జ్ఞాపకాల మూట అక్టోబర్‍ 9న ‘‘ప్రపంచ తపాలా దినోత్సవం’’

నిన్న మొన్నటి వరకూ టెలిఫోన్‍ కలిగిన వారిదే. మధ్యతరగతిది ఉత్తరం. పేదవాడికి పోస్ట్కార్డ్. కనీసం ఐదు దశాబ్దాల భారతీయుల జీవన భావోద్వేగాలు లేఖలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ కార్డులు, మనీ ఆర్డర్‍ల చుట్టే తిరిగాయి. ఉత్తరం లేకపోతే… పోస్ట్మేన్‍ లేకపోతే ఆ జ్ఞాపకాలు ఉండేవా? అక్టోబర్‍ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’ సందర్భంగా కొన్ని ఉద్వేగాల రీవిజిట్‍.
1970లు, 80లు కొడుకుల మనిఆర్డర్‍ల కోసం తల్లిదండ్రుల కళ్లు కాయలు కాచేలా చేశాయి. నిరుద్యోగ భారతంలో కొడుకు ఉద్యోగం సంపాదించి ఎంతో కొంత పంపితేనే జరుగుబాటైన ఇళ్లు. ఆ రోజుల్లో ఎవరికీ అకౌంట్లు ట్రాన్స్ఫర్లు, ఎవరికీ ఫోన్‍పేలు లేవు. అందరికీ మని ఆర్డరే. పోస్ట్మేన్‍ మనీ ఆర్డర్‍ తెచ్చి ఇస్తే సంతోషించి ఆ ఇంటి ఇల్లాలు మజ్జిగ ఇచ్చేది. ఇంటి పెద్ద రూపాయో రెండ్రూపాయలో బక్షీసు ఇచ్చేవాడు. ఆ పూట ఆ ఇంట్లో గుండెల మీద కాకుండా వంటగదిలోనే కుంపటి వెలిగేది.


సౌదీ, అమెరికా, రంగూన్‍… వలస వెళ్లిన వారి ఉత్తరాలు నెలల తరబడి వేచి చూస్తే తప్ప వచ్చేవి కావు. సైన్యంలో చేరిన వారి బాగోగులు ఉత్తరాలు చెప్తే తప్ప తెలిసేవి కావు. పట్నంలో చదువుకుంటున్న కొడుకు పరీక్ష ఫీజు కోసం రాసిన పోస్ట్కార్డు అతి బరువుగా అనిపించేది. కాపురానికి వెళ్లిన కూతురు నుంచి వచ్చిన ప్రతి ఉత్తరం ఉలికిపాటును తెచ్చేదే. ఆ కూతురు కూడా తక్కువ తిన్నదా? కష్టాలన్నీ తాను దిగమింగుతూ సంతోషంగా
ఉన్నట్టు తెగ నటించదూ?
ఇంటర్వూకు కాల్‍ లెటర్‍, అపాయింట్‍మెంట్‍ లెటర్‍, స్టడీ మెటీరియల్‍, కలం స్నేహం కోసం మొదలెట్టిన జాబులు, పత్రికకు పంపిన కథకు జవాబు, తకరారులో చిక్కుకుంటే వచ్చే కోర్టు నోటీసు, వ్యాపార లావాదేవీల కరెస్పాండెన్సు, అభిమాన హీరోకు లేఖ రాస్తే పంపే ఫొటో, వశీకరణ ఉంగరం… ఎన్నని. అన్నీ ఆ ఖాకీ బట్టల పోస్ట్మేన్‍ చేతుల మీదుగా అందేవి. తెలిసేవి. సంతోషపెట్టేవి. బాధించేవి. గెలిపించేవి. ఓడించేవి.


ఇక కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఉత్తరాలు స•ష్టించిన ‘డ్రామా’ అంతా ఇంతా కాదు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే లైనుతో ఎన్నో కథలు మొదలయ్యేవి. ఉత్తరాలు అందక ఏర్పడిన అపార్థాలు, ఒకరి ఉత్తరం ఇంకొకరికి చేరి చేసే హంగామాలు, ఒకరి పేరుతో మరొకరు రాసే ప్రేమ లేఖలు.. వీటిలో పోస్ట్మేన్‍లది ఏ పాపమూ ఉండదు. కాని వారికి తెలియకనే వ్యవహారమంతా వారి చేతుల మీదుగా నడుస్తుంటుంది. ఉత్తరాలు బట్వాడా చేయాల్సింది వారే కదా.


కొందరు పోస్ట్బాక్స్ నంబర్‍ తీసుకుని ఆ నంబర్‍ మీదే సవాలక్ష వ్యవహారాలు నడిపేవారు. బుక్‍పోస్ట్ను ఉపయోగించి పుస్తకాలు పంపని కవులు, రచయితలు లేరు. రిజిస్టర్డ్ పోస్ట్ విత్‍ డ్యూ అక్నాలెడ్జ్మెంట్‍ అయితే ఆ ధీమా వేరు. ‘టెలిగ్రామ్‍’కు పాజిటివ్‍ ఇమేజ్‍ లేదు. అది వచ్చిందంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారమే.


సంతవ్సరం పొడుగూతా సేవ చేసే పోస్ట్మేన్‍ మహా అయితే అడిగితే దసరా మామూలు. అది కూడా ఇవ్వక వారిని చిన్నబుచ్చేవారు కొందరు. చాలీ చాలని జీతంతో, ఎండనక వాననక సైకిల్‍ తొక్కుతూ ఇల్లిల్లు తిరిగి క్షేమ సమాచారాలు ఇచ్చి ఊరడింప చేసే ఆత్మీయుడు పోస్ట్మేన్‍ మధ్యతరగతి భారతదేశంలో కనిపించని పాత్ర పోషించాడు.


ఇవాళ కథే మారిపోయి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి సెల్‍ఫోన్‍లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్‍ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ క•త్రిమ మెషీన్‍లో ఎక్కడిది. చేతిరాతతో అందుకునే ఉత్తరం జాడ ఎక్కడిది. ఆ చెరగని గుర్తు ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు. ఆ కాలానికి ధన్యవాదాలు. థ్యాంక్యూ పోస్ట్మేన్‍.

  • దక్కన్‍ న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *