తన పేరు చిట్టి…. ఆరేళ్ళ వయసు ఉంటుందేమో. చిట్టీ వాళ్ళ అమ్మ నాన్న పొలం పనులు చేస్తుంటారు. చిట్టీ వాళ్ళది చిన్న పెంకుటిల్లు. వాళ్ళ ఇంటి ముందు పూల మొక్కలు చాలా ఉంటాయి. కానీ చిట్టీకి మాత్రం ఎదురుగా వున్న పెద్ద జామ చెట్టు అంటే చాలా ఇష్టం. చిట్టి పసికందుగా వున్నప్పుడు చిట్టీ వాళ్ళ అమ్మ దానికే ఉయ్యాల వేసేది. చిట్టి ఊగుతూ నిద్ర పోయేది. దానికి చిన్న చిన్న ఎర్రటి జామపళ్ళు కాస్తుంటాయి. అవి చాలా తియ్యగా ఉంటాయి. చిట్టి ఎప్పుడూ చెట్టు మీదకు ఎక్కి కొమ్మల మీద నిలబడి క్రిందకు పైకి ఊగుతూ ఉండేది. చెట్టు పైన ఒక పెద్ద కొమ్మకి చిన్న కొమ్మలు నాలుగు వైపులా విస్తరించాయి… దాంతో అది కూర్చోవడానికి పీఠంలా ఉండేది. ఆ చోటు చిట్టికి బాగా ఇష్టం. వాళ్ళ నాన్న వచ్చి చెట్టు క్రింద నిలబడి ‘‘చిట్టీ..’’ అని పిలిచిన వెంటనే ఆ కొమ్మ మీద నుండి నాన్న భుజాల మీదకి ఎక్కేసేది. అమ్మ మీద అలిగినప్పుడు కూడా జామ చెట్టు ఎక్కి కూర్చొని అన్నం తినకుండా మారాం చేసేది.
అప్పుడప్పుడు ఆ చెట్టు మొదలు దగ్గర చెవి పెట్టి వింటూ ఉండేది. అప్పుడు ఒక విధమైన శబ్దం వినిపించేది. అది ఆ చెట్టు గుండె చప్పుడు ఏమో అనుకునేది.
ఒకరోజు పొలానికి వెళ్లిన చిట్టీ వాళ్ళ నాన్నను రిక్షా బండి మీద ఇంటికి తీసుకుని వచ్చారు. పొలంలో ఏవో కరెంటు తీగలు తగిలి చనిపోయాడని చెప్పారు…
ఉలుకుపలుకు లేకుండా పడుకున్న నాన్నని, క్రిందపడి ఏడుస్తున్న అమ్మని చూస్తూ ఉండిపోయింది చిట్టి. సాయంత్రం వాళ్ళ నాన్నని తీసుకెళ్ళేటప్పుడు మాత్రం వెంటపడింది. నాన్న తనకు చెప్పకుండా ఎప్పుడూ అలా వెళ్ళిపోడు. అంటూ మొండికి వేసింది. బలవంతంగా అందరూ చిట్టిని లాగేసారు. వాళ్ళ నాన్నని తీసుకెళ్లిపోయారు.
కొన్ని రోజులు గడిచాయి. చిట్టితో ఒకరోజు వాళ్ళ అమ్మ అన్నది.. ‘‘చిట్టీ. మనం వేరే ఇంటికి వెళ్తున్నాం..’’
‘‘ఎందుకు… ఏమీ వద్దు…’’
‘‘చిట్టీ.. అమ్మ మాట వినాలి.. మనం ఎక్కువ దూరం వెళ్లడం లేదు.. ప్రక్కనే మరొక ఇంట్లో ఉంటాం..’’
‘‘అమ్మా.. వద్దమ్మా.. ఎక్కడికీ వెళ్లొద్దు.. నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం…’’
‘‘చిట్టీ ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది.. మన ఇల్లు వేరేవాళ్ళ తాకట్టులో వుంది… వాళ్ళకి ఇక మనం అప్పు తీర్చలేం.. మీ నాన్న
ఉంటే ఆ ధైర్యం వేరు. ఇప్పుడు అంతకన్నా ఏమీ చెయ్యలేం. తల్లీ..’’ తల్లి దీనత్వం చూసి చిట్టి అయిష్టంగానే ఒప్పుకుంది.
వేరే ఇంటికి వెళ్లినా చిట్టి జామ చెట్టు దగ్గరే ఎక్కువ సమయం గడిపేది. ఆ ఇంట్లోకి కొత్త వాళ్లు వచ్చారు. వాళ్ళది పాల వ్యాపారం. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఇంచుమించు చిట్టి వయసు వాళ్లే.
ఎప్పుడూ జామ చెట్టు దగ్గరకు వచ్చే చిట్టిని ఆ ఇంటి ఆవిడ మొదట విచిత్రంగా చూసింది. ‘‘నేను కాయలు ఏమీ కోయను ఆంటీ.. కొంచెంసేపు ఆడుకుంటాను.. అంతే..’’ అన్న చిట్టి మాటలు విని ఆమె ఏమీ అనలేదు. చిట్టి ‘‘హమ్మయ్య’’ అనుకుంది. వాళ్ళ పిల్లలు బయటకు ఎక్కువ రారు. టీవీ, సెలఫోన్లోనే ఎక్కువ కాలక్షేపం చేస్తారు. ఒకరోజు ఎవరో వచ్చారు. చెట్టును నిశితంగా పరిశీలిస్తున్నారు. చిట్టి మనసెందుకో కీడుని శంకించింది. తరువాతి రోజు ఒక వ్యక్తి గొడ్డలి తీసుకుని వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే చిట్టి చెట్టు దగ్గరకి పరిగెత్తుకుని వచ్చింది. అతడి పేరు కొండయ్య. ఆ ఊరిలో ఎవరు పిలిచినా డబ్బులు తీసుకుని చెట్లు కొడుతూ ఉంటాడు. కొండయ్య చెట్టు కొట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ‘‘అంకుల్… ఈ చెట్టుని కొట్టొద్దు’’ అడ్డంగా నిలబడింది చిట్టి.
‘‘ఎందుకు.. ఈ చెట్టు కొట్టడానికి నాకు డబ్బులు కూడా ఇచ్చారు. నువ్వు పొయ్యి ఆడుకో పో..’’ అన్నాడు గొడ్డలి ఎత్తుతూ.
‘‘నేను వెళ్ళను… మా అమ్మని అడిగి ఆ డబ్బులు నేను తెచ్చిస్తా.. ఈ చెట్టుని కొట్టొద్దు..’’ కొండయ్య విసుగ్గా చూశాడు…
‘‘ఇదిగో నేను మళ్ళీ వేరే కాడికి పోవాల.. అడ్డు లే…’’ అంతే చిట్టి ఒక్క
ఉదుటున చెట్టు మొదలు దగ్గరకు వెళ్లి దానిని చేతులతో చుట్టుకుని నిలబడింది… దాని గుండె చప్పుడు చిట్టికి వినిపిస్తున్నట్లే అనిపించింది.
కొండయ్య ఇంటి యజమానిని పిలిచాడు… ‘‘ఈ పిల్లేంటి సామీ… చెట్టుని కొట్టనివ్వడం లేదు..’’
ఆ ఇంటి యజమాని వచ్చాడు. ‘‘ఏయ్ అమ్మాయ్…. ఇంటికి వెళ్ళు.’’.. చిట్టి ఏమీ మాట్లాడలేదు… అలాగే చెట్టుని పెనవేసుకుని నిల్చుంది… ‘‘ఈడ్చి అవతల పడేయ్…. ఇంకా అరిస్తే ఆ రెండు చేతులు కట్టిపడేయ్…’’ కరకుగా పలికింది అతని కంఠం….
‘‘రెండేనా సామీ…. నాలుగు చేతులు కట్టెయ్యమంటారా….’’
అర్థం కానట్లు చూశాడు అతను కొండయ్య వంక… ‘‘నాలుగు చేతులేంటి..?’’
‘‘మీరే వచ్చి చుడండి సామీ..’’ వెంటనే వచ్చి చెట్టుపై లైట్ వేసి చూశాడు….. కనిపించిన ఆ ద•శ్యం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు… తన ఇద్దరు పిల్లలు ఆ చెట్టుకు చుట్టుకుని ఉన్నారు… ‘‘ఈ చెట్టుని కొట్టొద్దు నాన్నా….’’ అన్న అర్థింపు వాళ్ళ కళ్ళలో కనిపించింది…. కొన్ని నిముషాలు అలాగే చూస్తూ తలదించుకుని లోపలకు వెళ్ళిపోయాడు… రోజులు గడిచాయి… కొండయ్య అటు వైపుగా వెళ్తూ చూశాడు…
జామచెట్టు మీద చిట్టి, పిల్లలు ఆడుకుంటున్నారు… ఆ చెట్టు తన ఆకులతో ఆప్యాయంగా వారిని నిమురుతున్నట్లు అనిపించింది.
- పి.వి. పద్మావతి,
ఫోన్ : 898505614