పర్యావరణవేత్త, సామాజిక చింతనాపరుడు కెప్టెన్ జలగం రామారావు. తన 94వ ఏట అనారోగ్యంతో హైదరాబాద్‍లో మరణించారు.
ప్రత్యేకంగా పర్యావరణం,కాలుష్యం అంశాలపై పని చేసే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఖమ్మం జిల్లాలో జన్మించిన ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేశాక నౌకాదళంలో చేరారు. కెప్టెన్ స్థాయికి ఎదిగి 23 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందారు. దాదాపు రెండు దశాబ్దాలు హైదరాబాద్‍లో చిన్న మెషిన్ టూల్స్ పరిశ్రమ నడిపించారు. అందువల్ల పరిశ్రమ రంగంలో జరుగుతున్న అవక తవకలను, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని, దానిని నియంత్రించే కాలుష్య నియంత్రణ మండలి పని విధానాన్ని, ఆ సంస్థ అధికారుల్లో పేరుకుపోయిన అవినీతిని, వాళ్ల బాధ్యతారాహిత్యాన్ని చాలా దగ్గర నుంచి వీక్షించే అవకాశం లభించింది. అప్పుడే ఆయన పర్యావరణం, కాలుష్యం విషయాల్లో తన వంతుగా ఏమైనా చేయాలని సంకల్పించుకున్నట్టుగా ఉంది. తన సోదరుడు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎప్పుడూ ప్రభుత్వ గౌరవ పదవులకు, ప్రభుత్వ ఆశీస్సులకు వెంపర్లాడలేదు.
రామారావు గారు ముక్కుసూటిగా మాట్లాడే, ప్రవర్తించే వ్యక్తి. మితభాషి, నిగర్వి. హైదరాబాద్‍లో సామాజిక అంశాలతో, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, విధ్వంసం అవుతున్న పర్యావరణ ఉద్యమాల్లో మేము పని చేస్తున్న క్రమంలో రామారావు గారితో పరిచయం ఏర్పడింది. పఠాన్‍చెరువు దగ్గర రుద్రారంలో దేశంలోనే అతి పెద్ద పశువుల వ్యధశాల ఏర్పాటయింది. అల్ కబీర్ ఎక్స్పోర్ట్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఏర్పాటైన ఈ కంపెనీ పెద్ద మొత్తంలో పశుమాంసం, గొర్రె మాంసం అరబ్ దేశాలకు, జపాన్, తైవాన్ దేశాలకు ఎగుమతి చేసేది. ఈ కంపెనీ ముస్లిం మతస్తులదని, తెలంగాణ గ్రామాలలోని పశుసంపదను వినాశనం చేస్తుందని దానికి వ్యతిరేకంగా 1994లో ఒక ఉద్యమం మొదలయింది. ఆ కంపెనీని ముస్లింలు, ఉత్తర దేశానికి చెందిన జైన్ పారిశ్రామిక వేత్తలు కలిసి నిర్వహిస్తున్నారన్న వాస్తవాలను బహిర్గతపరచి, ప్రొ. కేశవరావు జాదవ్ గారు, ఆ ఉద్యమాన్ని కొత్త దిశలో నడిపారు. కరువు కాటకాలు, వ్యవసాయంలో సంక్షోభం వల్ల తెలంగాణలోని మెదక్, వరంగల్, మహబూబ్‍నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని చిన్న, సన్నకారు రైతులు తమ జీవనం గడవడానికి పశువులను అల్‍కబీర్ వ్యధశాలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే తప్ప ఈ ఫ్యాక్టరీ మూతపడదు అని ఒక నూతన దిశవైపు ఉద్యమాన్ని జాదవ్ సార్ నడిపించారు.
ఈ తరుణంలో కెప్టెన్ రామారావు గారు ఈ ఉద్యమానికి తోడుగా ఉండి తనకు తెలిసిన చాలా విషయాలను జాదవ్ సార్‍తో పంచుకునేవారు.
రామారావు గారు క్షేత్రస్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న విషయాలు నేను గమనించలేదు కాని, సమస్యలపై పిటిషన్లు సమర్పించడం, తనకు తెలిసిన పర్యావరణ అంశాలు పంచుకోవడం, న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయడం చేసేవారు.
1996లో నల్లగొండ, నాగార్జునసాగర్ పక్కనే యురేనియం తవ్వకాలు చేపట్టి, పరిశ్రమ స్థాపించాలని ప్రయత్నాలు జరిగినప్పుడు, పెద్ద ఎత్తున పర్యావరణవేత్తలు, సామాజిక సంస్థలు యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమంలో రామారావు గారు చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు నల్లగొండ మాల్ దగ్గర జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి కూడా రామారావు సార్ మాతో పాటు హాజరయ్యారు. తర్వాత దేశవ్యాప్తంగా యురేనియం వ్యతిరేక ఉద్యమాలు మొదలై ఒక జాతీయ యురేనియం వ్యతిరేక సంఘటన ఏర్పడ్డప్పుడు దాంట్లో సభ్యుడిగా ఉంటూ చివరి వరకు ఆ సంస్థతోనే ఉన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ వ్యతిరేక ఉద్యమంలో భావపరంగా పాలు పంచుకొని చాలా పిటిషన్లు పంపి ప్రజాభిప్రాయానికి బలం చేకూర్చారు.
1990లో పఠాన్‍చెరువు, రామచంద్రాపురం, ఇస్నాపూర్, బొల్లారం, పాషమైలారంలో ఏర్పాటయిన కర్మాగారాల వల్ల ఈ ప్రాంతంలోని 40 గ్రామాల్లో కర్మాగారాలు విడిచిపెట్టే రసాయన పదార్థాల వల్ల చెరువులు, కుంటలతో పాటు భూగర్భజలాలు కూడా కలుషితమయ్యాయి. పెద్దయెత్తున వ్యవసాయం దెబ్బతింది. పశువులు వ్యాధులబారిన పడ్డాయి. ఈ సమయంలో ఈ పరిశ్రమలకు వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమం వచ్చింది. పర్యావరణవేత్త ప్రొ. పురుషోత్తం రెడ్డి, రైతు నాయకుడు అల్లాని కిషన్‍రావు పూర్తిస్థాయిలో ఈ ఉద్యమంలో పాలుపంచుకొని పని చేశారు. ఆంధప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ సమస్యపై వేసిన పిటిషన్‍లకు స్పందించి స్థానిక జడ్జిని విచారించి నివేదికలు ఇమ్మని ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయంలో రామారావు సార్ నష్టాన్ని అంచనా వేసే పక్రియలో పాల్గొన్నారని మేము విన్నాం.
తెలుగు దేశం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మూసీ నది ఒడ్డున ఉన్న పేదల బస్తీలను తీసి వేసి నదీ గర్భంలో ఒక కాలువ నిర్మించి, కాలువ రెండు వైపుల వచ్చే స్థలాలపై వ్యాపార కేంద్రాలు, పార్కులు అభివ•ద్ధి చేయాలని నందన వనం ప్రాజెక్ట్ పేరుతో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు.
దీన్ని వ్యతిరేకిస్తూ బస్తీల సంరక్షణ ఆందోళన గా ప్రారంభమైన పేద ప్రజల నిరసన మూసీ బచావో ఆందోళన పేరుతో పెద్ద
ఉద్యమంగా మారి ప్రభుత్వాన్ని ప్రజల విస్తాపణపై, జరగబోయే విధ్వంసంపై చాలా ప్రశ్నలతో ప్రశ్నించింది. చంద్ర బాబు ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఆందోళనలో రామారావు సార్ చివరివరకు ఆందోళన చేస్తున్న ప్రజలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల వెంట ఉన్నారు. యురేనియం వ్యతిరేక పోరాటంలో ఆయనది విశిష్ఠ పాత్ర. యుసిఐఎల్ చైర్మన్‍తో చర్చలలో పాల్గొన్నపుడు బెదిరింపులకు దిగితే మేము సిద్ధమే అని ఎదురు నిలబడ్డారు.
హైదరాబాద్‍లోని జంట జలాశయాలకు సుప్రీమ్ కోర్టు రక్షణ తీర్పు 2000 సంవత్సరంలో సాధించిన క్రియలో ప్రొ।।ఎం.వి. నాయుడు, కెప్టెన్ రామారావు గార్లది ప్రధాన పాత్ర. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హిమాయత్ సాగర్ పరిధిలో ఏర్పాటు చేయడాన్ని రామారావు గారు ప్రశ్నించారు. రామారావు గారు కొల్లేరు సరస్సు రక్షణకు విశేష క•షి చేశారు. క•ష్ణ పట్నంలో పివిసి కర్మాగార ప్రతిపాదన తిరస్కరణకు జరిగిన ఉద్యమానికి దన్నుగా నిలిచి అక్కడ సభలలో పాల్గొని ప్రసంగించారు. ఇక్కడ కాలుష్య నియంత్రణ మండలి అనుమతి నిర్ణయాలకు వ్యతిరేకంగా చేసిన ధర్నాలో పాల్గొన్నారు. అణు విద్యుత్ వ్యతిరేక పోరాటాలకు ఆయన ఎప్పుడూ మద్దతు ఇచ్చేవారు. పర్యావరణ రక్షణ కోసం ఏర్పడ్డ సంస్థలు ఆశయాల మేరకు పని చేయడం లేదని అసంత•ప్తి పడి ప్రముఖ పర్యావరణ వేత్త, మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ బాబురావు గారితో కలిసి సుస్థిర అభివ•ద్ధి వేదిక ఏర్పాటు చేసాడు. ఆ సంస్థ దామర చర్ల క్రోమేట్ ప్లాంటు కాలుష్య సమస్యలపై పనిచేసింది. విశాఖపట్నం ఫార్మా సిటీ ఏర్పాటులో లోపాలపై అధికారులకూ, నియంత్రణ సంస్థలకూ వివరాలతో ఈ సంస్థ తరపున పిటిషన్లు రాశారు. రామారావు గారు పదేళ్ళ క్రితం వరకూ వ్యక్తిగా పర్యావరణ సమస్యలపై స్పందిస్తూనే వున్నారు అని ప్రముఖ పర్యావరణ వేత్త, మానవ హక్కుల నాయకుడు డాక్టర్ కె.బాబురావు గారు సార్‍ను జ్ఞాపకం చేసుకున్నారు.
హైదరాబాద్ పక్కనున్న జంట జలాశయాలను కాపాడేందుకు జీవో 111 తీసుకువచ్చారు. వై.ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఆదేశాలను సడలించి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అభివ•ద్ధి కోసం ప్రయత్నాలు జరిగాయి. జీవో 111 విశిష్టతను ముఖ్యమంత్రికి వివరించి, దాన్ని మార్చకుండా ఉండడానికి కె.జి.కన్నభిరాన్, ఎం.వేదకుమార్, పురుషోత్తం రెడ్డి, ఇంకా చాలామంది సామాజిక కార్యకర్తలు క•షి చేశారు. అందులో రామారావు సార్ భాగం పంచుకోవడమే కాక ఈ మధ్యనే మరణించిన మానిక్ షా దబేరాతో కలిసి కోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ కూడా వేశారు. పర్యావరణవేత్త జీవానందరెడ్డి గారి సహచర్యంలో హుస్సేన్‍సాగర్ కాలుష్యంపై నివేదికలు తయారుచేశారు. పలుమార్లు ప్రభుత్వానికి పిటిషన్లు సమర్పించారు.
బంజారాహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్లో వ్యాయామశాల (జిమ్) ఏర్పాటు ప్రయత్నాలు జరిగినప్పుడు దబేరా, కాజల్ మహేశ్వరి గార్లతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. వ్యాయామశాల వల్ల కెబిఆర్ పార్క్ హైదరాబాద్‍లో మనుషుల వినాశనానికి కేంద్రం అవుతుందని ఈ లేఖలో హెచ్చరించారు. ఈ లేఖ బాగా ప్రజాదరణ పొందింది.
రామా రావు గారి చొరవతో పట్టణ సమస్యలపై పనిచేయడానికి స్థాపించిన ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ అనే సామాజిక సంస్థ ఇప్పుడు ఎం.వేదకుమార్ గారి నేత•త్వంలో కార్యక్రమాలు కొన సాగిస్తుంది.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల గ్రామమైన కొవ్వాడలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటుచేసే ప్రయత్నం జరిగినప్పుడు దాని వల్ల ప్రజలకు కలిగే నష్టాన్ని వివరిస్తూ రామారావు గారు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అదే జిల్లాలో సోంపేటలో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమంలో మానవ హక్కుల వేదిక పూర్తిస్థాయిలో పాల్గొని ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందించింది. ఆ ఉద్యమం జరిగినన్ని రోజులు రామారావు సార్ అన్ని విషయాలు తెలుసుకుంటూ నాతో ఫోన్‍లో మాట్లాడేవారు.
కాలుష్య నియంత్రణ మండలి పని విధానంలో ఆ సంస్థలో బాధ్యతాయుత స్థానాల్లో ఉండేవారి విషయంలో రామారావు సార్‍కి కచ్చితమైన అభిప్రాయాలుండేవి.
ఈ సంస్థ వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని, సంస్థ అవినీతిలో మునిగిపోవడమే కాక రాజకీయ నాయకులకు, పదవీ విరమణ చేసిన కొందరు ఉన్నత అధికారులకు పునరావాస కేంద్రంగా మారిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. ఎప్పుడు ఈ సంస్థలోని సభ్యులంతా పరిశ్రమల ప్రతినిధులే ఉంటారని, వాళ్లకు లాభాపేక్ష తప్ప ప్రజల బాధలు పట్టవని, వాళ్లు కాలుష్యాన్ని నివారించే, నియంత్రించే చర్యలు ఎలా చేపడతారని ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ పలుమార్లు ఉత్తరాలు రాశారు.
కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు బోర్డు మెంబర్లుగా ఉండాలని ద•ఢంగా అభిప్రాయపడే వారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ సంస్థను మూసివేయడం మంచిదని ఒకసారి పత్రికలో ప్రకటన కూడా చేశారు.
వారి నిబద్దత, పర్యావరణ రక్షణ కోసం పడ్డ తపన, ఆ విషయాల్లో వారి విజ్ఞానం వల్ల చాలా మంది యువతీ, యువకులు ప్రభావితులై పర్యావరణ కార్య కర్తలుగా ఎదిగారు.
డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాత కవుల సరస్వతి గారు సార్ శిష్యరికం లోనే తాను పర్యావరణ రక్షణ రంగాన్ని ఎంచుకొని పర్యావరణ కార్యకర్తగా పని చేస్తున్నానని సార్ మ•తి పట్ల విషాదాన్ని తెలిపింది.
పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణ, నియంత్రణ కోసం తన జ్ఞానాన్ని సమయాన్ని నిబద్ధతతో ధారపోసిన కెప్టెన్ జలగం రామారావు గారికి మనమంతా నివాళి తెలుపుదాం.
- యస్. జీవన్ కుమార్, మానవ హక్కుల వేదిక
ఎ : 9848986286