మన వారసత్వ సంపదను మనమే కాపాడుకుందాం!


భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతో, సువిశాలంగా, సుసంపన్నంగా విలసిల్లే దేశం. చరిత్ర ప్రారంభకాలం నుంచి భారతదేశాన్ని ‘‘ల్యాండ్‍ ఆఫ్‍ మిల్క్ అండ్‍ హనీ’’ గా పేర్కొన్నారు. వేదకాలం నుంచి ఎన్నో దండయాత్రలు, మరెన్నో ప్రక•తి వైపరీత్యాలను చవిచూసినా ఎదురొడ్డి నిలచిన ఘనత మన దేశానిది. గ్రీకు, రోమన్‍, మెసపటోమియన్‍ నాగరికతలు ఎంతో వైభవాన్ని చూపినా కాలగర్భంలో కలిసిపోయాయి. అసలు నాగరికతే తెలియదు అనుకున్న భారతదేశం మాత్రం 5000 సం।।లకు పైగా ఒకే సంస్కృతికి కట్టుబడి ఉంది. సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పటికీ కొత్త ధర్మాలని ఎప్పుడూ ఒడిసి పట్టుకొనే తల్లి భారతి.


బౌద్ధ, జైన ధర్మాలు దేశ విదేశాల్లో వ్యాపించి, నేటికీ అలరారుతున్నాయన్నది మనకు ఎన్నో శాసనాలు, కట్టడాల ద్వారా తెలుస్తూనే ఉంది. సింధు నదీ పరివాహక ప్రాంతంలో వెలుగొందిన సింధూ నాగరికత ఆనాటి స్నానవాటికలు, గిడ్డంగుల నిర్మాణంతో, ప్రజా సౌకర్య భవనాలు, చేతి పని కార్మికుల ఆవాసాలతో అత్యంత అధునాతనమైన మురికి కాల్వల నిర్వహణలతో ప్రపంచాన్ని అబ్బుర పరిచింది. ఇది పూర్తిగా భారతీయుల వాస్తు కళా వైభవమే. వేదకాలంలో విశ్వకర్మ ప్రస్తావన ఉన్నప్పటికీ ఆనాడు నిర్మాణాలకు చెక్క (wood) వినియోగించడం వల్ల అవి ఎక్కువకాలం నిలువలేదు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఇటుకలు మరియు రాళ్ళను నిర్మాణానికి ఎన్నుకోదగ్గవిగా చెప్పినా, చెక్క వాడకం ఎక్కువగానే ఉండేది. కుమ్రాహార్‍లో 80 వరుసల చెక్కస్తంభాల గది దీనికి ఉదాహరణ. అశోకుడు తన శాసనాలను రాతి గోడలపై, స్తంభాలపై చెక్కించటానికి కూడా వాటి దీర్ఘకాల మన్నికే కారణం అని పేర్కొన్నాడు. బుద్ధుని మరణానంతరం ఆయన ధాతువులను భద్రపరచటానికి నిర్మించిన చైత్యాలు, స్థూపాలు, ఆరామాలను ఎంతో నాణ్యతతో నిర్మించారనేది వాస్తవం. ఆంధ్రరాష్ట్రంలో అమరావతి స్థూపాన్ని పూర్తిగా సున్నపురాతితో నిర్మించారు. మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహలు రాతితో చెక్కించారు. గుప్తుల కాలం నాటికి భారతదేశంలో హిందూధర్మ పునరుద్ధరణతో వాస్తు కళ అలరారింది. ఫలితంగా రాజ్యాలేవైనా రాజులెవరైనా అధునాతన పోకడలతో భవనాలు, మందిరాల నిర్మాణం కొనసాగింది. ప్రత్యేకించి దక్షిణ భారతదేశం అద్భుత కట్టడాలకు పెట్టింది పేరు. విస్తారమైన ఎత్తైన కొండలు ఉండడం వల్ల కొండల్ని గుహలుగా, చైత్యాలుగా, ఆరామాలుగా, ఆవాసాలుగా, ఏకశిలా దేవాలయాలుగా మలిచే సాంప్రదాయం విలసిల్లింది. నాగర, ద్రావిడ, వేసర అనే నిర్మాణ శైలులతో పాటు ఇండో సార్సెనిక్‍, ఇండో పర్షియన్‍, ఇండో ఇస్లామిక్‍ మరెన్నో విభిన్న సంప్రదాయాల్లో భవన నిర్మాణం జరిగేది.


అలాంటి ప్రదేశాలకు ప్రతి రోజూ వేలాదిగా దేశవిదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరాన్నీ, గంటల కొద్దీ ప్రయాణాన్ని అన్నింటినీ మించి శారీరక, మానసిక, ఆర్థిక శ్రమల్ని ఖాతరు చేయకుండా ఆ ప్రదేశాన్ని చూడటానికి వస్తారు. వాళ్ళందరూ విద్యావంతులే, జీవితంలో స్థిరపడ్డ వాళ్ళే, పురాతన కట్టడాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళే కాని, చిన్న చిన్న తప్పిదాల వల్ల ఆ ప్రదేశం ఉనికిని దెబ్బ తీస్తారు. అవి కావాలని చేసే తప్పులు కావు, మానవ సహజంగా జరిగిపోయేవి. వాటిలో కొన్నిటిని చూద్దాం.
ప్రస్తుతం ప్రపంచ పురాతత్వ శాస్త్రవేత్తలదరికీ ‘‘హ్యూమన్‍ వాండలిజం’’ ఒక సమస్యగా మారింది. ఏదైనా ఒక పురాతన ప్రదేశాన్ని, భవనాన్ని లేదా వస్తువుని వెలికి తీసి, దాని సంబంధిత కాలాన్ని నిర్ధారించి దాన్ని ప్రపంచదేశాలకి పరిచయం చేయటం ఎంత కష్టమో అలాగే భద్రపరచటం కూడా అంతే కష్టం. ముఖ్యంగా మానవుల నుండి. ఈ సమస్య భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నిట్లో ఉంది. అయితే ఒక ప్రదేశం కాలక్రమేణా ఎలా పురాతత్వ ప్రదేశంగా మారుతుందో చూద్దాం. మొదటగా, చరిత్రలో నిర్మింపబడి, శతాబ్దాల పాటు వెలుగులో ఉండి, ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యం వల్లనో, ( భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు మొ।।వి) యుద్ధాల వల్లనో (ప్రపంచ చరిత్రలో యుద్ధంలో గెలిచిన ప్రతి రాజ్యాన్ని ఓడిన రాజ్యం నేలమట్టం చేసింది) లేదా అంటు వ్యాధుల వల్లనో (ప్లేగు వంటి వ్యాధులు వ్యాప్తి చెందినపుడు ) ఆ ప్రదేశాలని వదిలి వేరొక గ్రామానికి వలస వెళ్ళేవారు అక్కడి ప్రజలు. అలా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో చిన్న చిన్న జంతువులు స్థిరనివాసం ఏర్పరచుకోవటం, వాతావరణంలోని మార్పులకు అది బయల్పడడం వల్ల (ఎండ, వాన, మంచు, ఉరుములు, మెరుపులు మొ।।నవి ) దాని శోభని కోల్పోయి పాత భవనం లేదా ప్రదేశంగా మారుతుంది. శతాబ్దాలు గడిచే కొద్ది ఆ ప్రదేశం వరదల వల్లనో, గాలి వల్లనో మట్టితో కలుస్తుంది. దాన్ని పురాతత్వ శాస్త్రం (Archaeology) లో Stratification అనే పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.


ఇలాంటి ప్రదేశాన్ని కొన్ని వందల లేదా వేల సంవత్సరాల తర్వాత అక్కడున్న స్థానిక ప్రజలో, వ్యాపారులో లేదా పురాతత్వ శాస్త్రవేత్తలో కనుగొంటారు. కొన్ని సార్లు అలాంటి ప్రదేశాల్లో వాళ్ళే తవ్వకాలు మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే ప్రాచీన కథలన్నిటిలోనూ నిధి నిక్షేపాలు, లంకె బిందెలు భూమి నుండే దొరుకుతాయి కాబట్టి. దీని వల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ఎంతో గొప్పదైన వారసత్వ సంపదని మన చేతులతో మనమే పాడు చేయవచ్చు. ఇటువంటి ప్రదేశాలు, వస్తువులు ఎప్పుడు, ఎక్కడ కనిపించినా వెంటనే సంబంధిత అధికారులకి తెలియజేస్తే వారు సరయిన పద్ధతిలో తవ్వకాలు జరుపుతారు. అంతే కాదు అదే న్యాయబద్ధమైన పద్ధతి. అయితే శిక్షితులైన, నిష్ణాతులైన పురాతత్వ శాస్త్రవేత్తలకు కూడా ఇది పరీక్షే.


ఇలా కనిపెట్టిన ప్రదేశాలని సంరక్షించటంలోనే ఉంది అసలు చిక్కంతా. ఒక ప్రదేశం బయల్పడగానే అప్పటికప్పుడు దాని గురించి వ్యాసాలు రాసి, కాల నిర్ధారణకి పరీక్షా కేంద్రాలకి (ల్యాబ్‍) పంపి, ఫలితాలు వెలువడే దాకా, క్రమానుసారంగా దాని గురించి వార్తా పత్రికల్లో శీర్షికలు వెలవరిస్తాం. తర్వాత పాత కాలం నాటి నాణేలో, విగ్రహాలో లేదా శిల్పాలో అయితే ఏదో ఒక ప్రభుత్వ వస్తు ప్రదర్శనశాలలో (మ్యూజియం) భద్రపరచుకోవచ్చు. కానీ, బయటపడిన ప్రదేశం ఒక హరప్పా, మొహెంజొదారో స్నానవాటిక అయితే? దాన్ని ఎక్కడ పెడతారు? ఇలాంటి ప్రదేశాన్ని ‘‘ఓపెన్‍ ఎయిర్‍ మ్యూజియం’’ అంటారు. అయితే పురాతత్వ శాస్త్రవేత్తలు చేయలేనిది అంటూ ఏదీ లేదు. ఒక వేళ ఈ ప్రదేశాలు ప్రస్తుత నగరం మధ్యలో ఉండి, నగర విస్తరణకి అవసరం అనుకుంటే ఉన్నది ఉన్నట్టుగా పూర్తి శాస్త్రీయ పద్ధతిలో వేరొక ప్రదేశానికి తరలిస్తారు. ఉదాహరణకి నాగార్జున సాగర్‍ ప్రాజెక్ట్ ప్రదేశంలో ఇక్ష్వాకుల రాజధాని విజయపురి బయల్పడితే అక్కడి కట్టడాలు చిన్నవీ, పెద్దవీ అన్నిటినీ, బుద్ధుని ప్రతిమలు, యజ్ఞవాటికలూ, బౌద్ధ స్తూపాన్ని కూడా వేరొకచోట పునర్నిర్మించారు. ఇది ఇప్పటికీ మనం చూడొచ్చు. ఇది ఒక
ఉదాహరణ మాత్రమే ఇలాంటి సందర్భాలు కోకొల్లలు.


అయితే భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం మనకు పురాతత్వ సంపదలో కూడా కనబడుతుతుంది. అజంతా చిత్రాలు, ఎల్లోరా శిల్పాలు, భింభెట్కా ప్రాచీన మానవ గుహలు, బుద్దుని గాంధార శిల్పాలు, సింధు నాగరికతలో వెలసిన ఎర్రమట్టి బొమ్మలు (Terracotta fifurines), కాంస్య యుగపు ప్రతిమలు, చోళుల కాంస్య విగ్రహాలు, రాతి యుగపు సమాధులు, ఒక్కటేమిటి? ఎన్నో భిన్నమైన కోణాల్లో భారత దేశ ఐక్యత కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న ప్రతిమలు, కట్టడాలే కాదు మానవ సాధ్యమేనా? అనిపించే తంజావూరులోని బృహదీశ్వరాలయం లాంటి గొప్ప గోపుర నిర్మాణాలూ, మహాబలిపురంలోని ఏకశిలా రథాలు, ఖజురహో మందిర సొబగులు, కోణార్కలోని సూర్యదేవాలయ వెలుగులు ఇలా ఒకటేమిటి? ఎన్నో మరెన్నో అందాలు భారతదేశానికి పెట్టింది పేరు. అలాంటి మన దేశాన్ని, దేశ సంపదలని మనమే పాడు చేసుకుంటున్నాము. అదెలాగో తెలుసుకుందాం.


బ్రిటీషు వారు ఎంతో అరాచకంగా, రాక్షస పాలన సాగించారని మనం ఎంత తిట్టుకున్నా భారతదేశ పురాతత్వ శాస్త్రానికి పునాదులు వేసింది వారేనని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. వారి రాజ్య విస్తరణలో భాగంగా, రోడ్లు, రైలు మార్గాల త్రవ్వకాలలో బయల్పడిన ఎన్నో విలువైన వస్తువులను వారు ప్రపంచదేశాలకు వెల్లడించారు. అయితే వాటిలో సింహభాగం బ్రిటీషు మ్యూజియంలో ఇప్పటికీ ప్రదర్శింపబడుతున్నాయి. అటువంటి అధికారుల్లో ప్రపధమంగా చెప్పుకోవలసింది కల్నల్‍ కాలిన్‍ మెకంజీ ( 1754-1821) గురించి. ఈయన 1797లో ఆంధప్రదేశ్‍ లోని అమరావతిని సందర్శించారు. దీపాలదిన్నెగా పిలువబడే ఒక దిబ్బను తవ్వి బౌద్ధ చైత్యాన్ని కనుగొన్నారు. సున్నపురాయితో నిర్మింపబడిన ఈ చైత్యంలో కొన్ని పలకలను ఒక స్థానిక జమీందారు తన ఇంటి నిర్మాణానికి వాడుతుండగా అడ్డుకొని, మిగిలిన పలకలతో ప్రస్తుతం మనం చూస్తున్న చైత్యాన్ని నిర్మించాడు. ఇలా పురావస్తు అవశేషాలను వాటి విలువ తెలియక తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం తీవ్రమైన మొదటి మానవ తప్పిదం. అంటే, దాని చారిత్రక విలువ తెలుసుకోకుండా ఏదో బయటపడి ఉంది దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి నేను తీసుకెళ్తున్నాను అని మనకి మనం సర్ది చెప్పుకోవటం సమ్మతం కాదు. పురాతత్వ కట్టడాలలో వెలుగు చూసిన వస్తువులను ఊరికే పడెయ్యరు, యథాస్థానంగా ఉంచుతారు.


ఇక రెండవది, రోడ్లు, రైలు మార్గాల విస్తరణ. ఇక్కడ అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోని ఉదంతాన్ని ఉదహరిస్తాను. అభివృద్ధి చెందిన దేశాలని సైతం భయపెడుతున్న సమస్యగా ఈ ఉదాహరణని తీసుకుందాం. అక్కడ రోడ్డు విస్తరణలో Puebloan కాలం నాటి (900-1350 AD) ప్రాచీన ప్రాముఖ్యత కల్గిన ఒక ప్రదేశం బయట పడింది. కాని అస్తవ్యస్తంగా జరిపిన రోడ్డు తవ్వకాల వల్ల, భవన నిర్మాణాల వల్ల అక్కడి వివరాలు పూర్తిగా నాశనమయ్యాయి. అసంపూర్తిగా ఉన్న వివరాల వలన, అధికారులు చేసిన తప్పిదాల వలన ఆ ప్రదేశం వారసత్వ ప్రదేశాల్లో స్థానం సంపాదించలేక పోయింది. ఇది కావాలని చేసిన తప్పిదం కాదు. ఇటువంటి ప్రణాళికా రహితమైన చర్యల వల్ల జరిగే నష్టం దేశ నాగరికతకు ముప్పు తేవచ్చు.


మూడవ తప్పిదం యుద్ధాలు. ఎంత నాగరికులం అని చెప్పుకుని తిరుగుతున్నా ఇంకా అనాగరిక లక్షణాలు మనల్ని వదలట్లేదు. రాజుల కాలంతో ముగియాల్సిన యుద్ధాలు ఆధునిక యుగంలో మరింత ఎక్కువ అయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఎవరికి వారు రాజులే కాని ఆగ్రహావేశాలకు లోనైనపుడు పురాతన కట్టడాలను, అది కూడా శిధిలావస్థలో ఉన్న కట్టడాలను నాశనం చేయటం ఎంత వరకు సమంజసం? తమ ఉనికి ప్రపంచానికి తెలియాలంటే ఏదో ఒక నిర్మాణాన్ని నాశనం చేయాలనుకోవడం అమానుషం. అది తీవ్రవాదం, ఉగ్రవాదం, మతవాదం ఏదైనా కావచ్చు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు ఎన్నో పురాతన నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. అలాగే ఆఫ్ఘనిస్తాన్‍లో తాలిబన్లు బమియన్‍ బుద్ధుడి విగ్రహాన్ని నేలమట్టం చేశారు. సరే తాలిబన్లు మతోన్మాద శక్తులు అనుకుందాం. 2012లో హంపీ నగర గాలి గోపురాన్ని నేలకూల్చింది ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దాన్ని పునర్నిర్మించటానికి ఎన్ని కసరత్తులు చేసినప్పటికీ అప్పటి మండప నిర్మాణం ఇప్పటి నిపుణులకు కుదురుతుందా?


దేవాలయాల్లో, ఏమైనా నిధి నిక్షేపాలు ఉన్నాయేమో అని కొందరు అనాలోచితంగా మందిర ప్రాంగణాల్లో తవ్వకాలు జరుపుతుంటారు. దేవాలయానికే కాదు అందులోని దేవుని విగ్రహాలకీ, వాటి ఆభరణాలకీ, చివరికి పూజా వినియోగ వస్తువులకి కూడా దొంగల రూపంలో ప్రమాదం పొంచి ఉంది. కేవలం దేవాలయాలు, చారిత్రక భవనాలు, ప్రదేశాలకే కాదు. చరిత్రకు సంబంధించిన నాణేలు, లోహ శాసనాలకు కూడా మానవులు హాని చేస్తూనే ఉన్నారు. దేవాలయాల్లో, పాత ఇళ్ళ పునర్నిర్మాణాల్లో ఏవైనా నాణాలు, శాసనాలు దొరికితే వాటిని సంబంధిత అధికారులకి ఇవ్వటం వల్ల వాటిలోని లిపి, భాష ఆధారంగా ఎన్నో చారిత్రక, సామాజిక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా రాగి, ఇత్తడి శాసనాలను కేవలం లోహాలుగా పరిగణించి, వాటిని కరిగించి ఇంట్లో వాడుకునే పాత్రలు తయారు చేసుకున్న సందర్భాలు ఎన్నో. మరికొంత మంది ఆ శాసనాల్లో ఉన్న భాష అర్థం కాకపోయినా ఏమైనా నిధినిక్షేపాల వివరాలు అందులో ఉన్నాయేమో అని ఎవరికీ ఇవ్వకుండా ఇంట్లో చుకుంటారు. మనకి దొరికిన చారిత్రక వస్తువు ఏదైనా (తాళపత్రాలు, నాణేలు, శాసనాలు లాంటివి) సంబంధిత అధికారులకు ఇస్తే వాటిల్లోని వివరాలను చరిత్ర పరిశోధకులకు అందించే అవకాశం ఉంటుంది. తద్వారా మన పూర్వీకుల గొప్పతనం తెలిసే అవకాశం ఉంటుంది.


అశోకుని కాలం నుండీ రాళ్లమీద, బండలమీద శాసనాలు వేయించడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఏదైనా ముఖ్య సమాచారాన్ని జనబాహుళ్యానికి తెలియజేయటానికి శాసనాలను ఊరిలోని ఏదైనా గుట్ట లేదా, కొండమీద చెక్కించేవారు. అవి ఆయా ప్రాంతీయ భాషల్లో ఉండేవి. ఒక భూమిగానీ, పొలంగానీ కొన్నప్పుడు దానికి దగ్గర్లో ఉన్న ఒక రాయిపై అందరికీ అర్థం అయ్యే భాషలో సరిహద్దులు వేయించేవారు. కాల క్రమేణా ఆ పద్ధతి మారింది. అయితే ఆ రాళ్ళపై ఏవో మంత్రాలు చెక్కించబడి ఉన్నాయని, ఆ రాయిని తొలగిస్తే గాని ఆ చేనులో పంటలు పండవు అని, మూఢనమ్మకాలతో వాటిని పిండి పిండి చేయటం దురదృష్టకరం. అదేవిధంగా ప్రణాళికా రహితంగా తొందరపాటులో చేసే క్వారీల తవ్వకాల వల్ల, ఆ కొండలమీద ఉన్న విలువైన శాసనాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
అలాగే ఈ యజ్ఞంలో ఎందరు పాల్గొన్నా ఉడతా భక్తిగా మీరు చేసే చిన్న సహాయం చిరస్మరణీయం అవుతుంది. ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రాచీన సంపద పరిరక్షణకు పూనుకోవాలి. వాటి ప్రాముఖ్యాన్ని అందరికీ తెలిసేటట్లు పత్రికల ద్వారా, ద•శ్యశ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలి. గ్రామాల్లో ఉపాధ్యాయులకు వాటి విలువ తెలియజేసి పిల్లలలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి. పురావస్తు సంస్క•తిని పాఠ్యాంశాలుగా ప్రాథమిక స్థాయి నుండి ప్రవేశపెట్టాలి. పురాతత్వ ప్రదేశాలను కావాలనే పాడు చేసేవారిని కఠినంగా శిక్షించాలి. చరిత్ర, పురావస్తు సంస్థల్లో తగిన సిబ్బందిని నియమించి, వాటి అన్వేషణకు, పరిశోధనలకు, పరిరక్షణకు సహకరించాలి. ఎప్పటికైనా మన దేశ వారతస్వ సంపదే మనకు గర్వకారణం.

ఇందిరా ప్రియదర్శిని,
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి

e: indirahydtpt@gmail.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *