పర్యావరణ హితం – గాంధీ దీపధారి

పర్యావరణ హితవరులుగా వ్యక్తులు, వ్యవస్థలు. వారి వారి వైఖరులు ఒక మేరకు మనకు దారి చూపుతుంటాయి. దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి. ప్రతి సందర్భంలోనూ ఎదుర్కోవలసిన ప్రశ్న ఏమిటంటే సమస్యలో భాగమవుతామా? లేక పరిష్కారంలో భాగంగా ఉంటామా? అనేది ఇదొక ఎడతెగని, ఎంతకీ సంతృప్తికర సమాధానం దొరకని ప్రశ్నగానే మిగులుతుంది. అభివృద్ధి, స్థిరత్వం, సమతుల్యతను సాధించడం అనేవి ఒకదాని కొకటి అభిముఖంగా నిలవటమే కాక పరస్పరం ఖండించుకుంటూ ఉంటాయి.


గాంధీ మహాత్ముడు గ్రామ పునరుద్ధరణ మీదనే భారతదేశ స్వాతంత్య్రం ఆధారపడి ఉందని విశ్వసించాడు. అది ఆయన దృష్టి. నెహ్రూ ఆలోచన అందుకు పూర్తి భిన్నమైంది. శీఘ్రగతితో పారిశ్రామిక అభివృద్ధి సాధించడం మీద దృష్టి నిలిపాడు. జాతిపిత మార్పుకంటే స్థిరత్వాన్ని అభిలషించాడు. నెహ్రూమార్గం అది కాదు. స్థిరత్వం కంటే మార్పు ముఖ్యమైంది నెహ్రూ దృష్టిలో. గాంధీ నమ్మిన విలువలకు మూలం మతం నెహ్రూది శాస్త్రం. పురోగతి, శాస్త్రదృష్టిని కలిగి ఉండటం అనే వాటిపై ఆధారపడ్డ ఆలోచన.


ఈ ఇద్దరూ పాశ్చాత్య ఆలోచనా ధారతో ప్రభావితమయ్యారు. గాంధీపైన జాన్‍ రన్కిన్‍, లియోటాల్‍ స్టామ్‍లు ప్రభావం చూపారు. పారిశ్రామికీకరణకు వ్యతిరేకంగా గాంధీ ఆలోచన సాగింది. నెహ్రూను రష్యా మార్కిస్టులు, బ్రిటీష్‍ ఫేబియన్‍లు ప్రభావితం చేశారని చెపుతారు. గ్రామీణ జీవితంలోనే సత్యం, అహింసలను గాంధీజీ చూపగలిగాడు. నిరాడంబరమైన, సరళమైన జీవితంగా గ్రామీణ జీవితంగా గుర్తించాడు గాంధీ. నెహ్రూ అలాక్కాదు పారిశ్రామిక సమాజం. కాంతి చుట్టూ త్వరితంగా ఆకర్షితమయ్యే దీపపు పురుగులాంటిది. ఆ వెలుగులోనే అది అంతరిస్తుంది. 1945లో కాంగ్రెస్‍ వర్కింగ్‍ కమిటీ సమావేశం అనంతరం గాంధీజీ నెహ్రూకి రాసిన ఉత్తరాలలో స్పష్టం చేశాడు. స్వాతంత్య్రానగరం సామాజిక, రాజకీయ లక్ష్యాలు ఎట్లా ఉండాలనే అంశంపై సాగిన చర్చను ఈ లేఖలో ధృవపరుస్తున్నాయి. నెహ్రూ ప్రకారం గ్రామం సాంస్క•తంగా, బౌద్ధికంగా వెనకబాటు తనంతో ఉంటుంది కనుక సత్యాహింసలో సూత్రాలను బోధపరచుకోలేదు. గాంధీతో ఈ విషయంగా విభేదించాడు నెహ్రూ. ఆర్థిక ప్రణాళిక ముఖ్య లక్ష్యం అతివినియోగం కాదని, సరిపోయినంత అన్న వస్త్రాలు, ఆవాసం, విద్య, పారిశుద్ధ్యం ప్రతి భారతీయుడికి ఉండాలని గుర్తించాడు. నెహ్రూ పేదరిక నిర్మూలన అనే లక్ష్యం పట్ల ఇద్దరికీ ఏకీభావం ఉంది నెహ్రూ తన సమకాలీన మేధావుల ఆలోచనలతో అంగీకరిస్తాడు. పేదరికం తొలిగిపోవాలంటే శీఘ్రంగా పారిశ్రామికీకరణ జరగాలని అది ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవటం ద్వారా జరుగుతుందనే భావించాడు.


ఒకానొక సందర్భంలో భారత తొలి ప్రధాని నెహ్రూతో మహాత్మాగాంధీ అహ్మదాబాద్‍లో ఉండవలసి వచ్చింది. ఒకానొక ఉదయం మహాత్ముడు తన కాళ్లూ చేతులు, మొహం కడుక్కుంటున్నాడు. నెహ్రూ నీళ్లు పోస్తూ గాంధీకి సహకరిస్తున్నాడు. వారిద్దరూ భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు. చర్చ చాలా గంభీరంగా సాగుతూ ఉంది. ఆ చర్చలో మునిగిపోయిన గాంధీ తాను ముఖం కడుక్కోకుండానే లోటాలో నీళ్లు అయిపోయాయి. అప్పుడు నెహ్రూ ‘కొద్దిగా ఆగండి. మరొక చెంబెడు నీళ్లు తెస్తాను’ అని గాంధీని ఉద్దేశించి అన్నాడు. అప్పుడు గాంధీజీ నేను ముఖం కడుక్కోకుండానే చెంబెడు నీళ్లు వృధా చేశాను. ప్రతి ఉదయం ఒక్క చెంబెడు నీళ్లనే వాడతాను అని అన్నాడు. అంతటితో ఆగలేదు సరికదా గాంధీజీ కళ్లవెంట నీళ్లు కారుతున్నాయి. ఈ దృశ్యం చూసి నెహ్రూ విస్మయం చెందాడు. అంతే కాకుండా గాంధీజీతో ఇలా అన్నాడు. ‘‘ఇప్పుడేమైందని మీరు రోదిస్తున్నారు. ఎందుకు మీరంతగా చెంబెడు నీటికోసం కలత చెందుతున్నారు’’ అని అడిగాడు. మా నగరం అలహాబాద్‍లో మూడు నదులున్నాయి. గంగ, యమున, సరస్వతుల సంగమం కదా! నీటి గురించి మీరు విచారించ పని లేదని కూడా అన్నాడు. అప్పుడు గాంధీజీ చెప్పిన సమాధానం ఏమంటే ‘నెహ్రూ మీరు చెప్పింది నిజమే. మీకు మూడు గొప్ప నదులున్న మాట కూడా వాస్తవమే. కానీ, ఆ నదులలోంచి నా వాటా నీళ్లు ప్రతి రోజూ ఉదయం ఒక చెంబెడు మాత్రమే. అంతకు మించి ఆ నీళ్లపైన నాకు హక్కు లేదు.


ఇది వినడానికి విచిత్రంగానే ఉంటుంది. తరచి చూస్తే గాంధీజీ వనరుల వినియోగం విషయంలో ఎంతో పట్టింపు, పట్టుదల కలిగి ఉన్నారని బోధపడుతుంది. ప్రకృతి వనరులను వినియోగ పరచుకోవటంలో గాంధీజీకి ఉన్న దూరదృష్టికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ స్వతంత్ర భారతం విధ్వంసకరమైన అతి వినియోగంలోకి ప్రవేశిస్తున్నదని గాంధీజీ గ్రహించాడని భావించవచ్చు. నెహ్రూ అభివృద్ధి ప్రణాళికల పట్ల సుముఖత అంతగా గాంధీకి ఉన్నట్లు కనిపించదు.


ప్రకృతి వనరుల పట్ల ఒక బాధ్యాతాయుతమైన ఆలోచనను కలిగి ఉండటమే కాకుండా, ఆ బాధ్యత ఒక విలువగా జీవన విధానాన్ని నిర్దేశించాలని గాంధీజీ భావన ఆయ్యుండవచ్చు. ఆధునిక నాగరికతలో బాధ్యత ఎరుగని ఒక విచ్చలవిడి వినియోగ ధోరణిని గాంధీజీ చూశాడు. ఆధునిక నాగరికత ఆవధులు లేని కోరికల సమాహారం. ఈ కోరికలు తమను తాము హెచ్చవేసుకుంటాయి. అదే ప్రాచీన నాగరికతలో తమకు తాము విధించుకునే ఒక నియంత్రణ ఉంటుంది. ఆ పరిమిత కోరికలకు ఈ స్వీయ నియంత్రణ ఒక అడ్డుకట్టను వేయగలుగు తుంది.


వ్యక్తిగత స్థాయిలో గాంధీజీ స్వచ్ఛందంగానే ఈ నియంత్రను పాటించాడు. అంతే కాదు ఆధునిక జీవన విధాన శైలులకు భిన్నంగా,ప్రత్యామ్నాయంగానూ స్థిరంగా ఉండే నిరాడంబరతను సైతం మనుషులు కలిగి ఉండాలని ఆశించాడు.


నేడు భారత దేశంలో కొనసాగిన, కొనసాగుతూ ఉన్న అనేక పర్యావరణ ఉద్యమాల వెనుక గాంధీ ప్రబోధించిన సత్యాహింసల ప్రభావం కనిపిస్తుంది. శాంతియుతంగా దేనినైనా సాధించటం హింసకు దూరం ఉంటూ ఆ లక్ష్యాన్ని చేరుకోవటం ముఖ్యమైంది. ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులు ఈ పద్ధతిని అనుసరించారు. చండీ ప్రసాద్‍ భట్‍, సుందర్‍లాల్‍ బహుగుణ, బాబా ఆమ్టే, మేధాపాట్కర్‍ లాంటివారు గాంధీని పలుమార్లు ప్రస్తావించటం గమనించదగింది.


అటవీ హక్కులను కాపాడుకోవటం కసం సంప్రదాయ రైతుల ప్రతిఘటన ఉద్యమాల వెనుక గాంధీజీ దర్శనం కనిపిస్తుంది. చండీ ప్రసాద్‍ భట్‍ దశౌలి గ్రామ స్వరాజ్యమండల్‍ (డిఎస్‍జిఎమ్‍) సంస్థ చిప్కో ఉద్యమానికి దారితీసింది. ఎగువ అలకనందా లోయ రైతులకు ఆయన వృక్షాలను హత్తుకోమని సూచించాడు. తొలి దశలో డిఎస్‍జిఎమ్‍ చిప్కో ఉద్యమాన్ని సమన్వయ పరచింది ముఖ్యంగా అటవీ సంపదను వాణిజ్య అవసరాలకు వినియోగించటం విషయంగా తలెత్తిన నిరసన అది. అడవుల పునరుద్ధరణ, చెట్ల పరిరక్షణ కార్యక్రమాలు సాధించిన ఫలితాలను తక్కువగా అంచనా వేయలేము. ఇక సుందర్‍లాల్‍ బహుగుణ సాగించిన సామాజిక సేవ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. 1940లలో గాంధీ శిష్యురాలు సరళాదేవి (కేథరిన్‍ మేరీ హెయిర్‍మన్‍) సర్వోదయ తొలితరం కార్యకర్తలకు శిక్షణ యిచ్చింది. ఆ శిక్షణ పొందిన వారిలో సుందర్‍లాల్‍ బహుగుణతో పాటు ఆయన జీవన సహచరి విమల కూడా ఉన్నారు. 1977-1980 మధ్య కాలంలో బహుగుణ పలు చిప్కో ఉద్యమ నిరసన, ప్రతిఘటన కార్యక్రమాలకు కొరకుడు అయ్యాడు. హిమాలయ పర్వత శ్రేణుల పర్యావరణ పరిరక్షణ కొరకు భట్‍ పాటుపడితే, ఆ పర్వత శ్రేణులను దాటి చిప్కో ఉద్యమ సందేశాన్ని బహుగుణ లోకానికి చాట గలిగాడు.

బహుగుణ గాంధీ తత్వాన్ని పరిపూర్ణంగా ఆకళింపుచేసుకున్నాడు. పర్యావరణ చైతన్యం కలిగించాడు. వినియోగం విషయంలో ప్రతి మనిషికీ
ఉండవలసిన అవగాహన ఏమిటో తెలిపాడు. మేర మీరిన భౌతికవాద దృష్టి, ఆడంబరాలవల్ల ప్రకృతికి మానవాళి కలిగించే ముప్పును విప్పి చెప్పాడు. నిరాడంబర జీవితం, సంపద భోగ భాగ్య ప్రదర్శన రహిత భావన విధానం వైపు దారిచూపాడు.


చండీప్రసాద్‍ భట్‍, గాంధీ తన సబర్మతి, వార్దా ఆశ్రమాలలో నిర్మాణాత్మకంగా సామాజిక సేవకు ఎటువంటి శిక్షణ ఇచ్చాడో అటువంటి ఆలోచనను అందించి స్వయంసిద్ధ గ్రామం, గ్రామ స్వరాజ్యం అనే ఆదర్శాన్ని పర్యావరణ హితార్థంలో సార్థకం చేశాడు. ఆ దారిలోనే మనం కూడా నడవవలసి ఉంది.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *