ఆలేరు మా ఊరు

మావూరు ఆలేరు. మాది యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా. మావూరు ఒక నదీలోయ నాగరికత నింపుకున్న పల్లెదీవి. వూరు చుట్టూ వాగుల వడ్డాణం. ఆలేరు ఇపుడొక మండలకేంద్రం. మావూరు నుండి 202 జాతీయరహదారి వెళుతున్నది. తెలంగాణానేలిన అందరి పాలనలో ఆలేరు ఉన్నది.
ఆలేరు పేరు కథ: చిన్నప్పుడు మా తాత ఈ వూరిలో పెద్దపులులనే తరిమేటన్ని ఆవుల మందలుండేవని అందువల్లే ఆవులున్న ఈ వూరు ఆవులూరు లేదా ఆవులేరుగా, రాను రాను ఆలేరుగా పిలువబడ్డదని చెప్పేవాడు. కాదు ఆరు ఏరులు పారే ఊరే ఆలేరుగా పేరుపొందిందని ఒక వాదం. కైఫీయతు ఏమిటంటే ఒకరాజు(?) రంగనాయకుని విగ్రహాన్ని తనరాజ్యానికి తీసుక పోతున్నపుడు విగ్రహమున్న బండి ఇక్కడి నదిపాయలో దిగబడిపోయి కదలలేదట. అపుడు రంగనాయకుడే రాజుకు కలలో కనిపించి ‘శ్రీరంగపట్నంలో సప్తకావేరులున్నట్టు ఇక్కడ ఏడుపాయలు ప్రవహిస్తున్నందున ఇక్కడే తనవిగ్రహాన్ని ప్రతిష్టించి దేవాలయం నిర్మించమన్నా’డట. ఈ కథను రంగనాయకుని గుడిపూజారి కీ.శే. కొండమయ్యగారి భార్య చెప్పారు. ఈ దేవాలయం 16 వ శతాబ్దంలో నిర్మించబడ్డది కనుక క్రీ.శ. 1034 నాటి సైదాపురం శాసనంలో పేర్కొన్న ఆలేరు కా పేరట్లా వచ్చే అవకాశమే లేదు.
కొలనుపాకలో లభించిన క్రీ.శ.1106 ఏప్రిల్‍ 6 నాటి శాసనం కొలనుపాక సోమేశ్వరస్వామి అంగరంగ భోగాలకు ఆలేరు-40 కంపణంలోని గోష్టీపాళు గ్రామాన్ని దానంగా యిచ్చినట్టున్నది. గోష్టీపాళు అంటే ఆవులపల్లె అని అర్థం. ఆవులవూరు, ఆవులయేరుకు సంస్క•తీకరణమే ‘గోష్టీపాళెం’ అయివుండొచ్చు. కంపణం అంటే 40 నుండి 60 గ్రామాలకు కేంద్రంగావున్న పాలకప్రాంతం. చాళుక్య చక్రవర్తి జగదేకమల్లుని కాలాన కొల్లిపాక-7000 విభాగంలో ఆలేరు-40 కంపణంగా వుండేది. ఒక ప్రాంతీయాధికారి ఇక్కడ పాలకుడుగా వుండి కంపణంలోని గ్రామాలను ఏలుతుండేవాడు.


ఆలేటి ఏటి పుట్టుక:
దిగువమానేరు రిజర్వాయరు (కరీంనగర్‍) నుండి మొదలైన వాగొకటి రామెంచ దగ్గర చీలి రెండు దిక్కులకు వెళ్ళింది. ఒకటి వర్కోల్‍ వైపు, మరొకటి రామెంచ వైపు. ఒకపాయ వర్కోల్‍ నుండి కోహెడ (మ్రోయు తుమ్మెదవాగు), శనిగరం చెరువు, బసవాపూర్‍, నంగునూరు, ధూళిమిట్ట, బైరాంపల్లి, ఆకునూరు(దాటినంక మరొకపాయ), చేర్యాల, బచ్చన్నపేట, కొలిపాక నుండి ఆలేరు… ఇంకొకపాయ దొమ్మాట, గజ్వెల్‍, జగదేవపూర్‍, పీర్లపల్లి, గంధమల్ల, రేణికుంట, కొలిపాక నుండి ఆలేరు చేరుతుంది. ఆ వాగు ఆలేరుకు ఉత్తరాన వున్న కొలిపాక ఈవలి నుంచి ఈశాన్యాన మలుపు తిరిగి బచ్చన్నపేట నుండొచ్చిన వాగును కలుపుకుని ఆలేరు వాగయింది. ఆలేరు పేరు మీదనే ఆలేరువాగు కాపేరొచ్చింది. ఆలేరు వాగు మూసీనదికి ఉపనది. ఈ వాగు మెదక్‍, నల్లగొండ జిల్లాల గుండా 118 కి.మీ.లు ప్రవహించి మూసీనదిలో కలుస్తున్నది.
ఆలేరుకు పడుమట ఇంకా రెండు వాగులు (వరద ప్రవాహాలు) న్నాయి.


ఒకటి: గొల్లోనిఒర్రె. దీనికే రత్నాలవాగు అని పేరున్నది. కాని మా విరువంటిగోపాలక•ష్ణ సార్‍ అది రత్నాలవాగు కాదు రాటనాలవాగంటాడు. నిలువురాతిస్తంభాల గాడుల్లో పొందించిన గడకర్రలతో నీళ్ళు తోడే నీటియంత్రాలను రాటనాలంటారు. అట్లాంటి రాతిస్తంభాలు మాకు కొలనుపాక గొల్లమఠం ముందర, మాసాయిపేట గుమ్మటాల దగ్గర కనిపించాయి.


రెండవ వాగు: ఏ(ఈ)దులవాగు. ఇది చాలా చిన్నవాగు. రత్నాలవాగుకు పైన 1 కి.మీ దూరంలో ప్రవహించే వాగు. ఏదులవాగు దరుల్లోనే పాతరాతియుగం ఆనవాళ్ళు లభించాయని ఎస్‍.ఎన్‍. రావు అనే చరిత్రకారుడు ‘Stoneage Cultures in Nalgonda’ అనే తన పరిశోధనాగ్రంథంలో పేర్కొన్నాడు.


ఆలేటిబాట: పూర్వం హైదరాబాదు నుండి వరంగల్‍ వరకు ఒక ప్రాచీనమార్గం వుండేది. ఈ మార్గంలోనే బౌద్ధభిక్షుకులు ప్రయాణించినట్లు తెలుస్తున్నది. సార్థవాహులు కూడా ఈ బాటలోనే బంగళాఖాతం చేరి, అక్కడ నుండి విదేశాలకు నౌకాయానం చేసేవారట. సుత్తనిపాతంలో శ్రమణకుల మార్గం ఆలేరుగుండానే సాగిందని రాసున్నదని మా చారిత్రక మార్గదర్శి విరువంటి గోపాలక•ష్ణ గారన్నారు. (సుత్తనిపాతం గాథలుః 9711, 1010, 1013,

సార్థవాహులు, రచనః మోతీచంద్‍-పేజి నెం.54)
ఆలేటికి పూర్వ చారిత్రకసాక్ష్యాలుః ప్రస్తుతమున్న గ్రామానికి 3 కి.మీ. దూరంలో (రఘునాథపురం-రాజపేట దారిలో) బొబ్బిలిమడుగు దగ్గర గొల్లోనిమాన్యంలో ‘ఉల్లి’ పాటిగడ్డ అని పిలిచే ‘ఊరి’పాటిగడ్డ, పాతవూరు శిథిలాలున్నాయి. అక్కడ వ్యవసాయం చేస్తున్నవారికి మధ్యశిలాయుగపు, నవీనశిలాయుగపు గొడ్డళ్ళు, సుత్తెలు వంటి రాతిపనిముట్లు, మట్టిపూసలు, పెద్దసైజు (14ఞ9 అం.) కొలతల ఇటుకలు, మందపాటి పెంకులు దొరుకుతున్నాయి.


ఆలేరు నీటిపుట్టః వూరికి ఉత్తరాన ఒకప్పటి పెద్దవాగు (ఆలేరువాగు) ప్రవాహమార్గంలో ఊటపర్రెలు పదిదాకా ఏర్పడి వున్నాయి.
1.ఏముకుంటపర్రె (వూరికి వాయవ్యాన 3కి.మీ. దూరంలో ఏముకుంట దగ్గర), 2.ఒంటిపర్రె (వూరికి వాయవ్యాన 2కి.మీ. దూరంలో బైరకుంట దగ్గర), 3.రామసముద్రంపర్రె, 4.రెడ్డిపర్రె, 5.ఇటుకరాళ్ళపర్రె 6.పెద్దపర్రె (ముడిగెల నుండి పెద్ద కాలువ) సాయిగూడెం కాలువ, 7.కొలిపాకపర్రె, 8.తుంగ చంద్రమ్మపర్రె 9.లచ్చిందేవి పర్రె, 10.లొట్లపర్రె (మంతపురికి కాలువ), 11. తలపర్రె లేదా ఇక్కుర్తిపర్రె (తాటి ప్రమాణం లోతుండేదట), 12. బైరోని బొంద
ఇవిగాక మాకు వర్షపునీటిని నిలువచేసుకునే కుంటలు : 1.ఏముకుంట, 2.బైరకుంట, 3.చింతకుంట (పాత బీరప్ప గుడి దగ్గర), 4.పోచమ్మకుంట, 5.నాగుల కుంట (?), 6. బొబ్బిలి మడుగు (బండ్రు బీరప్ప కొట్టం దగ్గర), 7.కొచ్చెరువు( ఇప్పటి జూనియర్‍ కాలేజి దగ్గర) వుండేవి.


ఈ పర్రెలనుండే 1.రామసముద్రం కాలువ (చాకర్ల కాలువ), 2.రెడ్డికాలువ (కుమ్మరిండ్ల దగ్గరి కాలువ), 3.పర్రెకాలువ, 4.పెద్దకాలువ, 5.కొత్తకాలువ, 6.శాయిగూడెం కాలువ, 7.మైలోని కాలువ, 8.చంద్రమ్మ కాలువ, 9.సోమరాజుబాయి కాలువ, 10. గోనె కాలువ (ఏముకుంటలోనికి), 11. మంతపురల్లరస కాలువ (లొట్లపర్రె నుండి)


కాకతీయుల శాసనాల్లో మూసేటి కాలువ, ఆలేటికాలువ, బొమ్మకంటి కాలువ, కూచినేని కాలువల ప్రస్తావన వుంది. ఆలేటివాగు నుండి తీసిన కాలువే ఆలేటికాలువ. కొలనుపాక రెవెన్యూ రికార్డులో ఆలేటికాలువ ప్రస్తావించబడింది. క్రీ.శ,1074 నాటి కొలనుపాక శాసనంలో అసగరస అను మాండలీకుడు సూరయ్య అనే బ్రాహ్మణునికి అరసర కాలువ ప్రక్కన కొంతభూమిని దానం చేసాడు. ఈ కాలువ మంతపురల్లరస కాలువగా పేర్కొనబడింది. ఈ కాలువే ఆలేరునుండి మంతపురికి పోయే ఊటకాలువగా గుర్తించబడ్డది.


ఏముకుంట నేమికుంటనా? కావొచ్చు. మా అమ్మ చిన్నపుడు చెప్పిన కథ నిజమే అయితే ఈ కుంట నేమికుంట కావచ్చు. ఏముకుంట ప్రాంతంలో గిన్నెదేవర బంగారుగుడి వుండేదట. దాన్ని సుదర్శన చక్రం వంటిది కాపాడుతుండేదట. ఒక మాంత్రికుడు (కాలాముఖశైవులా?) ఛండాల(వామాచార, కౌలాచార) పూజలతో గుడిని అపవిత్రం చేసి బంగారం దోచుకుని గుడిని తగులపెట్టాడట. అపుడు కొందరు గుడిలోని వజ్రాల విగ్రహాలను తీసుకుని మాయావి మంత్రాలకందకుండా ఏరు (మంతప్రభావం ఏరు దాటదట) దాటించి దాచిపెట్టారట.


రాజరాజేంద్రచోళుడు క్రీ.శ.1008లో, క్రీ.శ.1042లో రాజేంద్రచోళుడు కొలనుపాకను ధ్వంసం చేసి, తగులబెట్టించినట్టు చరిత్ర చెపుతున్నది. జైనదేవాలయాలను, బసదులను కూల్చాడని తెలుస్తున్నది. దారిలో వున్న ఆలేరు కూడా ధ్వంసం చెయ్యబడి వుంటుంది.


ఆలేరు నుండి కొలనుపాక దారిలో (గ్రామ సచివాలయం) ఆలేరు శాసనం బయల్పడింది.


ఆలేరుశాసనం: నల్లగొండ జిల్లా శాసనసంపుటి-1లో 42వది. రెడ్డికాలువ ఒడ్డున లభించిన శాసనంలో శాసనకాలం తెలియదు. విశ్వావసు సం. (ఏ సం.మో) జయంతిపురం రాజధానిగా పాలిస్తున్న త్రిభువనమల్లదేవుని కాలం నాటిది. ఈ శాసనంలో ఆలేరు-40 కంపణం సవదొరె సోమనాయకుడు పేర్కొనబడ్డాడు. సోమిరెడి, బూదిరెడిపేర్లు కూడా రాయబడి వున్నాయి.


ఇతర శాసనాలు: ఆలేరు గురించి సైదాపురం (క్రీ.శ.1034 జూన్‍ 4వ తేది) శాసనంలో ఆలేరు-40, ఆలేరు కంపణంగా పేర్కొన బడింది. కొలనుపాకను పాలించిన పారమార జగద్దేవుడు తన (రాజరక్షకుడు) సవదొరె (పిదప కాలంలో చౌదరిగా మారిన పిలుపు) సోమయ నాయకునికి ఆలేరుని ఇచ్చాడుట. ఆలేరు అప్పటి పాలనా కేంద్రంగాను, రెవెన్యూ కేంద్రంగా వుండేదని తెలుస్తున్నది.


ఒకపుడు ఈ వూళ్ళో మహాకాళి దేవాలయం వుండేదట. అది ఏ వరదమేటల్లో మునిగి వున్నదో. మా వూళ్ళో మూడు ఆంజనేయుని గుళ్ళున్నాయి. మావూళ్ళోని రంగనాయకుని గుడి, 16వ శతాబ్దం నాటిదని ప్రతీతి. గుడిలోని రంగనాయకుని శిల్పం అద్భుత కళాఖండం. ఇంతటి విగ్రహం శ్రీరంగపట్నం తర్వాత మరెక్కడా లేదని అంటారు. ప్రతి వైశాఖపౌర్ణిమకు తీర్థం సాగేది. పాతగుడిలోని అర్ధమంటపం, ఆలయం పైకప్పు పైన మా చిన్నపుడు వున్న మునుల (జైనులు?) శిల్పాలు ఇపుడు లేవు. ఇప్పుడున్న గుడిగోడల్లో చాళుక్యుల శిల్పకళా స్తంభాలు రెండు,మూడు అగుపిస్తున్నాయి. గుడి లోపల ఒకటి, గుడిబయట మరొకటి వీరగల్లు లున్నాయి. ఒకప్పటి జైనబసదిని వైష్ణవాలయంగా మార్చి వేసినట్లు చెప్తారు చారిత్రకపరిశోధకులు. అక్కడికి దగ్గరలో చాముండేశ్వరిగుడి వుంది. ఆ గుడిని కూడా పునరుద్ధరణలో మార్చివేసారు. గుడిలో చాముండేశ్వరి, శివలింగం, వినాయకుడు, సూర్య విగ్రహాలున్నాయి. ఒకప్పుడు ఇక్కడ త్రికూటాలయం వుండేదేమో. గుడి ముందర నగ్నరూపంలో మహిషాసుర మర్దని, భైరవుడు, 1అడుగు ఎత్తున్న హనుమంతుడు, చిన్నవైన లింగాలున్నాయి. మేం చిన్ననాడు చూసిన అర్థమంటపం ఇపుడు లేదు. అక్కడికి చేరువలో బొడ్రాయి దగ్గర మరొక శివాలయం వుంది. దేవాలయం లోని శివలింగం తెల్లనిరంగులో వుంది. గుడి ఎదుట వున్న వినాయకునిశిల్పం శైలి చూస్తే చాళుక్యుల నాటిదని తెలిసిపోతున్నది.


ఒకప్పుడు వుండే పోచమ్మకుంటకు పడమట వున్న పోచమ్మ దేవాలయంలో మూడు దుర్గ విగ్రహాలున్నాయి. మరొక విగ్రహం శిథిలమై విరిగివుంది. గుడిబయట పోతరాజుగా పూజలందు కుంటున్న వీరగల్లు వుంది. గుడిలో వున్న మరొక శిల్పం అది శైవాచార్యునిది.
రైలుకట్ట వెంట మాలోల్ల పోచమ్మ, కిష్టారెడ్డిచెలకలో మాదిగల పోచమ్మలున్నారు. అందులో వున్నవి దుర్గల శిల్పాలే. రైలుకట్టకు దగ్గరలో గౌరిదేవమ్మ గుడివుంది. అది 60 ఏళ్ళ కిందటిదే నంటారు. రైలుకట్టకు అవతలివైపు రైల్వేస్టేషన్‍ దగ్గరలో వున్న శివాలయం రాజరాజేశ్వరునిది. 150 ఏళ్ళ కింద నిర్మించబడ్డదట. రైల్వే అధికారి తాతయ్య మాస్టరు ఈ శివాలయాన్ని నిర్మించాడట. ఆలేరులో రైల్వేస్టేషన్‍ కు ఎదురుగా ధర్మశాల వుండేదట. ధర్మశాల బాయి కూడా వుండేది.


ఇప్పటి పోలీస్‍ స్టేషన్‍కు దగ్గరగా పురాతనకాలం నాటి మసీదుకు 150 యేళ్ళ వయసు. ఎదురుగా దర్గా వుంది.అది సయ్యద్‍ ఇస్మాయిల్‍ షా ఖాద్రి సమాధిగా ప్రసిద్ధం. ఖాద్రి బాగ్దాద్‍ కు చెందిన అఫ్జల్‍ బియాబాని మనవడు స్మ•త్యర్థం నిర్మించినదే ఆలేరుదర్గా. ఇపుడున్న రైల్వేస్టేషన్‍ ఎదురుగా గ్రామపంచాయతీ మడిగెలున్నచోట ఒకప్పుడు ‘కరోడ్గిరి నాకా’ (check post) వుండేది. మాకు అక్కడ వుండే చిన్నభవనం యాదికే. మా వూరిలో 1918లోనే పోలీస్‍ స్టేషన్‍ ఏర్పాటైందట. మా వూరి అడ్డగట్ల విజయ్‍ గారి ఇంటి ప్రాంతంలో నిజాం కాలం నాటి ‘జాగీర్‍ బడి’ వుండేది.


తాళ్ళకు వెళ్ళే రామసముద్రం తొవ్వలో కాటమయ్యగుడి వుంది. అక్కడే వున్న రైస్‍ మిల్లు గోడకు దగ్గరగా ఒక బావి (కోనేరు) వుండేది. పూడ్చేసారు. దానికి పైన కొద్ది దూరంలో భూదేవమ్మ గుడి వుండేదట. రైసుమిల్లు లోని బావిలో మట్టి ఒరలు బయటపడ్డాయని మానాన్నవాళ్ళు చెప్తుండేవారు. మావూరికి ఉత్తరాన కొలనుపాక దారిలో పెద్దవాగు ఒడ్డున ‘ముడిగెల’ అనే పేరున్న ప్రదేశం వుంది. ఇక్కడ సర్వాలంకార శోభితయైన మహిషాసురమర్దిని, వినాయకుని విగ్రహాలున్నాయి. అక్కడికి దగ్గరలో ఆంజనేయుని విగ్రహం వుంది. అక్కడే బెల్లంబొంద లేదా కోనేరు అని పిలువబడే చతురస్రాకారపు బావి వుంది. మావూరిలో 33 అమ్మదేవతల గుళ్ళున్నాయి. 7 వూర్ల (ఆలేరు, రామసముద్రం, శాయిగూడెం, మందనపల్లి, బహదూర్‍ పేట, మంతపురి, ఇక్కుర్తి) పొలిమేరల కూడలి దేవత బంగారు మైసమ్మ.


ఈ అమ్మదేవతలు కాక కాటమయ్య (శ్రీకంఠ మహేశ్వరుడు), పోతలింగం (గుండెలమ్మ గుడి దగ్గర), నంది (చిరిగె వాళ్ళ పొలంలో), భైరవుడు (బొడ్రాయి దగ్గర), వనభైరవుడు(?), మరో భైరవుని బొమ్మ వాగు మీది బస్సులదారిలో మండల కార్యాలయం వైపు ఆలేరువాగులో కుడిదిక్కున పెద్ద మీద గంటుబొమ్మ లెక్క చెక్కి వుంది. మావూరి బీరప్పగుడి గొల్లోని ఒర్రె ఒడ్డున వుంది. ఇందులో గొల్ల, కుర్మలు పూజించే లింగాలలో కొన్ని ఆదిమానవుల రాతి పనిముట్లు ఎక్కువగా రాతిగొడ్డండ్లు వున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు అన్ని బీరప్పగుళ్ళలో నవీన శిలాయుగానికి చెందిన ఆదిమానవుల రాతి పనిముట్లు లింగాలుగా పూజలందు కుంటున్నాయి. ఇవికాక శిథిలాలయాల ఆనవాళ్ళు చాలానే వున్నాయి.
ఇది మా ఊరు ఆలేటికథ.


ధన్యవాదాలు:
చరిత్రకు గైడ్‍ గురువంటి విరువంటి గోపాలక•ష్ణ, ఈ దేవతల పేర్లు, జాడలు చెప్పిన చాగంటి (కుమ్మరి) లింగమ్మ, కీ.శే. మల్లెల బీరప్ప (ప్రఖ్యాత ఒగ్గు కథకుడు), కీ.శే. గాయకుడు మంగళి పోషయ్యలకు.

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *