ఆకుపచ్చ నగరం… హరిత హైదరాబాద్‍

ప్రకృతి సమవాది. తను ఇవ్వదగిన ప్రతిదీ సృష్టిలోని ప్రతి జీవరాశికీ అవసరాలకి అనుగుణంగా అందించగల వర ప్రసాదిని. జీవరాశులన్నిటిలో తెలివైనవాడుగా పరిగణించ బడుతున్న మనిషి ‘ప్రకృతి తన ఒక్కడిదే’ అన్న భావనతో అవసరానికి మించి వినియోగించటంతో జీవ వైవిధ్యం దెబ్బ తినడమే కాక, ప్రకృతిలో సమతుల్యతకి విఘాతం ఏర్పడుతుంది. దీని వల్ల ప్రకృతి విపత్తులు వేగంగా వెంట వెంటనే తోసుకొస్తున్నాయి. మానవాళి అవసరాలకి అనుగుణంగా ప్రకృతిని క్రమబద్ధంగా వినియోగించుకోగల విజ్ఞత నేటి తక్షణ అవసరం.


హైదరాబాద్‍ నగరం నేడు ప్రకృతిపరంగా ఎన్నో సమస్యలను ఉమ్మడి రాష్ట్ర పరిపాలనా తప్పిదాలతో ఎదుర్కొంటుంది. చిన్నపాటి వర్ష మొచ్చినా రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. డ్రైనేజి నీటితో భూగర్భజలాలు విషపూరిత మవుతున్నాయి. వరదలతో ప్రాణనష్టం, ధన నష్టం తరచుగా చూస్తున్నాం.


ఐటి, ఫార్మా, విద్యారంగాల్లో హైదరాబాద్‍ దూసుకెళ్తుంది. వైద్య, విద్య, ఉపాధి అవకాశాలు ఇక్కడ కేంద్రీకృతమవటం వలన తెలంగాణా నుంచే కాక, ఇతర ప్రాంతాల నుంచి వలసలు పెరిగాయి. ప్రజా రవాణా సౌకర్యాలు అవసరమైనంత పెరగనందున వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరిగింది. దీనితో ట్రాఫిక్‍ రద్దీ పెరిగింది. ఇంధనం వాడకం పెరిగింది. వాయుకాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగాయి. శరవేగంతో వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజల జీవనంలోని పలు అంశాలను ప్రభావితం చేస్తున్నాయి.


అభివృద్దీ, దానితో సమస్యలు ఎంత సహజమో సమస్యలూ, వాటి పరిష్కారాలు అంతే సహజంగా కలిసి ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మన చేతుల్లోనే ఉంది.


హైదరాబాదుకు ఉద్యానవనాలు, మెట్ల బావులు, వారసత్వ కట్టడాలు, చెరువులతో పురావైభవం తేవాలి. ఆకుపచ్చనగరంగా రూపుదిద్దాలి. తెలంగాణా ప్రభుత్వం ఈ దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం ఆహ్వానించ దగ్గ విషయం.


ప్రజారవాణాభివృద్ధికి ఎలక్ట్రికల్‍ బస్సులు, స్కూటర్లు, కార్లు వినియోగంలోకి తేవాలి. వీమీ• వ్యవస్థను మరింతగా విస్తరించాలి. అనుసంధాన రహదారులు నిర్మించాలి. దీని వలన ట్రాఫిక్‍ రద్దీ, వాయు, శబ్ద కాలుష్యాలను నివారించవచ్చు.


డ్రైనేజీ, వరదనీటిని ఎక్కడికక్కడ శుభ్రపరచి, ఆ నీటిని స్థానిక చెరువుల్లోకి, మూసీలోకి మళ్ళించాలి. వర్షపు నీటిని ఒడిసి పట్టి, నగరంలోని వందల చెరువులకి మళ్ళించాలి. నీటి వృధా, నీటి కాలుష్యం తగ్గించొచ్చు. నగరం మీద వలసల వొత్తిడి పెరగకుండా 100 కి.మీ. దూరంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలను కౌంటర్‍ మ్యాగ్‍నెట్లుగా అభివృద్ధి చేయాలి. అక్కడ విద్యావకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తే వలసలు తగ్గిపోతాయి.


సుదీర్ఘ భవిష్యత్తు ప్రయోజనాలకు భరోసానిచ్చే మౌలిక వసతులతో కూడిన సిటీ మాస్టర్‍ ప్లాన్‍ రూపొందించుకోవాలి. 1975 నుండి ఇప్పటి దాకా ఆరు మాస్టర్‍ ప్లాన్స్కి రూపకల్పన జరిగింది. వాటిని సమన్వయ పరుచుకుంటూ ఒక సమగ్రమయిన హైదరాబాద్‍ ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ ప్లాన్‍ రూపకల్పనకు, అమలుకు ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాలి. ఏ పాలితుడూ అధికారీ ఉల్లంఘించటానికి వీల్లేని విధంగా చట్టసభలో బిల్లు పెట్టి ఆమోదింపచేయాలి.
హైదరాబాద్‍ అందమయిన,ఆరోగ్యదాయకమయిన, సామర్థ్యపూర్వకమయిన నగరంగా రూపుదిద్దుకోవటం, స్థిరపడటం ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ప్లాన్‍ అమలు ద్వారానే సాధ్యపడుతుంది.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *