ఆకుపచ్చ నగరం అందరికీ ఆదర్శం చింతచెట్టు కింద పాఠాలతో హైదరాబాద్‍ అభివృద్ధి

సెప్టెంబర్‍ 28…
ఈ తేదీ రాగానే… 1908లో హైదరాబాద్‍ ను ముంచెత్తిన చరితాత్మక వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధిక భాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి. వరదలు వచ్చి నేటికి 115 ఏళ్లు గడిచినా… ఈ నగరానికి నాటి స్మృతులు నేటికీ తడి ఆరకుండానే ఉన్నాయి. అఫ్జల్‍ గంజ్‍ పార్క్ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం) లో ఉన్న ఓ చింత చెట్టు నాటి జ్ఞాపకాలను నేటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు… ఈ ఏడాది సైతం సెప్టెంబర్‍ 28న ఈ చింతచెట్టు కింద జరిగే సమావేశం ఒక నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ…. నేటి పరిస్థితుల్లో నగరాభివ•ద్ధికి నిపుణులు చేసే సూచనలకు వేదిక కానుంది. హైదరాబాద్‍ నగరం విశ్వనగరం మారేందుకు బాట వేయనుంది.


1908 వరదలకు ముందు… ఆ తరువాత….
హైదరాబాద్‍ నగర చరిత్రను మూసీ వరదలకు ముందు….ఆ తరువాత అని విభజించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మూసీ నదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయి కానీ 1908లో వచ్చిన వరద మాత్రం కనివిని ఎరుగనిది. అందుకే నగర చరిత్రలో అది ఓ అత్యంత విషాద సంఘటనగా మిగిలిపోయింది. ఆ వరదలు వచ్చిన మూడేళ్లకు చివరి నిజాం మీర్‍ ఉస్మాన్‍ అలీ ఖాన్‍ గద్దెనెక్కారు. ఉగ్రరూపం ప్రదర్శించిన మూసీనది సృష్టించిన సమస్యను గుర్తించారు. అలాంటి విపత్తు మరోసారి రావద్దని భావించారు. అందుకోసం సిటీ ప్లాన్‍ రూపొందించాలని, మౌలిక వసతులు కల్పించాలని సంకల్పించారు. అందుకే నగర ప్రణాళికకు అంతులేని ప్రాధాన్యం ఇచ్చారు. మాస్టర్‍ ప్లాన్‍ అవసరాన్ని గుర్తించి, వీలైనంత త్వరగా దాన్ని అమలు చేయడం ప్రాథమిక అవసరమని భావించారు. 1914లోనే సిటీ ఇంప్రూవ్‍ మెంట్‍ బోర్డు (సీఐబీ)ను ఏర్పాటు చేశారు. దీర్ఘకాలం పాటు ఉండగల పరిష్కారాలను రూపొందించే బాధ్యతను దానికి అప్పగించారు. ప్రముఖ ప్లానర్‍ సర్‍ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో City Improvement Board(CIB)పని చేయడం ప్రారంభించింది. నగరంలో పౌర వసతులను మెరుగుపరిచేందుకు ప్రధాన పథకాలను రూపొందించి అమలు చేయడం మొదలెట్టింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సిఫారసులు సమగ్ర సిటీ ప్లాన్‍ రూపకల్పన, అమలు అవసరాన్ని నొక్కిచెప్పాయి.


సీఐబీ ఏర్పాటు హైదరాబాద్‍ నగరాభివ•ద్ధికి కొత్త ఆశలు రేకెత్తించింది. వరదలకు మునిగిపోయిన నగరానికి కొత్త రూపు ఇచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆనాటి విపత్తు నుంచి కోలుకునేందుకు ఓ చక్కటి అవకాశం లభించినట్లయింది. భాగ్య నగరం చరిత్రలో నూతన శకానికి నాంది పలికినట్లయింది. అప్పట్లో CIB రూపొందించిన ప్రతిపాదనల్లో, సమర్పించిన నివేదికల్లో ఎంతో ఉత్సుకత కనిపించేది. ప్రభావపూరిత ఫలితాలపై ఆకాంక్షలు వాటిలో ప్రతిఫలించేవి. నగర ప్రజల వినియోగం కోసం పార్కులు, బహిరంగ స్థలాలు, క్రీడామైదానాలు ఏర్పాటు చేయాలని సీఐబీ సంకల్పించింది. మురికివాడల తొలగింపు, ఇళ్ల కాలనీల నిర్మాణం, సరికొత్తగా నీటి సరఫరా వ్యవస్థ, నూతన డ్రైనేజీ వ్యవస్థ, దుమ్ము లేని విధంగా రహదారులు, వారసత్వ కట్టడాల పరిరక్షణ సదుపాయాలపై ప్రతిపాదనలు రూపుదిద్దుకొని, అమలయ్యాయి. ఈ పథకాలన్నీ కూడా నగర ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చాయి. క్షీణ దశలో, అనారోగ్యకర పరిస్థితులల్లో ఉన్న నగరం కాస్తా అందమైన, ఆరోగ్యదాయకమైన, సామర్థ్యపూర్వకమైన నగరంగా రూపుదిద్దుకోవడం మొదలైంది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోల్చదగిందిగా మారింది. అప్పట్లో నగర ప్రణాళిక బాగ్‍ (ఉద్యానవనాలు), బౌలి (బావులు), తలాబ్‍ (చెరువులు)తో ముడిపడి ఉండింది. పచ్చదనం, జలాశయాలు నగరప్రణాళికలో కీలక పాత్ర పోషించాయి.


వందేళ్లు గడిచినా అవే సమస్యలు
నిజాం హయాంలో సిటీ ఇంప్రూవ్‍ మెంట్‍ బోర్డ్ (సీఐబీ) ఆధ్వర్యంలో ఎన్నో గొప్ప ప్రణాళికలు అమలై నేటికి వందేళ్లు గడిచిపోయాయి. ఈ శతాబ్ది కాలంలో నగరం ఎంతో అభివ•ద్ధి సాధించింది అనడంలో సందేహం లేదు. కాకపోతే… నగరం ఊహకు అందని విధంగా విస్తరించింది. జనాభా కూడా బాగా పెరిగిపోయింది. దీంతో ఒకనాటి పరిస్థితులే తిరిగి ఏర్పడుతున్నాయన్న భయాలు కూడా కలుగుతున్నాయి. నగరంలో అనేక ప్రాంతాలు ఓ మోస్తరు వర్షానికే జలమయమైపోతున్నాయి. పుట్టగొడుగుల్లా మురికివాడలు వెలిచాయి. చక్కగా ప్లాన్‍ చేసిన ప్రాంతాలు సైతం ఇరుకిరుగ్గా మారుతున్నాయి. వందేళ్ల కాలంలో అక్రమ నిర్మాణాలను చట్టబద్దం చేయడం అలా కొనసాగుతూ రావడం కూడా ఇందుకు ఓ కారణంగా నిలిచింది. పౌర సదుపాయాలు ఎంతగా వ•ద్ధి చేసినా ప్రజల అవసరాలు తీరడం లేదు. నేటికీ అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య కొనసాగుతూనే
ఉంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారింది. ఈసమస్యలన్నీ ఏ ఒక్క సంవత్సరంలోనే ఏర్పడినవి కావు. దశాబ్దాలుగా పేరుకుపోయి… ఇప్పుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి.


చింత చెట్టు నీడలో….

ఈ నేపథ్యంలోనే ఫోరమ్‍ ఫర్‍ హైదరాబాద్‍, సెంటర్‍ ఫర్‍ దక్కన్‍ స్టడీస్‍ సంస్థలు ఇతర ఎన్జీఓలతో కలసి అర్బన్‍ ప్లానింగ్‍ పై ప్రత్యేక ద•ష్టి సారించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, నగరాభివ•ద్ధితో ముడిపడిన సంస్థలకు అనేక సూచనలు చేసింది. 1908 నాటి వరదల భయంకర పరిస్థితికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన చింతచెట్టు నీడలో ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. 2008 సెప్టెంబర్‍ 28 నుంచి కూడా ఏటా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. నాటి వరదల్లో కొట్టుకుపోయిన వందలాది మందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. నగరాభివృద్ధికి చేయాల్సిన సూచనలు సిఫారసు చేయడం, వాటి అమలుకు కార్యాచరణ రూపకల్పన, అప్పటి వరకూ సాధించని ప్రగతి… లాంటి అంశాలన్నీ ఈ సమావేశాల్లో చర్చకు వస్తుంటాయి. అలాంటి సందర్భమే ఇప్పుడు మరోసారి వచ్చింది. అఫ్జల్‍ గంజ్‍ పార్క్ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం)లో ఉన్న చింత చెట్టు అప్పట్లో కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడింది. అలాంటి చెట్టు నేటికీ పచ్చగా ఉంది. ఈ చెట్టును, ఆ స్థలాన్ని నగర సహజ వారసత్వంలో భాగంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాకుండా… అప్పట్లో భారీ వరదలు వచ్చిన సమయంలో అప్పటికే ఉన్న పెద్ద పెద్ద కట్టడాలు (మసీద్‍-ఎ-బర్ఖ్ జంగ్‍, పేట్ల బుర్జు లాంటివి) ఎంతమేరకు మునిగిపోయాయో తెలియజేసే సూచికలను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీంతో అప్పటి వరదల తీవ్రత నేటి తరానికి తెలుస్తుంది. అంతే కాదు… కాలం కలసిరాక పోతే… ఏ స్థాయి వరదలు వస్తాయో కూడా అర్థమవుతుంది. అప్పట్లో సర్‍ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్‍ నిజామత్‍ జంగ్‍, అలీ నవాజ్‍ జంగ్‍, దంగోరియా లాంటి ప్రముఖ ప్లానర్లు, అడ్మినిస్ట్రేటర్ల గుర్తులను పదిలంగా భద్రపర్చుకోవాల్సిన అవసరం ఉంది.


హిమాయత్‍ సాగర్‍, ఉస్మాన్‍ సాగర్‍ లాంటి జలాశయాలతో పాటు కాకతీయుల కాలం కంటే ముందు నుంచి ఉన్న మరెన్నో జలాశయాలను కాపాడుకోవాలి. వీటిలో అనేకం ఇప్పటికే కాలగర్భంలో కలసిపోయాయి. మిగిలినవాటిని కాపాడుకునేందుకు తీవ్రంగా క•షి చేయాల్సిన అవసరం ఉంది. నేడు హైదరాబాద్‍లో పలు కాలనీలు కొద్ది పాటి వర్షాలకే మునిగిపోతున్నాయంటే… అవన్నీ ఒకనాటి చెరువుల్లో…. నీటి ప్రవాహ మార్గాల్లో నిర్మించిన కట్టడాలనే విషయం అర్థమవుతుంటుంది. ఇదే చింత చెట్టు కింద జరిగిన సమావేశాల్లో ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. ప్లానర్లు, అడ్మినిస్ట్రేటర్లు చేసిన తప్పిదాలను గుర్తించి… వాటికి పరిష్కారాలు అన్వేషించే ప్రయత్నాలు జరిగాయి. చెట్ల ప్రాధాన్యం, జలాశయాల పరిరక్షణ, సిటీ ప్లానింగ్‍ లో సంబంధిత వర్గాలకు ప్రమేయం కల్పించడం, జోన్ల ఏర్పాటు, ట్రాఫిక్‍ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, వారసత్వ భవనాల సంరక్షణ లాంటివి వీటిలో కొన్ని మాత్రమే. ఈ చింత చెట్టు నీడలో మరెన్నో అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఈ హైదరాబాద్‍ వారసత్వ ప్రాంతం అఫజల్‍ పార్కు (చింతచెట్టు)ను కాపాడేందుకు గతంలో ఎంతో మంది ఉన్నతాధికారులు ఎన్నో హామీలిచ్చారు. రకరకాల కారణాలతో అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై శ్రద్ధ వహించి అఫజల్‍ పార్కును వారసత్వ పార్కుగా తీర్చిదిద్దాలి.


నగరంలో వరదలు…

నగరంలో వరదలు అంటే మూసీ వరదలు అనే భావించాల్సిన అవసరం లేదు. నిజానికి 1908 తరువాత కూడా పలు సందర్భాల్లో మూసీ నదికి వరదలు వచ్చాయి. 1970లో నగరవ్యాప్తంగా, చుట్టపక్కల చెరువులు నిండిపోయాయి. ఉస్మాన్‍ సాగర్‍కు భారీగా వరద నీరు చేరింది. చెరువు కట్టకు ముప్పు ఉందని భావించి దాని గేట్లు ఎత్తేయడంతో వరద నీరు నగరాన్ని ముంచెత్తింది. అప్పట్లో అదో పెద్ద సంచలనంగా మారింది. ఆ తరువాతి కాలంలో మూసీ వరద కాకున్నా పట్టణ వరదలు ప్రధాన సమస్యగా మారాయి. హైదరాబాద్‍ అని మాత్రమే గాకుండా దేశవ్యాప్తంగా కూడా పట్టణ వరదలు నేడు ప్రధాన సమస్యగా మారాయి. ఇలాంటి వరదలను తట్టుకునేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఆ మేరకు మౌలిక వసతులు అధికం చేసుకోవాలి.


సమస్యల వలయంలో నగరం
హైదరాబాద్‍ నగరం నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాకాలంలో కాల్వలుగా మారుతున్న రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం, పెరిగిపోతున్న ట్రాఫిక్‍, వాహన కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం, మంచి నీటి సమస్య, డ్రైనేజీ ఇక్కట్లు, ప్రజా రవాణా, మూసీ నది కలుషితం కావడం… మూసీ తీరంలో ఆక్రమణల తొలగింపు ఇలా చెబుతూ పోతే…ఇక ఈ జాబితాకు అంతు ఉండదు. ఈ తరహా సమస్యలు ఎన్ని ఉన్నా… వాటిలో చాలా వాటిని పరిష్కరించేది హైదరాబాద్‍ కు చక్కటి ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ ప్లాన్‍ మాత్రమే. ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అధికారులు చేయాల్సింది ఎంతో ఉంది. అదే సమయంలో ప్రజలు చేయాల్సింది కూడా మరెంతో ఉంది. ఇవన్నీ ఇప్పుడు చర్చకు రావాల్సిన అవసరం ఉంది.


ప్రపంచపటంలో హైదరాబాద్‍
కుతుబ్‍ షాహీల కాలం నుంచి కూడా హైదరాబాద్‍ ప్రపంచపటంలో ఒక విశిష్ట స్థానం పొందింది. అప్పట్లో అది వజ్రాలకు పేరొందింది. ఆ తరువాతి కాలంలో నిజాంల హయాంలో ఆధునికత దిశగా అడుగులు వేసింది. ఇటీవలి చరిత్రకు వస్తే… దశాబ్దాలుగా యావత్‍ దేశంలో పేరొందిన ఐటీ హబ్‍ గా వెలుగొందుతోంది. తాజాగా ఫార్మా, ఎడ్యుకేషన్‍… ఇలా మరెన్నో రంగాల్లో దూసుకెళ్తోంది. ఇవన్నీ నగరానికి గర్వకారణాలే అనడంలో సందేహం లేదు. దశాబ్దాలుగా సాధిస్తూ వచ్చిన అభివృద్ధి తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా యావత్‍ దేశం నుంచి భారీగా వలసలకు కూడా కారణమైంది. దాంతో ఊహకు అందని విధంగా నగరం విస్తరించింది.నగర జనాభా కూడా ఎన్నో రెట్లు పెరిగిపోయింది. మొత్తం మీద నగరం విశ్వనగరంగా మారిపోయింది. మరి ఆ స్థాయిలో వసతులు కల్పించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నగరంలో తాగునీటి సదుపాయాలు వ•ద్ధి చెందాయి. మరో యాభై ఏళ్ల దాకా సరిపడా వసతులు కల్పించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. హైదరాబాద్‍ జనాభా 3 కోట్లకు చేరుకున్నా ఢోకా లేని విధంగా తాగునీటి వసతులు మెరుగుపర్చినట్లుగా మంత్రి కేటీఆర్‍ చెబుతున్నారు. రహదారులు కూడా వృద్ధి చెందాయి. ఓ.ఆర్‍.ఆర్‍,… ఇలా ఎన్నో వచ్చాయి, ఆర్‍.ఆర్‍.ఆర్‍ వస్తున్నాయి. ఫ్లై ఓవర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎయిర్‍ పోర్ట్, మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నాలాల పై కూడా ప్రభుత్వం ద•ష్టి సారించింది. నాలాల అభివృద్ధికి సుమారు 1000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.


శరవేగంగా విస్తరణ….
హైదరాబాద్‍ దశదిశలా శరవేగంగా విస్తరిస్తోంది. చుట్టుపక్కల ఒక్కో వైపు 50 కి.మీ. దాకా నగరంలో కలసిపోయింది. 100 కి.మీ. దూరం దాకా రాజధాని విస్తరణ ప్రభావం పడుతోంది. రాబోయే రోజుల్లో మంచిరేవుల నుంచి ఘట్‍ కేసర్‍ దాకా మూసీ మీదుగా రూ.10 వేల కోట్ల వ్యయంతో ఓఆర్‍ఆర్‍, విమానాశ్రయంతో పాటు, ఇతర ప్రాంతాలను కలుపుతూ ఎక్స్ ప్రెస్‍ వే కూడా రానుంది. ఇది ఒక్కటే కాదు. నగరానికి నాలుగు వైపులా సుమారుగా 100 కి.మీ దాకా ఇదే తరహా అభివ•ద్ధి కనిపిస్తోంది. నగరం నడిబొడ్డు అనే పదానికి అర్థం మారిపోయింది. శివారు ప్రాంతాల్లోనూ ఎక్కడికక్కడ కొత్త కొత్త సెంటర్లు ఏర్పడుతున్నాయి. పాతబస్తీలోనూ రోడ్డు నెట్‍ వర్క్ పెరుగుతోంది. చార్మినార్‍ పెడెస్ట్రియన్‍ ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నవి. వివిధ ప్రాంతాల్లో ఫుట్‍ ఓవర్‍ బ్రిడ్జ్ లు, జంక్షన్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. మూసీ నదిపై 14 కొత్త వంతెనలు రాబోతున్నవి. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. కొత్తవి రూపుదిద్దుకుంటున్నాయి. శాంతిభద్రతలు బాగానే ఉన్నాయి. పెట్టుబడులు కూడా అధికంగా వస్తున్నాయి. ఇవన్నీ మనకు సానుకూల సంకేతాలే అనడంలో సందేహం లేదు. అభివృద్ధి, సమస్యలు… ఈ రెండూ వెలుగునీడల్లాంటివి. ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాల్లాంటివి. అభివ•ద్ధికి పట్టం కట్టడం సరే… దాంతో పాటుగా సమస్యల పరిష్కారానికి కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉంది.


సమగ్ర మాస్టర్‍ ప్లాన్‍ తక్షణావసరం…
ఏ నగరానికైనా మాస్టర్‍ ప్లాన్‍ అత్యంత కీలకం. చండీగఢ్‍ లాంటి నగరాలు ఈ మాస్టర్‍ ప్లాన్‍ల తోటే ప్రపంచవ్యాప్తంగా బాగా పేరొందాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‍ ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ ప్లాన్‍ రూపకల్పన, అమలు విషయంలో కూడా ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. రాబోయే 50 ఏళ్లను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1975 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివిధ సంస్థల ద్వారా హైదరాబాద్‍ కు 6 మాస్టర్‍ ప్లాన్లు వచ్చాయి. వాటిని కలిపి ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ ప్లాన్‍ అమలు చేయాలి. మాస్టర్‍ ప్లాన్‍ లేకుండా క్రమబద్ధమైన అభివృద్ధి సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించాలి. ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ ప్లాన్‍ ను అమలు చేయడం ఓ పెద్ద సవాలు కానుంది.


ప్రజారవాణాకు పట్టం కట్టాలి….
హైదరాబాద్‍ నగరం ఎదుర్కొంటున్నసమస్యల్లో వాహన కాలుష్యం, ట్రాఫిక్‍ రద్దీ ముఖ్యమైన అంశాలుగా మారిపోయాయి. వీటిని నివారించేందుకు ప్రజా రవాణా ఒక్కటే మార్గం. అందులోనూ గ్రీన్‍ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఎలక్ట్రిక్‍ బస్సులు, కార్లు, స్కూటర్ల వినియోగం పెరగాలి. ప్రజారవాణలో ప్రజలకు ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణ సౌకర్యం కల్పించడం మాత్రమే కాదు… చివరి అంచె దాకా ఆ ప్రయాణం సజావుగా సాగేలా కూడా చూడాలి. అప్పుడు మాత్రమే ప్రజా రవాణా విజయవంతమవుతుంది. అలా గాకుండా సగం దూరం వరకే ప్రజా రవాణా… ఆ తరువాత ఇతరత్రాగా వెళ్లాల్సి వస్తే…. ప్రజలు సొంత వాహనాలపైనే మక్కువ చూపుతారు. అందుకే చివరి అంచె ప్రయాణాలకు అనువైన ఏర్పాట్లు కూడా చేయాలి. రెండవ దశ MMTS వ్యవస్థను మరింతగా విస్తరించాలి. దాంతో పాటుగా ఇప్పటికే ఉన్న లోకల్‍ రైల్‍ లాంటి వాటిని అభివృద్ధి చేయాలి. నగరానికి ఎన్ని ప్లస్‍ పాయింట్లు ఉన్నా… మైనస్‍ పాయింట్లు సైతం అదే విధంగా ఉంటున్న విషయాన్ని కూడా అధ్యయనం చేయాలి. అభివ•ద్ధి చెందుతున్న క్రమంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మెట్రో రైలు రాగానే…. సంబంధిత పార్కింగ్‍ సమస్య తలెత్తింది. ఇలా ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టినా సంబందిత సమస్యలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఆయా సమస్యల కారణంగా అభివ•ద్ధి ఫలాలు అందకుండా పోతాయి. ఈ విషయాన్ని కూడా అధికారులు గమనించాలి.


డ్రైనేజీ సదుపాయాల మెరుగు
నగరం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ, వరదనీళ్లు. ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని స్థానికంగా వినియోగించుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. మిగులు నీటిని (శుద్ధి అయినవి మాత్రమే) స్థానిక చెరువుల్లోకి, మూసీనదిలోకి పంపించేలా చూడాలి. వరద నీటి కాల్వల నిర్వహణను పటిష్ఠం చేయాలి. కొత్త వాటిని నిర్మించాలి. ఈ తరహా చర్యలకు కాల నిర్దేశిత ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయాలి. కనీసం ఓ ఐదేళ్లలోగా ఈ పనులు పూర్తయ్యేలా చూడాలి. అంతేగాకుండా… వాన నీటిని ఒడిసిపట్టి అవసరాలకు వినియోగించుకునేలా చేయాలి. ఈ విషయంలో అవసరమైతే భవన నిర్మాణ నిబంధనలను మరింత కఠినం చేయాలి. నేడు జీహెచ్‍ఎంసీ పరిధిలో వందల చెరువులు ఉన్నాయి. వాటి పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలను అరికట్టాలి. కురిసిన వర్షం నీరు చెరువుల్లోకి, మూసీ నదిలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ఘనవ్యర్థాల సేకరణ, సెపరేషన్‍, రీసైకిల్‍ చేయడం పుంజుకోవాలి. చెత్త నుంచి సైతం డబ్బు సంపాదించే అవకాశం ఉంది. దీనిపై అవగాహన కల్పించాలి. తద్వారా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెంపొందించవచ్చు. అంతకన్నా ముఖ్యంగా చెత్త సమస్య నుంచి నగరానికి విముక్తి కల్పించవచ్చు.


కౌంటర్‍ మాగ్నెట్ల వ•ద్ధి
హైదరాబాద్‍ జనాభా ఇప్పటికే కోటి దాటింది. మొత్తం తెలంగాణ జనాభాతో పోలిస్తే… నాలుగో వంతు జనాభా ఈ నగరంలోనే ఉన్నట్లయింది. ఆ లెక్కన చూస్తే మాత్రం హైదరాబాద్‍ నగర అభివృద్ధికి ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించినా తక్కువే అనిపించడం ఖాయం. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. జనాభా ఒక స్థాయికి మించి పెరగడం ఏ నగరానికైనా మంచిది కాదు. నగరాల పతనానికి అదే ముఖ్య కారణం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని సమస్యలకూ జనాభా పెరుగుదలనే కారణమవుతోంది. అందుకే వలసలను నివారించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాజధానికి 100 కి.మీ. వెలుపల కౌంటర్‍ మాగ్నెట్స్ గా వివిధ చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలి. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాలి. తద్వారా చిన్నపాటి ఉపాధి అవకాశాలు, విద్యావకాశాల కోసం హైదరాబాద్‍ కు ప్రజలు వలస రాకుండా చూడవచ్చు. దాంతో అత్యున్నత స్థాయి నిపుణులు మాత్రమే నగర అవసరాలకు అనుగుణంగా నగరానికి వచ్చేందుకు వీలవుతుంది. రాష్ట్రంలోని ఇతర పట్టణాలను సైతం హైదరాబాద్‍ కు దీటుగా అభివ•ద్ధి చేసినప్పడు మాత్రమే హైదరాబాద్‍ పై ఒత్తిడి తగ్గుతుంది. మరింత నాణ్యమైన రీతిలో విశ్వనగరంగా వృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుంది. నేడు జాతీయంగా, అంతర్జాతీయంగా వివిధ రకాల సూచీల్లో హైదరాబాద్‍ నగరం ప్రముఖ స్థానాలు సాధిస్తోంది. ఇది హర్షణీయం. ఈ రోజున హైదరాబాద్‍ యావత్‍ దేశపు గ్రోత్‍ ఇంజిన్లలో ఒకటిగా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేందప్రభుత్వం కూడా హైదరాబాద్‍ నగరానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయాలి. మరీ ముఖ్యంగా ప్రజా రవాణా, డ్రైనేజీ వ్యవస్థ వసతులు మెరుగుపరిచేందుకు ముందుకు రావాలి.


చారిత్రక భవనాల పరిరక్షణ
హైదరాబాదు నగరంలో నేటికీ ఎన్నో చారిత్రక భవనాలు వారసత్వ జాబితాలోకి ఎక్కవలసి ఉన్నాయి. అలాంటి వాటిని పరిరక్షించు కోవాలి. కనీసం 5 లేదా 6 ప్రాంతాలు UNESCO గుర్తింపు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ పక్రియను వేగవంతం చేయాలి.


ప్రజల భాగస్వామ్యం ముఖ్యం

భవిష్యత్‍ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని… కాంక్రీట్‍ జంగిల్‍గా మారిన నగరాన్ని ఆకుపచ్చ నగరంగా మార్చడంపై తెలంగాణ ప్రభుత్వం ముందడుగు శుభసూచికంగా భావించవచ్చు. హరితహారం 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‍రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణ మొత్తంలో (తెలంగాణ భూభాగంలో 33%) మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2023, జూన్‍ నాటికి రూ. 10,822 కోట్లు ఖర్చు చేసి 273.33 కోట్ల మొక్కలు నాటింది. 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు జరిగింది. 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్‍ ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. 1,00,691 కిలోమీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు విస్తరించుకొని ఉన్నాయి.
‘నేను నిర్మించిన నగరం చేపలతో నిండిన మహా సముద్రంలా ఉండాలి’ అని అప్పట్లో కులీ కుతుబ్‍ షా కోరుకున్నారు. అది నిజమైంది. నగరం జనసంద్రమైంది. ఇప్పుడు కావాల్సింది ఆ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మరింతగా అందించడం. ఈ విషయంలో ప్రభుత్వం తాను చేసేది తాను చేస్తుంది. అదే సమయంలో ప్రజలు సైతం ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. నగరంలో నివసించే ప్రతి వ్యక్తి కూడా నగరాభివ•ద్ధికి తాను ఏం చేయగలననే విషయం ఆలోచించాలి. రోడ్లపై చెత్త పడేయకుండా ఉండడం కావచ్చు… ఇంట్లో తడి, పొడి చెత్త వేరు చేయడం కావచ్చు… ప్రజా రవాణాను వినియోగించడం కావచ్చు… ఇలానే మరెన్నో… ఇలా ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడు మాత్రమే అభివృద్ధి ఫలితాలు అందుకోగలుగుతాం. ఆ దిశలో ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ లాంటి సంస్థలెన్నో కృషి చేస్తున్నాయి. ఇక ముందు కూడా కొనసాగిస్తాయి.


శీతోష్ణస్థితి మార్పుల ప్రభావం
హైదరాబాద్‍ నగరం కూడా శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి లోనైంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మరి ఇలాంటి శీతోష్ణస్థితి మార్పులను తట్టుకునేందుకు నగరం సిద్ధంగా ఉన్నదా అనేదే ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్నగా మారింది. పరిస్థితి ఇలానే కొనసాగితే… 115 ఏళ్ల క్రితం వలె వరదలు మరోసారి నగరాన్ని ముంచెత్తే పరిస్థితి కూడా పొంచి ఉంది. దశాబ్దాల పాటు పోరాడి మనం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాంటి రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్‍ను యావత్‍ దేశానికే తలమానికంగా తీర్చిదిద్దు కోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ప్రత్యేక రాష్ట్రం సాధించడం అందుకు ఓ చక్కటి అవకాశాన్ని మనకు అందించింది. రాష్ట్రం ఏర్పడి కూడా దశాబ్దం కావస్తోంది. సాగునీరు, తాగునీరు లాంటి అంశాలను చాలా వరకు పరిష్కరించుకో గలిగాం. ఎన్నో సంక్షేమ పథకాలు అమలవు తున్నాయి. రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. ఇదే సందర్భంలో హైదరాబాద్‍ నగరంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఐటీ, ఫార్మా లాంటి రంగాల్లో సాధించిన అభివృద్ధి వెనుకడగు వేసే ప్రమాదం కూడా ఉంది. ఐటీ హబ్‍గా పేరొందిన బెంగళూరు నగరం కావచ్చు… లేదంటే… దేశ ఆర్థిక రాజధానిగా ప్రఖ్యాతి చెందిన ముంబై కావచ్చు… అలాంటి నగరాలు ఇటీవలి కాలంలో మౌలిక వసతుల కొరతకు గురయ్యాయి. అలాంటి పరిస్థితి మన హైదరాబాద్‍కు రాకుండా తక్షణమే నడుం బిగించాలి. శీతోష్ణస్థితి మార్పులు తీవ్రతరం కాకుండా ఉండేం దుకు వ్యక్తి స్థాయి నుంచి మన ప్రయత్నాలను మొదలుపెడుదాం.


పొరపాట్లు జరుగకుండా…
నగరాభివృద్ధి అనగానే కొన్నిసార్లు అధికారులు అత్యుత్సాహంతో పొరపాట్లు కూడా చేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో పొరపాట్లు జరిగినట్టు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, చారిత్రక వారసత్వ కట్టడాల సంరక్షణ లాంటివన్నీ కలసికట్టుగా కొనసాగాలి. ఏ ఒక్కదాన్నీ విడివిడిగా చేయాలనుకోవడం సాధ్యం కాదు. అలాంటి సమగ్ర ప్రణాళికలతో ముందుకెళ్లడం నేటి తక్షణావసరం.


-ప్రొఫెసర్‍. మణికొండ వేదకుమార్‍,
ఎ: 9848044713,

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *