న్యాయం జరిగినట్టు అన్పించాలి


ఈ మధ్య ఓ ఇద్దరు మిత్రులు ఫోన్‍ చేసి ‘న్యాయమూర్తులు ఎలా వుండాలి’ అని అడిగారు. ఓ మిత్రుడు నాతోపాటు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‍ సర్వీస్‍ కమీషన్‍లో సభ్యుడిగా పనిచేశారు. మరో మిత్రుడు ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‍గా పనిచేస్తున్నాడు. తెలసీ ఈ ప్రశ్నను నన్ను అడుగుతున్నారని అన్పించింది. అయినా నాకు నేను తెలుసుకుందామని చేస్తున్న ప్రయత్నమే ఇది.
న్యాయమూర్తులు ఎలా వుండాలి అన్న ప్రశ్న చాలా సంవత్సరాల నుంచి చర్చల్లో వుంది. న్యాయమూర్తికి ఈ లక్షణాలు వుండాలని సోక్రటీస్‍ పేర్కొన్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే
ఓపికగా వినాలి
మర్యాదగా జవాబు చెప్పాలి
సులువుగా అర్థం చేసుకోవాలి
ప్రశాంతంగా తీర్పు చెప్పాలి
అయితే ఇవి న్యాయమూర్తి ఎలా వుండాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వవు. మన భారత రాజ్యాంగాన్ని మించిన పత్రం మరొకటి లేదు. ఈ ప్రశ్నకి రాజ్యాంగం సమాధానం చెబుతుంది. రాజ్యాంగానికి అదనంగా న్యాయ జీవితంలో విలువల గురించి (1999), అదే విధంగా న్యాయనడవడిన గురించి బెంగళూర్‍ సూత్రాలు (2002) వుండవచ్చు. వాటి గురించి చర్చించే ముందు భారత రాజ్యాంగం ఏమి చెబుతుందో ముందు చూద్దాం. న్యాయమూర్తులు రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి వుండాలి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దేశ ప్రజలకి అందే విధంగా కృషి చేయాలి. ఈ లక్షాన్ని చేరుకోవడం కోసం న్యాయమూర్తులు చేసే ప్రమాణంలో సంగ్రహంగా చెప్పారు. హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు.
భగవంతుని ఎదుటగా కానీ అంతరాత్మ సాక్షిగా గానీ వాళ్లు ప్రమాణం చేస్తారు. అందులో ఈ అంశాలు వుంటాయి.
… అనే నేను భారత రాజ్యాంగం యెడల నిజమైన విశ్వాసాన్ని భక్తిని కలిగి వుంటానని
దేశ సార్వభౌమత్యాన్ని, సమైక్యతని కాపాడతానని
నిజంగా, విధేయంగా ఎటువంటి భయం గానీ పక్షపాతం గాని, స్వార్థచింతన లేకుండా, అత్యంత విశ్వాస పాత్రంగా, నా శక్తి మేరకు న్యాయంగా నా విధులను నిర్వర్తిస్తానని
రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని.
భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‍ ఆర్‍.ఇ. లాహోటీ ప్రకారం ఈ ప్రమాణంలో న్యాయమూర్తుల నడవడికకు సంబంధించి, నైతిక ప్రవర్తనకు సంబంధించి అన్ని అంశాలు వున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, విలువలని చాలా జాగూరూకతతో పరిరక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల మీద వుంటుంది. న్యాయమూర్తి తీసుకున్న ఈ ప్రమాణంలో ప్రజలకి రక్షణని, న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయమూర్తి మీద వుంటుంది.
న్యాయవ్యవస్థకి స్వతంత్రత అనే భావన చాలా ఉత్తమమైనది. ప్రజాస్వామ్య రాజకీయాలకి అది పునాది వంటిది. న్యాయపాలన అన్న సూత్రం ప్రకారం పాలన జరగాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఆ బాధ్యతని ఈ ప్రమాణం ద్వారా న్యాయమూర్తులపై రాజ్యాంగం వుంచింది. న్యాయ సమీక్ష కూడా అందులోని ఓ అంశం. రాజ్యం దాని అధికారులు చేసే ఉల్లంఘనల నుంచి, అధికార దుర్వినియోగాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై వుంది. (ఎస్‍.పి.గుప్తా వర్సెస్‍ యూనియన్‍ ఆఫ్‍ ఇండియా, 1981 సప్లిమెంట్‍ ఎస్‍.సి.సి.87 పేరా 27).


న్యాయమూర్తి తీసుకునే ప్రమాణంలోని ప్రతి పదం ప్రతి అభివ్యక్తిలో ఓ బలమైన సందేశం వుంది. మామూలు కళ్లని దాటి చూస్తే అందులో నిగూఢమైన అర్థాలు కన్పిస్తాయని జస్టిస్‍ లాహోటీ అన్నారు.
భగవంతునిపై గానీ మనస్సాక్షిగా కాని న్యామూర్తి ప్రమాణం చేయవచ్చని అనడంలో లౌకిక స్వభావం ఇమిడి వుంది. న్యాయమూర్తికి రాజ్యాంగం పట్ల మామూలు విశ్వాసం భక్తి కాదు. అది నిజమైన విశ్వాసం భక్తి కలిగి వుండాలి. రాజ్యాంగ సూత్రాలకి, విలువలకి న్యాయమూర్తి పూర్తిగా బద్ధుడై వుండాలని ప్రమాణం కోరుతుంది.
ఎందుకంటే అన్న ప్రశ్నకి సుప్రీంకోర్టు ఎస్‍.సి. అడ్వకేట్స్ ఆన్‍ రికార్డ్ అసోషియేషన్‍ మరి ఇతరులు వర్సెస్‍ యూనియన్‍ ఆఫ్‍ ఇండియా, (1993)4 ఎస్‍.సి.సి 441లో ఇలా చెప్పింది! ‘‘దేశపౌరుల ప్రాథమిక హక్కులని రక్షించాల్సిన బాధ్యతని అదే విధంగా న్యాయపాలన జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత రాజ్యాంగ కోర్టులపై వుంచింది రాజ్యాంగం. రాజ్యాంగాన్ని చట్టాలని పరిరక్షిస్తానని న్యాయమూర్తులు ప్రమాణం చేస్తారు. కోర్టులు జారీ చేసే ఆదేశాలను అమలు చేయడంలో ర్యాంతో, దాని అధికారులతో విభేదాలు వస్తుంటాయి. అందుకని స్వతంత్రమైన, నిష్పాక్షితమైన న్యాయవ్యవస్థలో మంచి వ్యక్తులు ధైర్యం వున్న వ్యక్తులు వుండాలి. అదే వారి ప్రమాణంలో వుంటుంది. ఎటువంటి భయం లేకుండా పక్షపాతం లేకుండా స్వార్థచింతన లేకుండా అత్యంత విశ్వాస పాత్రంగా న్యాయమూర్తులు తమ విధులని నిర్వర్తించాల్సి వుంటుంది.


న్యాయమూర్తి విధులు పవిత్రమైనవి. అందుకే వాటిని ప్రమాణంలో చెప్పినట్టు అత్యంత విశ్వాసపాత్రంగా, శక్తి మేరకు న్యాయంగా తన విధులని న్యాయమూర్తి నిర్వర్తించాల్సి వుంటుంది.
న్యాయమూర్తులు చేసే ప్రమాణంలోనే అతను నిర్వర్తించాల్సిన విధులు, నడవడిక సంబంధించిన అంశాలు వున్నాయి. ఈ ప్రమాణం కాకుండా మే7, 1997 రోజున సుప్రీంకోర్టులోని ఫుల్‍ కోర్టు ఏకగ్రీవంగా ‘న్యాయజీవితంలో విలువల గురించిన మరో ప్రకటనని’ అమోదించింది. అందులోని మొదటి సూత్రం ప్రకారం న్యాయం జరగడమే కాదు. జరిగినట్టు అన్పించాలి. ఉన్నత న్యాయస్థానాల్లో వున్న న్యాయమూర్తుల నడవడిక ఈ విషయం గురించి అదేవిధంగా న్యాయవ్యవస్థ నిష్పక్షపాతం గురించి ప్రజల విశ్వాసాన్ని పొందే విధంగా వుండాలి. అందుకని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తమ వ్యక్తిగత లేక అధికారిక వ్యవహారాల్లో విశ్వసనీయత కోల్పోకుండా చూడాలి. అందులోని 6వ సూత్రం ప్రకారం తన ఆఫీస్‍ గౌరవానికి తగినట్టుగా దూరాన్ని అలవాటుచేసుకోవాలి. అదేవిధంగా అందులోని 10వ సూత్రం ప్రకారం ఎలాంటి బహుమతులను బందు మిత్రుల దగ్గర నుంచి తప్ప స్వీకరించకూడదు.
న్యాయనడవడిక గురించి ముసాయిదాని ‘బెంగళూర్‍ ప్రిన్స్పల్స్ ఆఫ్‍ జ్యుడీషియల్‍ కాండక్ట్’ని 2001లో తయారు చేసి బెంగళూరు సమావేశంలో న్యాయమూర్తులు ఆమోదించారు. అవసరమైన మార్పులను చేసి దీన్ని ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆమోదించారు. ఈ నైతిక ప్రవర్తన సూత్రాలలో ప్రధానమైనవి స్వతంత్రత, నిష్పక్షపాతికత, సజ్జనత్సం (Integrity) ఔచిత్యం, సమానత్వం, యోగ్యత, సావధానత.
ఈ సూత్రాలకి సంబంధించిన ప్రవేశికలో న్యాయమూర్తుల నైతిక ప్రవర్తన వియంలో అత్యున్నత ప్రమాణాలని ఏర్పాటు చేయడం కోసం ఈ సూత్రాలని ఏర్పరిచినట్టు చెప్పారు. తమ నడవడికలను నియంత్రించుకోవడం కోసం వీటిని తయారు చేశారు. అదేవిధంగా శాసనకర్తలు, కార్యనిర్వాహకులు, న్యాయవాదులు, ప్రజలు న్యాయవ్యవస్థని అర్థం చేసుకొని, న్యావ్యవస్థకి బలం చేకూర్చాలన్నది కూడా పరోక్ష ఉద్దేశ్యం. ఈ సూత్రాలోని 1.6 ప్రకారం ప్రజల విశ్వాసం పొందే విధంగా న్యాయమూర్తి తన నడవడిక ప్రదర్శించాల్సి వుంటుంది. అత్యంత ఉన్నత ప్రమాణాలను న్యాయమూర్తులు ప్రదర్శించాల్సి వుంటుంది. ఈ సూత్రాలలోని 1:3 ప్రకారం కార్యనిర్వాహక వ్యవస్థలో, శాసనవ్యవస్థలో అదే విధంగా ప్రభుత్వ విభాగాలలో దూరంగా వుండాల్సి వుంటుంది. అలా వుండటమే కాదు వున్నట్టుగా అన్పించాలి.
‘న్యాయం జరగడమే కాదు జరిగినట్టుగా అన్పించాలి’ అన్న పదబంధం యునైటెడ్‍ కింగ్‍డమ్‍లో జరిగిన ఒక కేసు వల్ల ప్రచారంలోకి వచ్చింది. 1923వ సంవత్సరంలో మాక్‍ కార్తీ అనే వ్యక్తి ఓ రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంటాడు. అపాయకరంగా డ్రైవింగ్‍ చేశాడన ఆరోపణతో అతను ప్రాసిక్యూషన్ని ఎదుర్కొంటాడు. ఆ న్యాయమూర్తుల క్లర్క్ సివిల్‍ క్లెయిమ్‍లోని న్యాయవాదుల సమూహాలలో సభ్యుడు. ఆ రోడ్డు ప్రమాదం వల్ల ఉత్పన్నమైంది. ఆ సివిల్‍ కేసు. న్యాయమూర్తులు బెంచి దిగి చాంబర్‍లోకి వెళ్లినప్పుడు ఆ క్లర్క్ కూడా చాంబర్‍ లోకి వెళ్లాడు. ‘మాకార్తీ’కి కోర్టు శిక్షను విధించింది. ఆ క్లర్క్ తీర్పు చెప్పే చర్చల్లో పాల్గొన్నాడన్న కారణాన్ని ప్రధానంగా పేర్కొంటూ అప్పీలుని దాఖలు చేశాడు ‘మాకర్తీ’ (Macarthy).
ఆ క్లర్క్ని సంప్రదించకుండానే తాము తీర్పుని ప్రకటించామని న్యాయమూర్తులు అప్పిలేట్‍ కోర్టు ముందు పేర్కొన్నారు. ఆ విధంగా ప్రమాణ పత్రాలని కూడా దాఖలు చేశారు. కింగ్స్ బేంచి ఆ అప్పీలుని విన్నది. లార్డ్ హెవర్ట్ ప్రధాన న్యాయమూర్తి ‘మాకర్తీ’పై కేసుని కొట్టివేశాడు. ఆయన తీర్పుని ప్రకటిస్తూ ఇలా అన్నాడు.
‘‘న్యాయమూర్తులు క్లర్క్తో సంప్రదించకపోవచ్చు. సాక్ష్యాల ఆధారంగానే ‘మాకర్తీ’కి శిక్షని విధించి వుండవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ‘న్యాయం జరగడమే కాదు. అది అలా జరిగినట్లు స్పష్టం కావాలి’. అంటే న్యాయం జరిగినట్టు కాదు. జరిగినట్టు అన్పించాలి. అది కేసులోని వ్యక్తులకే కాదు. అందరికీ.
ఈ సూత్రం అప్పుడే కాదు. ఎప్పుడూ వర్తిస్తుంది. రాజ్యం అంటే ముఖ్యంగా ప్రభుత్వం కోర్టుల ముందు ప్రధాన లిటిగెంట్‍. వాళ్ళని ఆమడ దూరంలో న్యాయమూర్తులు వుంచుతారు. ఆ విధంగా వుంచాలి కూడా.


-మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *