ఈ విశ్వాన్ని సృష్టించి దాని సంచాలనం చేస్తున్న తల్లి పరాశక్తి. అందరి జీవితాల్లో వెలుగులు నింపే జగన్మాత ఆమె. ఆ ఆదిశక్తి అంశగా ముగ్గురమ్మలు ఆవిర్భవించి లోకకళ్యాణం చేస్తున్నారు. పరాశక్తి నుంచి ఉద్భవించిన త్రిమూర్తులకు శక్తిని ప్రసాదిస్తూ ఆ చల్లని తల్లి అందరిని ప్రేమతో కనిపెట్టుకొని బతుకును పంచుతుంది. అందుకే ఆ అమ్మను బతుకమ్మ అని పిలుస్తున్నాం. బతుకమ్మ లాగే ప్రకృతితో ముడిపడిన పండుగ తీజ్. బంజారాలు వారి శ్రేయస్సు, యశోవృద్ధి కోసం తీజ్‍ను జరుపుకుంటారు.
చెట్టు, పుట్ట, గుట్టలకు నిలయమైన అడవుల్లో గుడిసెలు నిర్మించుకొని గోసేవ, ప్రకృతి సేవ చేస్తూ తమదైన సంస్క•తిని, సంప్రదాయాలను నిలుపుకుంటూ సాగిపోతారు బంజారాలు. అనాదిగా సాతి భవానీలను (సప్త మాతృకలు) కొలుస్తూ ఆ జగదంబలోనే జగతిని దర్శిస్తారు. మొలకనారును ఆ తల్లికి మరోరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ రెండు పండుగలకు దగ్గరి పోలికలు, సామీప్యతలు చాలా విషయాల్లో కనిపిస్తాయి. ఈ రెండు పండుగలు కాలానుగుణంగా కొద్దిగా ముందు వెనకాల నిర్వహించబడినా రెండింటి లక్ష్యం సృష్టి కళ్యాణమే.
తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ పండుగ జరుపబడితే, తీజ్ పండుగను మాత్రం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు బంజారాలు. రెండు పండుగల్లో ప్రకృతే ప్రధాన దైవంగా కొలవబడుతుంది. ముత్తైవదులు, కన్నెపిల్లలు తమ జీవితాలు మంగళమయం అవ్వాలనే ఆకాంక్షతోనే ఈ పండుగలను జరుపుకుంటారు. తీజ్ కొండా కోనల్లో, అడవుల్లోని తండాల్లో నిర్వహించబడితే, బతుకమ్మ మైదాన ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. వివిధ రాష్ట్రాల్లో హర్యాలి తీజ్, గణ్ గోర్ తీజ్, కజిరి తీజ్, హర్తాలికా తీజ్, అఖా తీజ్, అవ్రా తీజ్, కాజల్ తీజ్, కేవ్డా తీజ్, తాయ్ తీజ్‍ల పేర్లతో విభిన్నతను సంతరింప జేసుకున్నది ఈ తీజ్ పండుగ.
అందరికీ శుభం జరగాలని, తమకు మంచి భర్త లభించాలని కోరుతూ
మారో బాపు జబరజ హూంసియే కనాయియో
ఓరి బేటివూన తీజ బొరాదు
కేరాయే కనాయియో…
అంటూ వినమ్రంగా పాట రూపంలో తండా నాయకునికి విన్నవించుకుంటారు.
తండా నాయక్ అనుమతితో బంజారాలు గోధుమలు, శనగలు తీసుకొస్తారు. అడవిలోని మేలైన చెట్ల కొమ్మలతో మంచెను నిర్మిస్తారు. దానిపై పుట్ట మన్నుతో నింపిన బుట్టల్లో బీజాల్ని వేసి తొమ్మిది రోజులపాటు వివిధరకాల నైవేత్యాదలతో ఆరాధిస్తారు. మొలకలను మేరామా భవానీకి (పార్వతిదేవి) ప్రతిరూపంగా భావించి పాటలు పాడుతూ, తమ సంప్రదాయ నృత్యాలతో తండాను ఆనందమయం చేస్తారు.
ఖొదా ఖొదారే సేవాభాయ కువలో ఖొదా/
కువలేరో పాణి అకేలా భీ భరే సకేలా భీ భరే..
లాంబి లాంబియే లాంబడి ఎకేరియా /
ల్యార లేరియే లాంబడి ఎకేరియా
ధోక ఖారియే లాంబడి ఎకేరియా…
అంటూ భక్తిగా పాడే బంజారాల జీవనంలో సేవలాల్ మహారాజ్ తెచ్చిన క్రాంతి సాంస్క•తికంగా, ధార్మికంగా వారి జీవితాలను ఏ విధంగా ఉన్నతంగా మలచిందో ఈ పాట తెలియజేస్తుంది.
నవనవ దాడేరి భూకీరే భీయో/
తరసీరే భీయో
మారి చడకలి మన ద…
తండాలో ఎందరు ఆడబిడ్డలుంటే వారి పేరు మీద అన్ని బుట్టలుంటాయి. ఆ బుట్టల్లో ఒక బుట్ట మేరా మా భవానీది, మరొకటి సేవాలాల్ మహారాజ్ ది ఉంటుంది. ఈ బుట్టలను పవిత్ర భావనతో తొమ్మిది రోజులపాటు నిర్జలావ్రతంతో నిష్టగా ఆరాధించడం తీజ్ పండుగలో చూడవచ్చు.
బతుకమ్మ, తీజ్ రెండు పండగులు ప్రకృతి మాతను ఆరాధించే ప్రజల హృదయ నిర్మలతను ఆవిష్కరిస్తున్నాయి. పండుగలు జరుపుకునే విధానాలు, పద్ధతులు వేరువేరు కావచ్చు. కానీ రెండింటి లక్ష్యం లోక కల్యాణం అన్నది మాత్రం గమనించవలసిన అంశం. పాట, ఆటల మధ్య పువ్వులు, మొలకలు పరవశించి ప్రాణశక్తిని ప్రజారణ్యంలోకి ప్రసారం చేస్తున్న విధానం రెండు పండుగలలో కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఏ విధంగా గౌరవిస్తోందో అలాగే బంజారా గిరిజనుల సంప్రదాయ తీజ్ పండుగను కూడా సారంగా గౌరవిస్తున్నది. ఈ పండుగలు రెండు తెలంగాణ గడ్డ ఆత్మగౌరవ ప్రతీకలుగా దర్శనమిస్తాయి.
- ఆచార్య సూర్యాధనుంజయ్
తెలుగుశాఖ, ఉస్మానియ విశ్వవిద్యాలయం
ఎ : 984910418