సరిగ్గా పదిసంవత్సరాలు. తెలంగాణ ఉద్యమం చివరి దశ 2009 డిసెంబర్‍కి తెలంగాణ ప్రకటన వచ్చి, వెనుకంజ వేసిన సంక్షోభకాలం. తెలంగాణ మళ్లీ క్రాస్‍రోడ్స్లో నిలబడింది. ఉద్యమం ఉవ్వెత్తున జరగవలసిన సందర్భంలో ఉన్నది. అలాంటి సంక్షుఛిత సందర్భంలో మాసపత్రికగా ‘దక్కన్‍ల్యాండ్’ ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాఫ్రంట్ నాయకుడు మణికొండ వేదకుమార్ ఈ పత్రికను స్థాపించి, సంపాదకుడిగా ఉన్నారు. అప్పుడు సందిగ్ధ సందర్భంలో ప్రారంభమయిన ఆ ‘దక్కన్ ల్యాండ్’’ నిర్విఘ్నంగా, నిర్విరామంగా, పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక గొప్ప విజయం.
తెలంగాణలో పత్రికలు తక్కువ. అవి పదేళ్లు నడవడం అరుదు. పదేళ్లు కూడా తెలంగాణ స్పృహ, తెలంగాణ చైతన్యంతో పత్రిక నడవడం అసాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వేదకుమార్‍కు ప్రత్యేక అభినందనలు. తెలంగాణ గురించి విస్తృత ప్రజాభిప్రాయాల వేదికగా ఇది నిలిచింది. తొలి సంచిక ఆవిష్కరణ సందర్భం ఇంకా గుర్తున్నది. ప్రత్యేక తెలంగాణ సాధన విషయాలు చర్చించే ఒక వేదికగా ప్రారంభమై, అనంతర కాలంలో తెలంగాణ కల సాకారమైన అనంతరం తెలంగాణ పునర్నిర్మాణ పక్రియను చిత్రించిన పత్రికగా నిలిచింది. ఈ పదేళ్ల ప్రయాణంలో తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల మీద విశ్లేషణలు, అవగాహనలు కల్పిస్తూ అనేక రచనలు ప్రచురించింది. లబ్ధ ప్రతిష్టులతో తెలంగాణ వాదులు, రచయితలు, కథకులతో కొత్త ఒరవడితో పత్రికను తీర్చిదిద్దింది. అంతకు ముందు మణికొండ వేదకుమార్ అధ్యయన కేంద్రం ద్వారా తెలంగాణకు సంబంధించిన అన్ని రంగాల ప్రముఖులతో ప్రసంగాలు ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చిన ఆదరణ, ప్రేరణ గడ్డుకాలంలో కూడా ఒక పత్రిక అవశ్యంగా నడపాలని భావించి, తెలంగాణ, దక్కన్ పీఠభూమి సంస్కృతీ, సంప్రదాయాలు, జీవన విధానాలు, ఇక్కడ మరుగన పడిన ప్రదేశాలు, పర్యావరణం, సమస్త రంగాల, సకల జీవనాల ప్రతిబింబంగా పత్రికను రూపుదిద్దాలని భావించి అట్లాగే పదేళ్లు నడిపారు.
తెలంగాణ ఉద్యమ సందర్భంలో పత్రిక ఉద్యమ వేదికగా నడిచింది. తెలంగాణ ఎదుర్కుంటున్న వివక్షను, నిర్బంధాన్ని, వేదనను, ఒక ప్రాంతం ఆధిపత్యాన్ని అది ప్రశ్నించింది. అనంతరం అది మిషన్‍కాకతీయ, మిషన్ భగీరథ, రైతు ప్రాయోజిత కార్యక్రమాలు, సంక్షేమ, ప్రాజెక్టులు, శిథిలాల మీద నిర్మితమయిన కొత్త తెలంగాణను చిత్రిస్తూ పత్రిక వచ్చింది.
దక్కన్ పీఠభూమి లాంటి ఒక ఒంటరి సమాజంలో రూపు దిద్దుకున్న ప్రత్యేక సంస్కృతిని పత్రిక ఎత్తి చూపింది. హైదరాబాద్ గంగా జమునా తహజీబ్, సమభావన సంస్కృతి ఇక్కడ పరిఢవిల్లిన సామరస్యం, భాషా సహిష్ణుతలు ఇవన్నీ కూడా దక్కన్ ల్యాండ్ వస్తువులయ్యాయి. జీవన ప్రేమలు, మానవ సంబంధాలు, ఆరాం జిందగీ, అనదగిన వ్యాపార లౌల్యతలు లేని, సాదాసీదా జీవితాలను ప్రేమించిన హైదరాబాద్ నమూనా తెలంగాణ జీవితాలకు చిత్రిక పట్టింది. వ్యవహార విజయాల కన్నా, జీవన విజయాలకు ప్రాధాన్యత నిచ్చే తెలంగాణ జీవితాలకు ప్రతి బింబంగా పత్రిక పదేళ్లు నడిచింది.
పత్రిక ఏ మౌలిక భావాల కోసం ఏర్పడిందో, ఏ దక్కనీ సంస్కృతీ సంప్రదాయాలు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పడిందో, ఆ ప్రయోజనాలకు, ఆ మౌలిక సూత్రాలకు భిన్నంగా వర్తమానం రూపు కడ్తున్నది. దరిదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‍ను ఇప్పుడు విచ్ఛిన్న రాజకీయాలు కలుషితం చేసే పరిస్థితులు వచ్చాయి. ఏ సమభావన సంస్కృతీ ప్రతీకగా తెలంగాణ వెలుగొందిందో? ఆ సమభావన, సామరస్యతలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదంలో ప్రారంభమయిన పత్రిక అనంతర కాలంలో తెలంగాణ పునర్నిర్మాణ పక్రియ ప్రతిభావంతంగా చిత్రించింది. భవిష్యత్‍లో కూడా తెలంగాణ జీవన మాధుర్యాన్ని కాపాడే సామరస్య సహజీవనాన్ని కాపాడడానికి కలం ఎత్తి పట్టాలని హైదరాబాద్ విచ్ఛిన్నశక్తుల బారినపడకుండా కాపాడుకోవడానికి ముందుకు రావాలని సేవ్ హైదరాబాద్ అధ్యక్షుడు కూడా అయిన వేదకుమార్‍కు విన్నపం.
పదేళ్లపాటు పత్రిక నడిపినందుకు మీకు ప్రత్యేక అభినందనలు. భవిష్యత్ భరోసా కల్పించేందుకు మీకు విన్నపం.
నమస్తే…
అల్లం నారాయణ
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్