వరి స్థానంలో కూరగాయల సాగు


స్టేకింగ్‍ పద్ధతిలో బీర, కాకర, సొరకాయ సాగు
అభ్యుదయ రైతుల వినూత్న ప్రయోగం


రైతులు ప్రతీ ఏడాది రెండు సీజన్లలో వరిసాగు చేస్తున్నప్పటికీ పెద్దగా ఆదాయం సమకూరడం లేదు. దీంతో అభ్యుదయ రైతులు వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. వరిసాగు చేసే భూమిలో, రకరకాల కూరగాయలను పండిస్తున్నారు. దీనికి తోడు, ప్రస్తుతం కూరగాయలకు మంచి డిమాండ్‍ ఉండడంతో, కూరగాయల నాణ్యత చెడిపోకుండా స్టేకింగ్‍ పద్ధతిలో సాగు చేస్తున్నారు. రాయికల్‍ మండలంలోని అలూర్‍ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతులను చూసి, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని మరి కొంతమంది రైతులు సైతం కూరగాయల సాగుకు ఉపక్రమిస్తున్నారు.


జూన్‍ మొదటి వారంలోనే…

ఈ రైతులు ముందుగా జూన్‍ మొదటి వారంలో సమావేశమై, ఎలాంటి కూరగాయల సాగుచేయాలో నిర్ణయించుకుంటారు. వినియోగదారుల నుంచి డిమాండ్‍ ఉన్న బీరకాయ, సోరకాయ, కాకరకాయ, టమాట, అలిసెంత వంటి కూరగాయలు సాగుచేస్తున్నారు. దీంతో నాణ్యమైన విత్తనాలను వివిధ కంపెనీల నుంచి కరీంనగర్‍లో కొనుగోలు చేశారు. విత్తనం, కంపెనీని బట్టి 50 గ్రాముల విత్తనాల్ని, రూ.900కు కొనుగోలు చేశారు. విత్తనం నాటే భూమిలో పశువుల ఎరువువేసి, ట్రాక్టర్‍తో రెండు, మూడుసార్లు బాగా దున్నిస్తారు. తర్వాత, మట్టి బెడ్‍లు తయారుచేసి, వాటిపై సాగునీరందేలా డ్రిప్‍ పైపులు వేస్తారు. కలుపు మొక్కలు రాకుండా మల్చింగ్‍ షీట్‍ సైతం వేస్తారు. అనంతరం, మల్చింగ్‍ షీట్‍కు రంధ్రాలు చేసి, అందులో విత్తనాలు నాటుతారు.


నాణ్యత దెబ్బతినకుండా స్టేకింగ్‍

కూరగాయల నాణ్యత దెబ్బతినకుండా కంక బొంగులతో స్టేకింగ్‍ ఏర్పాటు చేశారు. ఇందుకోసం, తీగజాతీ కూరగాయలైన సోరకాయ, కాకరకాయ, బీరకాయలు నేలపై పారితే ముడుచుకు పోయి, మార్కెట్‍లో రేటు ఉండదు. దీంతో మొక్కలకు తీగపారగానే, తీగకు సుతిల్‍తో కట్టి, కంక బొంగులకు పాకించడం చేస్తున్నారు. దీంతో మొక్కకు సరైన గాలి, సూర్యరశ్మీ తగిలి మొక్క ఏపుగా పెరుగుతుంది. మొక్కకు పెద్దగా పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉండదు.


పురుగు మందులు కొట్టకుండా… సోలార్‍ ట్రాప్‍లు..
సాధారణంగా కూరగాయల పంటలను పూత, పిందె దశలో పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. దీంతో, రైతులు రకరకాల పురుగు మందులు పిచికారీ చేస్తుంటారు. కానీ, ఈ రైతులు సమాజ శ్రేయస్సు కోసం పురుగుమందులు వాడకుండా పురుగులను ఆశించే సోలార్‍ ట్రాప్‍లు, పండు ఈగ ఆకర్షక బుట్టలు పెడుతున్నారు. మొక్కలు బలంగా పెరిగేందుకు యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువులు వేయకుండా, మజ్జిగ, బెల్లంతో కూడిన పుల్లటి పదార్థాన్ని మొక్కలకు అందిస్తున్నారు.


మార్కెట్‍కు కూరగాయలు…

తమ పొలంలో పండించిన కూరగాయలను మార్కెట్‍కు అయితే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పుడిప్పుడే పంట చేతికి అందుతుంది. కాబట్టి రైతుల పొలాల్లో కూరగాయల పంట దిగుబడులు సెప్టెంబర్‍ చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కూరగాయలకు మంచి డిమాండ్‍ ఉండడంతో, తమకు కలిసి వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు సాగుచేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు డ్రిప్‍, మల్చింగ్‍ పరికరాలు అందించాలని రైతులు కోరుతున్నారు.


ఆనబోయిన స్వామి,
బాలారణ్యం, సుస్థిర కేంద్రం
ఎ : 9963 87 2222

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *