ఉమ్మడి సొత్తు


ఒక అరణ్యంలో ఒక చోట ఏనుగుల గుంపు ఒకటి నివాసం వుంటున్నది. ఆ గుంపులో అన్ని వయస్సుల ఏనుగులున్నాయి. వాటితో పాటు ఐదారు గున్న ఏనుగులు కూడా వున్నాయి.
ఆ గున్న ఏనుగుల్లో ఒక మచ్చల ఏనుగుండేది. మిగతా వాటికన్నా తను ప్రత్యేకంగా వున్నానని దానికి గర్వంగా కూడా వుండేది. మిగతా పిల్ల ఏనుగులపట్ల అది దురుసుగా ప్రవర్తిస్తూ లెక్కలేని తనంగా వుంటుండేది.
ఆహారం కోసం అడవిలో తిరుగుతున్నప్పుడు మచ్చల ఏనుగు మొక్కలను తన కాళ్లతో చిందరవందరగా తొక్కేస్తూ, చెట్ల కొమ్మలను తన బలమైన తొండంతో ఎడాపెడా విరిచి పడేస్తూ బల ప్రదర్శన చేస్తుండేది.
‘‘మిత్రమా! నోరులేకపోయినా మొక్కలు కూడా మనలాంటి ప్రాణులే. అవి మనకు ఆహారాన్నిస్తున్నాయి. ఆకలి తీరుస్తున్నాయి. వాటికి ఎలాంటి హాని జరగకుండా మన ఆహార అవసరాలను తీర్చుకోవాలి.’’ అంటూ ఒక రోజు జిరాఫీ మందలించ బోయింది.
‘‘అలా చేయటం నాకెంత ఆనందమో నీకు తెలుసా!’’ అంటూ పెంకెగా సమాధానమిచ్చింది మచ్చల ఏనుగు.
‘‘నీకు ఆనందం కలగటానికి అది ఆటనుకున్నావా? ఈ అడవిలో ఒక మొక్క పుట్టి పెరగటానికి ఎంత కాలం పడుతుందో తెలుసా?’’ అన్నాయి.
‘‘అదంతా నా కనవసరం’’ పెడసరంగా మాట్లాడింది మచ్చల ఏనుగు.
‘‘మనం శాఖాహారులం. వాటి అవసరం మనకే వుంటుంది. వాటి సంరక్షణ పట్ల మనం ఎంతో బాధ్యతగా వుండాలి. ఆ మొక్కలు లేకుంటే మన జీవులకు మనుగడే లేదు.’’ జింక హెచ్చరిస్తూ మాట్లాడింది.
‘‘ఈ అడవిలో ఇలాంటి మొక్కలు లెక్కలేనన్ని పుడుతుంటాయి. గిడుతుంటాయి. వాటికేం లోటు గనుక మనం చింతించాలి. నా శరీర ద•ఢత్వాన్ని పటిష్ట పరచుకోవటానికి ఇంతకన్నా మరో దారి కనిపించలేదు.’’ బింకంగా పలికింది మచ్చల ఏనుగు.
‘‘అందుకు నువ్వు ఇతర ప్రయత్నాలు చాలా చేయవచ్చు. పదే పదే కూచుని లేవడం. పరుగులు పెట్టడం లాంటివి నీ శారీరక బలాన్ని పెంచుతాయి. అంతేకాదు అడవిలో చనిపోయి ఎండిన చెట్లను విరిచి, పెళ్లగించి పరిసరాలను శుభ్రం చేయవచ్చు’’ అంటూ మంచిగా చెప్పింది జిరాఫీ.
ఒకరోజు మచ్చల ఏనుగుతో పాటు అడవిలో ఒక ప్రాంతంలో సంచరిస్తూ కంటబడిన ఆకులు అలములు తింటూ కాలక్షేపం చేస్తున్నాయి జిరాఫీ, జింకలు.
ఎప్పటిలానే మచ్చల ఏనుగు ఒక ఎత్తయిన గుట్ట మీదకు ఎక్కి, ఒక బలమైన నేరేడు చెట్టు కొమ్మల్ని ఎడా పెడా విరిచి పారేయసాగింది. ఆ కొమ్మల్లో ఒక దానికి పెద్ద తేనెపట్టు వేలాడుతూంది. ఎప్పుడయితే ఏనుగుపిల్ల ఆ కొమ్మలను విరిచే ప్రయత్నం చేస్తున్నదో, అప్పుడు ఆ తేనెతుట్టె కదిలి దానిని పట్టివున్న తేనెటీగలు గీమంటూ పైకి లేచాయి.
ఏనుగు దుశ్చర్యకు వాటికి అంతులేని కోపం వచ్చింది.
తేనెటీగలు దాని తొండాన్ని పట్టి ములుకుల్లాంటి తమ కొండీలతో కుట్టి పడేశాయి. దాంతో క్షణాల్లో వాటి విషం ఏనుగు తొండంలోకి ప్రాకిపోయి భరించలేని మంట, బాధ పెట్టసాగటంతో అది పరిగెత్తబోయి గుట్టమీద నుంచి కిందకు దొర్లిపడింది.
మచ్చల ఏనుగు శరీరానికి గాయాలయ్యాయి. తేనెటీగ విషం పాకటంతో తొండమంతా ఎర్రబారి వాచిపోయింది. అతికష్టం మీద తోటి జంతువుల సహాయంతో స్థావరానికి చేరుకోగలిగింది.
మర్నాటి కల్లా దాని దేహం పచ్చిపుండయింది. కదల్లేని స్థితిలో, శరీరం మంటల్లో కాలుతున్నంత బాధలో విలవిల్లాడి పోసాగింది.
తమ బిడ్డ దుస్థితికి ఏనుగులు కన్నీరు పెట్టాయి. జరిగిన సంగతంతా మచ్చల ఏనుగు సహచర జంతువులు పొల్లు పోకుండా వివరంగా చెప్పాయి.
తేనెటీగలు కుట్టడంతో ప్రాణాపాయంలో చిక్కుకున్న తమ మిత్రుడ్ని గురించి చిన్న జిరాఫీ తల్లితో చెప్పింది. ఆ విషం విరుగుడుకు తగిన చికిత్స తనకు తెలుసుననటంతో, ఏనుగులు తమ బిడ్డ ప్రాణాలు కాపాడమని జిరాఫీ తల్లిని కలిసి మొరపెట్టుకొన్నాయి.
‘‘అడవికి ఉత్తరాన సెలయేటి ఒడ్డున ఎన్నో రకాల ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. ఆ ఒడ్డున పెరుగుతున్న ఔషధ మొక్కను గుర్తించి చూపింది జిరాఫీ. ఆ మొక్కల కొమ్మలను సరిపడినన్ని విరిచి తీసుకొచ్చాయి ఏనుగులు. ఆ మొక్కల ఆకులను ముద్దలుగా చేసి, రసాన్ని పిండి మచ్చల ఏనుగుకు తాగించాయి. ఆ మందు ప్రభావంతో మచ్చల ఏనుగుకు బాధ నుంచి ఉపశమనం కలగసాగింది.
కొద్ది రోజుల్లోనే మచ్చల ఏనుగు తెప్పరిల్లుకొంది. ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోసాగింది. అనారోగ్యం నుంచి క్రమంగా కోలుకొంటూ ప్రాణాపాయం నుంచి బయటబడింది. గుంపులోని ఏనుగులు, జిరాఫీ, జింకలు ఎంతో సంతోషించాయి.
‘‘చూశావా!’’ నీ పొగరుమోత్తనంతోనే చేజేతులా ప్రాణాల మీదకు తెచ్చుకొన్నావు? ఈ అడవి ఒక్క మన జంతువులకే సొంతమని విర్రవీగకూడదు. సకల జీవజాలానికి అడవి ఒక ఉమ్మడి సొత్తు. అడవిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది.’’ అంటూ ఏనుగులు మచ్చల ఏనుగుకు బుద్ధి చెప్పాయి.
ఆ మాటలతో మచ్చల ఏనుగుకు తన తప్పు తెలిసొచ్చింది. అది జీవిత కాలమంతా మొక్కలపట్ల ఆదరాభిమానాలు చూపింది.

  • వల్లూరు శివప్రసాద్‍, ఫోన్‍ : 929153071

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *