ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! పెను ప్రమాదంలో భూగోళం! – ‘ఐరాస’ (Code Red for Globe – UN)(గత సంచిక తరువాయి)

అది నవంబర్‍ 6, 2021. స్కాట్‍లాండ్‍లోని గ్లాస్గో నగరం. డ్రమ్ములతో, ట్రంపెట్లతో, వివిధరకాల వాయిధ్యాలతో, ప్రమాదాల నేపథ్య రాగాలతో, ‘మానవాళికి పెనుప్రమాదం / కాలుష్యకారక పెద్దలారా! నా(మా)కు కోపంగా వుంది / మీ కంటితుడుపు పర్యావరణ సదస్సుల్ని మేం చూస్తున్నాం – ఆపండిక!’ లాంటి నినాదాలతో ప్లకార్డుల్ని పట్టుకున్న వేలాదిమంది పర్యావరణ అబిమానులు, ఆలోచనాపరులు, యువతులు, యువకులు, చివరికి పిల్లలు COP-26 సమావేశం సందర్భంగా, గ్లాస్గోనగర వీధుల్లో నిరసనల్ని చేపట్టారు.
మనదేశంలో తప్ప, యూరప్‍లోని మహానగరాలైన లండన్‍, ప్యారిస్‍, డబ్లిన్‍, కొపెన్‍హగన్‍, జ్యూరిచ్‍లలో, టర్కిలోని ఇస్తాంబుల్‍లో పెద్ద ఎత్తున COP-26 సదస్సు సందర్భంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. భారతదేశం పక్షాన మోడీతో కలిసి ఈ సదస్సుకు హాజరైన 15 సం।।ల తమిళచిన్నారి వినీషా ఉమాశంకర్‍ (బొగ్గుల ఇస్తిరిపెట్టెకు బదులుగా కాలుష్యరహిత సోలార్‍ ఇస్తిరి పెట్టెకు రూపకల్పన చేసినందుకు వేల్స్ డ్యూక్‍ ప్రిన్స్ విలియంచే ఎర్త్ ఓవర్‍ షూట్‍ (Earth Overshoot Day)బహుమతిని ఈ సదస్సు సందర్భంగా అందుకుంది. మాట్లాడుతూ, ‘ప్రపంచ అధినేతలారా, మీకు చేతకాకపోతే ప్రపంచాన్ని మేం నడుపుతాం! ఇంకా మీ చేతల కోసం మేం వేచి చూడలేము. రేపటి మాతరం ఆరోగ్యంగా, సంపన్నంగా వుండాలను కుంటున్నాం. ఇప్పటికే మీరు కుంటినడక నడుస్తున్నారు. కాబట్టి, మా భవిష్యత్తును మేమే నిర్మించుకుంటాం!’ అంటూ ఈ సదస్సు నుద్దేశించి మాట్లాడడం గమనార్హం!


పచ్చదనాన్ని తుడ్చిపెట్టే సదస్సులు :
ఈ సదస్సుకు ముందు, నవంబర్‍ 4న గ్లాస్గోలో జరిగిన మహార్యాలీని ఉద్దేశించి భవిష్యత్‍ కోసం ప్రతి శుక్రవారం (Fridays for future) కార్యకర్త, స్వీడిష్‍ పర్యావరణ ఆకాంక్షకురాలైన 19 సం।।ల గ్రేటా థన్‍బర్గ్ (Greta Thunberg) మాట్లాడుతూ, COP-26 సదస్సు ఉత్తరార్ద్రగోళ పచ్చదనాన్ని తుడ్చిపెట్టే పండగగా (global north green wash festival)అభివర్ణించింది.


స్వయానా తన తల్లిదండ్రులచే కార్బన్‍ ఉద్గారితాలు తమ ఇంట్లో సున్నా శాతంగా వుండేలా ఒప్పించిన థన్‍బర్గ్ 2018లోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యమే 2019 సెప్టెంబర్‍ 21 నుంచి 23 దాకా న్యూయార్క్లో జరిగిన వాతావరణ సదస్సులో ప్రసంగించే అవకాశాన్ని కల్గించింది. త్వరితగతిన మార్పు చెందుతున్న వాతావరణ మార్పులపై చేపట్టాల్సిన చర్యల (UN Climate Action Summit-2019)పై జరిగిన ఈ సదస్సులో చివరి రోజున థన్‍బర్గ్ తన వయస్సుకు మించి, ఉన్నతస్థాయి ఆశయంతో మాట్లాడడం దేశాధినేతల్ని తలదించుకునేలా చేసింది. ‘How dare you! (మీకెంత ధైర్యం!)’, మా బాల్యాన్ని హరించి, మా తరానికి భవిష్యత్‍ లేకుండా చేస్తూ, మా కలల్ని ధ్వంసం చేస్తున్నారు. నేతలవన్నీ మాయమాటలే!’ అంటూ హెచ్చరికతో మాట్లాడగా, హాలంతా చప్పట్లతో, కేరింతలతో మార్మోగింది. తిరిగి రెండు సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచాధినేతల్లో ఎలాంటి మార్పు కనపడక పోవడంతో గ్లాస్గోలో జరిగిన ర్యాలీలో మరోసారి తన ఆక్రోషాన్ని వెలిబుచ్చింది. థన్‍బర్గ్తో పాటు పాల్గొన్న అనేకమంది అమ్మాయిలలో ఉగండాకు చెందిన వనెస్సా నకాటే (founder Africa based Rise up movemebt), పాక్‍కు చెందిన విద్యా ఉద్యమకారిణి మలాలా యూసఫ్‍జాయిలు కూడా వున్నారు.
అమ్మాయిల ప్రకోపానికి కారణం…
2015లో జరిగిన ప్యారిస్‍ ఒప్పందాన్ని ప్రపంచాధినేతలు, ముఖ్యంగా G-20 దేశాలు ఉల్లంఘిస్తున్నాయని, కనీసస్థాయిలో కూడా వాతావరణ పరిరక్షణ చర్యల్ని చేపట్టకపోగా, కాలయాపనకై కాన్ఫరెన్స్ ఆఫ్‍ పార్టీల (COP) పేరున సమావేశాలు పెడుతున్నారని, ఈ సమావేశాల్లో కొందరు అధినేతలతో పాటు ప్రపంచస్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడుదారులు హాజరై వారి దోపిడికి రచనలు చేసుకుంటున్నారని, వీరివన్నీ అతిశయోక్తులే (blah, blah..) అని బాహాటంగా థన్‍బర్గ్ గ్లాస్గో నగర వీధుల్లో నినదించింది. ఇలా ప్రపంచ వ్యాపిత పిల్లల పక్షాన మనదేశ తమిళపాప, స్వీడిష్‍ థన్‍బర్గ్లతో పాటు వేలాదిమంది చిన్న పిల్లలు కూడా పాల్గొనడం గమనార్హం!
అంతర్జాతీయ సదస్సుల సందర్భంగా జరిగే తతంగాలు
గ్లాస్గో (COP-26) సమావేశానికి మూడు నెలల ముందే (ఆగస్టు 9న) ఐక్యరాజ్య సమితి నిర్దేశిత ఇంటర్‍ గవర్నమెంటల్‍ పానెల్‍ ఆన్‍ క్లైమెట్‍ చేంజ్‍ (IPCC) తన ఆరవ అసెస్‍మెంట్‍ రిపోర్టును (AR-6) విడుదల చేసింది. పోతే, ఈ రిపోర్టు కూడా గత రిపోర్టుల లాగానే భూగోళానికి పొంచివున్న పెను ప్రమాదాన్ని సాక్షాత్కరింప చేసింది. ఈ నివేదికల్ని చదివిన వారు, ఐక్యరాజ్యసమితి బహుపసందైన పనుల్ని చేస్తూ వుంటుందని సంబరపడుతారు. ప్రతీ సంవత్సరం దావోస్‍ (స్విడ్జర్లాండ్‍)లో జరిగే వరల్డ్ ఎకనమిక్‍ ఫోరం (WEF) సమావేశాల సందర్భంగా ఆక్స్ఫాం (oxfam) అనే సంస్థ ప్రపంచస్థాయి అసమానతల్ని, ప్రపంచస్థాయి కుభేరుల్ని, దిగజారుతున్న అశేష జనాల ఆకాంక్షల్ని కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. ఈ నగ్నసత్యాల ముసుగులో దోపిడిని అరికట్టే చర్యల గూర్చి కాకుండా, ఆయా దేశాల్లో దోపిడి ఎలా కొనసాగించాలో చర్చలు జరుగుతాయి.
పై అసెస్‍మెంట్‍ రిపోర్టులో భూగోళం ఎలా విలవిల లాడుతుందో చూపుతూ, తీసుకోవాల్సిన చర్యల్ని కూడా ఏకరువు పెట్టింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, మానవ మనుగడకే కాక, యావత్‍ జీవావరణ వ్యవస్థ మాడి మసైపోతుందని హెచ్చరించింది.


మనిషికి జ్వరం వస్తే…
మనిషికి 0.60F(98.4 0F నుంచి 990F ) ఉష్ణోగ్రత పెరిగితే డాక్టర్‍ వద్దకు పోయి మందుల్ని వాడుతాం! మరింతగా పెరిగితే (1000F కు పైన) హాస్పిటల్‍లో చేరడం, లేదా తడిగుడ్డతో, మంచుతో శరీరాన్ని చల్లబర్చడం చేస్తాం. అయినా తగ్గనిచో వివిధ పరీక్షలు చేయించి, సంబంధిత కారణాలను గుర్తించి మందుల్ని వాడుతాం. అప్పటికే మనిషి బలహీనపడి, చాలా రోజులదాకా కోలుకోలేడు. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు!
భూమికి జ్వరం సోకితే…
మరి భూగోళం సాధారణ ఉష్ణోగ్రత కన్నా (ధృవాల వద్ద, ఎత్తైన పర్వతాలపై, కర్కకట, మకరరేఖ, భూమధ్యరేఖ ప్రాంతాల్లో, ఎడారులలో ఉష్ణోగ్రతలు కాలానుగుణంగా వేరువేరుగా వుంటాయి) అధిక ఉష్ణోగ్రతకు (400C-450C -500C ) చేరుకుంటే పరిస్థితి ఏంటో ఏనాడైనా ఊహించుతున్నామా? ఇప్పుడు జరుగుతున్నది ఇదే! నిజానికి గత 500 సం।।గా చూసినా, లేదా ఇంకా వెనక్కివెళ్ళి 8,000 సం।। భూ ఉష్ణోగ్రతల్ని చూసినా పెద్దగా మార్పు జరగలేదు. కాని, ప్రస్తుత మార్పంతా పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత, నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి అనే నాటకరంగంలో భూమి మానవుని సుఖలాలస జీవితాలకు సమిధగా మారుతున్నది. చిక్కిశల్యమైతూ జ్వరపీడితురాలిగా మారిపోయింది.
ఇప్పటికే ఆలస్యం అయింది. ఇప్పుడన్నా భూగోళానికి చికిత్స చేయకపోతే, తనతోపాటు మనను, మన చుట్టూ వున్న జీవావరణను విశ్వంలో కలిపేస్తుంది. ఇది జరుగుతుందా అనే ప్రశ్న రావచ్చు! కాని, భూగోళానికి జరుగుతున్న అన్యాయాన్ని మన మనస్సుతో వీక్షిస్తేకాని ఇది అర్థంకాదు. డబ్బున్నదిగా, ఇతర గ్రహాలకు ఎగిరిపోవచ్చుగా అని భ్రమిస్తే, కొందరు పోవచ్చు! కాని, పోయిన వారికి శ్మశానవైరాగ్యం తప్ప మరేమి మిగలదు. భూమిని రక్షించడం అమెరికాదో, రష్యాదో, చైనాదో లేదా యూరోపియన్‍ దేశాలదో, భారత్‍దో అని కలలుగంటూ పోతే, ఈ కలలు పీడకలలుగా మారే ప్రమాదం మన వెన్నంటే వుంది.
కాబట్టి, భూమిని రక్షించుకోవడం అందరి బాధ్యత అని గుర్తించాల్సిందే!


మానవాళికి పెను ప్రమాదం (code Red for Humanity):
అనునిత్యం పెరుగుతున్న భూతాపానికి మానవుడి సృజనాత్మక ఆలోచనలతో పాటు, స్వార్థపూరిత జీవన విధానాలే కారణమని అనేక నివేదికలు చూపుతున్నాయి. నియంత్రణలేని పారిశ్రామిక వ్యర్థాలు ముఖ్యంగా 1850 నుంచి 1990 మధ్యన అనూహ్యంగా పెరిగిన కర్బన ఉద్గారాలే ప్రధాన కారణం! మానవుడి తప్పిదాలతో ఈ మధ్యకాలంలో 1.10C ఉష్ణోగ్రతలు పెరగ్గా, నియంత్రణ జరగనిచో రానున్న 20-30 సం।।లలో ఈ ఉష్ణోగ్రత 1.50C కు, కూడా పెరుగుతుందని నివేదికలు ఘోషిస్తున్నాయి. ఇక 2015 నాటి ప్యారిస్‍ ఒప్పందం ప్రకారం అత్యధికంగా కార్బన్‍డయాక్సైడ్‍ను విడుదల చేస్తున్న అభివృద్ధి చెందిన పెట్టుబడి దేశాలు, భారత్‍తో సహా కార్బన్‍ ఉద్గారాలను తగ్గించకపోతే, ఈ పెరుగుదల 20C చేరుకుంటుందనేది కాదనలేని సత్యం! కాదంటే, ఈ కింది పరిణామాలు అనివార్యంగా సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • విపరీతమైన వేడిగాలులు – అరణ్యాలు తగలబడడం.
  • అత్యధికంగా అవపాతం (precipitation) ఏర్పడును.
  • కరువు కాటకాలు సంభవిస్తాయి – వ్యవసాయం దెబ్బతింటుంది.
  • ఉష్ణమండల ప్రాంతాల్లో తుఫానులు – అల్పపీడనాలు – పర్వత ప్రాంతాల్లో కుంభవృష్టి ఏర్పడును.
  • మంచు ఖండికలు (glaciers) కరిగి, నదులు ఉప్పొంగి వరదల్ని కరిగించును. సముద్ర మట్టాలు పెరుగును.
  • జనజీవనం అతలాకుతలమై, వలసలు పెరగడం, నిరాశ్రయులు కావడం జరుగును.
  • జీవావరణ వ్యవస్థ దెబ్బతిని, వేలాది వృక్ష, జంతుజాలం భూమిపైన కనుమరుగు అగును.


ఈ దృక్కోణంతోనే, ఐక్యరాజ్యసమితి దీన్ని మానవాళికి పెను ప్రమాద సూచనగా (Code red for Humanity)గా ప్రకటించింది. అయితే ఇలాంటి నివేదికలు, హెచ్చరికలు గత దశాబ్ద కాలంగా వింటున్నవేగా అని మనం కొట్టిపారేయవచ్చు. కాని మన చుట్టూ, దేశవ్యాపితంగా, ప్రపంచ వ్యాపితంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా గత జులైలో నైరుతి రుతుపవనాలు యావత్‍ దేశాన్ని అతలాకుతలం చేసింది తెలిసిందే. దాదాపు ఆగస్టు దాకా ఉత్తర భారత్‍లో వర్షాలు పడని వ్యవస్థ! ముందు అండమాన్‍లో, కేరళలో, తమిళనాడులో, ఉమ్మడి తెలుగు, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసే నైరుతి రుతుపవన వర్షాలు, కుంభవృష్టిగా దేశమంతా కురవడం, అమర్‍నాథ్‍, చార్‍దామ్‍ యాత్రలు నిలిచిపోవడం భవిష్యత్‍ భయానక దృశ్యాలే!
అలాగే అభివృద్ధి చెందిన దేశాలుగా విర్రవీగుతున్న అమెరికా, చైనా దేశాలేకాక, మొదటి స్థాయిలో వున్న యూరప్‍ దేశాలు సహితం అకాల వర్షాలతో, వరదలతో కొట్టుమిట్టాడం చూస్తూనే వున్నాం. ఆల్ఫ్స్‍ పర్వత శ్రేణుల్లోని మంచు శిఖరాలు కృంగిపోవడం రాబోయే రోజులకు పెనుప్రమాద హెచ్చరిక కాదా..!!??


గ్రేటా థన్‍బర్గ్కు క్షమాపణ :

పోర్చ్గీస్‍, ఫ్రాన్స్, ఇటలీ, స్విడ్జర్లాండ్‍లతో పాటు ఇతర పశ్చిమ దేశాల్లో, అమెరికాలోని కాలిఫోర్నియాలో గత జులై, ఆగస్టు నెలలో అడవులు తగలబడి వేలాది హెక్టార్లు బూడిదపాలు కావడం చూసాం. ఐబేరియన్‍ ద్వీపకల్పంలో దాదాపు 1700 మంది వేడిగాలులకు ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో తెలుస్తున్నది. దాదాపు 400C ఉష్ణోగ్రతకే ఈ విధంగా వుంటే, ఉష్ణోగ్రత 450C -500C చేరుకుంటే, పశ్చిమ దేశాలు రూపులేకుండా అట్లాసులో మాయం కావచ్చు? లండన్‍లాంటి నగరాల్లో జనాలు సముద్రాలకు వలస వెళ్లారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో! ఈ సందర్భంగా కొన్ని పశ్చిమ దేశాలు ఏకంగా వేడి అత్యవసరస్థితిని (heat emergencies) ప్రకటించాల్సి వచ్చింది కూడా!
ఈ నేపథ్యంలో ఇటలీలో ఆగస్టు 5, 2022న 55 దేశాలకు చెందిన నాయకులు పాల్గొనగా, పెరు మాజీ దౌత్యవేత్త రికార్డోలునా (Riccard o Luna) మాట్లాడుతూ, 2019లో స్విస్‍ అమ్మాయి గ్రేటా థన్‍బర్గ్ మాటల్ని అపహాస్యం చేసామని, అమ్మాయివి కుర్రచేష్టలని భావించామని, కాని రేపటి ఆహ్లాదకర పిల్లల ప్రపంచాన్ని తీర్చిదిద్దే ధైర్యం తమకు లేకండా పోయిందని వాపోయాడు. ఇప్పుడన్నా ఈ పశ్చిమ దేశాలు మేల్కొంటే సంతోషమే మరి! చీకటిని వెక్కిరిస్తూ కూచోవడం కాదు, చిరు వెలుతురుకై ప్రయత్నిద్దాం అన్న సామెతలా ప్రపంచవ్యాపితంగా పర్యావరణ ఉద్యమకారులు, భూగోళ రక్షణకై తమవంతు పాత్రను పోషిస్తూ వున్నారు. వారిలో కొందరిని కింద చూద్దాం!

1.మేధాపాట్కర్‍ (Medha Pathkar) (1.12.1954) :
భారత్‍ – నర్మదానదిపై నిర్మించే సర్దార్‍ సరోవర్‍ ప్రాజెక్టు మధ్యప్రదేశ్‍, మహారాష్ట్ర, గుజరాత్‍ రాష్ట్రాలలోని వందలాది గిరిజన, ఆదివాసి గ్రామాల్ని ముంచివేస్తుందని, పర్యావరణానికి, జీవావరణకు పెను ప్రమాదమని ఆ ప్రాంత ప్రజల్ని కూడగట్టి నర్మదాబచావో ఆందోళన (NBA)ను దీర్ఘకాలికంగా కొనసాగించి, అపజయాలతోపాటు, అనేక విజయాల్ని సాధించింది. ఈ ఆందోళనకు జడిసిన ప్రభుత్వాలు, ప్రాజెక్టుకు అనేక మార్పులు చేసినా, కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆనకట్ట ఎత్తు పెంచి, వేలాది గిరిజనలను నిరాశ్రయులుగా మార్చాడు.

2.గ్రేటా థన్‍బర్గ్ (Greta Thunberg) (3.1.2003) :
స్వీడన్‍ – అతిపిన్న వయస్సులో (16) ఐక్యరాజ్య సమితిలో వివిధ దేశాల పెద్దల్ని ‘How Dare You ! (మీకెంత ధైర్యం) అంటూ ప్రశ్నించిన అమ్మాయి. ఇంట్లో జీరో కర్బన ఉద్గారాలు వుండేలా తల్లిదండ్రుల్ని ఒప్పించి, Fridays For Future (FFF) నినాదానికి శ్రీకారం చుట్టి, ఐక్యరాజ్యసమితి వేదికల్ని (Sumits, COPS)లను దద్దరిల్ల చేస్తున్నది. 2018 నుంచి 2021 దాకా 15 అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

3.దిశారవి (Disha Ravi)(1998) :
భారత్‍-బెంగళూర్‍కు చెందిన దిశారవి (23),ఢిల్లీలో జరిగిన రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమం సందర్భంగా, యావత్‍ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గ్రేటా థన్‍బర్గ్ నిర్వహించే టూల్‍ కిట్‍ (Toolkit) మాధ్యమంతో సంబంధ ముందని, దేశద్రోహం కింద 13, ఫిబ్రవరి 2021 అరెస్టు అయిన అమాయకురాలు. ప్రతీ శుక్రవారం రేపటికోసం (FFF)ను భారత్‍లో ధైర్యంగా ప్రారంభించి, పర్యావరణ పరిరక్షణకై నినదిస్తున్న అమ్మాయి.

4.జాదవ్‍ పేంగ్‍ (Jadav Payeng) (1963-) :
భారత్‍ – అస్సాంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నదిలో ఏర్పడిన ఇసుక దిబ్బలలో సరీసృపాలు మరణించడాన్ని చూసిన 16 సం।।లా జాదవ్‍, మొక్కలు నాటడమే జీవితంగా, గత మూడు దశాబ్దాలుగా నాటుతూనే వున్నాడు. 550 హెక్టార్లలో 46 మిలియన్ల చెట్లను నాటి మానవ నిర్మిత మహా అటవికి కారకుడైన జాదవ్‍, ఏ ప్రభుత్వాలు చేయని మహత్తర కృషిని చేసాడు. ఇప్పుడా అడవి పులులకు కూడా ఆవాసమైందంటే ఆశ్చర్యమే. అందుకే ఆయనను Forest Man of India గా అభివర్ణిస్తారు. ఈయనపైన సినిమాలు, డాక్యుమెంట్లు అందరికి ఆదర్శంగా మారాయి. ఈ అటవికి ఆయన తెగ మొలాయి (Molai) పేరుతో పిలవడం గమనార్హం!

5.సాలుమారద తిమ్మక్క (Saalumarada Thimmakka) :
భారత్‍ – కర్నాటకు చెందిన ఈ మహిళ ఓ మారుమూల గుబ్బి అనే గ్రామంలో పుట్టి, రహదారుల నిర్మాణం పేరున మహా వృక్షాల్ని నరికివేస్తుంటే, చలించి 385 మర్రి చెట్లను (హులికల్‍ – కుదుర్‍ రహదారి) 45 కి.మీ. పరిధిలో నాటి పెంచి పెద్ద చేసింది. వీటికి అధనంగా వివిధ ప్రదేశాల్లో 8000 పైగా ఇతర మహా వృక్షాల్ని నాటి పెంచింది.

6.హర్మాన్‍ బొర్గ్ (Harmann Borg) :
జర్మని -తన స్వంతడబ్బు 50 వేల డాలర్లను ఖర్చు పెట్టి 30 సం।।ల పాటు కెన్యాలో వృక్షాల్ని నాటి పెంచాడు.

7.వనజీవి రామయ్య (Ramaiah) (1.7.1937-) :
భారత్‍ – వనజీవి రామయ్యగా గుర్తించబడ్డ దర్పల్లి రామయ్య, తన భార్యతో కలిసి చెట్లు నాటడమే జీవిత పరమార్తంగా ఎంచుకున్నాడు. భార్యాభర్తలిద్దరు మెడలో వృక్షోరక్షితి-రక్షిత అనే నినాదం గల చక్రాన్ని ధరించి, గత 40 సం।।గా లక్షలాది చెట్లను నాటిన ధన్యజీవి. తనకు వచ్చే నెలవారి 2000 రూ।। పెన్షను, ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల్ని కూడా పర్యావరణంపై ఖర్చు చేస్తున్న నిస్వార్థపరుడు.


(నోటు : కొందరు పర్యావరణ ఉద్యమకారులనే ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. దేశవ్యాపితంగా, ప్రపంచవ్యాపితంగా వేలాది మంది పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు తమ ప్రాణాల్ని లెక్క చేయకుండా పోరాడుతున్నారు. అందరికి వినమ్రంగా తలవంచి నమస్కరించాల్సిందే! అందర్ని పరిచయం చేయలేనందుకు మన్నించాలి. – రచయిత)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *