తెలంగాణ గిరిజన నృత్యాలు


ఇప్పటికీ తెలంగాణలో పది శాతం ప్రజలు సుమారు పది గిరిజన తెగలకు చెందినవారున్నారు. వారి నృత్యాలలో ప్రాక్‍ చారిత్రక మూలాలతోపాటు చారిత్రక, ఆధునిక యుగాల మూలాలు కూడా మిగిలి ఉన్నాయి. కాబట్టి గిరిజన నృత్య రీతుల అధ్యయనం అత్యవసరం. కాని తెలుగు పరిశోధకులు ఇప్పటివరకు రెండు మూడు తెగల నృత్య రీతులనే ప్రస్తావించారు. నటరాజు రామకృష్ణ, బిరుదురాజు రామరాజు, వి.ఎన్‍.వి.కె. శాస్త్రి ప్రభృతులు గోండుల గుస్సాడీ నృత్యం, లంబాడీ స్త్రీల నృత్యాలను గురించి వివరించారు. కొండొకచో కోయ గిరిజనుల కొమ్ము (పెర్మకోక) నృత్యం గురించి ప్రస్తావించారు. మానవ శాస్త్రవేత్త హైమండార్ఫ్ గోండ్‍, చెంచు, కొండరెడ్ల నృత్యాలను వర్ణించారు. కోలామ్‍, ఆంధ్‍, ఎరుకల, నాయక్‍ పోళ్ళ నృత్యాలను ఇంకా సమగ్రంగా అధ్యయనం చేయవలసి ఉంది.


గోండుల గుస్సాడీ నృత్యోత్సవం
గిరిజనులందరూ వారి వారి నృత్యరీతుల్లో నిష్ణాతులైనప్పటికీ తెలంగాణలో గోదావరి నదికి ఉత్తరాన నివసిస్తున్న గోండులు మాత్రం ప్రత్యేకంగా వారానికి పైగా ప్రత్యేక నృత్యోత్సవాలను జరుపుకుంటారు. దీపావళి పండుగకు వారం రోజుల ముందు ప్రారంభమయ్యే ఈ నృత్యోత్సవంలో ప్రధాన ఆకర్షణలుగా గుస్సాడీ వేషధారులు కనిపిస్తారు కాబట్టి ఈ నృత్యోత్సవాన్ని గుస్సాడీ నృత్యోత్సవం అంటారు.


గుస్సాడీ నర్తకుడు:
సంతానం కోరుకునేవారు, ఆపద నుంచి విముక్తి కావాలనుకొనే వారు తమ గోండు కులపెద్ద పటేలు, గుస్సాడీ వేషభూషణాల పారంపర్య సంరక్షకుడైన ఆకడ్‍ రోథోర్‍ ను కలిసి తాము గుస్సాడీలము కావాలనుకుంటున్నాము, అనుమతించండి అని కోరుతారు. తమ వద్దనున్న గుస్సాడీ వేషభూషణాల అందుబాటును బట్టి వారు గుస్సాడీల సంఖ్యను నిర్ణయిస్తారు. వారికి తొమ్మిది రోజుల పండుగ అయ్యేవరకు సహకరించే ‘పోరిక్‍’ అనే సహాయకులను ఎంపిక చేస్తారు. పోరిక్‍ లు అమ్మాయిల వేషం వేసుకోవాల్సి ఉంటుంది. గుస్సాడీల వస్తువులను మోసుకుపోవలసి ఉంటుంది.
గుస్సాడీ శరీరం, ముఖం అంతా తడి బూడిద (గురు నీరు)తో అలలుగా, వలయాలగా అలంకరిస్తారు. జనుపనారతో చేసిన మీసాలు, గడ్డం ధరింపచేస్తారు. మొలచుట్టూ మోకాళ్ళ వరకు గొంగడి లేదా కాషాయ వస్త్రం చుడుతారు. చీల మండలాల చుట్టూ గజ్జెలు కడుతారు. భుజాల పై నుంచి ఛాతీ, వెన్ను మీదుగా ఐ ఆకారంలో పెద్ద / ఎడ్ల గంటలు కడతారు. కంఠంలో నెయ్‍ పల్క్ హార్‍ అనే పల్లేరు కాయల దండ వేస్తారు. ఎడమ భుజానికి పాసుడి అనే మేక చర్మం, మక్కమల్లి అనే జోలె వేలాడదీస్తారు. కుడిచేతిలో గంగరాం సోట అనే రోకలిని పట్టుకుంటారు. తలపైన నెమలీకలతో చేసిన మల్జాలిన గరాల్‍ టోపిని పెడతారు. ఈ టోపి ముందు భాగంలో కొహ్క్ అనే కొండగొర్రె కొమ్ములుంచుతారు. ఈ మధ్య ఈ టోపీని జిగేల్మనే అద్దపు ముక్కలు, రంగు రంగుల ప్లాస్టిక్‍ ముక్కలతో అలంకరిస్తున్నారు. గుమేల, ఫర్ర, డప్పు, ఢోల్‍, తుడుం, వెట్టె, పేప్రె (సన్నాయి), కాలికోమ్‍, చచోయ్‍ కోలలు మొదలైన సంగీత వాయిద్యాలను పోరిక్‍లు మోసుకెళ్తారు. వీటి శబ్దాలు, గుస్సాడీ శరీరంపైనున్న గజ్జెలు, గంటల శబ్దాలు కలిసి గుస్సాడీ నృత్యానికి వినసొంపైన సంగీత నేపథ్యాన్నిస్తాయి. గుస్సాడీ జోలెలో వస్తువులు వేసుకొంటాడు. పాసుడిని పడుకొనే చాపగా వాడుకుంటాడు. వాయిద్య శబ్దాలకు అనుగుణంగా నర్తిస్తారు. రుంజ, సన్నాయి, పిల్లనగ్రోవులు వాయిస్తారు.


మొదటి నృత్యం:

అలంకరించిన గ్రామం మధ్యలో వేసిన పందిరి కింద అకాడ్‍ రోథోర్‍ ఎత్మసూర్‍ పేన్‍ అని పిలిచే గుస్సాడీ సంగీత వాయిద్యాలను పెట్టి పూజించి, తమ వంశ / గోత్ర దేవతను, ఆకడ్‍ పేన్‍ అనే దేవతను తమ దండారీ పండుగ సజావుగా సాగేటట్లు అనుమతివ్వుమని వేడుకుంటారు. గ్రామ స్త్రీలు కూడా పూజలు చేసిన తరువాత గుస్సాడీలు, పోరిక్‍ లు ఆ సంగీత వాయిద్యాలు, గుస్సాడీ వస్తువులను తీసుకుంటారు. వారిని గ్రామస్థులు అభినందిస్తారు. అనంతరం వీరు ఒకే పెద్ద పళ్ళెంలో ‘పాతి’ భోజనం చేస్తారు. తరువాత గుస్సాడీలు, పోరిక్‍ లు, గ్రామ యువత తొలి న నృత్యం చేస్తారు. వాద్యకారులు సంగీత వాయిద్యాలు వాయిస్తుండగా, పాటవార్వలీర్‍ అనేవారు పాటలు పాడుతుండగా, శృతిగీతాలకు అనుగుణంగా గుస్సాడీలు, పోరిక్‍ లు నృత్యం చేస్తారు. పోరిక్‍ లు తమ ముఖాలకు కోడల్‍ యెహ్వాల్‍ అనే చెక్క ముసుగులను ధరించి యెంద్వాల్‍ అనే నృత్యం చేస్తారు. కొందరు తమను ఏదో శక్తి ఆవహించినట్లుగా నియంత్రించలేనంత ఉగ్రంగా నృత్యం చేస్తారు. అలాంటివారిని గట్టిగా పట్టుకుని, ‘‘నువ్వు శాంతించకపోతే పద్మల్పురి కాకో అమ్మవారికి అప్పగిస్తాం’’ అని దేవత పేరు చెప్పి భయపెట్టి శాంతింపచేస్తారు. ఓ పక్కన గ్రామ యువత ప్రత్యేకంగా చచ్చోయ్‍ అనే కోలాటం నృత్యం చేస్తారు.
ఈ తొలి నృత్యం తరువాత ఒక గ్రామ గుస్సాడీలు, పోరిక్‍ లు మరో ఆతిథ్య గ్రామానికి డప్పు చప్పుళ్ళ మధ్య దండుగా వెళ్తారు. వీరు వాయించే ఒక ప్రత్యేకమైన డప్పుల వాయింపును బట్టి ఆతిథ్య గ్రామస్థులు ఎదురుగా వచ్చి వీరిని ఆహ్వానిస్తారు. గుస్సాడీల చేతుల్లోని రోకళ్ళను శంభుమహాదేవుని త్రిశూలంగా భావించి వాటికే అభిషేకం చేస్తారు. గుస్సాడీలను శివరూపాలుగా భావించి వారి వస్తువులను, సంగీత పరికరాలను (ఎత్మసూర్‍ పేన్‍) పూజిస్తారు. అనంతరం అందరూ కలిసి గుస్సాడీ నృత్యం చేస్తారు. తరువాత అతిథులకు మృష్టాన్నం (పాతి భోజనం) వడ్డిస్తారు. అతిథులు ఒకరినొకరు ‘తాత’ (దాదా) అని ఆటపట్టించుకుంటూ పోటాపోటీగా భుజిస్తారు. భుక్తాయాసమైతే తమ రోకళ్ళను గట్టిగా నేలకు గుద్దుతూ తేలికవుతూ మళ్ళీ భుజిస్తారు.
ఇలా కొంతసేపు జరిగిన తరువాత అసలు నృత్యకార్యక్రమం మొదలవుతుంది. పాటలు, వాయిద్యాలకు అనుగుణంగా గుస్సాడీలు, పోరిక్‍ లు నృత్యం చేస్తారు. రాత్రి గడుస్తున్నా కొద్ది వాద్యాల ఘోష, పాటల్లో ఊపు, చూపరుల్లో ఉత్సాహం పెరుగుతుంటుంది. గుస్సాడీలు ఒక్కోమారు చూపరులలోకి చొచ్చుకొని పోయి తమ రోకళ్ళతో వారికి చక్కిలిగింతలు చేస్తారు. గుస్సాడీలలో యువకులైన వారు, పోరిక్‍ లు (యువకులు) తమ నృత్య ప్రావీణ్యం ద్వారా యువతులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఆకర్షించగలిగిన అమ్మాయిల పేర్లను తమ తల్లిదండ్రులకు చెప్తారు. వరసైన వారికి తదనంతరం పెళ్ళి జరుగుతుంది.
ఇలా సుమారుగా వారం రోజులు ఓపికున్నంత సేపు నృత్య వేడుకలు జరుపుకుంటారు. ఓపిక అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేకమైన డప్పు చప్పుడు ద్వారా ‘ఈనాటి గుస్సాడీ నృత్యం ముగిసింది’ అనే సంకేతమిస్తారు. ఆ తరువాత గుస్సాడీలు తమ వస్తువులను ఒక మంచం లేదా బల్లపైన (నేలపైన మాత్రం కాకుండా) పెట్టి తాము పాసుడిపైన పడుకుంటారు.
దండారీ పండుగలో చివరి / తొమ్మిదవ రోజు నాడు ప్రజానాయకులు, ప్రభుత్వ పెద్దలు ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ రోజు స్త్రీలు కూడా వలయాకారంలో ఏర్పడి డియాన్‍ యెంద్వాల్‍ అనే నృత్యం చేస్తారు. ఆ తరువాత గుస్సాడీలు, పోరిక్‍ లు తమ స్వగ్రామానికి వెళ్తారు. అప్పుడు కోలబోడి అని పిలిచే కోర్కుటుత్సవల్‍ జరుపుతారు. అంటే, ఆ గ్రామ దేవరి గాని, ఆకడ్‍ రోథోర్‍ గాని ఆకిపెన్‍ లేదా అవ్వల్‍ పెన్‍ అనే దేవత ముందు తమ గోత్ర సంఖ్యను తెలిపే పిడికిళ్ళ బియ్యం పోసి, కోడి పుంజును కోసి, మొక్కి దేవతకు కృతజ్ఞతలతో దండారి ఉత్సవం ముగిసిందని ప్రకటిస్తారు. ఆ తరువాతనే గుస్సాడీలు వారం అనంతరం వేషాలు విప్పేసిన తరువాత స్నానం చేస్తారు. వేషభూషణాదులతో ఉన్నప్పుడు వారు శివస్వరూపులు. కాబట్టి వారినే ప్రజలు మొక్కుతారు.


ఇలాంటి నటరాజు స్వరూపమైన గుస్సాడీ నృత్యానికి సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నుండి ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాకు చెందిన పలువురు గోండు పెద్దలు ప్రచారం కల్పించాలనుకున్నారు. ఆ జిల్లా ఉట్నూరు సమీప లక్షెట్టిపేటకు చెందిన ఐ.ఎ.ఎస్‍. అధికారి కీ.శే. శ్రీ మడావి తుకారాం పిట్టగూడలో గుస్సాడీ నృత్యాన్ని గోండు యువకులకు నేర్పించేందుకు ప్రోత్సహించారు. నేర్పించిన వారిలో ప్రముఖులు కనక రాజు. వీరికి స్ఫూర్తినిచ్చింది వారి మాతామహులు ఆత్రం లచ్చు పటేల్‍.
రాజుగారి దగ్గర శిక్షణ పొందిన వందకు పైబడిన గోండు యువకులలో లయ-గతులు (స్టెప్స్ వేయడంలో సుమారు సగం మంది విఫలురు కాగా సుమారు 65మంది సఫలురయ్యారు. వారు, వారి ప్రశిష్యులు అంతరించే ప్రమాదంలో పడిన గుస్సాడీ నృత్యాన్ని కాపాడారు. కనక రాజు ఈ నృత్యాన్ని 1982లో భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ముందు, 2002లో భారత రాష్ట్రపతి అబ్దుల్‍ కలామ్‍ ముందు ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. ఇందిరాగాంధీ కాళ్ళకు గజ్జెలు కట్టి ఎగిరించిన అనుభూతిని కనక రాజు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. వీరి ప్రావీణ్యాన్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా వీరిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‍, గిరిజన సంక్షేమ శాఖ, సాంస్కృతిక శాఖల అమాత్యులు, పలు సంస్థలు సన్మానించాయి. రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో గుస్సాడీ నృత్యోత్సవాల నిర్వహణకు రూ. కోటి విడుదల చేయడం సంతోషం.


కోలామ్‍ల డండారి చచ్చోయ్‍ నృత్యాలు
కోలామ్‍ లది అత్యంత ప్రాచీన తెగ. వీరు డండారి, చచ్చోయ్‍ నృత్యాలు చేస్తారు – పండుగలు, దేవతారాధన జాతరలలో. వీరు తమ నృత్యాలలో కోలలు పట్టుకొని కొట్టుకుంటూ పలు రకాల నృత్తరీతులను ప్రదర్శిస్తారు. ఈ నృత్యాలలో భాగంగా పురుషులు, స్త్రీలు, స్త్రీ వేషాలు వేసుకున్న పురుషులు పలు రకాల పిండీ బంధాలు (ఫార్మేషన్స్)గా ఏర్పడుతూ డోలు, డప్పు, మృదంగం, గుమ్మేల, పిల్లనగ్రోవి తదితర వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. పాటలకు అనుగుణంగా వీరి నృత్యాలలో నెమలి నాట్య అనుకరణ, పులి, ఎలుగుబంటి వంటి క్రూర జంతువులనుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోవటం, వేటాడటం మొదలైన అంశాలను ప్రదర్శిస్తారు. పెళ్ళిళ్ళలో వేత, డెంసా అనే నృత్యాలను పోటీలుపడి మరీ చేస్తారు.


ఆంధ్‍ల నృత్యాలు

ఆంధ్‍ లు కూడా దండార్‍, వాఘ్యా అనే నృత్యాలు, కలాపథ్‍, భూతాచేసోంగ్‍ అనే నృత్య రూపకాలను ప్రదర్శిస్తారు. దండార్‍ లో భాగంగా 7-8 మంది పురుషులే స్త్రీ-పురుష పాత్రలను ధరించి పౌరాణిక గాథలను గాన నృత్యాలలో ప్రదర్శిస్తారు. దేవుడి అనుగ్రహంతో సంతానం పొందినవారు మొదటి కొడుకు పెరిగిన తరువాత ఖండోబా దేవునికి జాగరణ పేరుతో ‘వాఘ్యా మురళి’ అనే వీరగాథా నృత్యాలను ప్రదర్శిస్తారు. కలాపథ్‍ అనేది మనోరంజనం కోసం ఆడే నాటక కళ. భూతాచేసోంగ్‍ అనే దయ్యాల నాటకంలో పాత్రల వాదనాపూర్వక నాట్యం ప్రదర్శితమవుతుంది. ఆంధ్‍ లు సంతానం విషయమై ఆరాధించే సట్వాయి దేవత కొలుపులో ముఖానికి ఆ దేవత ముసుగును ధరించి నాట్యం చేసేవారు. ఆంధ్‍ లు వేట నృత్యాలు కూడా ప్రదర్శించేవారు. చివరి రెంటిని ఇప్పుడు పూర్తిగా మర్చిపోయారు.


నాయక్‍ పోడ్‍ నృత్యాలు
నాయకపోళ్ళు లక్ష్మీదేవర పెండ్లి సంబరం జరుపుకునేటప్పుడు లక్ష్మీదేవర, పాండవుల ముసుగులను తలలపై ధరించి తప్పెటగూళ్లకు (డప్పులకు) అనుగుణంగా నృత్తం చేస్తారు. వేట చేసినట్లుగా నాట్యమాడుతారు. కొర్రాజుల కొలుపులో డేగ ఆట, కీలుగుర్రం ఆట ఆడుతారు. భీమన్న జాతరలో ఉడుము ఆటను ప్రదర్శిస్తారు. పెద్దమ్మ కొలుపులో కూడా నృత్తాలు చేస్తారు – స్త్రీ బాల వృద్దలందరూ. మహిళలు చెమ్మకాయల గుత్తులు పట్టుకొని అవి చేసే శబ్దాలకు అనుగుణంగా నర్తిస్తారు. రుంజ, సన్నాయి, పిల్లనగ్రోవులు వాయిస్తారు.


కోయ నృత్యాలు

కోయజాతివారు సామూహికంగా జరుపుకొను భూమి పండుగ, ముత్యాలమ్మ పండుగ, కొలుపు, తాటిచెట్ల పండుగ, లేలే పండుగ, పేనండూం వేల్పుల పండుగ మరియు వివాహాది కార్యక్రమాలలో సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. కోయలు తాటి, జీలుగు చెట్ల నుండి కల్లును తీస్తారు. ఆయా సందర్భాలలో కోయ స్త్రీ పురుషులందరు కల్లు, ఇప్ప సారాయి సేవిస్తారు. ఆ మత్తు కొత్త ఉత్సాహం నింపగా అందరూ ఆనందంగా కేరింతలతో నృత్యాలు చేస్తారు.


రేల నృత్యం:
కోయలు మూడు రకాల రేల నృత్యాలు చేస్తారు. ఈ రేల నృత్యాలలో 30 నుండి 40 మంది వరకు స్త్రీ పురుషులు పాల్గొంటారు. స్త్రీ జట్టుకు ఒక నాయకురాలు, పురుషుల జట్టుకు ఒక నాయకుడు ముందు ఉండి ఈ నృత్యాలను చేస్తుంటారు. ఒక రకమైన పద్ధతిలో స్త్రీ పురుషులు పాటలు పాడుతూ ఒకరి నడుముపై ఒకరు చేతులు వేసి పాటకు అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ వలయకారంగా తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇంకో రకమైన పద్ధతిలో స్త్రీ పురుషులు విడివిడిగా వలయాకారంగా నిలబడి, ఎవరి చేతులతో వారే చప్పట్లు కొడుతూ ముందుకు మూడు అడుగులు వేసి, వెనుకకు మూడు అడుగులు వేస్తూ పాటకు అనుగుణంగా నృత్యం చేస్తారు. మరో రకమైన పద్ధతిలో వలయాకారంగా విడివిడిగా నిలబడి అడుగులు వేస్తూ నృత్యం చేస్తూ తమ చేతులను ఇరు ప్రక్కలకు మార్చి మార్చి చప్పట్లు కొడతారు. ఈ ఆట కోలాటం మాదిరిగా ఉంటుంది.
భూమి పండుగ సమయంలో గ్రామంలోని పురుషులందరు సామూహికంగా వేటకు వెళ్ళి ఏదో ఒక అడవి జంతువును వేటాడి తీసుకు వస్తారు. పురుషులు అడవి నుండి తిరిగి వచ్చు వరకు గ్రామంలోని స్త్రీలు రేల పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. స్త్రీలు ఒకరి భుజాలు ఒకరు పట్టుకొని వలయాకారంగా తిరుగుతూ రేల నాట్యం చేస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. అడ్డ కట్టుగా మోకాళ్ళ వరకు చీర కట్టి కుడివైపు పైట వేసుకుంటారు. శిరోజాలను అందమైన కొప్పులుగా (కూపారు ముడి) ముడుస్తారు. తలపై పక్షుల ఈకలను ధరిస్తారు. పండుగ, వివాహము, జాతర్లు, వెన్నెల రోజుల్లో ఆనందంగా మైమరచి చేసే కోయ యువతుల నృత్య భంగిమలు బహు ఆకర్షణీయంగా ఉంటాయి. వారు పాడే రేల పాటలలో రేల అంటే ‘‘వెన్నెల’’ అని అర్థం. వారి జాతి కూడా రేల చెట్టు క్రిందనే జన్మించిందనే భావం కూడ ఉంది.


ఒక రేల పాట:
రేలా రేలయ్యో రేలా రేలా రేరేలా
సన్నబాదు చెల్లెలే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
వీరలరాజు చెల్లెలే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
అద్దమన్నా నత్తింకే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
దాని లేబరేయ్యానో లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
దానితోడు చెల్లెలే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
ముత్తలచ్చు చెల్లెలే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
ముత్తల జానకి చెల్లెలే లారి దాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
రేలా రేలా రేరేలా?
రేలా రేలా రేరేలా?
రేలా రేలా రేరేలా?
రేలా రేలా రేరేలా?
రేలా రేలా రేరేలా?
రేలా రేలా రేరేలా?
రేలా రేలా రేరేలా?
లచ్చల నీరు చెల్లెలే లారీదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
లచ్చల రాజు చెల్లెలే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
రేలా రేలా రేరేలా?
రేలా రేలా రేరేలా?


కొమ్ము నృత్యం:
కోయలు అడవి దున్న కొమ్ములతో తయారు చేసుకున్న ‘‘సింగ’’ అను శిరస్త్రాణము (టోపి) ధరిస్తారు. నెమలి ఈకలతో తయారు చేసిన పుర్కట్టను ఈ శిరస్త్రాణమునకు అలంకరించి రంగు రంగుల చీరను కడతారు. మెడలో డోలు కొయ్య(గండ్డ)ను ధరించి ఒక పక్క చేతితో, మరో పక్క ‘‘చిర్ర’’(చిన్న కర్ర)తోను డోలును వాయిస్తారు. కాలికి అందె (అందెలను) ధరించి లయబద్ధంగా అడుగులు వేస్తూ డోలునృత్యం చేస్తారు. మధ్య మధ్య ముసారి కొమ్ము (తూత కొమ్ము – అడవి దున్న కొమ్ము) ను ఊదుతూ శబ్దాలు సృష్టిస్తారు. నాట్యం చేసే సమయంలో ఈ ముసారి కొమ్మును భుజానికి తగిలించు కుంటారు.
వారి నాట్యంలో భాగంగా అడవి దున్నల పోరాటం (పెర్మాం) ఆసక్తికరంగా ఉంటుంది. భూమి మీద వేసిన కాగితపు ముక్కను తాము ధరించిన అడవి దున్న కొమ్ముకొనతో గుచ్చి పైకి తీయడం వంటి చిత్ర విచిత్రమైన కళలను ప్రదర్శిస్తారు.


కుర్రె నృత్యం:
సందర్భాన్ని బట్టి 20 నుండి 30 మంది పురుషుల వరకు ఈ నృత్యంలో పాల్గొంటారు. రెండు సన్నాయిలు, మూడు మేళాలు ఈ నృత్యంలో ప్రధాన సంగీత వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. పంచ, బనీను ధరించి తలకట్టు కట్టుకొని చేతిలో తువ్వాలు పట్టుకొని కాళ్లకు గజ్జలు ధరించి వలయాకారంగా సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తారు. ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసి బృంద నాయకుని సైగలను అనుసరించి ఈ నృత్యాలు చేస్తారు.
లంబాడీ నృత్యం
రాష్ట్ర జనాభాలో ఆరున్నర శాతంగా ఉన్న లంబాడీ గిరిజనులలో వారి స్త్రీలు హెరీళి, తీజ్‍, తదితర పండుగలు, వేడుకలలో చేసే నృత్యం చూడముచ్చటగా ఉంటుంది. వారి ప్రత్యేక ఆహార్యం, వారు పాడే పాటలు వారి నృత్యానికి అదనపు ఆకర్షణలు. నృత్యం చేస్తున్నప్పుడు మహిళలు వలయాకారంలో తిరుగడమే కాకుండా చేతులను పైకెత్తి డప్‍ వాద్య శబ్దాలకు అనుగుణంగా తిప్పుతూ లయబద్ధంగా అడుగులు వేస్తుండడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ లంబాడీ / బంజారా నృత్యాన్ని బాలికలు విద్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.


చెంచు నృత్యం
కృష్ణ నది ఒడ్డున నల్లమల అడవులలో నివసించే చెంచు గిరిజనులు కూడా తమదైన శైలిలో నృత్యాలు చేస్తారు. ప్రత్యేకంగా కొంత మంది కలిసి ఇప్ప సారాయి కాచుకొని తాగినప్పుడు చేసుకునే ప్రత్యేక వేడుకల్లోనూ, శివరాత్రి సందర్బంగా జరుపుకునే భ్రమరాంబా మల్లికార్జున స్వామిల కళ్యాణంలో, వివాహాది శుభకార్యాలలో చెంచు స్త్రీ పురుషులు నృత్యం చేస్తారు. సాధారణంగా వారు సహజంగా వేసుకున్న బట్టలతోనే నృత్యం చేస్తారు. కొన్నిసార్లు పురుషులు బుడ్డగోచి కట్టుకొని, భుజం వెనుక తేనే బుట్ట వేసుకొని, నడుముకు కట్టి తగిలించుకొని, చేతుల్లో ధనుర్బాణాలు ధరించి వేటకు వెళ్తున్నట్టుగా నృత్యం చేస్తారు. డప్పు, ఊదనగ్రోవి (పిల్లనగ్రోవి) శబ్దాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. వారి నాట్య పద్ధతిలో ఒక క్రమాన్నైతే ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదు. వారి ఉత్సాహం మాత్రమే వారి నృత్యంలో కనిపిస్తుంది.


గీత, వాద్య నాట్యాల సమ్మేళనమైన నృత్యం ఆబాల గోపాలాన్ని సహజంగా అలరిస్తుంది. కాబట్టి నృత్యాభినయం భాష కంటే ముందే పుట్టి నాటి నుంచి నేటివరకు మానవాళి సంతోష సంస్కృతిలో భాగమై ఉంది. ప్రాక్‍ చారిత్రక, చారిత్రక యుగాలలో రకరకాల జాతుల సమ్మేళనంతో మార్పు చేర్పులకు గురై పరిపుష్టమైంది. ఈ నేపథ్యాన్ని అధ్యయనం చేయకనే పలువురు ఆంధ్ర పరిశోధకులు తెలంగాణకు నృత్య సంస్కృతి లేదని అన్నందుకు తను వాపోయినట్టు నటరాజు రామకృష్ణ రాశారు. పై పేజీలలో చూశాము – తెలంగాణ గిరిజనులకు ఎంత వైవిధ్యభరితమైన, వైభవోపేతమైన నాట్యకళా సంస్కృతి ఉన్నదో! అయితే ఆ సంస్కృతి ప్రాధాన్యతను తక్షణమే గుర్తించి, పోషించి భావితరాలకు భద్రంగా అందించవలసిన ఆవశ్యకత కూడా అవశ్యంగా ఉంది.

  • ద్యావనపల్లి సత్యనారాయణ,
    ఎ : 94909 57078

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *