించింది. ఇందుకు సాక్ష్యం కోటిలింగాల దగ్గర బావనూర్‍ కుర్రు మరియు బాదన కుర్తి గ్రామాలు. బౌద్ధ గ్రంథమైన సుత్తనిపాతంలో గోదావరి తీరంలోని అశ్మక జనపదంలో నివసించిన బావరి అనే బ్రాహ్మణుని కథ వుంది. అతడు బుద్ధుని ఉపదేశం పొందగోరి, తాను వ•ద్ధుడవటం వల్ల తన శిష్యులను బుద్ధుని దగ్గరకు పంపి బౌద్ధ ధర్మాన్ని తెలుసుకున్నాడు. దాదాపు 2600 సంవత్సరాలకు పైబడిన ఈ చరిత్రను తన పేరులో ఇముడ్చుకుంది బావనూర్‍ కుర్రు / బాదనకుర్తి. గ్రామనామాలకున్న చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోవడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ అఖ్ఖర్లేదు. బౌద్ధం ప్రచార మతం అవడం వల్ల వారు ప్రచారం కొనసాగిస్తూ, స్థూపాలు కట్టినచోట గ్రామాలేర్పడ్డాయి. ఈ ఊర్లపేర్లు బౌద్ధమతసంబంధంగా వుంటాయి. ఉదాహరణకు బోదనం, దుప్పల్లి (దుప్ప అనేది స్థూప పదానికి అపభ్రంశరూపం). బౌద్ధంలోని ధర్మ కొన్నిచోట్ల అలాగే వుండగా కొన్ని చోట్ల జనవ్యవహారంలో జమ్మ గా మారింది. బౌద్ధం క్షీణించిన తర్వాత స్థూప శిథిలాలున్న ప్రదేశాలను పాటిగడ్డలనీ, సానిదిబ్బలనీ, లంజదిబ్బలనీ వ్యవహరించారు. ఇలాంటి స్థలనామాలున్న చోట బౌద్ధ స్థూపాల ఆనవాళ్ళు ఉండే అవకాశం వుంది. కొన్ని ప్రదేశాలను మహాభారతంలోని పాత్రలు, కథలతో ముడి పెట్టి వ్యవహరించారు. ఉదాహరణకు పాండవుల గుట్ట, పాండవుల గుహ వంటి పేర్లున్న ప్రదేశాలు బౌద్ధమతానికి సంబంధించినవై వుంటాయి. నేలకొండపల్లిలో బౌద్ధ స్థూపమున్న ప్రదేశానికి విరాటరాజు దిబ్బ అని పేరు. పక్కనే కీచకగూడెం అని ఊరు వుంది. తెలుగు రాష్ట్రాలలో మహాయానం ప్రజల ఆదరణ పొందింది. ఇందులోనూ శైల, గిరి శాఖలు ఇక్కడ ప్రాచుర్యం పొందాయి. వీటి ప్రస్తావన విజయపురి శాసనాలలో వుంది. అందుకనే తెలుగు రాష్ట్రాలలో బౌద్ధ స్థూపాలు గిరి పేరుతో వుంటాయి. ఉదాహరణకు ధూళికట్ట, ఇది ధవళగిరికి వ్యవహారరూపం. అలాగే ఫణిగిరి. బౌద్ధ సన్యాసులని భిక్షువులనడం కద్దు. ఈ భిక్షు పదం భిక్కుగా మారింది. భిక్నూరు, భిక్కేరు వంటి పేర్లు బౌద్ధసంబంధాన్ని సూచిస్తాయి.


జైనమతం:
జైనమతం తెలంగాణాలో చారిత్రకంగా అత్యంత ప్రజాదరణ పొందిన మతం. రాష్ట్రకూటులు, పశ్చిమచాళుక్యులు, తొలి కాకతీయులు ఇతోధికంగా జైనాన్ని పోషించారు. తెలంగాణాలో అనేక జైనగ్రామాలున్నాయి. జైన పదం కొన్నిచోట్ల అలాగే వుండగా (జైనథ్‍), కొన్నిచోట్ల జన, జిన వంటి రూపాలుగా మారింది. జనగాం, జన్వాడ, జినరాజకొండ వంటి పేర్లు జైనసంబంధాన్ని సూచిస్తాయి. జైన సన్యాసులని మునులని పిలవడం కద్దు. మునిపల్లె, మునులగుట్ట వంటి పేర్లు జైన స్థావరాలని సూచిస్తాయి. జైన తీర్థంకరుల శాసనదేవతల పేర్ల మీదుగా కూడా ఊర్లపేర్లున్నాయి.


వీరశైవం, కాలాముఖం:
కాలాముఖులకు లకులీశుడు మతప్రవర్తకుడు కాగా, వీరశైవులకు బసవేశ్వరుడు. లకుడారం, లగుడారం వంటి గ్రామనామాలు కాలముఖ సంబంధాన్ని సూచించగా, బసవాపురం, బసవేశ్వరం వంటి పేర్లు వీరశైవసంబంధాన్ని సూచిస్తాయి.
ప్రకృతి విపత్తుల కారణంగా ప్రజల వలస:
సాధారణంగా వచ్చే ప్రకృతివిపత్తు వరదలు. ఇలా వరదలు సంభవించినప్పుడు ప్రజలు ముంపు ప్రాంతాలను వదిలేసి దగ్గరలోని ఎత్తు ప్రాంతాలకు వలస వెళ్ళడం సహజం. ఇలాంటప్పుడు కొత్తగా ఏర్పడ్డ గ్రామానికి కొత్తగూడెం, కొత్తపల్లె వంటి పేర్లుంటాయి. ఇటువంటి ఊర్ల దగ్గర పాతఊరు శిథిలాలున్న గడ్డలు, దిబ్బలు గమనించవచ్చు.


పైన చర్చించిన అంశాల ప్రాతిపదికగా పరిశీలిస్తే, గ్రామ నామాలు చారిత్రక పరిశోధనకు కరదీపికలని చెప్పవచ్చు. గ్రామ నామాన్ని బట్టి, గ్రామం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను అంచనా వేయవచ్చు. గ్రామం చరిత్ర గురించి శాసనాధారం కానీ, సాహిత్యా ధారం కానీ లేనప్పుడు, గ్రామం చరిత్రను నిర్ధారించడానికి, గ్రామనామమే ప్రాతిపదిక అవుతుంది. సుప్రసిద్ధ స్థలనామ పరిశోధనా శాస్త్రవేత్త ఎ.ఎస్‍ త్యాగరాజు ‘‘ఎ స్టడీ ఆఫ్‍ తెలుగు ప్లేస్‍ నేమ్స్’’ (A study of Telugu place Names)లో ఎక్కడ చరిత్ర మూగబోయిందో అక్కడ స్థలనామాలే గుర్తు చేస్తాయి (where History is silent there Place Name Speaks loud)అన్న మాటను స్ఫురణ ఉంచుకొని గ్రామనామాలను గ్రామ చరిత్రలను లిఖిత బద్దం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

  • బీవీ భద్రగిరీశ్‍, ఎ : 9177301451

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *