పేర్వారం జగన్నాథం


అభ్యుదయ కవితోద్యమ తరువాత తెలుగు సాహితిలో ఆకర్షించినవారు చేతనా వర్తకవులు. మనిషి ఆత్మానుభూతి నుంచి సమాజ చైతన్యంలోకి ప్రయాణిస్తున్నాడనే స్పృహతో వీరు కవిత్వం రాశారు. దీనిని చేతనా వర్తమానిగా పిలిచారు. తెలంగాణకు చెంది, ఓరుగల్లు నేలకు చెందినవారు సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, సంపత్కుమార, వేనరెడ్డి. చేతనావర్తకవిగా సుప్రసిద్ధులైన పేర్వారం జగన్నాథం గారు ప్రధానంగా అధిక్షేప కవి.


పఠాభి ‘ఫిడేలు రాగాలు డజన్‍, కవితా సంపుటిని రచించి అధిక్షే కవిగా ప్రసిద్ధులయ్యారు. పఠాభి తరువాత వెంటనే గుర్తుకు వచ్చే కవి పేర్వారం జగన్నాథం గారు. పఠాభి తరువాత వ్యంగ్యాన్ని సందర్భోచితంగా ప్రయోగించి ‘ఔరా, అనిపించిన కవి పేర్వారం. పఠాభి నగర జీవనాన్ని వస్తువుగా స్వీకరించి వ్యంగ్యంగా, అధిక్షేపాత్మాకంగా వచన కవిత్వం రచించి సఫలీకృతులయ్యారు. పేర్వారం సమాజం ప్రజల ఆశల్ని కలల్ని ఎలా విచ్ఛినంచేసిందో తమ కవిత్వంలో శక్తివంతంగా ప్రదర్శించారు.
ఆధునిక వచన కవితలో ఇంతటి వ్యంగ్యాన్ని, అధిక్షేపాన్ని రంగరించిన కవి పేర్వారం జగన్నాథంగారే అంటే అతిశయోక్తి కాదు. స్వతంత్రభారతదేశంలో పెరిగిన దోపిడి, లంచగొండితనం, అవినీతి ఈ కవిని కలచివేసినై. సునాయాసంగా సంపన్నులు కావడానికి రాజకీయ రంగప్రవేశం ఒకటే మార్గం అని భావించిన వాళ్ళను చూసిన తరువాత తన కవితలో వ్యంగ్యాన్ని ప్రతిష్టించడం అవశ్యమని ఆయన భావించారు. రాజకీయ వాతావరణాన్ని, కుహనా సంస్కారాన్ని చూసి పేర్వారం గుండెలో అగ్నిపర్వతాలు బ్రద్దలైనై.


ఆయన వక్రోక్తి, ని ఆశ్రయించి రచించిన కవిత్వం వృషభపురాణం, కవిత్వానికి దేశ సంక్షేమాన్ని కోరి సందేశం ఇవ్వడం ఎంత ముఖ్యమో, అభివ్యక్తి మార్గానికి చెందిన శిల్ప నైపుణ్యం కూడా అంతే ముఖ్యం. ‘దేశాన్ని జాతినీ మానవతనూ విస్మరించిన కవిత్వం నేల విడిచిన సాము లాంటిది. కేవలం నినాదాల్ని వల్లిస్తూ కవిత్వమని బుకాయించకుండా రమణీయంగా వ్యంగ్య విలసితంగా చెప్పడమే నా లక్ష్యం’ అన్నారు పేర్వారం జగన్నాథంగారు. పేర్వారం జగన్నాథం గారు ప్రస్తుతం జనగామ జిల్లా, రఘునాథపురం మండలంలోని ఖిలా షాపురంలో 23-8-1934 నాడు జన్మించారు. శ్రీమతి సయ్యమ్మ, సంతాజీ ఆయన జననీ జనకులు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో, ఉన్నతపాఠశాల విద్యను హనుమకొండలో అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పూర్తి చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వరంగల్‍ అప్సి సైన్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా చేరారు. తరువాత వరంగల్‍ పోస్టుగ్రాడ్యుయేట్‍ సెంటరులో పనిచేశారు. అదే కాకతీయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. అక్కడి నుండి ప్రొఫెసరుగా పదవీ విరమణ చేశారు.


ఉద్యోగ జీవితంలో కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యక్షుడుగా, పాఠ్యప్రణాళికా సంఘ అధ్యక్షుడుగా కాకతీయ అధ్యయాన కేంద్రం డైరెక్టరుగా, ఆం.ప్ర. సాహిత్య అకాడమీ సహాయ కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఉపాధ్యక్షుడిగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‍ చాన్సలర్‍గా ఆయన పనిచేశారు.
పేర్వారం మాతృభాష అరెభాష ఐనా విద్యార్థి దశ నుంచే ఆయన సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నారు.
హైస్కూలులో చొల్లేటి నరసింహశర్మ గారు తెలుగు అధ్యాపకులుగా రచనవైపు దృష్టిని మళ్ళించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివేకాలంలో ఆచార్య దివాకర్ల వేంకటావధాని, కురుగంటి సీతారామయ్య, చెలమచర్ల రంగాచార్యులు, ఖండవల్లి లక్ష్మీరంజనం, బిరుదురాజు రామరాజు గార్లు అధ్యాపకులు. ఆ సాహితీమూర్తుల బోధన, స్ఫూర్తి జగన్నాథంగారిని కవిగా, సాహితీమూర్తిగా తీర్చిదిద్దనై. విశ్వవిద్యాలయ విద్యార్థిగానే జగన్నాథం గారు రచించిన కవితాసంపుటి. సాగరసంగీతం, ఎందరో సాహితీపరుల ప్రశంసలనందుకుంది.


పేర్వారం రచనలు

సాగర సంగీతం (1960); చేతనావర్తం (1,2, భాగాలు) (1967-1970); వృషభపురాణం (1984); ఎస్‍.ఇ.ఆర్‍.టి., మైసూర్‍ వారికి ప్రాంతీయ కళాశాలలో పాఠ్యగ్రంథంగా నిర్ణయింపబడింది. గరుడపురాణం (1995), సాహిత్యావలోకనం – సాహిత్యవాసి సంపుటి; సాహిత్యావలోకనం – సాహిత్యవ్యాస సంపుటి (1982), సాహితీవసంతం, (వ్యా సంపుటి) (1992), ఆరె జానపద గాధలు (1986); ఆరె జానపద గేయాలు (1957); ఆరె జానపద సాహిత్యం – తెలుగు ప్రభావం – సిద్ధాంతం.
పేర్వారం జగన్నాథంగారు ప్రతిష్ఠాత్మక పురస్కారాలనెన్నో అందుకున్నారు. ఆచార్యులుగా దక్షణ భారత విశ్వవిద్యాలయాలలో జరిగిన సదస్సులలో పత్రాలు ఎన్నో సమర్పించారు. పేర్వారం అనేక పత్రికలలో ప్రచురించిన రచనలు పరిశీలించారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలోనే గొప్ప అధిక్షేప రచన వృషభపురాణం అని పేరు పెట్టడంలోనే వ్యంగ్యం కనిపిస్తుంది. పార్కురికి సోమనాధుని బసవపురాణం, ఈ పేరు పెట్టడానికి ప్రేరణ. సమాజ సంస్కరణ ధ్యేయంగా బసవపురాణం రచన సాగింది. పేర్వారం వృషభపురాణం. రాజకీయాలను, నాయకులను ఎత్తిపొడిచే, విమర్శించే వ్యంగ్యకవిత్వం. ప్రజల్ని పీడించే ఆబోతుల వ్యంగ్యప్రదర్శనం.


రాజకీయ వృషభం గూర్చి చెబుతూ
‘మరునాడు పొద్దుపొడవకముందే
వైతాళికలు నిదురులేవగా
బుద్ధగమలో బౌద్ధమతం స్వీకరించి
అశోకసమ్రాట్టు సమాధిపై
పూలగుచ్ఛం సమర్పించి
రాజధానికి తరలివస్తూ
దారిలో కనపడ్డ గోవుల్ని
పపద్యశీలకు పంపింది.’ అని వాడిగా వ్యంగ్యంగా చెబుతారు.
తెలంగాణాలో ప్రజల్ని పీడించిన నాయకులు, రజాకార్లు, స్వాతంత్య్రానంతరం రాజ ప్రముఖ బిరుదులు, ఉన్నత పదవులతో సత్కరింపబడడాన్ని చూసి ఈ కవి
పూర్వాశ్రమంలో వారు
పక్కా రజాకారు
ప్రస్తుతం వారొక మంత్రి గారికి
బావమరిది
వారి పెద్ద కుమారుడు
ఖాదీబోర్డుకధ్యక్షుడుగా
ఇటీవలే నామినేటెడ్‍, అంటూ మేడిపండ్ల
పొట్టలు చీల్చారు
నమ్మినవాళ్ళను మోసగించే వారిని పేర్వారం మందలించిన వైనం. ఆయన ధర్మాగ్రహాన్ని వెల్లడిస్తుంది.
ఇక ముందెప్పుడూ
విశ్వాసంలేని కుక్కల్ని పెంచుకొని గుర్రుపెట్టి నిద్రపోకండి
చుట్టూ దొంగలున్నారు జాగ్రత్త, అన్న పంతుల్ని చదవగానే ఆ దొంగలెవరో పాఠకులు గ్రహిస్తారు.
జగన్నాథంగారికి పేరు తెచ్చిన కవిత ‘స్వయంవరం’.
‘విడాసత్యవంతుడుకాదు’
అందుకే నేను సావిత్రిలా నటించలేను.
యముడు మునుపటంత ధర్మరాజు కాడు
తెగించి వెంటబడితినా
యమునితో లేచి
స్త్రీ సమస్యలపట్ల ఆయనకున్న అవగాహనను పై పంక్తులలో మనం గమనించవచ్చు.


వృషభ పురాణంలోని ప్రతి కవితలో పేర్వారం వ్యంగ్యవస్తు వైభవాన్ని సహృదయాలు గుర్తిస్తారు. సమకాలీన సమాజానికి సంబంధించిన వస్తువును ఎన్నుకోవడంలోనూ దాన్ని దనదైన బాణిలో శక్తివంతంగా వ్యక్తీరించడంలోనూ ఆయన నైపుణ్యం కన్పిస్తుంది. పేర్వారం వారు కావ్యకర్తేకాదు, సాహితీబంధుబృందం వంటి సాహిత్యసంస్థను హన్మకొండలో స్థాపించి ఎందరో సాహితీపరులను ప్రోత్సహించారు. సదస్సులోద్భవించారు.
వివిధ రచయితల సాహిత్యవాస్తు సంపుటులను ప్రచురించారు. వానిలో అభ్యుదయ కవితా ఇతర ధోరణుల వంటి మంచి వ్యాస సంపుటలను ప్రచురించింది మరోసాహిత్య గ్రంథం. ఆయన ప్రచురించిన దశీయ కవిత ప్రస్థానం. పేర్వారం చక్కని పరిశోధకుడు ఆయన పిహెచ్‍డి సిద్థాంత గ్రంథం ‘ఆరెజానపదం సాహిత్యం తెలుగు ప్రభావం’ ఆచార్య రవ్వా శ్రీహరి గారితో కలిసి సిద్ధం చేసిన గ్రంథం. ఆరెభాషా నిఘంటువు చిరకాలం నిలిచే గ్రంథం.


అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు ఆయన సంపాదకత్వంలో వెలువడిన ప్రసిద్ధ సాహితీవేత్తల వ్యాససంకలనం. సాహితీపరులకు సర్వకాలాలకు రిఫరెన్స్ గ్రంథం.
తెలంగాణాలో దాదాపు ఐదు దశాబ్దాలపాటు సాహిత్యసంస్థల ద్వారా, కళీ వేదికల ద్వారా, ఎందరినో కవులుగా సాహితీస్రష్టలుగా, విమర్శకులుగా వెలుగులోనికి తెచ్చారు. ఆధునిక యుగంలో తెలంగాణంలో సాహిత్య వైతనను రావడానికి కారణభూతులుగా పేరొందారు. ఆయన నిండుమానంబు నవనీత సమానం.
గ్రేట్‍ ఇండియన్‍ సర్కస్‍, వంటి కవితలను పేర్వారం మాత్రమే రచించారు. ప్రాపంచిక అనుభవాలను ఇంత సహేతకంగా సమగ్రంగా ఆవిష్కరించిన కవులు అరుదు. ఇంత సరళ సుందరంగా చెప్పినవారు అరుదు.


‘మానవ ప్రవృత్తుల మౌలిక స్వపాలన వెలికితీయడంలోనూ సర్వమానవ సహోదర జీవనాశయానికి అవరోధంగా ఉన్న సంఘర్షత శక్తుల్ని వెలువరించడంలోనూ పేర్వారం కవిగా కొనసాగించిన కృషి అసాధారణమైంది. అన్న డా।। పి.వి.రమణ మాటలు అక్షర సత్యాలు.
విశ్వశ్రేయస్సే లక్ష్యంగా జీవనానుభవాలను అధిక్షేపరీతిలో అభినవంగా ఆవిష్కరించిన విశిష్ట కవి తెలంగాణ ముద్దుబిడ్డ ఆచార్య పేర్వారం జగన్నాథం తెలుగు సాహిత్యలోకానికి ప్రాతఃస్మరణీయులు.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-డా।। తిరునగిరి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *