ఇటీవల హైదరాబాద్ సమీపంలో రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ‘4 పర్ 1000’ పేరిట ఆసియా పసిఫిక్ ప్రాంతీయ సదస్సు జరిగింది. కన్హా శాంతివనంలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖామాత్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారని పత్రికలలో వచ్చింది. మంత్రులన్న తరువాత అనేక సదస్సులలో, సమావేశాలలో పాల్గొనవలసి వస్తుంది. అదంత ముఖ్యమైన విషయం కాకపోవచ్చు కాని, ఆ సదస్సులో నిరంజన్‍రెడ్డి మాట్లాడిన విషయాలు, ప్రస్తావించిన అంశాలు ఎంతో ముఖ్యమైనవి, విలువతో కూడినవి. మనమందరం ఆలోచించవలసినవి కూడా. వాటి ప్రాధాన్యం ఎంత ఉందంటే అవి మనం అనుదినం చర్చించాల్సినవి, ఆచరించాల్సినవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పర్యావరణ ప్రేమికుడు, పర్యావరణ వేత్త అయిన వ్యక్తి వ్యవసాయశాఖకు మంత్రిగా ఉండటం చాలా సంతోషించదగిన విషయం. నిజంగా ప్రభుత్వానికి ఒక దీర్ఘకాలిక దృష్టి, దార్శనిక శక్తి ఉందనే విషయాన్ని నిరంజన్‍రెడ్డి ముఖ్య అతిథిగా పేర్కొన్న మాటలు రుజువు చేస్తున్నాయి.
ఇంతకీ నిరంజన్‍రెడ్డి మాట్లాడిన విషయం ఏమంటే భూగోళ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని చెప్పారు. భూమిని కాపాడుకోవటం అందరి బాధ్యత అన్నాడు. అంతేకాదు ‘‘భూమిపై నివసించే వైవిధ్యమైన సూక్ష్మజీవులు, కీటకాలు, జంతువులు, మనుషులు, భవిష్యత్తులో మనుగడ సాగించేందుకు భూగోళాన్ని సంరక్షించాలని’’ కోరారు. మరొక పత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఆయన మాటలు ఈ విధంగా ఉన్నాయి. ‘‘నీరు, పోషకాలతో కూడిన మట్టి అటు వాతావరణాన్ని నియంత్రించడమే కాకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకూ సాయపడుతోందని చెప్పాడు’’ దీనిని మరికొంత వివరిస్తూ ‘‘వివిధ కారణాల్ల వల్ల ప్రపంచ వ్యాప్తంగా మట్టిసారం తగ్గిపోతుండటం, సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం మానవాళి మనుగడకు ముప్పు కలిగించేవని’’ ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారభద్రత, పర్యావరణ సమతుల్యతలకూ ప్రమాదకరంగా మారిన ఈ సమస్యను పరిష్కరించేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నాడు’’ మానవ మనుగడకు ఏర్పడిన ముప్పు ఏ ప్రమాద ఘంటికలు మ్రోగిస్తూ ఉందో నిరంజన్‍రెడ్డి సంక్షిప్తంగానే కాదు సమగ్రతతో కూడా చెప్పారు. భూసారం తగ్గిపోవటం వల్ల ఏర్పడబోయే సంక్షోభాల గురించి కూడా నిరంజన్‍రెడ్డి ప్రస్తావన చేయటం గమనించదగింది.
అయితే పత్రికలు ఈ వార్తకు ఇచ్చిన ప్రాధాన్యం చూస్తే కొంత విచారం కూడా కలుగుతుంది. ఒక పత్రిక ఎందుకో ప్రాధాన్యం ఇచ్చింది. నిజానికి మీడియా పర్యావరణ సంబంధ వార్తలకు అన్ని సందర్భాలలో ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వదనేది వాస్తవం. అందుకు మీడియాను తప్పు పట్టాల్సిన పనిలేదు కాని, తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని మాత్రం చెప్పక తప్పదు. కొన్ని పత్రికలు ఇందుకు మినహాయంపు కావచ్చు. అయినప్పటికీ పర్యావరణ సంబంధం గల వార్త అయినా అది పతాక వార్తగానే రావాల్సిన అనివార్యత ఈనాడు ఉందనేది కూడా అంతే సత్యం.
భూగోళ పరిరక్షణ, భూసార సంరక్షణ గురించి గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఎంతోమంది మాట్లాడుతున్నారు. ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమకారిణి వందనాశివ తన జీవితకాలం మొత్తాన్ని పర్యావరణం గురించిన సమస్యలకే వెచ్చించింది. ఆమె వాతావరణ మార్పులు, పర్యావరణ సంక్షోభాలు, విధ్వంసాల గురించి రాస్తూనేఉన్నారు. 2008లోనే క్లైమేట్ ఛేంజ్, పీక్ ఆయిల్, ఆహారభద్రతల గురించి ‘సాయిల్‍శాట్ ఆయిల్’ అనే పుస్తకం రాసింది. ‘సేవ్ సాయిల్’ నినాదంతో నేలను, భూసారాన్ని కాపాడుకొనే విషయంగా జగ్గీవాసుదేవ్ చైతన్య, అవగాహనల కోసం కృషి చేస్తూనే ఉన్నారు.
వందనాశివ పర్యావరణవేత్త, ఉద్యమ కార్యకర్త. జగ్గీవాసుదేవ్ స్వచ్ఛంద సేవకుడు అనవచ్చునా? అంతకు మించి ఆయన కృషి ఏదో ఉత్తమ మానవ సమాజ నిర్మాణం కోసమో, శాంతి, సుస్థిరతల కోసమో ఉద్యమతుల్యంగా బహుముఖాలుగా తన కార్యక్షేత్రాన్ని విస్తరించుకొని కృషి చేస్తున్నారు.
వ్యవసాయ మంత్రి నిరంజన్‍రెడ్డి, వందనాశివ, జగ్గీవాసుదేవ్ భూగోళం విషయంగా ఒకే విధమైన అవగాహన కలిగి ఉన్నారు. ఒక విధంగా నిరంజన్‍రెడ్డి మిగతా ఇద్దరి కంటే భిన్నమైన స్థానంలో ఉన్నారు. విధాన నిర్ణయాధికారం వారికి ఉంది. ఎటువంటి నిర్ణయాలు, విధాన పరంగా చేయాలో సూచించగల అవగాహనా శక్తి వందనా శివకు ఉంది. సరైన విధాన నిర్ణయాలు వాటి అమలులో లోటుపాట్లు విషయంగా పాలనను, పాలక వర్గాలను ఇబ్బందులలోకి నెట్టివేయగల శక్తి, సమర్థతలు కూడా వందనాశివ స్వంతం. ఎన్నో గ్రంధాలు కూడా రాసింది. మేనిఫెస్టోస్ ఆన్ ది ఫ్యూచర్ ఆఫ్ పుడ్ & సీడ్స్ (2007), ఎర్త్ డెమోక్రస్ : జస్టిస్ సస్టైయినబిలిటీ అండ్ పీస్ (2005), గ్లోబలైజేషన్స్ న్యూ వార్స్ : సీడ్, వాటర్ అండ్ లైఫ్ ఫార్మస్ (2005), వాటర్ వార్స్ : స్రైకేట్రేజేషన్, సొల్యూషన్ అండ్ ప్రాఫిట్ (2002), స్టోరెన్ హార్వెస్ట్ : దిహైజానింగ్ ఆఫ్ ది గ్లోబల్ ఫుడ్ సప్లై (2000) లాంటి గ్రంధాలు ఆమె పర్యావరణ ఆలోచనా శీలిగా ఉద్యమకారిణిగా ఆమె భావజాల దృష్టికోణాన్ని పట్టి ఇస్తాయి.
నిరంజన్‍రెడ్డి ముఖ్య అతిథిగా చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలు, వందనాశివ ఆలోచనలు నేల విషయంగా జగ్గీవాసుదేవ్ నినాద సారాంశం ఒక్కటే. భూమిని కాపాడుకొనే మార్గాలు, ఆహారభద్రత, సుస్థిర భవిష్యత్తు. ఈ మూడు పర్యావరణ సమతుల్యత సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. ఇవి సమిష్టి ప్రయత్నాలు పర్యావరణం పట్ల బాధ్యతగా చేపడితేనే సుకదమవుతాయని చెప్పవచ్చు.
తన గ్రంథం సాయిల్ శాట్ ఆయిల్‍తో వాతావరణ మార్పులు, పీక్ ఆయిల్, ఆహార ఆభద్రత అనే మూడు భావనలు గురించి ప్రధానంగా మాట్లాడింది. గత రెండు వందల ఏళ్లుగా ప్రపంచం శిలాజ ఇంధనాల మీద ఆధారపడి నడిచింది. కార్బన్ ఉద్గారాలు ఇచ్చిన గ్రీన్‍హౌజ్ ప్రభావం గ్లోబల్‍వార్మింగ్‍కు కారణం. ఇది వాతావరణ సంక్షోభాలకు దారి తీసింది. ఉష్ణోగ్రతలు 3 నుండి 5 డిగ్రీల సెల్సి వరకు పెరగనున్న ఫలితంగా ధృవాల మంచు కరిగి వరదలు, కరువు, క్షామం, తుఫానులు సంభవిస్తాయి. వీటిని మనం చవి చూస్తూనే ఉన్నాం. ఉష్ణోగ్రతలు పెరగటాన్ని మనం ఆపకపోతే వాతావరణ సంక్షోభం మనం జీవించడాన్ని నాటకీయంగా మార్చి వేస్తుంది.
మనం జీవించి ఉందామా? అంతరిద్దామా? అనేది మన ముందున్న ప్రశ్న. ఇక రెండవది వాతావరణ వ్యవస్థ సమస్యకు తోడుగా పీక్ ఆయిల్ అనేది ఒకటి. ఆయిల్‍ను అవసరమైన దానికంటే అధికంగా తోడివేశాం. ఆయిల్ ఉత్పత్తి గరిష్ఠ స్థాయికి చేరింది. ఇక దీని తరువాత ఆయిల్ ఉత్పాదన తగ్గుతుంది. ఫలితంగా ధరలు పెరుగుతాయి. ఈ ఆయిల్ ధరల పెరుగుదల 2008 నుంచే మొదలైన సంక్షోభం. ఫలితంగా మనం సమాజాన్ని సరికొత్తగా మార్చుకోవాలి. టెక్నాలజీ, ఆర్థికంగా కూడా మార్పుకు గురి కావలసిందే. ఫలితంగా జీవన విధానాలు కూడా ఇంధనానికి అతీతంగా ప్రత్యామ్నాయాలు కావాలి.
ఈ రెండూ కలిసి మూడవ సంక్షోభానికి కారణంగా నిలిచాయి. అదే ఆహార సంక్షోభం. ఆహార సంక్షోభం ఉత్పన్నం కావడానికి కారణం వ్యవసాయంలో ప్రపంచీకరణ, పారిశ్రామీకీకరణం ఉమ్మడి ప్రభావమేనని వందనాశివ పేర్కొంటున్నది. ఏయేశక్తులు, పరిక్రమాలు తక్కువ ఖర్చుతో ఆహారం అందుతుందని వాగ్దానం చేశాయో అవే శక్తులు ఆహారాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నాయని ఆమె వాదన. ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరుగుతున్నాయి. పలు దేశాలలో ఆహారం అందుబాటులో లేకపోవటం వల్ల ఆహారం కోసం దాడులూ జరుగుతున్నాయి, జరిగాయని కూడా ఆమె సూచిస్తున్నది. వాతావరణంలో మార్పులు, గ్లోబల్‍వార్మింగ్ మానవజాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. వాతావరణం మార్పులు పీక్ ఆయిల్, గ్లోబలైజేషన్ ప్రభావం పేదల ఆహార హక్కు, జీవించే హక్కు మీద ప్రభావం చుపుతున్నాయి.
బాధ్యత గల వ్యవసాయ శాఖా మంత్రిగా ఈ అంశాలు నిరంజన్‍రెడ్డి అవగాహనలో ఉన్నవే కనుక ఆయన జీవవైవిధ్యం భూసారం, ఆహారభద్రత, పర్యావరణ సమతుల్యత లాంటి విషయాలను నొక్కి మరీ చెప్పారు.
ఇవాళ అందరి దృష్టీ మట్టి సారాన్ని, భూగోళాన్నో కాపాడటం మీద లేదు. సరికదా కార్ల మీదకు మరలి ఉంది. ఆటోమొబైల్ విప్లవం అసంఖ్యాక ప్రజలు మరణాలకు కారణంగా నిలుస్తున్నది. కార్లు కూడా చంపుతున్నాయి అంటుంది వందనా శివ. ఢిల్లీ లాంటి నగరాలను ఆమె ఆధారాలతో ఉదాహరిస్తున్నది.
ఆరోగ్యపరమైన సమస్యలను ఆమె ప్రస్తావించింది. ఒక అధ్యయనం ప్రకారం 26 శాతం ఢిల్లీ వాసులు క్రోమోజోములలో మార్పులకు గురయ్యారు. ఇది కాన్సర్‍కు దారి తీయగల విషయం. వాతావరణ మార్పులకు కారణం వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం కారణం. ఢిల్లీలో 41 శాతం ఉబ్బస వ్యాధులు పెరిగాయి. 39 శాతం దీర్ఘకాల బ్రాంకైటిస్ వృద్ధి పొందింది. కార్బన్ మోనాక్సైడ్, ఇతర గాలిలో వేళ్లాడే కాలుష్యకణాలు అత్యవసర చికిత్స విభాగాల్లోకి చేరినా వారి సంఖ్యా ఆయారోజుల్లో అధికంగా పెరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉబ్బస వ్యాధి ‘మరణాలనే కాకుండా ఆర్థిక భారాన్ని కూడా పెంచుతున్నది.’ అమెరికా ఆస్త్మావ్యాధిపై 6 బిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్నది. చిన్నపిల్లలకు ఆస్త్మాచికిత్స కోసం చేసే ఖర్చు సగటున 3.2 బిలియన్లుగా ఉంది. బ్రిటన్ 1.8 డాలర్లు హెల్త్కేర్ కోసం ఖర్చు చేస్తున్నది. ఆస్ట్రేలియాలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కానీ ఆస్త్మాసంబంధిత వ్యాధుల కోసం చేసే ఖర్చు 460 మిలియన్లకు చేరుకుందిట. ఇవన్నీ 2008 నాటి గణాంకాలు మాత్రమే. ఇట్లాంటి ఇంకా అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయి.
మన జీవితాల్లో అత్యంత కీలకమైనది, అందుకు తగ్గ గుర్తింపులేని అంశం ఏదైనా ఉంది అంటే… అది మన పాదాల కింది మట్టేనని చెప్పారు నిరంజన్‍రెడ్డి. మట్టిని కాపాడుకోవటం ద్వారా మనిషిని కాపాడుకుందాం అన్నది వారి ఆకాంక్ష. భూగోళాన్ని రక్షించుకుందాం అనే ఆయన పిలుపులో ఒక ఆర్తి ఉంది, ఆవేదనా ఉంది, ఆకాంక్ష ఉంది. ఆ దిశగా అడుగేద్దాం. ఆరోగ్య తెలంగాణతో పాటు స్వచ్ఛ ప్రపంచానికి తలుపు తెరుద్దాం.
- డా।। ఆర్. సీతారామారావు
ఎ : 9866563519