నీటి బిందువు – రైతు బంధువు


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కట్టిన ప్రొజెక్టుల వలన నీటి కొరత తీరింది. అందువలన రైతులు అధిక ఆదాయం గల పంటలు పండిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడం సూక్ష్మ సేద్య పథకం (MIP) ముఖ్య ఉద్దేశం.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మైక్రో ఇరిగేషన్‍ ప్రాజెక్టు-TSMIP(తెలంగాణ సూక్ష్మ సేద్య పథకం) ద్వారా రైతులకు డ్రిప్‍ ఇరిగేషన్‍ సౌకర్యం కలిపిస్తూంది.


డ్రిప్‍ లేదా బిందుసేద్యం వలన ఉపయోగాలు:
 • డ్రిప్‍ పద్దతి ద్వారా మొక్కల నీటి అవసరాలకు అనుగుణంగా, నీరు అవసరమైనప్పుడల్లా అందించడం వలన మొక్కలు ఏపుగా, ఆరోగ్యవంతంగా పెరిగి పంట దిగుబడులు, పంట నాణ్యత పెరుగుతాయి.
 • నీటిని మొక్కలకు నేరుగా అందచేయడం వలన నీటి వృథాను అరికట్టి తక్కువ నీటితో ఎక్కువ భూమికి సేద్యపు వసతి కల్పించవచ్చు.
 • మొక్కలన్నిటికి నీరు సమంగా అందజేయడం ద్వారా పైరు మొత్తం ఒకేసారి కోతకు వస్తుంది.
 • నీటిలో కరిగే ఎరువులను, సేద్యపు నీటితోనే మొక్కలకు చిన్న చిన్న మొతాదులలో వాటి అవసరాలకు అనుగుణంగా అందజేయగలగడం (ఫెర్టిగేషన్‍) వలన ఎరువుల వృధా తగ్గుతుంది.
 • ఫెర్టిగేషన్‍ వలన వాడిన ఎరువుల సామర్ధ్యం పెరిగి ఎక్కువ దిగుబడులు పొందవచ్చు.
 • పంటకు అవసరమైన నీరు మాత్రమే మొక్కల వేర్లకు అందజేయడం వలన సేద్యపు నీరు, మోటార్ల వాడకంలో కరెంట్‍ ఆదా అవుతుంది.
 • సాంప్రదాయ సేద్య పద్దతులలో నీరు అందించేందుకు కావలసిన కాలువలు, సాళ్ళపై ఖర్చు ఆదా అవుతుంది.
 • నీటిని మొక్కల వేర్లకు మాత్రమే నేరుగా అందజేయడం వలన, పంట మొక్కలు లేనిచోట నీరు అందక కలుపు పెరగదు. ఇందువలన కలుపు తియ్యడంపై ఖర్చు ఆదా అవుతుంది.
 • ఎగుడు దిగుడు నేలలలో, పర్వత ప్రాంతాలలో డ్రిప్‍ పద్ధతి ద్వారా నేలను సాగుకు అనుకూలంగా చేయవచ్చు.
 • చౌడు లేక క్షార యుక్త భూములలో డ్రిప్‍ పద్దతి వలన నీరు ఎల్లవేళలా ఉండడం వలన మొక్క మొదళ్ళలో చౌడు తగ్గుతుంది. ఈ విధంగా అతిగా సేద్యపు నీరు వాడకుండా, నీటిని ఆదా చేయవచ్చు.

డ్రిప్‍ సిస్టమ్‍లో రకాలు :
ఆన్‍ లైన్‍ డ్రిప్‍ సిస్టమ్‍ : మొక్క మొక్కకు దూరం ఎక్కువగా ఉన్నపుడు లెటరాల్‍ పైపులపై డ్రిప్పర్లు అమర్చి ఆన్‍ లైన్‍ డ్రిప్‍ కు ఉపయోగిస్తారు. మామిడి, జీడిమామిడి, ఆయిల్‍ పామ్‍, సీతాఫలం మొదలైన పండ్ల తోటలలో ఈ రకమైన డ్రిప్‍ సిస్టమ్‍ అమర్చుతారు.
ఇన్‍ లైన్‍ డ్రిప్‍ సిస్టమ్‍ : మొక్క మొక్కకు దూరం తక్కువగా ఉన్నపుడు లెటరాల్‍ పైపులోపల అమర్చి నేలను తడపడం జరుగుతుంది. కూరగాయలు, బొప్పాయి, అరటి, చెరకు, మొక్కజొన్న, పత్తి, పసుపు మొదలైన పంటలకు ఈ రకమైన డ్రిప్‍ సిస్టమ్‍ అమర్చుతారు.
మైక్రో స్పింక్లర్‍ : మొక్కలకు, చెట్లకు తక్కువ వ్యవధిలో ఎక్కువ మోతాదులో నీరు ఇవ్వవలసినప్పుడు మైక్రో స్పింక్లర్‍ ఉపయోగిస్తారు.
మినీ స్పింక్లర్‍ : ఇవి నీటిని ఎక్కువ దూరం వెదజల్లుతాయి. ఇది తక్కువ వ్యవధిలో ఎక్కువ మోతాదులోనీటిని ఎక్కువ దూరం వెదజల్లుతాయి.


తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‍ రావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍ రెడ్డి గారు స్వతహాగా రైతులైవుండి డ్రిప్‍ ఇరిగేషన్‍ పై ప్రత్యక్ష అవగాహన కలిగి ఉండడం వలన రైతులకు అనేక మేళ్లు జరుగుతున్నాయి. రైతు బంధు, రైతు భీమాతోపాటు డ్రిప్‍ ఇరిగేషన్‍కు ప్రభుత్వం భారీ రాయితీలు కల్పిస్తుంది.

 • షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల రైతులకు – 100% రాయితీ
 • చిన్న సన్నకారు మరియు బి.సి రైతులకు -90% రాయితీ
 • ఇతర రైతులకు – 80% రాయితీ
 • పన్నెండున్నర ఎకరాలకు మించకుండా ప్రతి రైతుకు డ్రిప్‍ ఇరిగేషన్‍ సౌకర్యం కల్పించ బడుతుంది.

రైతు తను కోరుకున్న డ్రిప్‍ కంపనీద్వారా తన పొలానికి డ్రిప్‍ ఇరిగేషన్‍ సౌకర్యం కల్పించుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయానికి అనుగుణంగా ప్రతి ఆయిల్‍ పామ్‍ రైతుకు డ్రిప్‍ ఇరిగేషన్‍ అందించాలి అనే ఉద్దేశంతో 2022-23 సంవత్సరములో రాష్ట్ర వ్యాప్తంగా 82 వేల ఎకరాలలో ఆయిల్‍ పామ్‍ రైతులకు డ్రిప్‍ సౌకర్యం ఉద్యాన శాఖ ద్వారా కల్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా నదుల ప్రక్కన, సాగునీటి కాలువలు ప్రక్కన, చెరువుల ప్రక్కన ఆయిల్‍ ఇంజన్లతో సాగుచేస్తారు. అటువంటి రైతులకు TSMIP పథకం క్రింద రాయితీలు పొందే అర్హత లేదు. అట్టి రైతులకు డ్రిప్‍ ఇరిగేషన్‍ సౌకర్యం కల్పించి ప్రోత్సహించడం వలన నీటి ఆదాతో పాటు దిగుబడి అధికంగా వస్తుంది.

 • సముద్రాల విజయ్‍ కుమార్‍
  ఎ: 837444992

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *