నవంబర్‍ 14న బాలల దినోత్సవం


నవంబర్‍ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. బాలల దినోత్సవం అంటే.. భారత తొలి ప్రధాని పండిట్‍ జవహర్‍ లాల్‍ నెహ్రూ పుట్టిన రోజు. ఆయన జన్మదినాన్ని ‘చిల్డ్రన్స్ డే’గా నిర్వహించుకుంటారు. కాని ప్రపంచ దేశాలన్నీ నవంబర్‍ 20న బాలల దినోత్సవం జరుపుకొంటాయి.


మన దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్‍లాల్‍ నెహ్రూ. 1889 నవంబర్‍ 14న పుట్టిన నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ.
నెహ్రు ఎక్కడికెళ్లినా.. పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహపరిచేవారు. ప్రధాని కాకముందు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రుకు తన కుమార్తె ఇందిర అంటే ఎనలేని ప్రేమ. అందుకే ఆయన జైలు నుంచి ఆమెకు అనేక ఉత్తరాలు రాసేవారు. స్వతహాగా రచయిత అయిన నెహ్రు తన కుమార్తెకు రాసిన
ఉత్తరాల్లో బోలెడు మంచి సంగతులు చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? సమాజంలో మంచి, చెడులను ఎలా గ్రహించాలి? సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకషంగా వివరించేవారు.
పిల్లలకు కూడా నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. ఇష్టమైన మేనమామ/ బాబాయి అని దీని అర్థం. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్‍ 14ను ‘చిల్డ్రన్స్ డే’గా జరుపుకొంటున్నాం.


స్వాతంత్య్రానికి ముందు నవంబర్‍ 20న
స్వాతంత్య్రానికి ముందు బాలల దినోత్సవాన్ని నవంబర్‍ 20న నిర్వహించుకునేవాళ్లం. ఈ రోజున పిల్లల దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ తీర్మానించాయి. 1964 వరకు మనం కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాం. కానీ, నెహ్రు మరణం తర్వాత నుంచి నవంబర్‍ 14న నిర్వహించుకుంటున్నాం.
ఈ రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలను పంచిపెడతారు. వ్యాస రచన, క్విజ్‍ పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహం నింపు తారు. పిల్లల అరుదైన వేషధారణ కూడా ఆహ్లాదం నింపుతుంది.


చాచా నెహ్రూ చెప్పిన మంచి మాటలు
  • భయం మనలో ఎప్పటికీ ఉండకూడని విషయం. మనం ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు మనకు మద్దతుగా బోలెడు మంది ఉంటారు.
  • ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్‍.. భాష ఏదైనా సరే.. అక్షరమాల నుంచే క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏ విషయమైనా అంతే. మూలం నుంచే క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే దానిపై మనకు పట్టు వచ్చేస్తుంది. (నెహ్రూ ఇందిరతో చెప్పిన మాట ఇది.)
  • మనం కొన్ని సార్లు అబద్ధాలాడతాం. తర్వాత ఏమవుతుందోనని భయపడి పోతాం. అలా ఎప్పుడూ చేయొద్దు. మనలో ఎలాంటి రహస్యాలు దాచు కోకుండా స్వచ్ఛంగా ఉండాలి. మనం ఏ తప్పూ చేయనప్పుడు మాత్రమే అలా
  • ఉండగలం. ఏదైనా లోపల దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటే ఏదో తప్పు చేశామనో, ఎందుకో భయపడుతున్నామనో అర్థం.
  • తెలియని విషయం గురించి ఎవరితో అయినా మాట్లాడాలంటే మనకు భయంగా ఉంటుంది. కొన్ని సార్లు ఇతరులతో చర్చ వల్ల కూడా నిజానిజాలు తెలుస్తాయి. చాలా విషయాల్లో విజ్ఞానం ఇలాగేవస్తుంది.
  • మనుషులంతా సమానమే. అందులో నలుపు, తెలుపు అంటూ తేడా ఏం ఉండదు. జాతిని బట్టి మనుషులకి విలువ ఇవ్వకూడదు.
  • దేశాల చరిత్ర, గొప్ప వాళ్ల జీవిత చరిత్రలు చదవాలి. మామూలు వాళ్లంతా తమ జీవనోపాధి, తమ పిల్లలు అంత వరకే ఆలోచించుకుంటారు. అంతకు మించిన గొప్ప వాళ్ల గురించి చదివినప్పుడు, ఆలోచించినప్పుడే మనలోని గొప్ప వ్యక్తి బయట పడతాడు. మనకంటూ ఓ చరిత్రను సృష్టించుకోగలుగుతాం.


ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ కుమార్తె ఇందిరలో నెహ్రూ అమితమైన ధైర్యాన్ని నింపారు. బోలెడు విజ్ఞాన విషయాల్ని ఉత్తరాల్లో పంచుకున్నారు.

  • దక్కన్‍న్యూస్‍,
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *