కాలం కేవలం సమయసూచిక కాదు. అది ఒక నిర్ధారిత చరిత్ర. దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక ఈ సంచికతో 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ పది సంవత్సరాల సమయంలో ప్రధాన మీడియాకు భిన్నంగా, ప్రత్యమ్నాయ పత్రికగా సమాజం పట్ల జర్నలిజం నిర్వర్తించవలసిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించింది.
సామాజిక సంక్షోభాలూ, సంక్లిష్టతలూ ముసురులా కమ్మి అన్ని రంగాలనూ కుదిపేస్తున్న సమయంలో ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్య పరిచి, ఆచరణ వైపు నడిపించవలసిన ప్రధాన మీడియా తన కర్తవ్యానికి దూరమవుతున్నప్పుడు ఆలోటును భర్తీ చేయడానికి దక్కన్ ల్యాండ్ ఆవిర్భవించింది. ఈ పది సంవత్సరాల సంచికలను ఒకసారి పరిశీలిస్తే మొదటి సంచిక నుంచి ఇప్పటి వరకు ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తీరు అర్థమవుతుంది. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిలిచింది. మేధోపరమైన రచనలను అందించింది. రాజ్యాంగ స్పృహ, ఫెడరల్ విధాన ఆచరణ ఆవశ్యకత, ప్రపంచపరిణామాలను అర్థం చేసుకోవాల్సిన పద్ధతిని తెలియజేసే విశ్లేషణాత్మక వ్యాసాలను అందించింది.
కరోనా విపత్కర కాలంలో కూడా పత్రికను నిర్విఘ్నంగా వెలువరించింది. విపత్తుల నేపథ్యం, మానవజీవన రంగాలన్నిటిలో దాని ప్రభావం, వివిధ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన తీరు, వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు. వీటిని గురించి వివిధరంగాల మేధావులు, సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూలను సంవత్సరం పాటు ప్రతినెలా ప్రచురించింది.
పర్యావరణం, పురావస్తు, వారసత్వ సంపద పరిరక్షణ ఆవశ్యకత, శతాబ్దాలనాటి శాసనాలు, సాంకేతిక విజ్ఞానం, జీవవైవిధ్యం, దక్కన్ చరిత్ర, సాహిత్యం, సాంస్కృతిక కళారంగం, కుల వృత్తులు, సామాజిక న్యాయం వంటి మౌలిక అంశాలకి ప్రాధాన్యతయిస్తూ విలక్షణ పత్రికగా గుర్తింపు పొందింది. అవసరమైన వేళ పలు ప్రత్యేక సంచికలు వెలువరించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించడంలోనూ, అది సాధించే ఉద్యమంలో తనవంతు పాత్రను నిర్వర్తించడంలోనూ, విజయం సాధించాక నూతన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకందించడంలోనూ దక్కన్‍ల్యాండ్ ముందున్నది. పట్టణ, నగర ప్రాంత మేధావులతో పాటు గ్రామీణ స్థాయి సామాజిక కార్యకర్తల వరకూ దక్కన్ ల్యాండ్ చేరుతున్నది. విలక్షణ పత్రికగా ప్రముఖుల ప్రశంసలతో పాటు, విశ్వాసాన్ని సంపాదించుకున్నది.
రచయితలు, మేధావులు, న్యాయ, సాంకేతిక శాస్త్ర నిపుణులు, వాగ్గేయకారులు, చిత్రకారులు, చరిత్రకారులు, పర్యావరణ, పురావస్తు శాస్త్రజ్ఞులు, బుద్ది జీవులు, శాసన పరిశోధకులు అందించిన రచనా సహకారం విలువైనది. వారికి ఆత్మీయ ధన్యవాదాలు. గత సంచికల నుంచి విలువైన రచనలను, ఈ పది సంవత్సరాల దక్కన్ ల్యాండ్ కృషిని వివరించే, విశ్లేషించే వ్యాసాలను ప్రతినెలా వరుసగా ప్రచురిస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నాం. దాచుకోవాల్సిన విలువైన, ప్రయోజనకరమైన పత్రికను పదికాలాలపాటు నిలుపుకుందాం. ఎప్పటిలా మీ సహకారాన్ని కోరుతూ…
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్